బుధవారం, డిసెంబర్ 19, 2007

నా ద్వ్యక్షరీ కందం

ముక్కోటి యేకాదశికి శ్రీమన్నారాయణునికి సమర్పణగా నా ద్వ్యక్షరీ కందం:

కం. మిము మాననమున మీ నా
మమునూ నేమమున నేను మననము మానన్
మమమనమే నీ(మీ) నననీ
నమనమునన్ నమ్మినాను నానానామా.

[मानन = గౌరవము; నేమము = నియమము; मम = నా; నన = పువ్వు; नमन = గౌరవంతో తలవంచుట; నానానామా = పెక్కు పేర్లు కలిగినవాడా]

శనివారం, డిసెంబర్ 01, 2007

తెగులు - నివారణ

కం. తెలుగుకి ఆంగ్లం దట్టిం
చి లేతవంకాయకూర చికెనుకెబాబుల్
కలగలిపి తిన్న రీతిని
పలకకపోతె మనభాష అర్థమవదుగా.

ఆ.వె.పంది బురదలోన పొర్లుతూంటేజూచి
ఆహ! బురద యెంతొ హాయిగొలుపు
నంటు దొర్లినాము ఆంగ్లపంకమునందు
పందులం పరాయివారికన్న.

ఆ.వె.వారిభాష నేర్చి వారిసంస్కృతినేర్చి
వొరగబెట్టెదేన్ని? ఓరి శుంఠ!
వారిమాయలోన దూరి పరాయివై
పోయినావు నీవు పూర్తిగాను.

తే.గీ.అమ్మవంటి భాషనెటుల వదలినావు
మేలుకొనుము నీవిపుడైన మేలుసేయ
లేకపోయినచో నీకులేదు ముక్తి
కనుక సేవచేయ నడుముకట్టు యిపుడు.

సోమవారం, నవంబర్ 26, 2007

శివపఞ్చాక్షరీస్తోత్రమ్

కం. అహిభూషణ భస్మధరా
తుహినాంశ్వర్కాగ్నినేత్ర దోషరహిత ని
త్య హితకర దిగంబర శ్రీ
మహాశివ "న"కారరూప వందనమిదియే.

కం. మందాకిన్యభిషేకా
నందీశప్రమథగణపతి మండితగన్ధా
మందారపుష్పపూజిత
వందనము "మ"కారరూప పరమేశ శివా.

కం. గౌరీముఖాబ్జతపనా
ధారితపుంగవపతాక దక్షసవఘ్నా
వారిధిజాతమహావిష
ధారి శివ "శి"కారరూప దండములివియే.

కం. అగిరౌకసగణ సేవిత
అగస్త్య గౌతమ వసిష్ఠ వందిత దేవా
అగశశధరదహననయన
మృగధారి "వ"కారరూప మృడ శివ శంభో.

కం. ప్రమథేశ సనాతన శివ
ఉమాపతి పినాకి యక్షరూప కపర్దీ
అమరేశనుత దిగంబర
నమస్సులు "య"కారరూప నటరాజ నమో.

[శ్రీమచ్ఛంకరభగవత్పాదుల శివపఞ్చాక్షరీస్తోత్రముననుసరించి జేసిన స్వేచ్చాంధ్రానువాదమైన యీ స్తోత్రము బ్లాగేశ్వరుని "న"కార శివునిపై పద్యాన్ని జూచి ప్రేరణపొంది వ్రాసినది]

మంగళవారం, నవంబర్ 20, 2007

అర్ధనారీశ్వరస్తోత్రమ్

సీ.సంపెంగసుమవర్ణసౌందర్యలహరీమె కర్పూరసమవర్ణకాంతియతడు
ముత్యాలజడగలముగ్ధమోహనవేణి జటలుగట్టినజుట్టుజంగమయ్య
కస్తూరితిలకంపుకాంతినిండినమోము భవనాశకుడుచితాభస్మధారి
కవులెల్లకొలిచేటికలికిమీనాక్షమ్మ ప్రమథగణవిభుడుప్రథితమూర్తి

ఆ.వె.ఘల్లుఘల్లుమనెడిగజ్జెలూగాజులూ
పసిడినగలతోడిపార్వతమ్మ
సర్పనూపురములుశంకరుమెడలోన
బుస్సుమనెడిపామెభూషణంబు

సీ.కలువరేకులవంటికన్నులుగలదీమె పద్మలోచనములవాడుశివుడు
పద్మయుగళనేత్రిమాయమ్మగిరిపుత్రి మూడుకన్నులపూర్ణపురుషుడతడు
మందారసుమమాలనామెకొప్పునబెట్టె మెడనుపుఱ్ఱెలమాలవేసెనితడు
దివ్యాంబరములీమె దిగ్వస్త్రమాయన జలదనీలచికురి జటలశివుడు

ఆ.వె.దేవిరూపరహిత దేవదేవుడితడు
ఈమెసృష్టిజేసె నితడులయము
జగతికంతజనని జగదేకజనకుడు
శుభమునిచ్చుగాత ఉమయుశివుడు

अर्धनारीश्वरस्तोत्रम्

चाम्पेयगौरार्धशरीरकायै कर्पूरगौरार्धशरीरकाय।
धम्मिल्लकायै च जटाधराय नमश्शिवायै च नमश्शिवाय॥

कस्तूरिकाकुङ्कुमचर्चितायै चितारजः पुञ्जविचर्चिताय।
कृतस्मरायै विकृतस्मराय नमश्शिवायै च नमश्शिवाय॥

झणत्क्वणत्कङ्कणनूपुरायै पादाब्जराजत्फणिनूपुराय।
हेमाङ्गदायै भुजगाङ्गदाय नमश्शिवायै च नमश्शिवाय॥

विशालनीलोत्पललोचनायै विकासिपङ्केरुहलोचनाय।
समेक्षणायै विषमेक्षणाय नमश्शिवायै च नमश्शिवाय॥

मन्दारमालाकलितालकायै कपालमालाङ्कितकन्धराय।
दिव्याम्बरायै च दिगम्बराय नमश्शिवायै च नमश्शिवाय॥

अम्भोधरश्यामलकुन्तलायै तटित्प्रभाताम्रजटाधराय।
निरीश्वरायै निखिलेश्वराय नमश्शिवायै च नमश्शिवाय॥

प्रपञ्चसृट्युन्मुखलास्यकायै समस्तसम्हारकताण्डवाय।
जगज्जनन्यै जगदेकपित्रे नमश्शिवायै च नमश्शिवाय॥

प्रदीप्तरत्नोज्ज्वलकुण्डलायै स्फुरन्महापन्नगभूषणाय।
शिवान्वितायै च शिवान्विताय नमश्शिवायै च नमश्शिवाय॥

एतत्पठेदष्टकमिष्टदं यो भक्त्या स मान्यो भुवि दीर्घजीवी।
प्राप्नोति सौभाग्यमनन्तकालं भूयात्सदा तस्य समस्तसिद्धिः॥

గురువారం, నవంబర్ 15, 2007

శ్రీసర్వజిత్ శరన్నవరాత్రులు - మహిషాసురమర్దని

[ఇన్నాళ్లకి అమ్మకి వ్రాయించుకోవాలనిపించిందేమో! ఎప్పుడో వ్రాయవలసినది యిప్పుడు వ్రాస్తున్నాను.]

