బుధవారం, డిసెంబర్ 19, 2007

నా ద్వ్యక్షరీ కందం

ముక్కోటి యేకాదశికి శ్రీమన్నారాయణునికి సమర్పణగా నా ద్వ్యక్షరీ కందం:

కం. మిము మాననమున మీ నా
మమునూ నేమమున నేను మననము మానన్
మమమనమే నీ(మీ) నననీ
నమనమునన్ నమ్మినాను నానానామా.

[मानन = గౌరవము; నేమము = నియమము; मम = నా; నన = పువ్వు; नमन = గౌరవంతో తలవంచుట; నానానామా = పెక్కు పేర్లు కలిగినవాడా]

శనివారం, డిసెంబర్ 01, 2007

తెగులు - నివారణ

కం. తెలుగుకి ఆంగ్లం దట్టిం
చి లేతవంకాయకూర చికెనుకెబాబుల్
కలగలిపి తిన్న రీతిని
పలకకపోతె మనభాష అర్థమవదుగా.

ఆ.వె.పంది బురదలోన పొర్లుతూంటేజూచి
ఆహ! బురద యెంతొ హాయిగొలుపు
నంటు దొర్లినాము ఆంగ్లపంకమునందు
పందులం పరాయివారికన్న.

ఆ.వె.వారిభాష నేర్చి వారిసంస్కృతినేర్చి
వొరగబెట్టెదేన్ని? ఓరి శుంఠ!
వారిమాయలోన దూరి పరాయివై
పోయినావు నీవు పూర్తిగాను.

తే.గీ.అమ్మవంటి భాషనెటుల వదలినావు
మేలుకొనుము నీవిపుడైన మేలుసేయ
లేకపోయినచో నీకులేదు ముక్తి
కనుక సేవచేయ నడుముకట్టు యిపుడు.