శనివారం, జనవరి 31, 2009

తిమ్మన చిత్రకవితావిలాసము

పారిజాతాపహరణ కావ్యంలోని పంచమాశ్వాసంలో నంది తిమ్మన తన చిత్రకవిత్వాన్ని ఆవిష్కరించాడు—


కందము. నాయశరగసారవిరయ – తాయనజయసారసుభగధరధీనియమా
మాయనిధీరథగభసుర – సాయజనయతాయరవిరసాగరశయనా (౫-౯౨)


సార అంటే బలమైన, శ్రేష్ఠమైన అని శబ్దరత్నాకరము. గ శబ్దం గమనానికి సూచన. వి అంటే విశేషమైన. రయమంటే వేగం. నాయ శబ్దానికి పద్ధతి, దిశ, నీతి అని నిఘంటువు. తాయన అంటే బాగుగా సాగుచున్న అని నిఘంటువు. కాబట్టి నాయ–శరగ–సార–విరయ–తాయన–జయసార అనే మొదటి విశేషణాన్ని నాయ–వి–రయ–గ–సార–శర–తాయన–జయ–సార గా అన్వయించుకోవచ్చు. పద్ధతిగా విశేషమైన వేగంతో ప్రయాణించే శ్రేష్ఠమైన బాణాలవలన కలిగిన చక్కటి జయించే చేవ ఉన్నవాడు అని అర్థం.

సుభగుడు అంటే మనోహరమైనవాడు, భాగ్యవంతుడు.

ధీ అంటే బుద్ధి. ధర అంటే భూమి అనీ కొండ అనీ అర్థాలు (ధర ధరించేది). నియమ శబ్దం మొక్కవోని వ్రతాన్ని సూచిస్తుంది. కాబట్టి ధీ నియమం అంటే బుద్ధికి సంబంధించిన వ్రతం. ఎలాంటి వ్రతం? భూమిలాంటి (లేదా కొండవంటి). ఏమిటి దీని అర్థం? నిశ్చలమైన అని తీసుకుంటే భూమికైనా కొండకైనా సరిపోతుంది. కాబట్టి నిశ్చలమైన (మార్చరాని) బుద్ధినియమం కలవాడు.

మాయనిధీ వేరు మాయానిధీ వేరు. మాయానిధీ అంటే మాయకు నిలయమని. ఇక్కడ మాయనిధీ అంటున్నాడు కాబట్టి మా అయ నిధీ అని చెప్పుకోవాలి. అయమంటే మేలు కలుగజేసే వస్తువు/దైవము అని శబ్దరత్నాకరము. మా అంటే లక్ష్మి. కాబట్టి మాయనిధీ అంటే లక్ష్మికీ మేలుకీ నిలయమైనవాడు.

రథమంటే తేరు, శరీరము అని శబ్దరత్నాకరము. భ శబ్దం కాంతికి సూచిక. గ శబ్దం ధరించడాన్ని కూడా సూచిస్తుంది. కాబట్టి భ–సుర–రథ–గ అంటే కాంతివంతులైన దేవతలను శరీరమునందు ధరించినవాడు. అంటే సర్వదేవస్వరూపుడు.

సాయమంటే బాణము. నయమంటే న్యాయము. కాబట్టి సాయ–జ–నయ అంటే బాణము(ల) ద్వారా పుట్టిన న్యాయం కలవాడు.

తాయ్ ధాతువు విస్తరించడం అనే అర్థంలో వాడుతారు అని నిఘంటువు. ర అంటే కాంతి, గమనం, అగ్ని, కామం, ధారణ... అని నిఘంటువు. కాబట్టి తాయరవిర అంటే రవి–ర–తాయ రవికోటితేజుడు అని.

సాగర శయనా అంటే సముద్రమే పాన్పుగా కలవాడు.

ఈ పద్యంలో గమ్మత్తు మొదటినుండి చివరికి చదివినా చివరినుండి మొదటికి చదివినా ఒకేలా ఉండడం. దీనకి అనులోమవిలోమమని పేరు.


కందము. ధీర శయనీయశరధీ – మారవిభానుమతమమత మనుభావిరమా
సారసవన నవసరసా – దారదసమతారహార తామసదరదా (౫-౯౩)


ధీరుడు అంటే విద్వాంసుడు, ధైర్యవంతుడు అని శబ్దరత్నాకరము.

శయనీయ శరధి అంటే శయనించుటకు అర్హమైన సముద్రము కలవాడు.

మారుడంటే మన్మథుడు. వి అంటే విశేషమైన. భా అంటే కాంతి. అనుమత సమ్మతించబడిన. మమత మమత్వం, అభిమానం. మార–విభానుమత–మమత. మన్మథుడి కాంతికి సమ్మతమైన అభిమానం కలవాడు. అంటే మన్మథుడివలె కాంతిమంతుడని.

నిఘంటువులో మను శబ్దానికి మంత్రమని అర్థం. భావి అంటే కాగల, భవిష్యత్ అని అర్థాలు. మంత్రము వలన కాగల లక్ష్మి కలవాడు. అంటే మంత్రమననముచే సమస్తశుభాలనీ ఇచ్చేవాడు.