చం. ఱుగను నీదువైభవము యేమనుకోకు మదంబ, యింతకీ
కరమున శూలమెందులకు? కామము క్రోధము ద్రుంచు శక్తివై
శరణనువారికందరికి చక్కటి యండవు తోడునీడవై
సరగున బ్రోవువమ్మ "మహిషాసురమర్దని" దేవి యీశ్వరీ.

బుధవారం, నవంబర్ 14, 2007

ఊకదంపుడుగారి "టంగు-తెగింది"కి కొనసాగింపు:

ముందు యిది చూడండి.

చూశాక...

ఉ.సూటిగ వొక్కమాట వినసొంపుగ పల్కగలేరు వీరు యే
ఆటలనాడలేరు మనభాషను నేర్వరు నేర్పబోయినన్
“కూటికి ఆంగ్లమైతె పనికొచ్చును, ఆంధ్రము తిండిబెట్టునా?
మేటిగ వుండగోరు మము మీరలు క్రిందకు ద్రోసివేతురా
వోటమి నోర్వనేర”మని పోరెడివారిని మార్చుటా? వృథా!

మ. నిజమే మాటలు చాలబోవు మన యీ నిట్టూర్పులే సాక్ష్యముల్
“అజుడైనా భయమొందు రీతిని తయారైయారు జాగ్రత్తరోయ్
విజిగీషావనమందు నిల్చినచొ వీడ్కోలు చెప్పొచ్చునా
విజిగీషాముఖులైతె? భాషకు నిలా వీడ్కోలు చెప్పొచ్చునా
ప్రజలారా” అని మొత్తుకుంటె తుదకున్ ప్రాయోజనంబున్నదా?

మ. అసలీ వైఖరి యెట్లు వచ్చె? మనమే గాదా సగం కారణం?
పసివారన్నది కూడ చూడక మహా భారంబులన్ నెత్తిపై
కసితో రుద్దుచు చోద్యమున్ గనుచు కందోయి చల్లారగా
కసితో రుద్దుచు పెంచుచుంటిమి గదా కందోయి చల్లారగా
మసలే నైజము నేర్వలేద? మన ఆత్రంబు లీడేరగన్.
మసలే నైజము నేర్వలేద? మనలో నాత్రంబు లీడేరగన్.

* * *

కం.[నా]మీలోనున్న కసినిలా
యీలోకంమీద గ్రక్కి యిపుడిక చాలా
తేలికపడి హాయిగ కం
దంలోతుల మునిగితేలుదాం రారండోయ్.

శుక్రవారం, నవంబర్ 02, 2007

ఎన్నాళ్లైందో యివి చదివి...

ఆ.వె. చేత వెన్న ముద్ద చెంగల్వ పూదండ
బంగరు మొల త్రాడు పట్టుదట్టి
సందె తాయెతులును సరి మువ్వ గజ్జెలు
చిన్ని కృష్ణ నిన్ను చేరి కొలతు.

కం. వంకాయ వంటి కూరయు
పంకజముఖి సీత వంటి భామామణియున్
శంకరుని వంటి దైవము
లంకాధిపు వైరి వంటి రాజును గలడే.

కం. అప్పిచ్చువాడు వైద్యుడు
యెప్పుడు నెడతెగక పారు యేరును ద్విజుడున్
చొప్పడిన యూర నుండుము
చొప్పడకున్నట్టి వూరు చొరకుము సుమతీ.

చం. చదువది యెంత గల్గిన రసజ్ఞత యించుక లేకయున్న నా
చదువు నిరర్థకంబు గుణసంయుతులెవ్వరు మెచ్చరెచ్చటన్
పదనుగ మంచికూర నలపాకము జేసినదైన నందు నిం
పొదవెడి వుప్పు లేక రుచి పుట్టగ నేర్చునటయ్య భాస్కరా.

ఆ.వె. కొండనుండు నెమలి కోరినపాలిచ్చు
పశువు చదువుచుండు శిశువు తోడ
వనిత వేదములను వల్లె వేయుచునుండు
బ్రాహ్మణుండు కాకి పలలము తిను.

ఆ.వె. చెరకుతోటనుండు వరిమళ్ళలోనుండు
జొన్నచేలనుండు చోద్యముగను
తలుపుమూలనుండు తలపైనవుండును
దీనిభావమేమి తిరుమలేశ.

ఇవి చదివి చాలా చాలా కాలమయింది... జ్ఞాపకం భ్రష్టుపట్టి తప్పులు దొర్లివుండవచ్చు. దోషములు సరిదిద్దగలరు.

గురువారం, నవంబర్ 01, 2007

ఆంధ్రప్రదేశావతరణోత్సవ శుభాకాంక్షలతో...

ఉ.మిక్కిలి యందమైనదియు మేటియు భారతభాషలన్నిటా
పెక్కుధరాధిపాదులకు పిన్నలపెద్దలయందరిన్ మహా
మక్కువయైనభాష మనమాతృకయై వెలుగొందునట్టిదౌ
చక్కని ఆంధ్రమాతకివె జన్మదినోత్సవ మోదశంసనల్
[అక్క యభీష్టముం దెలిసి తమ్ముడు వ్రాసిన పద్యమిద్దియే].

బుధవారం, అక్టోబర్ 31, 2007

శ్రీసర్వజిత్ శరన్నవరాత్రులు - లలితాంబిక

శా.నాడో గతజన్మలందొ కలనో నీ నామముం వింటినే
మో నా పూర్వుల లబ్ధపుణ్యఫలమో నోరారకీర్తించగా
నీ నా మానుషజన్మమెత్తితినొ అన్నీ నీదుసంకల్పమో
కానన్ కారణమేదియైన "లలితా" కాపాడు శ్రీమాతృకా.

