మంగళవారం, నవంబర్ 17, 2009

కృష్ణాజినం దర్భమయీ చ మౌఞ్జీ

కృష్ణాజినం దర్భమయీ చ మౌఞ్జీ పాలాశదణ్డః పరిధానశాటీ।
యజ్ఞోపవీతఞ్చ దిశన్తు నిత్యం వటోశ్చిరాయుశ్శుభకీర్తివిద్యాః।।

కృష్ణ-అజినమ్ దర్భమయీ చ మౌఞ్జీ పాలాశ-దణ్డః పరిధాన-శాటీ యజ్ఞోపవీతమ్ చ దిశన్తు నిత్యమ్ వటోః చిరాయుః శుభ-కీర్తి-విద్యాః

కృష్ణజింకచర్మమూ, ముంజ-దర్భలతో చేయబడిన ఒడ్డాణమూ, మోదుగకఱ్ఱా, అంగవస్త్రమూ, జంధ్యమూ నిత్యమూ (నిత్యముగా) వటువుకి చిరాయువునీ శుభాన్నీ కీర్తినీ విద్యలనీ ఇచ్చుగాక.

ఆదివారం, నవంబర్ 15, 2009

జానక్యాః కమలామలాఞ్జలిపుటే యాః

జానక్యాః కమలామలాఞ్జలిపుటే యాః పద్మరాగాయితాః
న్యస్తా రాఘవమస్తకే చ విలసత్కున్దప్రసూనాయితాః।
స్రస్తాశ్శ్యామలకాయకాన్తికలితా యా ఇన్ద్రనీలాయితాః
ముక్తాస్తాశ్శుభదా భవన్తు భవతాం శ్రీరామవైవాహికాః।।

జానక్యాః కమలామలాఞ్జలిపుటే యాః పద్మరాగాయితాః న్యస్తాః రాఘవమస్తకే చ విలసత్ కున్దప్రసూనాయితాః స్రస్తాః శ్యామలకాయకాన్తికలితాః యాః ఇన్ద్రనీలాయితాః ముక్తాః తాః శుభదాః భవన్తు భవతామ్ శ్రీరామవైవాహికాః

జానకి యొక్క కమలములవలె అమలములైన దోసిళ్లలో ఏవైతే పద్మరాగాలైనాయో, రాఘవుని మస్తకమునందు ఉంచబడినవై ఏవి కుందప్రసూనాలలాగ విలసిల్లాయో, తలపైనుండి జారి ఆ రాముని శ్యామలకాయకాంతితో కలిసినవై ఏవి ఇంద్రనీలాలయ్యాయో, ఆ శ్రీరామవైవాహికములైన ముత్యాలు మీకు శుభాలని ఇచ్చేవి అగుగాక.

న్యస్తాః + రాఘవమస్తకే = న్యస్తా రాఘవమస్తకే
స్రస్తాః + శ్యామలకాయకాన్తికలితాః = స్రస్తాశ్శ్యామలకాయకాన్తికలితాః
కలితాః + యాః = కలితా యాః
యాః + ఇన్ద్రనీలాయితాః = యా ఇన్ద్రనీలాయితాః
ముక్తాః + తాః = ముక్తాస్తాః
తాః + శుభదాః = తాశ్శుభదాః
శుభదాః + భవన్తు = శుభదా భవన్తు

శుక్రవారం, సెప్టెంబర్ 25, 2009

బెంగ

అమ్మా! అదేమిటో చెమ్మగిల్లెను కళ్లు జ్ఞప్తికొస్తున్నావు చాల నువ్వు
దవ్వునుంటినిగాని ఱివ్వున వాలనూ నీ కళ్లముందుగా నిలచుకొఱకు
బరువెక్కె మనసంత బాధతో నీ చెంత లేనన్న దిగులుతో రేఁగిపోయె
బెంగగా నుంది నీ వెనుక నేఁ దిరుగంగ నినుఁ జూడ నొడిలోన నిదురపోవ

నీ కబుర్లు నేను వినుచు నిలువ నీదు
చేతివంటను భుజియింపఁ బ్రీతి మీఱ
మనసు మారాము సేసేను మాట వినదు
అమ్మ! దీని వైఖరి నాకు నందకుంది౹౹ ౧

అగపడుతున్నావమ్మా మిగతా స్త్రీమూర్తులందు మెలఁకువలో లే
నగవుల పసిపాపలలో దిగులు మఱింతగ పెరిఁగెను దేనినిఁ గనినా౹౹ ౨

వేదములకుఁ బ్రణవమువలె నాదిని “అమ్మా”యనె గద యందరినోటా
నాదారంభంబౌనది! భూదేవిని మించు సహనమూర్తివి అమ్మా౹౹ ౩

దూరవాణి వచ్చి దూరాలఁ జెఱిపేను
మనసువఱకు గాదు మాటవఱకె
ఉత్తరాలు భువిని నుత్తమంబులు గాద
మనసుకైన రెండు కనులకైన౹౹ ౪

కనుక నీ యుత్తరము వ్రాస్తి, గాని నేను
నీకు నిది పంపి బాధింపలేక, నిదుర
పోయి, కలలోన నినుఁ జేరి, పొంగిపోదు
“నిదుర” దీవించి నాకోర్కె నెరపుఁగాత౹౹ ౫

వ్రాసినది: 27/2/2009

శుక్రవారం, సెప్టెంబర్ 11, 2009

ప్రార్థన

నమస్తే సదావత్సలే మాతృభూమే త్వయా హిన్దుభూమే సుఖం వర్ధితో೭హమ్
మహామఙ్గలే పుణ్యభూమే త్వదర్థే పతత్వేష కాయో నమస్తే నమస్తే ౧


తా. నిత్యవాత్సల్యవైన ఓ మాతృభూమీ, నీకు వందనం. ఓ హిన్దుభూమీ, నీచే సుఖంగా పెంచబడ్డాను. గొప్ప మంగళస్వరూపవైన ఓ పుణ్యభూమీ, నీ కోసం ఈ శరీరం పడిపోవాలి. నీకు వందనం. నీకు వందనం.

ప్రభో శక్తిమన్ హిన్దురాష్ట్రాఙ్గభూతా ఇమే సాదరం త్వాం నమామో వయమ్
త్వదీయాయ కార్యాయ బద్ధా కటీయం శుభామాశిషం దేహి తత్పూర్తయే
అజయ్యాం చ విశ్వస్య దేహీశ శక్తిం సుశీలం జగద్యేన నమ్రం భవేత్
శ్రుతం చైవ యత్కణ్టకాకీర్ణ మార్గం స్వయం స్వీకృతం నస్సుగం కారయేత్ ౨


తా. సర్వశక్తివంతుడవైన ఓ ప్రభూ, నీకు హిందురాష్ట్రపు బిడ్డలం అందరమూ సాదరంగా నమస్కరిస్తున్నాం. నీ పని చేయడం కోసమే నడుంబిగించాం. ఆ పని పూర్తి అవ్వడం కోసం నీ శుభాశీస్సులు ఇవ్వు. ఓ విశ్వేశ్వరా, ప్రపంచం గౌరవించేలాగ, ముళ్లమార్గమే అని విన్నా కూడా మేము స్వయంగా ఎంచుకున్న ఈ మార్గం సుగమం అయ్యేలాగ మాకు అజేయమైన శక్తినీ మంచి నడువడినీ ఇవ్వు.

సముత్కర్షనిశ్శ్రేయసస్యైకముగ్రం పరం సాధనం నామ వీరవ్రతమ్
తదన్తస్స్ఫురత్వక్షయా ధ్యేయనిష్ఠా హృదన్తః ప్రజాగర్తు తీవ్రానిశమ్
విజేత్రీ చ నస్సంహతా కార్యశక్తిర్విధాయాస్య ధర్మస్య సంరక్షణమ్
పరం వైభవం నేతుమేతత్స్వరాష్ట్రం సమర్థా భవత్వాశిషా తే భృశమ్ ౩


తా. శ్రేష్ఠమైన మోక్షాన్ని సాధించే అద్వితీయమైన ఉగ్రమైన వీరవ్రతం మా మనస్సులలో కొలువై ఉండాలి. ఆ అక్షయమైన ధ్యేయనిష్ఠ తీవ్రంగా నిత్యం మా గుండెలలో మేల్కొని ఉండాలి. నీ ఆశీస్సులవల్ల బోలెడంత సామర్థం పొంది, విజయవంతమై కేంద్రీకృతమై మా కార్యశక్తి ధర్మసంరక్షణ చేసి, స్వరాష్ట్రానికి గొప్ప వైభవాన్ని తీసుకురావాలి.

[ఇది "గురూజీ"గా పిలువబడే శ్రీ మాధవ సదాశివ గోల్వల్కరు గారిచే సంస్కృతంలో వ్రాయబడిన రాష్ట్రీయ స్వయంసేవక సంఘ ప్రార్థన. ఇంత అద్భుతమైన ఈ ప్రార్థనను నాకు నేర్పిన శ్రీ కళాపూర్ణారావుగారికీ, నాకు సంఘాన్ని పరిచయం చేసిన శ్రీ సదాశివగారికీ వేనవేల కృతజ్ఞతలు, నమస్కారాలు. ఈ ప్రార్థనకు ప్రస్తుతం ప్రచురించిన వ్యావహారిక భాషలోని తెలుగు తాత్పర్యాలు నావి, అందులో దోషాలుంటే దొడ్డమనసుతో మన్నించి నా దృష్టికి తీసుకురాగలరు.]

మంగళవారం, ఆగస్టు 11, 2009

శివధనుర్భంగపుసన్నివేశంలో ఐదు పద్యాలు

శ్రీమద్రామాయణకల్పవృక్ష మహాకావ్యంలో విశ్వనాథ సత్యనారాయణ గారు ఉపకాండలకి పెట్టిన పేర్లు సముచితాలు. ఉదాహరణకి బాలకాండలో చాలా ముఖ్యమైన ఘట్టాలు ఏమిటి అని ఎవరైనా అడిగితే మనకి వెంటనే స్ఫురించేవి పుత్రకామేష్టీ శ్రీరామజననమూ విశ్వామిత్రాగమనమూ అహల్యాశాపవిమోచనమూ శివధనుర్భంగమూ సీతారామకల్యాణమూను. ఇందులో అహల్యాశాపవిమోచనమూ శివధనుర్భంగమూ విశ్వామిత్రాగమనం పైన ఆధారపడ్డవే కాబట్టి ఈ జాబితాలో దానిని మినహాయించవచ్చు. విశ్వనాథ సత్యనారాయణ గారు పెట్టిన పేర్లు సరిగ్గా ఇక మిగిలిన ఘట్టాలకు సంబంధించినవే. మరొక విషయం ఏమంటే ఉపకాండలని ఆయన ఖండాలని పిలిచారు. ౢకప్తత కోసం ఆ పేర్లలోని ఆ ఆ సమాసాలలో ముఖ్యమైన పదాలని మాత్రమే తీసుకున్నారు. అంటే పుత్రకామేష్టిలో ఇష్టి అన్నది ముఖ్యమైన పదం కాబట్టి ఇష్టిఖండము అని పేరు పెట్టారు. అలాగే తరువాతవి అవతారఖండమూ అహల్యాఖండమూ ధనుష్ఖండమూ కల్యాణఖండమూను.