సవనమంటే యజ్ఞము. సవన–సార అని అన్వయించుకుని యజ్ఞములందు శ్రేష్ఠుడని చెప్పుకోవచ్చు. లేదా తరువాతి నవ–స–రసా కూడ కలిపి అర్థం తీసుకోవచ్చు. నవ అంటే క్రొత్త, తొమ్మిది. ఈ రెండు అర్థాలూ వాడుకుంటే నవసరసా అంటే కొంగ్రొత్త సరసనవము కలవాడా అని. అప్పుడు శ్రేష్ఠమైన యజ్ఞములందు సనవరసుడని.

దారదమంటే పాదరసము విషము ఇంగువ అని శబ్దరత్నాకరము. తార అంటే మలినరహితమైన ముత్యము. దారద–సమ–తార అంటే పాదరసంలా మెరిసే మంచి ముత్యం. అట్టి ముత్యాల హారం కలిగినవాడు.

దరమంటే భయమనీ శంఖమనీ శబ్దరత్నాకరము. తామసదరదుడంటే తామసానికి భయాన్నిచ్చేవాడు అని.

ఈ పద్యంలో గమ్మత్తు ఏ పాదానికి ఆ పాదం మొదటినుండి చివరికి చదివినా చివరినుండి మొదటికి చదివినా ఒకేలా ఉండడం. దీనకి పాదభ్రమకమని పేరు.


కందము. మనమున ననుమానము నూ–నను నీ నామ మను మను మననమును నేమ
మ్మున మాన నన్ను మన్నన – మను మను నానా మునీన మానానూనా (౫-౯౮)


మనమునన్ అనుమానమున్ ఊనను నీ నామము అను మను మననమునున్ నేమమ్మునన్ మానన్ నన్ను మన్ననన్ మనుము అను నానా ముని ఇన మాన అనూనా

ఊను అంటే అవలంబించు, పొందు అని శబ్దరత్నాకరము. మను శబ్దానికి మంత్రమని అర్థం. నేమము అంటే నియమము. మనుట అంటే జీవించుట (మనుగడ, మనికి). ఇన అంటే శ్రేష్ఠమైన అని నిఘంటువు. మానము అంటే కొలత, ప్రమాణం అని ఇక్కడ తీసుకోవలసిన అర్థం. అనూన అంటే వెలితి లేని, నిండైన అని శబ్దరత్నాకరము.

ముని శ్రేష్ఠుల అందరి ప్రమాణాలకీ ఏమాత్రం వెలితిలేనివాడా! మనస్సులో అనుమానం పొందను (ఊహాపోహలకి తావివ్వను). నీ నామపు మంత్రజపం చేసే నియమాన్ని మానను. మన్ననతో నన్ను జీవించుమని దీవించు.

తెలుస్తూనే ఉంది. ఈ పద్యం ద్వ్యక్షరి. న, మ — ఈ రెండక్షరాలే ఉన్నాయీ పద్యంలో.


పదాలు విడగొట్టుకోవడంలోనే అసలు చిక్కంతా ఉందీ మూడు పద్యాల్లోనూ. చిత్రకవిత్వంలో చిత్రమో ఏమిటో కానీ వీటిల్లో శబ్దాడంబరం బావున్నా అర్థమవ్వాలంటే పరిశ్రమ చేయక తప్పదు!

ముక్కు తిమ్మనార్యు ముద్దు పలుకే గానీ ఇక్కడ ముక్కు తిమ్మనార్యు చిక్కుపలుకు అనాలనిపించింది (చిక్కుకి శ్లేషతో సహా) ఈ మూడూ అర్థం చేసుకునే సరికి!


కృతజ్ఞతలు:
౧ పారిజాతాపహరణ కావ్యపు జాలప్రచురణకర్తలైన ఆంధ్రభారతి వారికి
౨ శబ్దరత్నాకరాన్ని కూర్చిన బహుజనపల్లి సీతారామాచార్యులు గారికి
౩ సంస్కృతాంగ్లనిఘంటువును కూర్చిన మోనియరు విలియమ్సు గారికి
౪ దీనికై తగినంత పరిశ్రమ చేయించినందుకు మందాకిని గారికి

శనివారం, జనవరి 03, 2009

శ్రీశ్రీ లేకున్ననేమి సిరిసిరిమువ్వా

ఊకదంపుడుగారి బ్లాగులో ఈ టపా చూసి అప్పటికప్పుడు మదిలో మెదిలిన ఆలోచనే ఈ అక్షరమంజరి...