కవిఘనత - వేమన

కం.రవిగననిది కవియెఱుఁగును
కవి యెఱుఁగనిచోటు రవియుఁ గానఁడు భువిలో
రవికన్న మిగుల నెక్కుఁడు
కవియై విలసిల్లు నీవు గానవె వేమా.

బుధవారం, అక్టోబర్ 24, 2007

శ్రీసర్వజిత్ శరన్నవరాత్రులు - కాళి

ఉ.క్షణమాత్రమైనపడనివ్వదు సాధనజేయుబిడ్డపై
మోక్షపుమార్గమెంచి పరమోన్నతలక్ష్యమువైపుసాగుచూ
దీక్షనుబూని కాళికను దీవెనలిమ్మని వేడుకున్నచో
రాక్షసమాయ మాయమగు రక్షణనిచ్చును "కాళి" తల్లియై.

శ్రీసర్వజిత్ శరన్నవరాత్రులు - సరస్వతి

చం. షిగణపణ్డితామరనిషేవిత బుద్ధిప్రదాత్రివీవు క
ల్మషరహితేన్దుబింబసమవక్త్రవు ముక్తికినడ్డుగోడలౌ
విషయవిషంబులన్ విరచు భేషజమీవని నమ్మినాడనో
ఝషనయనా నమస్సులివె జాడ్యముసేయక బ్రోవు "భారతీ".

శుక్రవారం, అక్టోబర్ 12, 2007

శ్రీసర్వజిత్ శరన్నవరాత్రులు - బాలాత్రిపురసుందరి

ఉ. ద్రికుమారి పార్వతివి, అంబుధి(జ)జాతవు, మాయ మత్తులో
నిద్రిత జ్ఞానమున్ వెలికితీసెడి శారదవీవె, నాసికన్
విద్రుమరత్నశోభితవు, విశ్వమునంతట మాతృమూర్తివై
భద్రము సేతువంచు నిను "బాల"గ గొల్చెదనమ్మ భక్తితో.౧.

గురువారం, అక్టోబర్ 04, 2007

ఆఫీసు బ్రతుకు ౧

శా. అయ్యో! యేంటిది? నాది కూడ బ్రతుకే? ఆఫీసులో యెద్దులా
కుయ్యోమంటు పని ప్రవాహము నెలాగోలాగ దాటేసినా
దెయ్యాల్లాగ నికృష్ట (వికార) జీవితముతో తెల్లారినా నిద్రతో
పొయ్యేకాలమువైపు హాయిగ యిలా పోతున్న తీరేమిటో!!!

మంగళవారం, సెప్టెంబర్ 11, 2007

కవిసామ్రాట్ విశ్వనాథసత్యనారాయణగార్కి జయంతినివాళులు

ఊ.దుష్కరమైన ప్రాసలతొ దోచెను పండితమానసంబులన్
శుష్కిలుచున్న ఛందముకు శోభను దెచ్చెను ఆంధ్రసాహితీ
పుష్కరమందు నిల్చెగద పున్నమిచంద్రునిబోలురీతిలో
పుష్కల విశ్వనాథునికి పూలనివాళులు నాదు కైతలే.

మంగళవారం, సెప్టెంబర్ 04, 2007

శ్రీకృష్ణగోకులాష్టమీ పద్యం

కం.నిష్ణాత వేణుగానము
ఉష్ణీవమునందు నెమలిపురిని ధరించే
విష్ణుస్వరూపుడు మన శ్రీ
కృష్ణుని కొలిచెదము నేడు కృష్ణాష్టమికిన్.

గురువారం, ఆగస్టు 09, 2007

మా అమ్మానాన్నల రజతవైవాహికవర్ష సందర్భంలో...

కం.మా వేల్పులు మీరే గద
రావేవీ మీకు సాటి అమ్మా నాన్నా
వైవాహిక బం'ధనము'న
జీవింతురుగాక మీరు చిరకాలమిలన్.

బుధవారం, జులై 25, 2007

నా మొదటి మత్తకోకిలకిలలు

మ.కో.'మత్తకోకిల'లోన వ్రాయగ మానసంబున యెక్కడో
విత్తుయుండెను వృక్షమై యది వేళ్లనూనెను పెద్దదై
ఇత్తరిన్ చిగురింపజేసితి యీ "కవీరుహమున్" యిలా (భలే!)
క్రొత్త భావమె నీరు దీనికి కొమ్మలన్నియు పూయగా.

మ.కో.ఏమి వ్రాయను? మంచి భావన దేనికైనను ముఖ్యమే;
నా మనస్సున తోచినట్టివి నాకు తోచిన రీతిలో
రామచంద్రునిపైన నాలుగు వ్రాయబూనితి నింతలో
యేమిటో మనసెందుకో యటువైపు దృష్టి మరల్చదే!

మ.కో.అక్కటా! ఎటు మర్చిపోదును ఆంధ్రభాష పరిస్థితిన్
చక్కనైనది తేనెవంటిది శబ్దప్రౌఢత యున్నదీ
పెక్కుకావ్యప్రసూనమాలలు పెద్దనాదుల గన్నదీ
దిక్కుతోచక బిక్కచచ్చెడి దైన్యమెట్టుల పొందెనో?!

మ.కో.నీవు నా ప్రియమాతృభాషవు నేను సేసెద భక్తితో
సేవ నీకు, తరించటానికి శీఘ్రమార్గమిదేగదా,
మావిపల్లవఖాదనంబున 'మత్తకోకిల' పల్కునే
ఆ విధంబునె పల్కగా తగు శక్తినీయుము ఆంధ్రమా!