ఈ ధనుష్ఖండంలోనే అహల్యాతనయుడైన శతానందుడు రామలక్ష్మణులకి విశ్వామిత్రచరిత్రని చెబుతాడు. నాకు బాలకాండలో ఈ విశ్వామిత్రచరిత్ర చెప్పే సర్గలు ఎందుకో కానీ భలే ఇష్టం. అందువల్ల నాలుగు నెలల క్రితం కల్పవృక్షం సంపుటాలు ఆరూ కొనగానే నేను ముందు చదివినది ఈ విశ్వామిత్రచరిత్రే (బాల-ధనుస్సు ౫౬-౨౫౯). అందులో వాల్మీకిమహర్షి చెప్పిన మూలకథకి అనుగుణంగా వ్రాసినది కాక, కొన్ని చోట్ల చిన్నవే ఐనా విశ్వనాథవారు చాలా అందమైన కల్పనలు చేసారు. వాటి గురించి తరువాతి టపాలో వ్రాస్తాను. ప్రస్తుతం ఈ ధనుష్ఖండంలో మల్లిన నరసింహారావుగారు  అడిగిన ఐదు పద్యాలూ నాకు అర్థమైనట్టుగా వివరించడానికి ప్రయత్నిస్తాను.

* * *

ఈ శివధనుర్భంగానికి సంబంధించి వాల్మీకిమహర్షి కృతమైన శ్రీమద్రామాయణంలో రెండు శ్లోకాలు ఉన్నాయి.

శ్రీరామచంద్రుడు వింటినారి సారించాక ఎక్కుపెట్టాడనీ, అలా ఎక్కుపెట్టడంద్వారా ఆ ధనుస్సుని మధ్యలో విరిచాడనీ—

ఆరోపయిత్వా మౌర్వీం చ పూరయామాస వీర్యవాన్।
తద్బభంజ ధనుర్మధ్యే నరశ్రేష్ఠో మహాయశాః।।
(బాల-౬౭-౧౭)

అప్పుడు పిడుగుపాటులాంటి గొప్ప నాదం ఆవిర్భవించిందనీ, పర్వతం బ్రద్దలైందా అన్నట్టుగా భూమి కంపించిందనీ—

తస్య శబ్దో మహానాసీత్ నిర్ఘాతసమనిఃస్వనః।
భూమికమ్పశ్చ సుమహాన్ పర్వతస్యేవ దీర్యతః।।
(బాల-౬౭-౧౮)

* * *

ఇక విశ్వనాథవారి పద్యాలు. ఈ ఐదూ సందర్భానికి తగిన అక్షరరమ్యత నిండుగా తొణికిసలాడే పద్యాలు.

నిష్ఠావర్ష దమోఘ మేఘపటలీ నిర్గచ్ఛ దుద్యోతిత
స్పేష్ఠేరమ్మదమాలికా యుగప దుజ్జృంభన్మహాఘోర బం
హిష్ఠ స్ఫూర్జథు షండమండిత రవాహీన క్రియా ప్రౌఢి ద్రా
ఘిష్ఠంబై యొకరావ మంతట నెసంగెన్ ఛిన్నచాపంబునన్.
(బాల-ధనుస్సు-౩౦౧)

నిష్ఠా ఆవర్షత్ అమోఘ మేఘ పటలీ నిర్గచ్ఛత్ ఉద్యోదిత స్ఫేష్ఠ ఇరమ్మద మాలికా యుగపత్ ఉజ్జృంభత్ మహా ఘోర బంహిష్ఠ స్ఫూర్జథు షండ మండిత రవ అహీన క్రియా ప్రౌఢి ద్రాఘిష్ఠంబై ఒక రావము అంతటన్ ఎసంగెన్ ఛిన్న చాపంబునన్

నిష్ఠా నిలకడగా ఆగకుండా. స్ఫేష్ఠ మిక్కిలి. ఇరమ్మద మెరుపులోని జ్యోతి. యుగపత్ కలిసియుండే. బంహిష్ఠ శక్తివంతమైన. స్ఫూర్జథు ఉరుము. షండ గుంపు. ద్రాఘిష్ఠ మిక్కిలి దీర్ఘమైన.

నిలకడగా కురియడం ద్వారా సఫలాలైన మేఘసమూహాల నుండి బయల్వెడలుతూ ప్రకాశించే బోలెడు మెరుపుల్లోని జ్వాలామాలలతో కలిసి అతిశయించే మహాభయంకరమైన శక్తివంతమైన ఉరుముల గుంపుచే అలంకరింపబడినట్టుగా గొప్ప ధ్వని లేకుండా ఉండనట్టిదీ [శివధనుర్భంగం అనే] క్రియ యొక్క శ్రేష్ఠత్వం వలన చాలా దీర్ఘమైనట్టిదీ ఐన ఒక మహానాదం విరిగిన వింటినుండి అంతటా వ్యాపించింది.

ఈ పద్యంలో మేఘపటలీనిర్గచ్ఛత్ అనడం ద్వారా అంతర్లీనంగా నీలమేఘశ్యాముడైన రాముని చేతినుండి విరిగిన “ధనుష్ఖండము” వెలువడిందనీ, మేఘం మెరుపులూ ఉరుములూ వెలువరించినట్లుగా ఆ విరిగిన విల్లు బోలెడు కాంతినీ బ్రహ్మాండమైన ధ్వనినీ నలుదిక్కులలో వెదజల్లిందనీ చెప్పబడింది.

హేరంబోన్నత శూర్పకర్ణ వివరహ్రీకారియై షణ్ముఖ
స్ఫార ద్వాదశ నేత్రగోళ వివృతిప్రాకారమై శైలక
న్యారాజ న్నవ ఫాలమండల విభుగ్నక్రీడమై యాశ్చల
ద్గీరుగ్రప్రమథంబుగా ధనువు మ్రోఁగెన్ శైవలోకంబులన్.
(బాల-ధనుస్సు-౩౦౨)

హేరంబ ఉన్నత శూర్ప కర్ణ వివర హ్రీకారియై షణ్ముఖ స్ఫార ద్వాదశ నేత్ర గోళ వివృతి ప్రాకారమై శైల కన్యా రాజత్ నవ ఫాల మండల విభుగ్న క్రీడమై ఆశ్చలత్ గీః ఉగ్ర ప్రమథంబుగాన్ ధనువు మ్రోఁగెన్ శైవ లోకంబులన్

శూర్ప చేట. వివర కన్నము. హ్రీ సిగ్గు. స్ఫార గొప్ప. వివృతి పూర్తిగా తెరుచుకోవడం. ప్రాకార చుట్టుగోడ. విభుగ్న వంగిన వంకరగా ఉన్న. ఆశ్చలత్ కంపించే(?). గీః వాక్కు.

వినాయకుడి గొప్ప చేటల్లాంటి చెవిరంధ్రాలకి సిగ్గు కలిగించేదిగా, కుమారస్వామికి పూర్తిగా తెరుచుకున్న పన్నెండు కనుగ్రుడ్లకీ చుట్టుగోడ అయ్యి, పార్వతీదేవియొక్క ప్రకాశించే నుదుటిపై చిట్లింపు అనే విలాసమయ్యి, కంపించిన మాటలు కలిగినవారిగా భయంకరమైన ప్రమథగణాలని చేసినదై శైవలోకాలలో ధనుస్సు మ్రోగింది.

చేటలంత పెద్ద చెవులకి కూడా ధ్వని అధికమైనదే అనీ, పన్నెండు కళ్లున్నా కాంతిని పూర్తిగా గ్రహించలేవనీ, అమ్మవారి దృష్టిని కూడా ఆకర్షించిందనీ, ఉగ్రంగా ఉండే ప్రమథగణాలకి సైతం మాటలు తడబడ్డాయనీ అర్థం. శివుడే ఆ వెలుగు (వెలుంగర్చింతు విశ్వేశ్వరా) కాబట్టి పైగా శివకేశవాద్వైతం చూపించారు కాబట్టి శివుడి గురించి ప్రత్యేకంగా చెప్పలేదు.

నృత్యన్మంజుల తారహార కబరీనిష్యంది ముక్తామణి
ప్రత్యగ్ర ప్రసవాక్షి సంకలన దీవ్య త్కంధరాభేద సా
హిత్య ప్రౌఢ నవాప్సరోనటన సౌహిత్యప్రశస్తాచ్ఛదృ
గ్గీత్యాకార మనోజ్ఞమై ధనువు మ్రోఁగెన్ స్వర్గలోకంబులన్.
(బాల-ధనుస్సు-౩౦౩)

నృత్యత్ మంజుల తార హార కబరీ నిష్యంది ముక్తా మణి ప్రత్యగ్ర ప్రసవ అక్షి సంకలన దీవ్యత్ కంధర అభేద సాహిత్య ప్రౌఢ నవాప్సరోనటన సౌహిత్య ప్రశస్త ఆచ్ఛత్ ఋక్ గీతి ఆకార మనోజ్ఞమై ధనువు మ్రోఁగెన్ స్వర్గ లోకంబులన్

తార ముత్యం. కబరీ జడ. నిష్యంది జారుతున్న. ముక్తామణి ముత్యం. ప్రత్యగ్ర క్రొత్త. ప్రసవ పువ్వు. దీవ్యత్ ఆడుతున్న. కంధర తల, మెడ. సాహిత్య సహితత్వం. సౌహిత్య మనోజ్ఞత్వం. ఆచ్ఛత్ కప్పుతున్న. ఋక్ పొగడ్త.

