శుక్రవారం, సెప్టెంబర్ 29, 2006

తాళ్ళపాక అన్నమాచార్యుని పద శోభ ౧

అలరఁ జంచలమైన ఆత్మలందుండ నీ యలవాటు జేసె నీ వుయ్యాల
పలుమారు నుచ్ఛ్వాస పవనమందుండ నీ భావంబు దెలిపె నీ వుయ్యాల

ఉదయాస్త శైలంబు లొనరఁ గంభములైన వుడుమండలము మోఁచె నుయ్యాల
అదన నాకాశ పద మడ్డదూలంబైన అఖిలంబు నిండె నీ వుయ్యాల

పదిలముగ వేదములు బంగారు చేరులై పట్ట వెరపై తొఁచె నుయ్యాల
వదలకిటు ధర్మదేవత పీఠమై మిగుల వర్ణింప నరుదాయ నుయ్యాల

మేలు కట్లయిమీకు మేఘ మండలమెల్ల మెఱుఁగునకు మెఱుఁగాయ నుయ్యాల
నీల శైలము వంటి నీ మేని కాంతికిని నిజమైన తొడవాయ నుయ్యాల

పాలిండ్లు కదలఁగాఁ పయ్యదలు రాఁపాడ భామినులు వడినూఁచు నుయ్యాల
వోలి బ్రహ్మాణ్డములు వొరగునో యని భీతి నొయ్య నొయ్యన వూఁచి రుయ్యాల

కమలకును భూసతికి కదలు కదలకు మిమ్ముఁ గౌఁగిలింపఁగఁజేసె నుయ్యాల
అమరాంగనలకు నీ హావ భావ విలాస మందంద చూపె నీ వుయ్యాల

కమలాసనాదులకుఁ గన్నులకు పండుగై గణుతింప నరుదాయ నుయ్యాల
కమనీయ మూర్తి వేంకట శైల పతి నీకు కడు వేడుకై యుండె నుయ్యాల