ముదితల్ నేర్వగరాని విద్య గలదే ముద్దార నేర్పించినన్

చిలకమర్తివారి "ప్రసన్నయాదవం"నుండి --

చం.చదవన్నేర్తురు పూరుషుల్ బలెనె శాస్త్రంబుల్ పఠింపించుచో
నదమన్నేర్తురు శత్రుసేనల ధనుర్వ్యాపారముల్ నేర్పుచో
నుదితోత్సాహము తోడ నేలగలరీ యుర్విన్ బ్రతిష్ఠించుచో
ముదితల్ నేర్వగరాని విద్య గలదే ముద్దార నేర్పించినన్.
(నాకీ పద్యమిచ్చినది మా 'వాగ్దేవి' లలితక్క)

సోమవారం, జులై 16, 2007

దేశభాషలందు తెలుగు లెస్స

పద్యం:
ఆ.వె.తెలుగదేలయన్న దేశంబు తెలుగేను
తెలుగు వల్లభుండ తెలుగొకండ
యెల్ల నృపులు గొలువ యెఱుగవే బాసాడి
దేశభాషలందు తెలుగు లెస్స. (శ్రీకృష్ణదేవరాయలు)

పదచ్ఛేదం:
తెలుగు అది ఏల అన్న దేశంబు తెలుగు; ఏను తెలుగు వల్లభుండ; తెలుగు ఒకండ;
ఎల్ల నృపులు కొలువ; ఎరుగవే బాసాడి; దేశ భాషలందు తెలుగు లెస్స

అర్థాలు:
ఏను = నేను
తెలుగు = తెలుగుభాష, తెలుగు మాట్లాడు వ్యక్తి, ఆంధ్రదేశము
బాసాడు = భాషించు అనగా మాట్లాడు(బాసాడు బాసయాడు భాషణముచేయు)

తాత్పర్యం:
తెలుగే ఎందుకంటే దేశం ఆంధ్రదేశం, నేను తెలుగువాడినైన రాజును, ఒక తెలుగువాడిని. అలాకాదుగానీ, రాజపూజ్యమైన తెలుగుభాషని మాట్లాడి, తెలుగు లెస్స అని తెలుసుకొనుము!

సోమవారం, జులై 09, 2007

నంది తిమ్మయ ముక్కు తిమ్మయ యెందుకయ్యాడంటే...

శా.నానా సూన వితాన వాసనల నానందించు సారంగమే
లా నన్నొల్లదటంచు గంధఫలి బల్కాలం తపంబంది యో
షా నాసాకృతి బూని సర్వ సుమనస్సౌరభ్య సంవాసియై
పూనెం బ్రేక్షణ మాలికా మధుకరీ పుంజంబులిర్వంకలన్.

[వితానము = సమూహము, ఒల్లు = ఎంచుకొను, గంధఫలి = సంపెంగ, యోష = ఆడుది, సుమనస్సు = పూవు, సౌరభ్యము = సౌరభము = పరిమళము, సర్వసుమనస్సౌరభ్యసంవాసియై = వివిధ పుష్ప సుగంధములకు నిలయమై (సుగంధములన్నిటికీ గమ్యమైన నాసికగా మారి), పుంజము = గుంపు, ప్రేక్షణమాలికా మధుకరీపుంజము = కన్నులనే తుమ్మెదలు, ఇర్వంకలన్ = రెండుప్రక్కల]

ఆడువారి ముక్కును సంపెంగతో పోల్చటం రివాజు. కానీ సంపెంగ తనవద్దకు తుమ్మెదలు వచ్చుటలేదని తపస్సుజేసి 'ముక్కు'గా మారి కన్నులనే రెండు తుమ్మెదలను శాశ్వతంగా తనప్రక్కన యిముడ్చుకుందని చెప్పటం అసాధారణాద్వితీయాద్భుతమైన ప్రయోగం. అంతచక్కగా ముక్కునుగూర్చి చెప్పిన తిమ్మనను ముక్కుతిమ్మన అనటం అతిశయోక్తిగాదేమో.

నంది తిమ్మనామాత్యునికి వికటకవి శంస

కం.మా కొలది జానపదులకు
నీ కవనపు ఠీవి యబ్బునే ! కూపనట
ద్భేకములకు గగనధునీ
శీకరముల చెమ్మ నంది సింగయ తిమ్మా !

[జానపదులు = గ్రామవాసులు, నటత్ = గెంతే, భేకము = కప్ప, ధుని = నది, శీకరము = నీటిబిందువు, చెమ్మ = తడి]

శుక్రవారం, జులై 06, 2007

నల్లిబాధ!

కం.శివుడద్రిని శయనించుట
రవిచంద్రులు మింటనుంట రాజీవాక్షుం
డవిరళముగ శేషునిపై (పాము పైన)
పవళించుట నల్లి బాధ పడలేక సుమీ!
-- చిలకమర్తి లక్ష్మీనరసింహం

సమస్య 7

ఇది సులభమైన సమస్య:
చం.రతిపతి సృష్టికర్తయని ప్రార్థన చేసిరి భక్తితో బుధుల్.

సోమవారం, జూన్ 18, 2007

నా కందపద్యం!

కం.అందం కావాలన్నా
పొందిక క్లుప్తత సరళత పొందాలన్నా
కందమె తప్పనిసరియని
చందస్సు తెలిసిన కవిగ చకచక చెప్తా.

ఆదివారం, జూన్ 17, 2007

పోతనగారి ప్రహ్లాదుని పలుకులు నా మాటల్లో...

కం.విరిమధువు గ్రోలు తుమ్మెద
అరగునె యుమ్మెత్త కడకు? అవ్విధముననే
మురహరి నామామృతమును
పరి ధ్యానించి మదిని హరి ప్రార్థన జేతున్.

మంగళవారం, జూన్ 12, 2007

ఆధునికత!

ఉ.ఏమిటొ ఈ ప్రపంచమున ఎక్కడ చూసిన పిచ్చిగోలలే -
గ్రామములన్ని పోయినవి - ఆమని చచ్చి యుగంబులయ్యె - ఔ
రా! మనిషన్నవాడు యిక రాడని లేడని పన్కిరాడనీ
యీ మరబొమ్మలే భువిని యేలగ జూసెనె - లెమ్మురా నరా!

ఆ.వె.ఒక్కసారి చూడు పోయిన విభవము
ప్రకృతికాస్త యిపుడు వికృతి అయ్యె
పుడమి మనది దాన్ని పునరుద్ధరించరా
చక్కదిద్దు గాని చంపబోకు.

కం.ఈ ధరణి జీవమాతృక
ఆధునికత ముసుగు లోన అమ్మను చాలా
బాధపెడుతు సాధించెడి
ఏ ధనమైనా విషంబె తెలుసుకొనుమురా.
పూర్తిజేసి సరిదిద్దవలసియున్నది.

తారకమంత్రము

కం.మననముచే రక్షించే
ధ్వనినే మంత్రమని యెరిగి ధరణిజపతియౌ
ఘనచరితుని ఘనశ్యాముని
మనసున రాముని తలచెద మధునామంబున్.