విశ్రాంతి చాలు చాలిక
లే శ్రమతోనైన కంటిరెప్పకు మల్లే
ప్రశ్రయమున నే చూచెద
శ్రీశ్రీ లేకున్ననేమి సిరిసిరిమువ్వా ౧

కందాలే మళ్ళీనా
అందామని ఉన్న కూడ అనవద్దమ్మా
అందంగా భావాలను
చిందిస్తా చిందులాడు సిరిసిరిమువ్వా ౨

ఓ కుఱ్ఱకుంక రాఘవ
నీకెందుకు నా గుఱించి నేనొప్పను పో
పో కైతలా ఇవనుచూ
ఛీ కొట్టకు నన్ను నువ్వు సిరిసిరిమువ్వా ౩

ఈ కవన మారథాన్లో
నా కంటే ముందు ఎవడు నడిచేస్తాడో!
నాకొక ఛాన్సిచ్చావో
చేకొందును ఫస్టు నేను సిరిసిరిమువ్వా ౪

ఇంకా ఏం కావాలట
నీకింకో గాఠి మాట నిజమిది శ్రీశ్రీ
కే కాదమ్మా పేర్లో
నాకూ శ్రీ ఉంది చూడు నా సిరి* మువ్వా ౫

లెచ్చర్లిచ్చుట సుళువే
అచ్చంగా టెల్గులోన అరవండంటూ
చచ్చే చావొచ్చిందే
చిచ్చీ ఇంగ్లీషుతోటి సిరిసిరిమువ్వా ౬

ఐనా కూడా యత్ని
స్తా నా వంతు పని నేను సాధించేస్తా
శానా సేయాలి... తెలుగు
సేనకు నే బంటునమ్మ సిరిసిరిమువ్వా ౭

నాది తెలుగు భాష అనీ
నా దేశము భారతమని నలుదిశలందూ
ఏదీ చాటక పోతే
చేదెక్కాలమ్మ జిహ్వ సిరిసిరిమువ్వా ౮

గునపం పారా కత్తీ
పని చేస్తేనే కదమ్మ పదిమందికి నో
ట్లో నలిగేదీ మెతుకులు
చినుకులు నడిపెడి బ్రతుకులు సిరిసిరిమువ్వా ౯

ఈ లోకంలో ఎంతో
కాలంగా ఉన్న వృత్తి కాయాకష్టం
గాలీ వానా ఎండా
చేలో సిరి ఉన్నదమ్మ సిరిసిరిమువ్వా ౧౦

పాలసపోటా కొబ్బరి
పాలూ గోదారినీళ్లు పనసా అరటీ
పాలూ జున్నూ చెరకూ
చేలో వరికంకి సిరులు సిరిసిరిమువ్వా ౧౧

కూలీనాలీ చేసే
పాలేళ్లూ కౌలుదార్లు పచ్చని చేలూ
కాలువగట్లూ ఈతలు
చేలో పాట సరదాలు సిరిసిరిమువ్వా ౧౨

వైనం చూస్తే దేశం
నానాటికి మారుతోంది నాగంభొట్లూ :)
గానుగ ఆడిన నూనెలు
చేనేతల బట్టలేవి సిరిసిరిమువ్వా ౧౩

వన్నెల బట్టల డూ బస
వన్నల సంక్రాంతి ఆటపాటలు చూశా
వెన్నెల్లో ఆటల్నీ
చిన్నప్పుడు చూస్తి నేను సిరిసిరిమువ్వా ౧౪

కోనేటిలోని చేపలు
మానులపై గూళ్లు చందమామా మట్టీ
వానా నా మదిలో రా
సేనెన్నో కవితలు మరి సిరిసిరిమువ్వా ౧౫

దోమలు చేసే నాదం
ఆమనిలో కోకిల స్వర మాడే నెమలీ
రాముడి గుడి పానకమూ
చీమల క్రమశిక్షణ భళి సిరిసిరిమువ్వా ౧౬

వేసవిలో మామిళ్లూ
శైశవమున అమ్మ చేతి చద్దన్నాలూ
సీసాల్లో షోడాలూ
చేసిన అల్లరి పసందు సిరిసిరిమువ్వా ౧౭

స్కూల్లో గెంతిన రోజులు
పిల్లా పిచికా కబుర్లు పీచు మిఠాయీ
చిల్లుల జేబులు ఇంకా
చిల్లరతో కొన్న జీళ్లు సిరిసిరిమువ్వా ౧౮

మా సారు పుస్తకాలూ
క్లాసుల మధ్యన కబుర్ల కాలక్షేపం
రాసిన పేరడి పాటలు
సీసంతో నా తకధిమి సిరిసిరిమువ్వా ౧౯

పూటకి ఇన్నే రాస్తా
నేటికి ఇవి చాలు నీకు నే వెళ్లొస్తా
పోటీ పరుగుల మధ్యన
చీటికి మాటికి కుదరదు సిరిసిరిమువ్వా ౨౦

చెమక్కు: ఇవాళ ముగింపు చురుక్కు...

దురుసుగ వాగే తమ్ముడు
సరిగా గుదిబండలాగు చక్కగ ఉంటే
పరకాల మిత్రులున్నా
చిరు నెగ్గునొ నెగ్గలేడొ సిరిసిరిమువ్వా ౨౧

______
*ఒక్కటే శ్రీ కదా... ఒక్కటే సిరి