నర్తిస్తున్న అందమైన ముత్యాలజడనుండి జారుతున్న ముత్యాలనీ మొగ్గలనీ కంటితో ఏరే ఆటాడే మెడకు తగినట్లుగా గొప్ప [దొడ్డ చిన్న అందరూ§] అప్సరసల నటనలోని అందం యొక్క గొప్పతనాన్ని కప్పే గానంలాగ మనోజ్ఞమై ధనుస్సు స్వర్గలోకాలలో మ్రోగింది.

అప్సరసలు నర్తిస్తున్నారు. ఆ నర్తనం చాలా అందంగా ఉంది. వాళ్లు నర్తిస్తూ ఉంటే జడలు కూడా నర్తిస్తున్నాయి. ఆ జడలు కదలడం వల్ల వాటికి పెట్టుకున్న ముత్యాలూ, ననలూ రాలిపడుతున్నాయి. ఆ రాలుతున్నవాటిని చూపులతోనే ఏరుతున్నారా అన్నట్టుగా కదులుతున్నాయి వాళ్ల తలలు. ఆ తలలు ఎలా కదులుతున్నాయో వాటికి అభేదంగా సాహిత్యంగా (సహితము–సాహిత్యము)... అంటే ఆ తలల కదలికలు ఎలా ఉన్నాయో అచ్చంగా అలాగే వాటికి తగినట్టుగానే వారి ఆంగికం కూడా ఉందట. అటువంటి ఆ నాట్యం లోని గొప్పతనాన్ని దాస్తోందా అన్నట్లుంది పొగడ్త. ఆ పొగడ్తని గానం చేస్తే ఆ ఋగ్గానం కూడా అందంగా ఉందట. అంత అందంగానూ స్వర్గలోకంలో శివధనుర్నాదం వినవచ్చిందీ, అంటే స్వర్గలోకంలో వారికి ఆ ధ్వని వినసొంపుగా ఉంది అని అర్థం.

దర్పస్వీకృతహాస విశ్లథనరుంధద్దుష్టవాగ్ధోరణీ
సర్పద్వీరచమూ పథశ్లథనమై స్రంసత్కటీ శాటికా
కూర్పాస ప్రకటోగ్ర సాధ్వస వధూగుర్విణ్య భద్రాధ్వమై
దర్పాడంబరమై ధనుస్సు మొఱసెన్ దైతేయలోకంబులన్.
(బాల-ధనుస్సు-౩౦౪)

దర్ప స్వీకృత హాస విశ్లథన రుంధత్ దుష్ట వాక్ ధోరణీ సర్పత్ వీర చమూ పథ శ్లథనమై స్రంసత్ కటీ శాటికా కూర్పాస ప్రకట ఉగ్ర సాధ్వస వధూ గుర్విణీ అభద్ర అధ్వమై దర్ప ఆడంబరమై ధనుస్సు మొఱసెన్ దైతేయ లోకంబులన్

శ్లథన వీడిపోవడం సడలిపోవడం. రుంధత్ అడ్డుపడే. సర్పత్ గమించే. స్రంసత్ పడే. శాటికా లుంగీ లాంటి గుడ్డ. కూర్పాస కవచం. సాధ్వస భయం. గుర్విణీ చూలాలు. అధ్వ మార్గం. మొఱయు మ్రోఁగు.

దర్పంవలన కలిగిన సంతోషం వీడిపోకుండా అడ్డుపడే చెడు మాటల పద్ధతిగల కదిలే వీరసైన్యానికి మార్గం నిర్వీర్యంచేసేలా, [అట్టి రాక్షసుల] జారిన కటివస్త్రాలూ కవచాల ద్వారా స్పష్టమయ్యే భీతివలన రాక్షసస్త్రీలకి భద్రం చేకూర్చనట్టిదై, [దైత్యుల దర్పాలను తీసేయడంలో] దర్పంతోకూడిన వైభవం కలదై ఆ ధనుస్సు దైత్యలోకాలలో మ్రోగిందట.

రాక్షసుల లక్షణం చెప్తున్నారు. వాళ్లు దర్పం వలన సంతోషపడతారట. అలాంటి సంతోషం పోకుండా చెడ్డ మాటలు మాట్లాడుకుంటారట. అలాంటి రాక్షసుల సైన్యానికి మార్గం సడలించేది. రెండర్థాలు. ఒకటి, వారి పట్టు తీసేయడం, నిర్వీర్యం చేయడం. రెండు, భూలోకంలో వారి ఆయుస్సు తీసేసి [త్వరగా] మోక్షాన్ని ఇవ్వడం. ఈ ధనుస్సు వల్ల ఆ రాక్షసుల వస్త్రాలూ కవచాలూ జారిపోతున్నాయట. అది స్పష్టంగా తెలియడం వల్ల రాక్షసస్త్రీలకి భయం కలుగుతోందట. కడుపుతో ఉన్న రాక్షసస్త్రీలకి అభద్రమైన మార్గమట.

స్ఫీతాష్టాపదవిద్యుదుజ్జ్వల పయ౱పీయుషధారాధునీ
నీతాస్వాద్యతర ప్రగల్భవచన స్నిగ్ధాననాంభోజ సం
ధాతీర్థంకర (తీర్థాకృతి) మాగధోల్బణము నానా మేదినీరాట్సభా
గీతిస్వాదు మనోజ్ఞమై ధనువు మ్రోఁగెన్ రాజలోకంబులన్.
(బాల-ధనుస్సు-౩౦౫)

స్ఫీత అష్టాపద విద్యుత్ ఉజ్జ్వల పయః పీయుష ధారా ధునీ నీత ఆస్వాద్యతర ప్రగల్భ వచన స్నిగ్ధ ఆనన అంభోజ సంధా తీర్థంకర (తీర్థాకృతి) మాగధ ఉల్బణము నానా మేదినీ రాట్ సభా గీతి స్వాదు మనోజ్ఞమై ధనువు మ్రోఁగెన్ రాజలోకంబులన్

స్ఫీత విశాలమైన. అష్టాపద కైలాసం. నీత తేబడిన. స్నిగ్ధ స్నేహముగల. సంధా కలయిక. మాగధ స్తోత్రము చేసేవాడు. ఉల్బణము మిక్కిలి, అతిశయము. స్వాదు తీపి.

అసలే విశాలమైన కైలాసం. అక్కడ మెరుపులా ప్రకాశించే కైలాసజలం. ఆ అమృతపుధార వల్ల ఏర్పడ్డ నది నుండి తేబడిన నీరు. ఆ నీటికి ఉన్న రుచి కన్నా మిక్కిలి రుచికరమైన ప్రగల్భవాక్యం. ఆ వాక్యం చెప్పే ఆప్తుని ముఖకమలం. ఆ కమలాన్ని బాగా ధరించిన తీర్థం వంటి మాగధుల అతిశయం. అలా ఉందట ఈ ధ్వని. అంతే కాదు, నానా రాజసభలలోనూ పాడే గీతాల తీయనిదనంలాగ మనోజ్ఞంగా ఉందట. అంటే రాజులందరికీ ఇది సంతోషకరమైన తీయని వార్త అని అర్థం.

* * *

అసలు ఈ నాలుగు లోకాలే ఎందుకు ఎంచుకోవాలి?

విరిచినది శివుని చాపం. తన ప్రభువు చేసిన ఘనకార్యాన్ని చూసి సంతోషించాడు శివుడు. శివుడు కాక కైలాసంలో ఉన్న చిన్నా పెద్దా అందరూ ఎలా స్పందించారో చెప్పారు ఒక పద్యంలో.

శ్రీరామావతారం కోసం ప్రార్థించినవారు దేవతలు. కాబట్టి అవతార ప్రయోజనం నెరవేరడం ప్రారంభమయ్యిందీ అని ఆ సురలకే తెలియజేయడం. స్వయంగా వైకుంఠవాసుడే విరిచాడు కాబట్టి వైకుంఠలోకంలో ఎలా మ్రోగిందో చెప్పనవసరంలేదు. బ్రహ్మగారి సత్యలోకమూ స్వర్గాలలో ఒకటి కాబట్టి ప్రత్యేకంగా చెప్పలేదు.

దైత్యలోకంలో వినబడిందీ అని చెప్పడం ద్వారా వారికి హెచ్చరిక అందిందీ అని.

రాజలోకాలలో వినబడిన మ్రోత ఇక రాక్షసుల అరాచకాలకి అంతమనీ, రామరాజ్యం రాబోతోందీ అని సూచన.

* * *

విశ్వనాథవారు మూలకథకు చేసిన ఒక మార్పు ధనుష్ఖండంలోనే విష్ణుచాపాన్ని కూడా తీసుకురావడం, తద్ద్వారా ఆయన తెలివిగా ఇవే పద్యాలని చిన్న చిన్న మార్పులతో మళ్లీ వాడుకోవడం జరిగింది.

--------
§ప్రౌఢ అంటే దొడ్డ, నవ అంటే చిన్న అన్న అర్థంలో

శుక్రవారం, జులై 31, 2009

మంగళంపల్లి రామనరసింహమూర్తిగారికి అశ్రునివాళి

ఆప్యాయముగ గౌరవాదరంబులతోడ తాతగారూ యంచు దగ్గరయ్యి
గురువుగారూ యంచు కూర్చుని కృతులను పాడి మందిరమున భక్తులమయి
ఈ క్రొత్త పద్యము ఈ వేళ వ్రాసాను చూడండి అని చూపి స్ఫూర్తి పొంది
మనుమలంటూ మీరు మమ్మల్ని ప్రేమతో ఆశీర్వదించగా హాయినొంది

మేము తిరిగి వచ్చెడిలోపు మీరు మమ్ము
వదిలి తిరిగిరానట్టి త్రోవను చనిరట!
మాకు మంగళంపల్లి రామనరసింహ
మూర్తి
గారు మీరొక్కరే! గుర్తులేదె?

మనుమలము బాధ పడమా
కనులందు తిరిగెడి నీళ్లు గద్గద స్వరమూ
కనలేదో! వినలేదో!
చనగా కైవల్యపథము జ్ఞప్తికి లేమో!