శుక్రవారం, జూన్ 08, 2007

ఆదిత్య 369 చిత్రంలోని శ్లోకం

శ్లో. జయ జయ దానవదారణకారణ శార్ఙ్గ రథాఙ్గ గదాసిధరా
జయ జయ చన్ద్ర దినేన్ద్ర శతాయుతసాన్ద్రశరీర మహత్ప్రసరా
జయ జయ తామరసోదర సోదర చారు పదోజ్ఝిత గాఙ్గఝరా
జయ జయ కేశవ కౌశినిషూదన శౌరి శరజ్జలజాక్ష హరీ.

[దారణ = చంపు,నిర్మూలించు; రథాఙ్గ = చక్రం; అసి = కత్తి; దినేన్ద్ర = సూర్యుడు; అయుత = పదివేలు(అనేకం); సాన్ద్ర = ఘన; మహత్ = గొప్పతనం; తామరసోదర = ఉదరమునుండి పుట్టిన తామరపువ్వు కలవాడు - విష్ణువు; ఉజ్ఝిత = emitted; ఝరము = ఝరి,ప్రవాహము; శరజ్జలజాక్ష = శరత్కాలంలో వికసించిన కలువలవంటి కన్నులు కలిగిన]

సోమవారం, జూన్ 04, 2007

సమస్య 6

ఒక్క వచనంలో తేడా సమస్యాపూరణాన్ని ఎలా మార్చేయగలదో!

1. పరకాంతను కోరె నేకపత్నీవ్రతుడై.

2. పరకాంతల కోరె నేకపత్నీవ్రతుడై.

శనివారం, జూన్ 02, 2007

బాల్యమిత్రునికిచ్చినదీ పద్యం

పదవ తరగతిలో వుండగా నా మిత్రుడు బందా శరవణ కార్తికేయకు నేను వ్రాసియిచ్చిన పద్యమిది:
ఉ.ఆపగ పారినట్లు హృది యా హరి మీదనె కల్గు భక్తియున్
ఏ పగ కల్గకుండ యిల ప్రేమను పంచెడిదైన స్నేహమున్
మాపుచు అంధకారమును మానవు మార్చెడిదైన విద్యయున్
ఆపదనుండినా విడువరానివిరా మనసైన నేస్తమా.
[ఆపగ = నది]

గురువారం, మే 31, 2007

పాఠకులకు చిన్న విన్నపం

ఈ పద్యం యెవరికైనా తెలిస్తే దయజేసి పూర్తిజేయ ప్రార్థన. నాకు నాల్గవ పాదం మాత్రం తెలుసు.

మ.ముదితల్ నేర్వగలేని విద్యగలదే ముద్దాడి నేర్పించినన్.

సమస్య 5

సమస్యాపూరణానికి లభించిన ఆదరణవలన ఉత్సాహంపొంది నేనిచ్చే మరొక సమస్య యిది. ఈ సమస్య ఇంతకు మునుపే సంస్కృతంలో వుంది. నేను తెనిగించానంతే.

ఉ.భామిని కౌగిలించె తన భర్తకు తండ్రిని కౌతుకమ్ముతో.
[భామిని = స్త్రీ; కౌతుకము = ఆశ, కోరిక]

మంగళవారం, మే 15, 2007

తెనాలి రామకృష్ణీయమ్

చం.స్తుతమతి యైన యాంధ్ర కవి ధూర్జటి పల్కుల కేల గల్గెనో
అతులిత మధురీ మహిమ? ఆ తెలిసెన్, భువనైక మోహనో
ద్ధత సుకుమార వార వనితా జనతా ఘనతాపహారి సం
తత మధురాధరోదిత సుధారస ధారల గ్రోలుటన్ జుమీ.

సోమవారం, మే 14, 2007

నేనిచ్చే సమస్య 4

రావణు చెల్లి ద్రౌపదిని రాముడు యెత్తుకు పోయె చక్కగా.

నేనిచ్చే సమస్య 3

మఠమును వేసి వండమనె మంచిగ భార్యను పిండివంటలన్.

ఆదివారం, మే 13, 2007

నేనిచ్చే సమస్య 2

మలమును గాంచి ముద్దిడెను మన్మథ తాపము తాళజాలకన్.

నేనిచ్చే సమస్య 1

తన వొడిలో కుమారుఁ గని తల్లి భయంబున మూర్ఛనొందదా?

శనివారం, మే 05, 2007

వికటకవి తెనాలి రామకృష్ణీయమ్

కం. ఎమితిని సెపితివి కపితము
భ్రమపడి వెరిపుచ్చకాయ వడి దిని సెపితో
యుమెతక్కయ దిని సెపితివొ
యమవసనిసి యన్న మాట యలసని పెదనా!

కం. గంజాయి త్రావి తురకల
సంజాతుల గూడి కల్లు చవిగొన్నావా?
లంజాకొడకా యెక్కడి
కుంజర యూధంబు దోమ కుత్తుక జొచ్చెన్?

కం. రంజన జెడి పాండవు లరి
భంజనులై విరటుఁ గొల్వ బాల్పడి రకటా
సంజయ యేమని జెప్పుదు
కుంజర యూధంబు దోమ కుత్తుక జొచ్చెన్!

శ్రీరామ మహిమ

తే.గీ.కవిత ఛందము లేకున్న కవిత గాదు
అన్న విశ్వనాథ పలుకు లనుసరించి
రామ నామము పలుకగ రమ్య రీతి
రామచంద్రునిఁ గొలుచుచు(కొలువగ)వ్రాసితినిది.

కం.శ్రీరామచంద్రమూర్తీ
నోరారా నీదు మహిమ నుర్విని పాడన్
వేరే సేవకులెందుకు
ఈ రాఘవుడుండ నీకు యినకులచంద్రా.

