మంగళవారం, మార్చి 24, 2009

విశ్వనాథవారి శ్రీమంజూషిక పద్యం

శ్రీమంజూషిక భక్తపాలనకళాశ్రీచుంచు వానందవ
ల్లీమంజుప్రసవంబు చిద్గగనప్రాలేయాంశువున్ మోక్షల
క్ష్మీమాణిక్యవినూత్నమేఖల కటాక్షీభూతనీహారరుక్
శ్రీమంతంబయి పొల్చు వెల్గు నొకడే సేవింతు విశ్వేశ్వరా


ఇది శ్రీ విశ్వనాథ సత్యనారాయణగారి శ్రీమద్రామాయణకల్పవృక్షమునందలి తొలి పద్యం. (ఈ పద్యానికి కొంత వివరణ శ్రీ వేదుల కామేశ్వరరావుగారు కల్పవృక్షము - అవతారిక అనే శీర్షికతో శ్రీమద్రామాయణకల్పవృక్ష కావ్య వైభవము అనే వ్యాస సంపుటిలో ప్రచురించారు.)

* * *

ముందు ఈ పద్యాన్ని ఎక్కడెక్కడ విఱవాలో గమనిస్తే...

శ్రీమంజూషిక. ఇక్కడే ఎందుకు విఱవాలి? మంజూషికా అని సంస్కృత శబ్దం కాబట్టి, ఇక్కడ ప్రయోగంలో దీర్ఘం లేదు కాబట్టి. తర్వాత, భక్తపాలనకళాశ్రీచుంచువు, ఆనందవల్లీమంజుప్రసవంబు, చిద్గగన ప్రాలేయాంశువున్. ఆ తర్వాత మోక్షలక్ష్మీమాణిక్యవినూత్నమేఖల [మేఖల ఆకారాన్త స్త్రీలింగశబ్దం కాబట్టి]. కటాక్షీభూతనీహారరుక్ శ్రీమంతంబు, అయి, పొల్చు, వెల్గును, ఒకడే, సేవింతున్, విశ్వేశ్వరా.

ఈ పద్యంలో ఒక చిన్న పేచీ ఉంది. చిద్గగనప్రాలేయంశువున్ వద్ద. చిద్గగనప్రాలేయాంశు అన్నదానిని శుద్ధ (సిద్ధ) సంస్కృత సమాసంగా తీసుకుంటే... అంటే రెండు తత్సమశబ్దాల సమాసంగా దీనిని తీసుకుంటే చిద్గగనప్రాలేయాంశు లో న గురువౌతుంది (ఆనందవల్లీమంజుప్రసవంబు లో జు గురువైనట్టుగా). అలాంటప్పుడు గణభంగం జరిగినట్టు. అలా కాదూ, ఇది రెండు తద్భవశబ్దాల సమాసమూ అనుకుంటే ఆ ఇబ్బంది లేదు. చిద్గగన వద్ద విఱచి ప్రాలేయాంశువున్ ప్రారంభంలోని ప్రాని ఊది పలికేస్తే సరిపోతుంది.

* * *

ఒకసారి విభజన జరిగాక అర్థం వెతుక్కోవడం కొంచెం తేలికే కదా.

శ్రీ అంటే సంపద, శోభ, శుభము, మంగళము, విషము అని అర్థాలు. మంజూషిక అంటే పెట్టె. శ్రీమంజూషిక అంటే సంపదలకి పెట్టె అంటే సంపదలని ఇవ్వగలిగిన అని. ఈ శ్రీమంజూషికకే విషమును ధరించిన అని రెండో అర్థమూ వస్తుంది. ఎంత సంపదలకి అధిష్ఠానదైవతమని చెప్పాలనుకున్నా ఈ శ్రీమంజూషిక ప్రయోగం సమస్త సంపదలకి ఇనప్పెట్టెలాంటివాడా అని సంబోధించినట్టుంది.

చుంచువు. చుంచు అనే శబ్దానికి వు ప్రత్యయం చేరింది. ప్రసిద్ధికెక్కిన అని అర్థం తీసుకోవాలి. అప్పుడు భక్తపాలనకళాశ్రీచుంచువు అంటే భక్తులను పాలించడమనే మంగళకరమైన కళయందు ఖ్యాతికెక్కినవాడు అని అర్థం.

ఆనందవల్లీమంజుప్రసవము. వల్లి తీగె. మంజు అందమైన, మనోహరమైన. ప్రసవము పువ్వు. ఆనందమనే తీగెను పూచిన మంజులమైన పుష్పం.

చిద్గగనప్రాలేయాంశువు. చిత్ జ్ఞనం. ప్రాలేయ చల్లని. అంశువు కిరణము. ప్రాలేయాంశువంటే చల్లని కిరణములు కలవాడు. కాబట్టి జ్ఞానమనే గగనమందు చంద్రుడు.

మోక్షలక్ష్మీమాణిక్యవినూత్నమేఖల. మోక్షమనే లక్ష్మికి మాణిక్యములతో కూడిన వినూత్నమైన మేఖల (మొలనూలు, వడ్డాణం).

కటాక్షీభూతనీహారరుక్‌శ్రీమంతంబు. కటాక్ష క్రీగంటిచూపు. భూత ఐన. నీహారరుక్. నీహారుడు అంటే చంద్రుడు. నీహారము అంటే మంచు. రుక్ కాంతి. ఎలా చూసినా నీహారరుక్ అంటే చల్లని వెలుగు. అటువంటి చల్లని వెలుగు సంపదలు కలిగిన (శ్రీమంతము). క్రీగంటిచూపులుగా మలచుకున్న చల్లని వెలుగు సంపదలు ఎవరికి కలవో వాడు.

పొల్చు అగుపించు, ఒప్పు.

* * *

ఓ విశ్వేశ్వరా! సర్వసంపదలకూ సమస్తమంగళములకూ మంజూషయైనదీ, భక్తులను పాలించే కళయందు ఖ్యాతికెక్కినదీ, ఆనందమనే లతకి పూచిన మనోహర పుష్పమైనదీ (లత లతగానే మనోహరంగా ఉంటుంది, అలాంటి లత కూడా పువ్వులవలన మిక్కిలి శోభిల్లుతుంది కదా), జ్ఞానమనే ఆకాశంలో చంద్రుడైనదీ (జ్ఞానం అనంతం అని గగన ప్రయోగం ధ్వనిస్తోంది), మోక్షలక్ష్మికి మాణిక్య వినూత్న మేఖలయైనదీ, క్రీగంటిచూపుగా మారిన చల్లని వెలుగు సంపదలు కలిగినదీ... ఐన వెలుగు ఒకడే (అద్వైతభావం... శివకేశవాభేదం). ఆ వెలుగుని సేవిస్తాను.

ఇప్పుడు ఒక్కసారి తిరిగి చదివితే ప్రతీ విశేషణమూ శివుడికీ వాడవచ్చు, కేశవుడికీ వాడవచ్చు అని స్పష్టంగా తెలుస్తుంది. ఐనా అలాంటి కాంతికి ఏకత్వాన్ని ఆపాదించి, అట్టి అద్వైత పరబ్రహ్మాన్ని కొలుస్తాను అని చెప్పడం ఈ పద్యంలోని ప్రత్యేకత.