గురువారం, జులై 30, 2009

శ్రీవరలక్ష్మి నమస్తుభ్యం

శ్రీవరలక్ష్మి నమస్తుభ్యం వసుప్రదే శ్రీసారసపదే రసపదే సపదే పదే పదే॥

భావజజనకప్రాణవల్లభే సువర్ణాభే భానుకోటిసమానప్రభే భక్తసులభే।
సేవకజనపాలిని శ్రితపఙ్కజమాలిని కేవలగుణశాలిని కేశవహృత్కేళిని॥

శ్రావణపౌర్ణమీపూర్వస్థశుక్రవారే చారుమతీప్రభృతిభిఃపూజితాకారే।
దేవాదిగురుగుహసమర్పితమణిమయహారే దీనజనసంరక్షణనిపుణకనకధారే।
భావనాభేదచతురే భారతీసన్నుతవరే।
కైవల్యవితరణపరే కాఙ్క్షితఫలప్రదకరే॥

* * *

వసుప్రదే సారసపదే రసపదే సపదే పదే పదే శ్రీవరలక్ష్మి తుభ్యం నమః॥ పదే పదే సపదే॥ శ్ర్యుత్తమగుణశోభితా చ వరదా చాసౌ లక్ష్మీశ్చ శ్రీవరలక్ష్మీ। నమస్తుభ్యం తే నమః। వసూః ధనధాన్యసంతానసౌభాగ్యాదీన్ ప్రదదాతీతి వసుప్రదా। సారసమివ పద్మమివ పదమఙ్ఘ్రిః యస్యాస్సా సారసపదా। రసః శోభా యస్యాః పదే గమనే సా రసపదా। సం జ్ఞానం పం రక్షణాం దాతీతి సపదా। అత్ర జ్ఞానరక్షణే దేహీతి చార్థః। పదే పదే సదా సర్వత్ర॥

శ్రీవరలక్ష్మీ, సమస్తసౌభాగ్యాలనూ ఇచ్చే తల్లీ , కమలములవంటి పాదములు కలదానా, అడుగులయందు అందము కనబరచుదానా, ఎల్లప్పుడూ జ్ఞానాన్నీ రక్షణనీ ఇచ్చుదానా, నీకు నమస్కారము.

భావజస్య మన్మథస్య జనకః పితేతి భావజజనకః విష్ణుః తస్య ప్రాణవల్లభా ప్రియవధూః ఇతి భావజజనకప్రాణవల్లభా। సువర్ణ ఇవ ఆభా రుచిః కాన్తిః యస్యాస్సా సువర్ణాభా। భానూనామాదిత్యానాం కోటిః భానుకోటిః మానే గణనే సమేతి సమానా భానుకోటిభిః సమానా ప్రభా కాన్తిః యస్యాస్సా భానుకోటిసమానప్రభా। భక్తానాం అనాయాసేన లభ్యేతి భక్తసులభా। సేవకజనాన్ భృత్యగణాన్ పాలయతీతి సేవకజనపాలినీ। శ్రితేభ్యః నతేభ్యః పఙ్కజైః పద్మైః కలితాం మాలాం యా ధార్యతే సా శ్రితపఙ్కజమాలినీ। కేవలాః అనితరసాధ్యాః గుణాః యస్యాం సా కేవలగుణశాలినీ। కేశవస్య విష్ణోః హృత్కేళినీ మానసోల్లాసినీతి కేశవహృత్కేళినీ॥

మన్మథుడి తండ్రియైన విష్ణుమూర్తికి ప్రియురాలా, బంగారు మేనిఛాయ కలిగినదానా, కోటిసూర్యులకు మేటియైన కాంతి కలదానా, భక్తసులభురాలా, సేవకజనులను ప్రీతితో పాలించుదానా, సరోజమాలికను ధరించినదానా, అనితరసాధ్యమైన గుణసంపత్తి కలదానా, కేశవునికి మానసోల్లాసము కలిగించుదానా ... శ్రీవరలక్ష్మీ, నీకు నమస్కారము.

శ్రావణమాసే పౌర్ణమీతిథ్యాః పూర్వం సమీపే స్థితే శుక్రవారే శ్రావణపౌర్ణమీపూర్వస్థశుక్రవారే। ఏతస్మిన్ దినే। చారుః మనోజ్ఞా మతిః యస్యాస్సా చారుమతీ ఏతావత్ సర్వాభిశ్చ చారుమతీప్రభృతిభిః పూజితః సేవితః ఆకారః మూర్తిః యస్యాస్సా చారుమతీప్రభృతిభిఃపూజితాకారా। దేవాదిభిః గురుగుహేన సుబ్రహ్మణ్యేన చ సమర్పితః మణిమయహారః యయా ధార్యతే సా దేవాదిగురుగుహసమర్పితమణిమయహారా। దీనజనానామకిఞ్చనానాం సంరక్షణార్థం కనకం హేమం ధారేవ వృష్టీవ ప్రదానే నిపుణా చతురా ఇతి దీనజనసంరక్షణనిపుణకనకధారా। భావనానాం చిత్తవృత్తీనాం భేదనే నిరోధే చతురా నిపుణేతి భావనాభేదచతురా। భారత్యా వాణ్యా సన్నుతా బహుధా స్తుతా వరా ఉన్నతా శక్తిః భారతీసన్నుతవరా। కైవల్యం మోక్షం వితరణే దానే పరా నిమగ్నా కైవల్యవితరణపరా। కాఙ్క్షితం కామితం ఫలం ప్రదాయకః కరః వరదహస్తః యస్యాస్సా కాఙ్క్షితఫలప్రదకరా॥

శ్రావణపౌర్ణిమకు ముందు వచ్చే శుక్రవారమునాడు (వరలక్ష్మీవ్రతము చేసికొనే రోజు) చారుమతులైన సువాసిన్యాదులచే పూజించబడుదానా, గురుగుహాదులచే ఈయబడిన మణిహారమును ధరించుదానా, దీనులను రక్షించుటయందు నిపుణురాలా, చిత్తవృత్తులను నిరోధించుటయందు చతురురాలా, సరస్వతిచే కొనియాడబడినదానా, కైవల్యాన్నిచ్చేదానా, కామితఫలములను ఒసగు వరదహస్తము కలదానా ... శ్రీవరలక్ష్మీ, నీకు నమస్కారము.

* * *

గురుగుహముద్రాఙ్కితా ముత్తుస్వామిదీక్షితస్య కృతిరియం శ్రీరాగరూపకతాళాభ్యాం గీయతే॥

శుక్రవారం, జులై 17, 2009

సంగీత కళానిధి శ్రీమతి "పట్టమ్మాళ్" గారికి

స్పష్టోచ్చారణతోనూ
సృష్టించే శిష్ట రాగ వృష్టులతోనూ
మృష్టాన్నం తిన్నట్టే
తుష్టులు కానట్టివారు దొరకరు ఒకరూ ౧

పట్టువి స్వరాలపుట్టవి
కట్టిపడేసావు నీదు గానాంబుధిలో...
ఇట్టాగా ముంచేదీ?
పట్టమ్మాళ్ నీకు వేల బాష్పాంజలిగళ్ ౨

మంగళవారం, జులై 07, 2009

ఆచార్యదేవోభవ

ఓ దేవా నిన్ ౧

సాధించగా నెంచి శక్తీయ మని కోర నణకువ న్నేర్పగా నణచితీవు
గొప్పకార్యార్థినై కోరగా స్వాస్థ్యంబు మంచిఁ జేయించగా వంచితీవు
సంతసిల్లెద నంచుఁ జాల ధనముఁ గోరఁ బుద్ధిచ్చి నా కోర్కె ముంచితీవు
స్తుతులకై స్థితిఁ గోరఁ మతిపోయి నే నిన్ను పోగొట్టుకోకుండఁ బ్రోచితీవు

ఉర్వి నున్నవన్ని యుల్లాసజీవనో
త్సాహినై యడుగఁగఁ గ్షమనుఁ జూపి
కోరినయవి గాకఁ గోరకున్నను నాకుఁ
గోరవలసినయవి గూర్చితీవు ౨

లలితపదాంబుజంబులను లాఘవమొప్పఁ బదాలఁ గొల్వగాఁ
దెలియదు నాకు నీకయి సుదీర్ఘములైన కవిత్వమాలికల్
కలనము సేయఁ దైవతమ! కాని వచించెద, వచ్చి రాని యీ
తెలుగు వచస్సరోజములు తెల్పునుగాక నమస్సుమాంజలుల్ ౩

నన్ను మన్నించి యో ప్రపన్నప్రసన్న!
నిన్ను చూపు గురునిఁ దెల్పు తెన్నుజూపు
మన్ని కన్నరల్ ఛిన్నమై చెన్నుమీఱ
విన్నపంబు నీసారి నీ వెన్నవయ్య ౪

గురువారం, జులై 02, 2009

భార్యాచతుష్టయము

అనగనగా నొకండు తన యాలులు నల్వురితో ముదంబునన్
ధనము సమృద్ధిగాఁ గలిగి ధాత్రిఁ వసించెను తృప్తచిత్తుఁడై;
తనకుఁ గనిష్ఠభార్య యనఁ దక్కిన భార్యలకంటె మోజు కా
వున సమకూర్చునామెకు నమోఘములైన విలాసవస్తువుల్ ౧

మనమున నుండు గౌరవపుమక్కువచేతఁ దృతీయభార్యనున్
జనులకుఁ జూపి తా మిగుల సంతసమొందును; కాని, డెందమం
దున నొక భీతి యుండెడిది దుర్గతి నాయమ నిల్వదంచు, పా
రుననియు వేఱు వ్యక్తికయి (చోటికని), రోదన లెవ్వియు నాపరావనీ ౨

అనుపమసౌమ్యమూర్తి మధురాప్తసుహృన్మణిదీప్తి నింటిమం
త్రిని ననువర్తినిన్ తన ద్వితీయకళత్రముఁ జూచుఁ బ్రీతితో;
ననుదినమున్నతిన్ పతికి నాదరగౌరవవృద్ధిఁ గోరు భా
ర్యనుఁ దన జ్యేష్ఠజాయను నిరాదరణన్ మరచెన్ మదంబునన్ ౩

దినములు దొర్లె... జబ్బువడి దీనదశన్ మదిఁ జింత సల్పి "నా
మనుగడ కొచ్చె ముప్పు, యికఁ గ్ష్మాపయి నూకలు చెల్లె!" నంచు నెం
చిన తరుణానఁ జిన్నసతిఁ జెంతకు రమ్మని "తోడు వత్తువా?"
యని యడిగెన్ వివిక్తమున నామె చివాలున లేచి "రా"ననెన్ ౪