ఆదివారం, మార్చి 25, 2007

భారతీ స్తుతి

భారతీ స్తుతి!
కవి: ఓం ప్రకాశ్, ఎం.ఏ,(ఎం.ఫిల్),ఉస్మానియా విశ్వవిద్యాలయం.
(ఇది 'తెలుగు సాహిత్య వేదిక' ద్వారా ప్రకాశితము)

కం. వ్యాసపుర పీఠవాసవు
భాసుర వీణాక్షదామ పాణివి వాణీ!
వ్యాసమునీశ్వర సేవిత
దాసుడ ననుయేలరమ్ము దయతో దేవీ! 1.
[భాసుర = ప్రకాశించే; అక్ష దామ = పూసల మాల; పాణి = చేయి]

ఉ. బాసర పుణ్యతీర్థమున భాసిలి, భక్త జనావళీ మనో
వాసినియై, వచోవిభవ భావ విజృంభిత దివ్య మూర్తయై,
హాసవిలాస దీవరదయై, కవితారచనాత్మరూపయై,
వ్యాస మహామునీశకృతయై వెలుగొందెడి వాణి వేడెదన్! 2.
[భాసిలు = ప్రకాశించు; ఆవళి(లి) = సమూహము; వచస్ = మాట; విభవము = వైభవము, సంపద; విజృంభించు = వ్యాపించు; విలాసము = లీల; ధీ = intellect]

ఉ.బాసర పీఠమున్ వెలిగి భక్తుల పాలిటి కల్పవల్లియై,
దోసములన్నిటిన్ దునిచి, దోర్బల ధీబల దాత్రివంచు, నీ
బాసట వీడకన్ హృదయ పద్మమునందున గొల్తునమ్మ, యో
సారసనేత్రి! నీ కరుణశారద చంద్రికలౌత భారతీ!! 3.
[వల్లి = లత; దోర్బల(?) = బలహీన, చిన్న; దాత్రి(స్త్రీ.) - దాత(పుం.); సారసము = తామరపువ్వు; శారద చంద్రిక = శరదృతువులోని వెన్నెల]

దీనిపై నా వ్యాఖ్య:

ఉ. పక్కులు పల్కురీతి నిటు బాసరవాసిని శారదాంబపై
చక్కని పద్యమాలికలు చప్పున చెప్పి విశేష భక్తితో
మ్రొక్కెడు భక్తసత్కవికి మోదము తోడ ప్రశంస జేసెదన్ -
ఎక్కడ నాయనా యిపుడు తెల్గులొ వ్రాసిన పద్యసూనముల్
ఎక్కడయంచు వేచి గన చేవను (చేతల) చూపెను ఓం ప్రకాశుడే.

వ.తెలుగు వ్రాయటం చదవటం మాట్లాడటం సరిగా వచ్చినవారే కనుమరుగౌతున్న యీ తరుణంలో చక్కగా పద్యప్రసూనపూజ చేసిన ఓం ప్రకాశ్ గార్కి రాఘవ నమస్సులు.
[పక్కి = పక్షి; సూనము = ప్రసూనము = పువ్వు]

తప్పొప్పులు:

1. రెండవ పద్యం మూడవ పాదంలో ధీవరద అని వుండాలి; దీవరద కాదు. దీ [= మరణించు] అన్నది సంస్కృత ఆత్మనేపద ధాతువు.

2. ఇది తప్పో కాదో నాకు నిశ్చయంగా తెలియదు కానీ మూడవ పద్యంలో దౌర్బల అన్న ప్రయోగంతో పోలిస్తే దుర్బల అన్న ప్రయోగం బావుంటుందేమో అని అనిపించింది. దుర్బల ధీబల దాత్రివంచు = 'that you bless even a nitwit with the power of intellect' అన్నదే కవి అభిప్రాయమైయుండవచ్చని భావిస్తే.

శనివారం, మార్చి 24, 2007

ఆదిశఙ్కరాచార్య కృత శివ మానస పూజా స్తోత్రమునకు నా తెనిగింపు

[ముందుమాట: "శార్దూల(విక్రీడిత)"మనే చందస్సులో వున్న సంస్కృత శ్లోకాలకు "శార్దూలం"లోనే తెలుగులో వ్రాయాలన్న వుద్దేశం వుండటం వల్ల కొన్ని కఠిన పదాలు వాడక తప్పలేదు. అలాగే చిన్న శ్లోకమవటం చేత చివరి "కర చరణ కృతం వా" అన్న శ్లోకాన్ని కందపద్యంగా వ్రాస్తే బాగుంటుందేమో అనిపించింది.]

స్తోత్రము:

శా. నానా రత్న విభూషితాసనము - శీతాపో೭భిషేకంబులున్ -
రత్నాలంకృత వస్త్రముల్ - భుజగ హారా - కస్తురీ గంధముల్ -
సూనంబుల్ ఘన బిల్వ పత్రములునూ - సూర్ముల్ - సుధూపంబులున్ -
అన్నీ నా హృదయంబునన్ మ(త)లచితిన్ - సర్వాత్మకా అందుకో. ౧.
[శీతాపో೭భిషేకము = శీత+ఆపః+అభిషేకము = చల్లని నీటితో అభిషేకము; సూనము = పువ్వు; సూర్ముల్ సుధూపముల్ = దీపధూపములు]

श्लो॥ रत्नैः कल्पितमासनं हिमजलैः स्नानं च दिव्यांबरं
नानारत्नविभूषितं मृगमदामोदाङ्कितं चन्दनम्।
जातीचंपकबिल्वपत्ररचितं पुष्पं च धूपं तथा
दीपं देव दयानिधे पशुपते हृत्कल्पितं गृह्यताम्॥१॥

శా. హేమాంగంబగు పాత్రలో - పచితముల్ హైయంగవీనంబుతోన్ -
ప్రేమన్ - పానక - క్షీరముల్ - ఫల - దధుల్ - పేయంబులున్ - వీటియున్ -
నీ మీదన్ గల భక్తితో మనసులో నీకై సమర్పించితిన్ -
శ్రీ మందాకినివాహ! శంకర! శివా! నీ స్వీకారమున్ దెల్పవే. ౨.
[పచితము = వండినది; హైయంగవీనము = అప్పుడే కాచిన నెయ్యి; దధి = పెరుగు; పేయము = beverage; వీటి = తాంబూలము]

श्लो॥ सौवर्णे नवरत्नखण्डरचिते पात्रे घृतं पायसं
भक्ष्यं पञ्चविधं पयोदधियुतं रम्भाफलं पानकम्।
शाकानामयुतं जलं रुचिकरं कर्पूरखण्डोज्ज्वलं
तांबूलं मनसा मया विरचितं भक्त्या प्रभो स्वीकुरु॥२॥