"ప్రణతులు నీకు! నెవ్వరును ప్రాణము పోయెడు కాలమందు ర
మ్మని పిలువంగఁబోరు! మతి మాలెను నీ!" కని పల్కె; నిట్టులే
చినసతులందఱూ పలుకఁ ఛిన్ననిరీక్షణుఁడైన వానికిన్
వినఁబడె నొక్క మాట తన వెంబడి "వత్తు"ననంచు నెప్పుడూ ౫

కనులు చెమర్చె కాంచుటకుఁ గష్టమయెన్ తుదకున్ కనుంగొనెన్
కని తన దొడ్డభార్య నటు "గర్వవశంబునఁ గాంచకుంటి నీ
ఘనతరమానినీమణిని, గౌరవమీయగనైతి" నంచు శో
కనతహృదంతరంగుడయి కై గొని చేతుల నుంచె చేతులన్ ౬

* * *

జననమునాటిభార్య మృతిజన్మవిమోచక మాత్మవస్తుచిం
తన యని, యామెగాక మఱి తక్కిన వార లసత్యమైనవౌ
మన పరివారమిత్రగణ మాదరకీర్తిధనాదిబంధముల్
తను వని గుర్తెఱెంగుట సదా సుఖదంబని గుర్తు చూడగా ౭

శనివారం, మే 02, 2009

భర్తృహరి వైరాగ్యశతకము ౨

భ్రాన్తం దేశమనేకదుర్గవిషమం ప్రాప్తం న కిఞ్చిత్ఫలం
త్యక్త్వా జాతికులాభిమానముచితం సేవా కృతా నిష్ఫలా।
భుక్తం మానవివర్జితం పరగృహేష్వాశఙ్కయా కాకవత్
తృష్ణే జృమ్భసి పాపకర్మనిరతే నాద్యాపి సంతుష్యసి॥ ౨


భ్రాన్తమ్ పర్యాటితమ్। దేశమ్। అనేకదుర్గవిషమమ్ బహుభిః గన్తుం దుర్గమైః స్థానైః వికటమ్। ప్రాప్తమ్ లబ్ధమ్। న కిఞ్చిత్ న స్వల్పమపి। ఫలమ్ సంతోషధనాదిరూపం ఫలితమ్॥ త్యక్త్వా విసృజ్య। జాతికులాభిమానమ్ బ్రాహ్మణాదిజాత్యభిమానం వంశాదికులాభిమానం చ। ఉచితమ్ హితమ్। సేవా పరిచర్యా। కృతా ఆచరితా। నిష్ఫలా యస్యాః ఫలం నాస్తి సా॥ భుక్తమ్ ప్రాశితమ్। మానవివర్జితమ్ మానేన అభిమానేన విశేషతః వర్జితమ్। పరగృహేషు పరాణాం గేహేషు। ఆశఙ్కయా భీతినా వా సందేహేన। కాకవత్ కాకేవ॥ తృష్ణే విషయేషు ఆసక్తిః। జృమ్భసి వృద్ధిం యాసి॥ పాపకర్మనిరతే పాపిష్ఠే। న అద్య అపి ఇదానీమపి। సంతుష్యసి సంతుష్టా న భవసి॥

వైరాగ్యార్థం తృష్ణాదూషణమత్ర ద్రక్ష్యతే। కైషా తృష్ణా। యయా తృష్ణయా ఫలాపేక్షయా కృతమ్ దుర్గమం దేశపర్యటనం ఫలరహితం బభూవ। యయా తృష్ణయా జాతికులాభిమానత్యాగేన కృతా యత్సేవా నిష్ఫలా బభూవ। యయా తృష్ణయా చోదితః మానరహితేషు పరగృహేష్వపి కాకవత్ ఆశఙ్కయా భుక్తం చ। యా పాపిష్ఠా। యేదానీమపి జృమ్భతి న తుష్యతి। తాం ప్రతి దూషణమ్॥

తా. దుస్సంచారములైన ప్రదేశాలలో దేశాటన చేసాను కానీ ఫలితం శూన్యం. జాత్యభిమానం కులాభిమానం వదిలి నిరుపయోగంగా (ధనికులు మొదలైనవారికి) సేవ చేసాను. (ఆపదలో) బెదురుతూనే ఇతరుల ఇళ్ళలో గౌరవంలేకున్నా కాకిలా భోజనం చేసాను. ఇన్ని కష్టాలు పడినా ఓ పాపిష్ఠపు తృష్ణా, ఇప్పటికీ తృప్తి కలగడం లేదు. నీవు ఇంకా ఇంకా పెరుగుతూనే విజృంభిస్తూనే ఉన్నావు.

విసికితి దుర్గదుర్విషయవిభ్రమయుక్తిఁ గులాభిమానమున్
బసచెడ సేవ చేసితి విపన్నుఁడనై పరగేహసీమ వా।
యసము వలెన్ భుజించితిఁ బ్రయత్నము నిష్ఫలమై నశించె సం
తసపడ వుగ్రకర్మపిశునత్వము చూపెద వాశ యేటికిన్॥

గురువారం, ఏప్రిల్ 30, 2009

భర్తృహరి వైరాగ్యశతకము ౧

ఎందుకో తెలియదు కాని భర్తృహరి వ్రాసిన వైరాగ్యశతకం చదవాలి అనిపించింది. స్థాళీపులాకన్యాయంగా అక్కడక్కడా ఒకటీ రెండూ చదివితేనే అద్భుతంగా తోచింది ఈ శతకం. అలా చదివాక (భర్తృహరి ఎలాంటి స్థితిలో ఏ ముహూర్తాన ఏ ఉద్దేశ్యంతో వ్రాయటం మొదలుపెట్టారో కానీ) వైరాగ్యశతకంలోని ఒక్కో శ్లోకానికీ వైరాగ్యపు రుచి తెలియజేసే లక్షణం పుష్కలంగా ఉందీ అని అనిపించింది. ఎలాగూ చదవటం ప్రారంభించబోతున్నాను కదా, ఒక్కో శ్లోకం చదివినప్పుడు నాకు ఏయే ఆలోచనలు కలిగాయో అవన్నీ వ్రాసి పెట్టుకుందాం అని తోచి, ఇలా...


చూడోత్తంసితచారుచన్ద్రకలికాచఞ్చచ్ఛిఖాభాస్వరో
లీలాదగ్ధవిలోలకామశలభః శ్రేయోదశాగ్రే స్ఫురన్।
అన్తఃస్ఫూర్జదపారమోహతిమిరప్రాగ్భారముచ్చాటయం
శ్చేతః సద్మని యోగినాం విజయతే జ్ఞానప్రదీపో హరః॥ ౧


చూడా శిఖాయాం। ఉత్తంసిత భూషణీకృతస్య। చారు మనోజ్ఞమూర్తేః। చన్ద్ర శశేః। కలికా కలాయాః। చఞ్చత్ ప్రకాశమానేన। శిఖయా అగ్రేణ। భాస్వరః ప్రకాశమానః॥ లీలా విలాసేన। దగ్ధ భస్మీకృత। విలోల చఞ్చల। కామశలభః మన్మథ నామ శలభః॥ శ్రేయః శుభానాం। దశా అవస్థాసు। అగ్రే పురతః। స్ఫురన్ ప్రకాశయన్॥ అన్తః మనసి। స్ఫూర్జత్ (తడిదివ) జృంభమాణస్య। అపార మహత్। మోహ తిమిర మోహాన్ధకారస్య। ప్రాక్ పురతః స్థితమ్। భారమ్ మహాన్తమజ్ఞానమ్। ఉచ్చాటయన్ నాశయన్॥ చేతః మనః। సద్మని గృహే। యోగినాం భక్త్యాది యోగేషు స్థితానాం। విజయతే వర్తతే॥ జ్ఞాన ప్రదీపః జ్ఞాన ప్రకాశకః॥ హరః భవానాం దుఃఖానాం అజ్ఞానానాం నాశకః॥

అత్ర హరో జ్ఞానప్రదీపః। భక్తానాం (చన్ద్రకలికాప్రయోగేణ ప్రతిక్షణవర్ధమానం తాపహారిత్వం జ్ఞాయతే) శీతకరవత్తాపహారీ కామాదీనాం శలభానాం సంహారకశ్చ। ఏషః హరః కుత్ర వర్తతే। చేతస్సద్మని। కేషాం। తృష్ణాద్వేషిణాం యోగినామ్। కథమ్। శ్రేయోదశాగ్రే స్ఫురన్। అన్తస్ఫూర్జదపారమోహతిమిరప్రాగ్భారముచ్చాటయన్॥ యది మనః హరావాసం కర్తుమిచ్ఛసి తర్హి యోగీ భవేత్యన్వర్థః॥

తా. హరుడు జ్ఞానమనే వెలుగునిచ్చే దీపం. సిగలో అలంకరించుకున్న చంద్రకళ యొక్క వెలిగే కొనచే ప్రకాశిస్తూన్నవాడు, కాముడనే మిడుతని మసిచేసినవాదు ఐన ఆ శివుడు శ్రేయస్సునిచ్చే వివిధ దశలలో ముందుగా పొడజూపుతూ మనస్సులోని గొప్ప మోహపుటజ్ఞానాన్ని నాశనం చేస్తూ యోగుల హృదయపంజరంలో శోభిల్లుతున్నాడు.

ఏనుఁగు లక్ష్మణకవి తెలుఁగు:
కలితవతంసితేన్దుకలికాశిఖిచే విలసిల్లి చిత్తభూ
శలభము నుగ్గు సేసి శుభసారదశాగ్రమునన్ వెలుంగుచున్।
బలవదపారమోహభరబాఢతమోహరణంబు సేయుచుం
దెలివి వెలుంగు పొల్చు శివదేవుఁడు యోగిమనోగృహంబులన్॥

బుధవారం, ఏప్రిల్ 29, 2009

శ్రీమచ్ఛఙ్కరభగవత్పాదాచార్యస్తుతిః

కాదమ్బినీవృత్తమ్
నమస్తే శఙ్కరాచార్య సచ్చిద్గురో
భవద్దివ్యానుకంపావిభూత్యా మమ
వివేకో జాయతాత్ శామ్యతాన్మేమనః
భవద్వేషోஉస్తు మాం బన్ధనాత్తారయ ౧

భుజఙ్గప్రయాతవృత్తమ్
విరాగోదయార్థం భవత్పాదపద్మౌ
భజేஉహం న ముఞ్చే భవారణ్యకీలౌ
నమస్తే నమస్తే నమస్తే ప్రసీద
న యాచేஉన్యమాచార్య దృష్టిస్తు తేஉలమ్ ౨

మంగళవారం, ఏప్రిల్ 21, 2009

కైలాసాచలసానువాసము

కైలాసాచలసానువాసము వృషస్కంధాగ్రసంస్థాయి త
త్ప్రాలేయాచలకన్యకాకుచతటీపర్యంకనిద్రాగతం
బాలోలాగ్రజటాతటీఘటితనాకౌకస్సరిత్కంబు దే
హాలంకారితలేలిహానము వెలుం గర్చింతు విశ్వేశ్వరా


ఇది విశ్వనాథ సత్యనారాయణగారి శ్రీమద్రామాయణకల్పవృక్షావతారికయందలి రెండవ పద్యం. కైలాసాచలసానువాసము అనగానే నాకు మొదట తెనాలి రామకృష్ణుని ఉద్భటారాధ్యచరిత్రలోని పద్యం గుర్తొచ్చింది.

* * *

కైలాస-అచల-సాను-వాసము వృష-స్కంధ-అగ్ర-సంస్థాయి తత్-ప్రాలేయ-అచల-కన్యకా-కుచ-తటీ-పర్యంక-నిద్రా-ఆగతంబు ఆలోల-అగ్ర-జటా-తటీ-ఘటిత-నాక-ఓకస్-సరిత్కంబు దేహ-అలంకారిత-లేలిహానము వెలుంగు అర్చింతు విశ్వేశ్వరా

సం అంటే సమ్యక్, బాగుగా. స్థా గతినివృత్తౌ అని ధాతువు, అంటే గమనరహితమైన స్థితి. ప్రాలేయము మంచు. పర్యంకము మంచము. ఓకస్సు అంటే నివాసం. నాకౌకస్సు అంటే స్వర్గము నివాసముగా కల. "ఆలోల"లో లోల కంపిస్తున్న, ఆ స్వల్పత్వాన్ని సూచిస్తుంది. లేలిహానము అంటే పాము (లేలిహానో ద్విరసనో గోకర్ణః కఞ్చుకీ తథా అని అమరకోశము).

వెలుంగు అన్న పదం ఇక్కడ కీలకం. నిరాకారస్వరూపంగా అర్చించడమన్నమాట. ఎప్పుడైతే ఇలా నిరాకారస్వరూపంగా తీసుకున్నామో అప్పుడు చెప్పేవన్నీ స్త్రీ-పురుష-నపుంసక-లింగాతీతమైన శివలింగానికి సంబంధించినవౌతాయి కదా.

కైలాస పర్వత సానువులందు నివాసమున్నట్టిది. నందీశ్వరునియొక్క భుజములపైన చక్కగా నుండినది. ఆ మంచుకొండ కూతురైన పార్వతీదేవియొక్క పాలిండ్ల ప్రదేశమనే మంచముపై నిద్రను పొందునది. స్వల్పంగా కదులుతున్న జటాజూటపు పైభాగంలో స్వర్గలోకపు నదిని కలిగినట్టిది. దేహాలంకారముగా పామును చేసికొన్నట్టిది.

కైలాసపర్వతసానువులలో నివాసముంటూ, పాముని గంగని ధరించి, నందీశ్వరుని అధిరోహించి, పార్వతీదేవిపాలిండ్లపై నిద్రపోయే స్వరూపంగా కనిపిస్తున్న వెలుగువైన విశ్వేశ్వరా! నిన్ను కొలుస్తాను అని తాత్పర్యం.

* * *

ఇక్కడ ముందు పద్యంలో మాదిరిగా శివకేశవాభేదం గోచరించదు కానీ, వర్ణనలద్వారా సాకారమైన శివుణ్ణి నిరాకారమైన వెలుగుగా కొలుస్తాను అని చెప్పడంలో వింత అందం ద్యోతకమౌతోంది.

శుక్రవారం, ఏప్రిల్ 03, 2009

శ్రీరామనవమి శుభాభినందనలు

శార్దూలవిక్రీడితమ్
ఫుల్లాంభోరుహపత్రనేత్రయుగభూతౌ భానుతారాధవౌ
యస్యత్వన్వయనామయోస్సురుచయస్సంపూరయన్తావుభౌ
రాత్రీశాన్వయజాతడిజ్జలధరో యస్సూర్యవంశోద్భవ
స్సీతామాధవమాంజనేయరమణం తం రామచన్ద్రం భజే.

ప.వి.
ఫుల్ల అంభోరుహపత్ర నేత్రయుగ భూతౌ భానుతారాధవౌ యస్య తు అన్వయనామయోః సురుచయః సంపూరయన్తౌ ఉభౌ రాత్రీశ అన్వయజా తడిత్ జలధరః యః సూర్యవంశోద్భవః సీతామాధవమ్ ఆంజనేయరమణమ్ తమ్ రామచన్ద్రమ్ భజే

తా.
ఎవరికి సూర్యచంద్రులు వికసించిన తామరపూరేకులవంటి నేత్రద్వయమగుచున్నారో, ఎవరికి వంశమునందు (సూర్యవంశము) నామమునందు (శ్రీరామ'చంద్రుడు') సూర్యచంద్రులిరువురూ కాంతులు (రుచిః - కాంతి, రుచి, సౌందర్యం) నింపుతున్నారో, చంద్రవంశంలో పుట్టిన మెరుపుతీగెకు ఏ సూర్యవంశజుడు మేఘమగుచున్నాడో అట్టి సీత అనబడే లక్ష్మీభర్తయైన, ఆంజనేయరమణుడైన శ్రీరామచంద్రుని కొలచుచున్నాను.

మంగళవారం, మార్చి 24, 2009

విశ్వనాథవారి శ్రీమంజూషిక పద్యం

శ్రీమంజూషిక భక్తపాలనకళాశ్రీచుంచు వానందవ
ల్లీమంజుప్రసవంబు చిద్గగనప్రాలేయాంశువున్ మోక్షల
క్ష్మీమాణిక్యవినూత్నమేఖల కటాక్షీభూతనీహారరుక్
శ్రీమంతంబయి పొల్చు వెల్గు నొకడే సేవింతు విశ్వేశ్వరా


ఇది శ్రీ విశ్వనాథ సత్యనారాయణగారి శ్రీమద్రామాయణకల్పవృక్షమునందలి తొలి పద్యం. (ఈ పద్యానికి కొంత వివరణ శ్రీ వేదుల కామేశ్వరరావుగారు కల్పవృక్షము - అవతారిక అనే శీర్షికతో శ్రీమద్రామాయణకల్పవృక్ష కావ్య వైభవము అనే వ్యాస సంపుటిలో ప్రచురించారు.)

* * *

ముందు ఈ పద్యాన్ని ఎక్కడెక్కడ విఱవాలో గమనిస్తే...

శ్రీమంజూషిక. ఇక్కడే ఎందుకు విఱవాలి? మంజూషికా అని సంస్కృత శబ్దం కాబట్టి, ఇక్కడ ప్రయోగంలో దీర్ఘం లేదు కాబట్టి. తర్వాత, భక్తపాలనకళాశ్రీచుంచువు, ఆనందవల్లీమంజుప్రసవంబు, చిద్గగన ప్రాలేయాంశువున్. ఆ తర్వాత మోక్షలక్ష్మీమాణిక్యవినూత్నమేఖల [మేఖల ఆకారాన్త స్త్రీలింగశబ్దం కాబట్టి]. కటాక్షీభూతనీహారరుక్ శ్రీమంతంబు, అయి, పొల్చు, వెల్గును, ఒకడే, సేవింతున్, విశ్వేశ్వరా.

ఈ పద్యంలో ఒక చిన్న పేచీ ఉంది. చిద్గగనప్రాలేయంశువున్ వద్ద. చిద్గగనప్రాలేయాంశు అన్నదానిని శుద్ధ (సిద్ధ) సంస్కృత సమాసంగా తీసుకుంటే... అంటే రెండు తత్సమశబ్దాల సమాసంగా దీనిని తీసుకుంటే చిద్గగనప్రాలేయాంశు లో న గురువౌతుంది (ఆనందవల్లీమంజుప్రసవంబు లో జు గురువైనట్టుగా). అలాంటప్పుడు గణభంగం జరిగినట్టు. అలా కాదూ, ఇది రెండు తద్భవశబ్దాల సమాసమూ అనుకుంటే ఆ ఇబ్బంది లేదు. చిద్గగన వద్ద విఱచి ప్రాలేయాంశువున్ ప్రారంభంలోని ప్రాని ఊది పలికేస్తే సరిపోతుంది.

* * *

ఒకసారి విభజన జరిగాక అర్థం వెతుక్కోవడం కొంచెం తేలికే కదా.

శ్రీ అంటే సంపద, శోభ, శుభము, మంగళము, విషము అని అర్థాలు. మంజూషిక అంటే పెట్టె. శ్రీమంజూషిక అంటే సంపదలకి పెట్టె అంటే సంపదలని ఇవ్వగలిగిన అని. ఈ శ్రీమంజూషికకే విషమును ధరించిన అని రెండో అర్థమూ వస్తుంది. ఎంత సంపదలకి అధిష్ఠానదైవతమని చెప్పాలనుకున్నా ఈ శ్రీమంజూషిక ప్రయోగం సమస్త సంపదలకి ఇనప్పెట్టెలాంటివాడా అని సంబోధించినట్టుంది.

చుంచువు. చుంచు అనే శబ్దానికి వు ప్రత్యయం చేరింది. ప్రసిద్ధికెక్కిన అని అర్థం తీసుకోవాలి. అప్పుడు భక్తపాలనకళాశ్రీచుంచువు అంటే భక్తులను పాలించడమనే మంగళకరమైన కళయందు ఖ్యాతికెక్కినవాడు అని అర్థం.

ఆనందవల్లీమంజుప్రసవము. వల్లి తీగె. మంజు అందమైన, మనోహరమైన. ప్రసవము పువ్వు. ఆనందమనే తీగెను పూచిన మంజులమైన పుష్పం.

చిద్గగనప్రాలేయాంశువు. చిత్ జ్ఞనం. ప్రాలేయ చల్లని. అంశువు కిరణము. ప్రాలేయాంశువంటే చల్లని కిరణములు కలవాడు. కాబట్టి జ్ఞానమనే గగనమందు చంద్రుడు.

మోక్షలక్ష్మీమాణిక్యవినూత్నమేఖల. మోక్షమనే లక్ష్మికి మాణిక్యములతో కూడిన వినూత్నమైన మేఖల (మొలనూలు, వడ్డాణం).