శా. సంకల్పంబున - చామర - వ్యజనముల్ - ఛత్రంబు - నాదర్శమున్ -
నీకై వాద్యములున్ - మృదంగ లయలున్ - నృత్యంబులున్ - గీతముల్ -
సంకీర్తుల్ యిల చాల జేసితి - హరా - సాష్టాంగ దండంబులున్ -
లోకాధీశ గ్రహించుమయ్య కృపతో - లోపాలు గాంచొద్దయా. ౩.
[చామరము = వింజామర; వ్యజనము = విసనకఱ్ఱ; చత్రము = గొడుగు; ఆదర్శము = అద్దము]

श्लो॥ छत्रं चामरयोर्युगं व्यजनकं चादर्शकं निर्मलं
वीणाभेरिमृदङ्गकाहलकला गीतं च नृत्यं तथा।
साष्टाङ्गं प्रणतिः स्तुतिर्बहुविधा ह्येतत्समस्तं मया
सङ्कल्पेन समर्पितं तव विभो पूजां गृहाण प्रभो॥३॥

శా. కాయంబే గుడి - ఆత్మ నీవు - మనసే కామాక్షి - ప్రాణంబులే
ఆయా సేవక బృందముల్ - విషయముల్ శాస్త్రోక్త పూజావిధుల్ -
శయ్యానిద్రలె శ్రీ సమాధి స్థితి - సంచారంబులావర్తముల్ -
నా యీ వాక్కులె స్తోత్రముల్ - క్రియలు నీ ఆరాధనల్ - ఓ శివా! ౪.
[ఆవర్తము = ప్రదక్షిణ]

श्लो॥ आत्मा त्वं गिरिजा मतिः सहचराः प्राणाः शरीरं गृहं
पूजा ते विषयोपभोगरचना निद्रा समाधिस्थितिः।
सञ्चारः पदयोः प्रदक्षिणविधिः स्तोत्राणि सर्वा गिरो
यद्यत्कर्म करोमि तत्तदखिलं शम्भो तवाराधनम्॥४॥

కం. కర - పద - తను - మనకృతములు
మరి జ్ఞానేంద్రియ కృతములు అపరాధంబుల్
సరియై(నై)నను కాకున్నను
కరుణాభ్ధీ నను క్షమించి కావుము దేవా.౫.

श्लो॥ करचरणकृतं वा कर्मवाक्कायजं वा श्रवणनयनजं वा मानसं वापराधम्।
विहित मविहितं वा सर्वमेतत्क्षमस्व शिव शिव करुणाभ्धे श्रीमहादेव शम्भो॥५॥

బుధవారం, మార్చి 21, 2007

పుష్ప విలాపము - కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి

తే.గీ.చేతులారంగ నిన్ను పూజించుకొరకు
కోడి కూయంగనే మేలుకొంటి నేను;
గంగలో మున్గి ధౌత వల్కలము గట్టి
పూలు కొనితేర నరిగితి పుష్పవనికి. 1.
[ధౌత = ఉతకబడిన; వల్కలము = నారచీర; అరుగు = వెళ్లు]

ఉ.నే నొక పూలమొక్క కడ నిల్చి చివాలున కొమ్మవంచి గో
రానెడు నంతలోన విరు లన్నియు జాలిగ నోళ్ళు విప్పి "మా
ప్రాణము తీతువా" యనుచు బావురు మన్నవి; క్రుంగిపోతి; నా
మానసమం దెదో తళుకు మన్నది పుష్పవిలాప కావ్యమై. 2.
[విరి = పువ్వు]

తే.గీ.తల్లి యొడిలోన తలిరాకు తల్ప మందు
ఆడుకొను మమ్ములను బుట్టలందు చిదిమి
అమ్ముకొందువె మోక్ష విత్తమ్ము కొరకు!
హృదయమే లేని నీ పూజ లెందుకోయి? 3.
[తలిరాకు = లేత/క్రొత్త ఆకు; తల్పము = పరుపు; విత్తము = ధనము]

తే.గీ.జడమతుల మేము; జ్ఞానవంతుడవు నీవు;
బుధ్ధి యున్నది; భావ సమృద్ధి గలదు;
బండబారెనటోయి నీ గుండెకాయ!
శివునకై పూయదే నాల్గు చిన్ని పూలు? 4.
[ఏము = మేము]

ఉ.ఆయువు గల్గు నాల్గు గడియల్ కని పెంచిన తీవతల్లి జా
తీయత దిద్ది తీర్తుము; తదీయ కరమ్ములలోన స్వేచ్ఛమై
నూయల లూగుచున్ మురియుచుందుము; ఆయువు దీరినంతనే
హాయిగ కన్ను మూసెదము ఆయమ చల్లని కాలి వ్రేళ్ళపై. 5.
[తీవ = తీగ; దిద్దు = చక్కబెట్టు; తదీయ = ఆ; ఆయమ = ఆ అమ్మ]

ఉ.గాలిని గౌరవింతుము సుగంధము పూసి; సమాశ్రయించు భృం
గాలకు విందు చేసెదము కమ్మని తేనెలు; మిమ్ము బోంట్ల నే
త్రాలకు హాయిగూర్తుము; స్వతంత్రుల మమ్ముల స్వార్ధ బుద్ధితో
తాళుము త్రుంప బోవకుము; తల్లికి బిడ్డకు వేరు సేతువే! 6.
[భృంగము = తుమ్మెద; మిమ్ము బోంట్లు = మీబోటి వారు; తాళు = సహించు]

ఉ.ఆత్మ సుఖమ్ము కోసమయి అన్యుల గొంతులు కోసి తెచ్చు పు
ణ్యాత్ముడ! నీకు మోక్ష మెటు లబ్బును? నెత్తురు చేతి పూజ వి
శ్వాత్ముడు స్వీకరించునె? చరాచరవర్తి ప్రభుండు మా పవి
త్రాత్మల నందుకోడె! నడమంత్రపు నీ తగులాట మేటికిన్? 7.
[నడమంత్రపు = అకస్మాత్తుగా (వచ్చిన); తగులాట = ఆసక్తి; మేటి = భగవంతుడు]

తే.గీ.ఊలు దారాలతో గొంతు కురి బిగించి
గుండెలో నుండి సూదులు గ్రుచ్చి కూర్చి
ముడుచుకొందురు ముచ్చట ముడుల మమ్ము
అకట! దయలేని వారు మీ యాడువారు. 8.