కటాక్షీభూతనీహారరుక్‌శ్రీమంతంబు. కటాక్ష క్రీగంటిచూపు. భూత ఐన. నీహారరుక్. నీహారుడు అంటే చంద్రుడు. నీహారము అంటే మంచు. రుక్ కాంతి. ఎలా చూసినా నీహారరుక్ అంటే చల్లని వెలుగు. అటువంటి చల్లని వెలుగు సంపదలు కలిగిన (శ్రీమంతము). క్రీగంటిచూపులుగా మలచుకున్న చల్లని వెలుగు సంపదలు ఎవరికి కలవో వాడు.

పొల్చు అగుపించు, ఒప్పు.

* * *

ఓ విశ్వేశ్వరా! సర్వసంపదలకూ సమస్తమంగళములకూ మంజూషయైనదీ, భక్తులను పాలించే కళయందు ఖ్యాతికెక్కినదీ, ఆనందమనే లతకి పూచిన మనోహర పుష్పమైనదీ (లత లతగానే మనోహరంగా ఉంటుంది, అలాంటి లత కూడా పువ్వులవలన మిక్కిలి శోభిల్లుతుంది కదా), జ్ఞానమనే ఆకాశంలో చంద్రుడైనదీ (జ్ఞానం అనంతం అని గగన ప్రయోగం ధ్వనిస్తోంది), మోక్షలక్ష్మికి మాణిక్య వినూత్న మేఖలయైనదీ, క్రీగంటిచూపుగా మారిన చల్లని వెలుగు సంపదలు కలిగినదీ... ఐన వెలుగు ఒకడే (అద్వైతభావం... శివకేశవాభేదం). ఆ వెలుగుని సేవిస్తాను.

ఇప్పుడు ఒక్కసారి తిరిగి చదివితే ప్రతీ విశేషణమూ శివుడికీ వాడవచ్చు, కేశవుడికీ వాడవచ్చు అని స్పష్టంగా తెలుస్తుంది. ఐనా అలాంటి కాంతికి ఏకత్వాన్ని ఆపాదించి, అట్టి అద్వైత పరబ్రహ్మాన్ని కొలుస్తాను అని చెప్పడం ఈ పద్యంలోని ప్రత్యేకత.

బుధవారం, ఫిబ్రవరి 25, 2009

పార్వతీపరమేశ్వరుల విహారపు పద్యం

తెనాలి రామలింగ కవి ఉద్భటారాధ్యచరిత్రమనే కావ్యంలో చెప్పిన పద్యం—

తరుణ శశాంక శేఖర మరాళమునకు సార గంభీర కాసారమగుచు
కైలాసగిరి నాథ కలకంఠ భర్తకు కొమరారు లేమావి కొమ్మయగుచు
సురలోక వాహినీ ధర షట్పదమునకు ప్రాతరుద్బుద్ధ కంజాతమగుచు
రాజ రాజ ప్రియ రాజకీరమునకు మానిత పంజరస్థానమగుచు

ఉరగ వల్లభ హార మయూరమునకు
చెన్ను వీడిన భూధర శిఖరమగుచు
లలిత సౌభాగ్య లక్షణ లక్షితాంగి
అద్రినందన బొల్చె విహారవేళ


ఈ పద్యం చదవటం మొదలుపెట్టగానే నాకు మొట్టమొదట అనిపించినది ఈ పద్యానికి సీసాన్ని ఎంచుకోవడం అంత అతకలేదేమో అని. సంగీతంలో ప్రవేశం ఉండడమో మరొకటో కారణమేమిటో తెలియదు కానీ నడకకి ఏదో అడ్డం తగిలినట్టుగా ఠపీమని మొదటి పాదం కూడా పూర్తికాకుండానే ఆగిపోయాను. పద్యాన్ని సీసంగా కాక చంపకమాలగా వ్రాసి ఉంటే ఇంకా అందగించేదేమో కూడా అనిపించింది. కానీ మొదటి పాదం దాటి ముందుకు వెళ్తే పద్యాన్ని ఆస్వాదిస్తూ అసలు మిగతా ఊసు(హ)లు అన్నీ మర్చిపోయాను. అంత అద్భుతంగా ఉందనిపించింది ఈ పద్యం.

అదేమిటో కానీ మొత్తం చదివేసాక పద్యం మరోసారి చదివినప్పుడు కూడా సీసం అతకలేదు మొదటిపాదానికి అనే అనిపించింది. దీనికి రెండు కారణాలు ఉండొచ్చు... ఒకటి ఏ శ్రీనాథుడి లేదా రామరాజభూషణుడి సీసపు నడకో మనస్సుకి బాగా పట్టేసి దాన్ని వదలలేకపోవడం, రెండు సీసం అంటే నా మనస్సులో ఒక రకమైన నడక బాగా ముద్రపడిపోయి ప్రస్తుత పద్యపు నడకని జీర్ణించుకోలేకపోవడం. ఏదైతేనేమి? సీసం సీసమే! పైగా అద్భుతమైన పద్యం!

ఏమాటకి ఆమాటే. శ్రీనాథుడికీ భట్టుమార్తికీ — వీరిద్దరికీ సీసంపై ఉన్న పట్టు, సీసం వాడడంలో ఉన్న ప్రతిభ, సీసపు నడకపై ఉన్న అవగాహన అనన్యసామాన్యం. అది ఒప్పుకు తీరాలి.

సరే. ఇక ఛందస్సు సంగతి ప్రక్కన పెట్టి పద్యాస్వాదనం, ఆలోచనామృతం సంగతి చూస్తే...

తరుణ అంటే యౌవనంలో ఉన్న (పూర్ణత్వము ఇంకా సిద్ధించని) అని. కాబట్టి తరుణేందుశేఖరుడంటే నెలవంకని శిఖలో ధరించినవాడు అని అర్థం. తరుణేందుబింబానికి కాంతి తక్కువే ఐనా శివుడు "మహాసితవపువు" అన్న అర్థం ధ్వనిస్తుంది తరువాతి మరాళ ప్రయోగంవలన. అలాంటి హంసకు శ్రేష్ఠమైన గంభీరమైన (నీటి) కొలను ఔతోందట అమ్మవారు.

కలకంఠ అంటే మగకోకిల (కలకంఠి అంటే కోకిలలా చక్కటి కంఠంగల ఆడుది అని అర్థం). భర్త ఇక్కడ శ్రేష్ఠతకి సూచిక. కైలాసాధిపతియైన కోకిలలలో శ్రేష్ఠునికి పూచే లేత మావి కొమ్మ ఔతోందట అమ్మవారు.

సురలోకంలో ప్రవహించేది – సురగంగ. దానిని ధరించినవాడు శివుడు. షట్పదం అంటే ఆరు పదములు కలిగినది, భ్రమరము. అట్టి భ్రమరానికి ప్రొద్దున్నే విచ్చుకున్న తామరపూవు ఔతోంది అమ్మవారు అని. ఇక్కడ షట్పద అన్నదానికి ఆరు భాగములు కలిగిన అని అర్థం కూడా చెప్పుకోవచ్చు. అంటే శివుడు వేదస్వరూపమని (వేదాంగములు ఆరు అన్న అర్థంలో). అప్పుడు కం శబ్దానికి ఆనందం అని అర్థం తీసుకోవాలి (అప్పుడు కంజాతమంటే కూడా ఆనందమే! పూర్ణమదః పూర్ణమిదం...).

రాజ రాజ ప్రియ రాజ కీరము. మూడు రాజ శబ్దాలు! రాజరాజ అన్న ప్రయోగానికే కనీసం నాలుగైదు అర్థాలు వెతుక్కోవచ్చు. రాజరాజప్రియ శబ్దానికి ఒక అర్థం (గొప్ప)వేల్పులకి (మిక్కిలి) ఇష్టమైన అని. రాజ అంటే శ్రేష్ఠమైన అని ఇంకో అర్థం. శ్రేష్ఠులకి ఇష్టమైన శ్రేష్ఠమైన మగచిలుక (కీరి అంటే ఆడుచిలుక). అట్టి చిలుకకి ఆమోదమైన పంజరపు స్థానం ఔతోందట అమ్మవారు.

ఉరగము అంటే పొట్టతో కదిలేది, పాము. పాములు మెడలో వేసుకున్నవాడు శివుడు. శివుడు అనే మయూరానికి, నెమలికి. ఇక్కడ నెమలి మెడలో పాము అనడం ద్వారా ప్రకృతికి వైరుద్ధ్యాన్ని కూడా చూడచ్చు. ఇక్కడ తన అందాన్ని (చెన్ను) వదిలేసిన (వీడిన) కొండశిఖరము (భూధర శిఖరము) ఔతోందట అమ్మవారు. అందాన్ని వదిలేయడం ఏమిటి? శిఖరానికి అందం సమతలం కాకపోవడమే. అది వదిలేసిన. అంటే అమ్మవారు పర్వతాలలోని సమతలమైన ప్రదేశం (సానువు) ఔతోందట.

లతితమైన సౌభాగ్యవంతములైన లక్షణాలను కనబరచే గిరితనయ విహారవేళలో ఇన్ని రకాలుగా కనబడింది. (ఎవరికి అని అడగకండి, ఇంతకుమించి నేపథ్యం నాకు తెలియదు).

* * *

ఇక నాకు చదువుతూంటే “భలే” అనిపించిన విచిత్రమైన విషయాలు…

౧ ఈ పద్యంలో ఎక్కడా కూడా అయ్యవారిని అమ్మవారిని పురుషప్రకృతి-స్త్రీప్రకృతిలా పోల్చకపోవడం. హంసకి హంసిలా, మగకోకిలకి ఆడుకోకిలలా, భ్రమరానికి భ్రమరిలా, రాజకీరానికి రాజకీరిలా, మయూరానికి మయూరిలా చెప్పడంలేదు.

విహారం అంటున్నాడు కాబట్టి అయ్యవారిని ఏ రూపంలో చెప్తాడో, ఆ విధమైన రూపానికి అమ్మవారు ఏ రూపంలో ఉంటే బాగా నచ్చుతుందో అదే చెప్పాడు. కొలను హంస. మావిచిగురు కోకిల. భ్రమరం తామర. చిలుక పంజరంలోని స్థానం (పంజరం కాదు). నెమలి పర్వతసానువు.