తే.గీ.గుండె తడి లేక నూనెలో వండి పిండి
అత్తరులు చేసి మా పేద నెత్తురులను
కంపు దేహాలపై గుమాయింపు కొరకు
పులుముకొందురు హంత! మీ కొలము వారు. 9.
[గుండె తడి = జాలి; హంత = హంతకుడు/హంతకురాలు; కొలము = కులము]

ఉ.అక్కట! హాయి మేము మహిషాసురు లెందరొ నాల్గు ప్రక్కలన్
ప్రక్కల మీద చల్లుకొని మా పసిమేనులు పాడు కాళ్ళతో
ద్రొక్కుచు దొర్లి - దొర్లి - మరు రోజుదయాననె వాడి వత్తలై
రెక్కలు జారిపోఁ పరిహరింతురు మమ్ముల పెంటదిబ్బ పై. 10.
[మేను = శరీరం; వత్త = వడలిపోయినది; పరిహరించు = విడుచు]

ఉ.మా వెలలేని ముగ్ధ సుకుమార సుగంధ మరంద మాధురీ
జీవిత మెల్ల మీకయి త్యజించి కృశించి నశించిపోయె; మా
యౌవన మెల్ల కొల్లగొని ఆ పయి చీపురుతోడ చిమ్మి మ
మ్మావల పారబోతురు గదా! నరజాతికి నీతి యున్నదా!? 11.
[ముగ్ధ = చక్కని; మరందము = మకరందము; మాధురి = తీయందనము]

తే.గీ.బుద్ధ దేవుని భూమిలో పుట్టినావు
సహజ మగు ప్రేమ నీలోన చచ్చెనేమి?
అందమును హత్య చేసెడి హంతకుండ!
మైలపడిపోయె నోయి! నీ మనుజ జన్మ. 12.
[మైల = మలినము]

తే.గీ.పూజ లేకున్న బాబు నీ పున్నె మాయె!
కోయ బోకుము మా పేద కుత్తుకలను
అకట! చేసేత మమ్ముల హత్య చేసి
బాపుకొనబోవు ఆ మహా భాగ్య మేమి? 13.
[కుత్తుక = గొంతు]

తే.గీ.ఇట్లు పుష్పాలు నన్ను చీవాట్లు పెట్టి
నట్లుగాన్ - పూలు కోయ చేయాడలేదు;
ఏమి తోచక దేవర కెరుక సేయ
వట్టి చేతులతో ఇటు వచ్చినాను. 14.

శనివారం, మార్చి 17, 2007

శ్రీరామ కర్ణామృతము - ప్రార్థన

చం. మొదలిడ కావ్యభారతిని ముందుగ వాణిని ప్రస్తుతింప నా
యెదనుదయించినట్టివగు యీ చిఱు పల్కులు వచ్చిరాని యీ
పదములతోనె నీకు అభివందనముల్ మనసార చేయుచూ
చదువులతల్లి శారదవు అమ్మవు నీకు నమస్కరించెదన్.

బుధవారం, మార్చి 14, 2007

చదువుల్ నేర్చిన చాలునంచు

మ. చదువుల్ నేర్చిన చాలునంచు విధులన్ సంధ్యాదులన్ వీడుచున్
అదియే లోకమటంచు నమ్మి క్రమబద్ధంబైన సజ్జీవనం
బు దగా గాబడినా నిజంబు యది కాబోదంచు జీవించు నా
హృదయంబందలి బాధనెంచి, హరి! నా హృత్తాపమున్ బాపవే.

ఆదివారం, ఫిబ్రవరి 18, 2007

ఆరువేల నియోగులపై శ్రీ దేవులపల్లి వారి ఛలోక్తి

ఆ.వె. ఆరువేల కొంపలంటించె నయగారు
ఆరువేల వేరె యప్పు జేసె
అతడుగాక యెవ్వడారువేల నియోగి
విశ్వదాభిరామ వినుర వేమ
దేవులపల్లి వేంకట కృష్ణ శాస్త్రి

బుధవారం, ఫిబ్రవరి 07, 2007

వాగీశాదులు

కం. వాగీశాదులు యెవరిని
బాగుగ పూజించి పనుల ప్రారంభమునన్
కాగలిగిరొ కృతకృత్యులు
ఆ గణనాథుని కొలిచెద ఆరాధనతో.

श्लो॥ वागीशाद्यास्सुमनसः सर्वार्थानामुपक्रमे।
यं नत्वा कृतकृत्याः स्युः तं नमामि गजाननम् ॥

శ్రీరామకర్ణామృత ఆంధ్రీకరణము - మంగళము కోసలేంద్రా

కం. మంగళము కోసలేంద్రా
మంగళము మహితగుణధర మహితనయపతీ
మంగళము రాకుమారా
మంగళములు సార్వభౌమ మా రామయ్యా.

श्लो॥ मङ्गलं कोसलेन्द्राय महनीय गुणाभ्धये।
चक्रवर्ति तनूजाय सार्वभौमाय मङ्गलम्॥

శుక్రవారం, జనవరి 26, 2007

మారమణాంతరంగ

ఉ.మారమణాంతరంగ నభమార్గమునందు చరించు హంస - తా
రారమణారుణానలకరమ్ములు చూపులుగా ధరించు గం
గారమణా - కృపాజలధి - కామితమోక్షప్రదాయకా - భవా
నీ రమణా - మనోకమలినీమధుకారక - నీకు మ్రొక్కెదన్.

గురువారం, జనవరి 25, 2007

శ్రీరఘువంశచంద్రుడగు

ఉ.శ్రీరఘువంశచంద్రుడగు శ్రీసతినాయకుఁ రామచంద్రునిన్
మారశరీరనాశకకుమారుడు బొజ్జగణాధిదేవునిన్
వారణచర్మధారి భవపాశవిమోచనకారి యీశునిన్
నీరజజాతధర్మసతినిన్ మది మ్రొక్కెద మోక్షసిద్ధికై.

శుక్రవారం, జనవరి 05, 2007

శ్రీరామకర్ణామృత ఆంధ్రీకరణము - మరి మరి అడిగెద

కం. మరి మరి అడిగెద నాకిల
వరములు యితరములు వలదు వారిజనయనా
నిరతముగ మదిని నీ శ్రీ
చరణకమలభక్తి నాకు చాలును రామా.

श्लो॥ वरं न याचे रघुनाथ युष्मत्पादाब्जभक्तिस्सततं ममास्तु।
इदं प्रियं नाथ वरं प्रयच्छ पुनःपुनस्त्वामिदमेव याचे॥