విహారాన్ని వర్ణించడానికి చక్కటి జంటలు ఇవి. హంస కొలనులో విహరిస్తుంది. కోకిల మావికొమ్మలపై విహరిస్తుంది. భ్రమరం తామరలందు విహరిస్తుంది (వేదాలు సచ్చిదానందస్వరూపంలో విహరిస్తాయి). చిలుక తనకి ఆమోదమైన పంజరంలో విహరిస్తుంది. నెమలి పర్వతసానువులపై విహరిస్తుంది. దీనివల్ల అయ్యవారు విహరిస్తున్నారనే అర్థం బైటకు కనిపిస్తున్నా ఇద్దరికీ అభేదం కూడా చెప్పినట్టైంది.

విహారం కాకుండా ఏకాంతమని చెప్పి ఉంటే వేరేలా ఉండేదేమో కవి కల్పనా చాతుర్యం.

౨ అన్ని చోట్లా అమ్మవారు కొలను ఔతోంది, కొమ్మ ఔతోంది, కంజాతమౌతోంది అన్నాడే కానీ కొలనులా ఉంది అనడం లేదు. ఆ రూపకాలంకార ధ్వనిని అమ్మవారివరకూ కొనసాగించడం అద్భుతం. పైగా అయ్యవారు హంస ఐతే అమ్మవారు కొలనులా ఉంది అనడం కాకుండా, అమ్మవారు కొలను ఔతోంది అనడం ఎంత సముచితం! మళ్లీ అర్ధనారీశ్వరతత్వం చూపినట్టౌతోంది.

మొత్తానికి అమృతమే ఈ పద్యం. అందులో అనుమానం లేదు. అలాంటప్పుడు అమృతభాండం బంగారానిదా వెండిదా రాగిదా ఇత్తడిదా లేదా ఆ భాండానికి రత్నాలు తాపడం చేసారా నగిషీలు చెక్కారా... ఇలాంటివి చూడడం అనవసరం!

* * *

రవిగారు చెప్పబట్టి ఇది ఉద్భటారాధ్యచరిత్రంలోనిదని తెలిసింది. తప్పితే ఈ పద్యం ఆ కావ్యంలో ఏ ఆశ్వాసంలోదో ఎన్నో పద్యమో నేపథ్యమేమిటో వివరాలు నాకు అస్సలు తెలియవు. ఏదేమైనా మంచి పద్యాన్ని పరిచయం చేసినందుకు రవిగార్కి కృతజ్ఞతలు.

శనివారం, జనవరి 31, 2009

తిమ్మన చిత్రకవితావిలాసము

పారిజాతాపహరణ కావ్యంలోని పంచమాశ్వాసంలో నంది తిమ్మన తన చిత్రకవిత్వాన్ని ఆవిష్కరించాడు—


కందము. నాయశరగసారవిరయ – తాయనజయసారసుభగధరధీనియమా
మాయనిధీరథగభసుర – సాయజనయతాయరవిరసాగరశయనా (౫-౯౨)


సార అంటే బలమైన, శ్రేష్ఠమైన అని శబ్దరత్నాకరము. గ శబ్దం గమనానికి సూచన. వి అంటే విశేషమైన. రయమంటే వేగం. నాయ శబ్దానికి పద్ధతి, దిశ, నీతి అని నిఘంటువు. తాయన అంటే బాగుగా సాగుచున్న అని నిఘంటువు. కాబట్టి నాయ–శరగ–సార–విరయ–తాయన–జయసార అనే మొదటి విశేషణాన్ని నాయ–వి–రయ–గ–సార–శర–తాయన–జయ–సార గా అన్వయించుకోవచ్చు. పద్ధతిగా విశేషమైన వేగంతో ప్రయాణించే శ్రేష్ఠమైన బాణాలవలన కలిగిన చక్కటి జయించే చేవ ఉన్నవాడు అని అర్థం.

సుభగుడు అంటే మనోహరమైనవాడు, భాగ్యవంతుడు.

ధీ అంటే బుద్ధి. ధర అంటే భూమి అనీ కొండ అనీ అర్థాలు (ధర ధరించేది). నియమ శబ్దం మొక్కవోని వ్రతాన్ని సూచిస్తుంది. కాబట్టి ధీ నియమం అంటే బుద్ధికి సంబంధించిన వ్రతం. ఎలాంటి వ్రతం? భూమిలాంటి (లేదా కొండవంటి). ఏమిటి దీని అర్థం? నిశ్చలమైన అని తీసుకుంటే భూమికైనా కొండకైనా సరిపోతుంది. కాబట్టి నిశ్చలమైన (మార్చరాని) బుద్ధినియమం కలవాడు.

మాయనిధీ వేరు మాయానిధీ వేరు. మాయానిధీ అంటే మాయకు నిలయమని. ఇక్కడ మాయనిధీ అంటున్నాడు కాబట్టి మా అయ నిధీ అని చెప్పుకోవాలి. అయమంటే మేలు కలుగజేసే వస్తువు/దైవము అని శబ్దరత్నాకరము. మా అంటే లక్ష్మి. కాబట్టి మాయనిధీ అంటే లక్ష్మికీ మేలుకీ నిలయమైనవాడు.

రథమంటే తేరు, శరీరము అని శబ్దరత్నాకరము. భ శబ్దం కాంతికి సూచిక. గ శబ్దం ధరించడాన్ని కూడా సూచిస్తుంది. కాబట్టి భ–సుర–రథ–గ అంటే కాంతివంతులైన దేవతలను శరీరమునందు ధరించినవాడు. అంటే సర్వదేవస్వరూపుడు.

సాయమంటే బాణము. నయమంటే న్యాయము. కాబట్టి సాయ–జ–నయ అంటే బాణము(ల) ద్వారా పుట్టిన న్యాయం కలవాడు.

తాయ్ ధాతువు విస్తరించడం అనే అర్థంలో వాడుతారు అని నిఘంటువు. ర అంటే కాంతి, గమనం, అగ్ని, కామం, ధారణ... అని నిఘంటువు. కాబట్టి తాయరవిర అంటే రవి–ర–తాయ రవికోటితేజుడు అని.

సాగర శయనా అంటే సముద్రమే పాన్పుగా కలవాడు.

ఈ పద్యంలో గమ్మత్తు మొదటినుండి చివరికి చదివినా చివరినుండి మొదటికి చదివినా ఒకేలా ఉండడం. దీనకి అనులోమవిలోమమని పేరు.


కందము. ధీర శయనీయశరధీ – మారవిభానుమతమమత మనుభావిరమా
సారసవన నవసరసా – దారదసమతారహార తామసదరదా (౫-౯౩)


ధీరుడు అంటే విద్వాంసుడు, ధైర్యవంతుడు అని శబ్దరత్నాకరము.

శయనీయ శరధి అంటే శయనించుటకు అర్హమైన సముద్రము కలవాడు.

మారుడంటే మన్మథుడు. వి అంటే విశేషమైన. భా అంటే కాంతి. అనుమత సమ్మతించబడిన. మమత మమత్వం, అభిమానం. మార–విభానుమత–మమత. మన్మథుడి కాంతికి సమ్మతమైన అభిమానం కలవాడు. అంటే మన్మథుడివలె కాంతిమంతుడని.

నిఘంటువులో మను శబ్దానికి మంత్రమని అర్థం. భావి అంటే కాగల, భవిష్యత్ అని అర్థాలు. మంత్రము వలన కాగల లక్ష్మి కలవాడు. అంటే మంత్రమననముచే సమస్తశుభాలనీ ఇచ్చేవాడు.

సవనమంటే యజ్ఞము. సవన–సార అని అన్వయించుకుని యజ్ఞములందు శ్రేష్ఠుడని చెప్పుకోవచ్చు. లేదా తరువాతి నవ–స–రసా కూడ కలిపి అర్థం తీసుకోవచ్చు. నవ అంటే క్రొత్త, తొమ్మిది. ఈ రెండు అర్థాలూ వాడుకుంటే నవసరసా అంటే కొంగ్రొత్త సరసనవము కలవాడా అని. అప్పుడు శ్రేష్ఠమైన యజ్ఞములందు సనవరసుడని.

దారదమంటే పాదరసము విషము ఇంగువ అని శబ్దరత్నాకరము. తార అంటే మలినరహితమైన ముత్యము. దారద–సమ–తార అంటే పాదరసంలా మెరిసే మంచి ముత్యం. అట్టి ముత్యాల హారం కలిగినవాడు.

దరమంటే భయమనీ శంఖమనీ శబ్దరత్నాకరము. తామసదరదుడంటే తామసానికి భయాన్నిచ్చేవాడు అని.

ఈ పద్యంలో గమ్మత్తు ఏ పాదానికి ఆ పాదం మొదటినుండి చివరికి చదివినా చివరినుండి మొదటికి చదివినా ఒకేలా ఉండడం. దీనకి పాదభ్రమకమని పేరు.


కందము. మనమున ననుమానము నూ–నను నీ నామ మను మను మననమును నేమ
మ్మున మాన నన్ను మన్నన – మను మను నానా మునీన మానానూనా (౫-౯౮)


మనమునన్ అనుమానమున్ ఊనను నీ నామము అను మను మననమునున్ నేమమ్మునన్ మానన్ నన్ను మన్ననన్ మనుము అను నానా ముని ఇన మాన అనూనా

ఊను అంటే అవలంబించు, పొందు అని శబ్దరత్నాకరము. మను శబ్దానికి మంత్రమని అర్థం. నేమము అంటే నియమము. మనుట అంటే జీవించుట (మనుగడ, మనికి). ఇన అంటే శ్రేష్ఠమైన అని నిఘంటువు. మానము అంటే కొలత, ప్రమాణం అని ఇక్కడ తీసుకోవలసిన అర్థం. అనూన అంటే వెలితి లేని, నిండైన అని శబ్దరత్నాకరము.

ముని శ్రేష్ఠుల అందరి ప్రమాణాలకీ ఏమాత్రం వెలితిలేనివాడా! మనస్సులో అనుమానం పొందను (ఊహాపోహలకి తావివ్వను). నీ నామపు మంత్రజపం చేసే నియమాన్ని మానను. మన్ననతో నన్ను జీవించుమని దీవించు.

తెలుస్తూనే ఉంది. ఈ పద్యం ద్వ్యక్షరి. న, మ — ఈ రెండక్షరాలే ఉన్నాయీ పద్యంలో.


పదాలు విడగొట్టుకోవడంలోనే అసలు చిక్కంతా ఉందీ మూడు పద్యాల్లోనూ. చిత్రకవిత్వంలో చిత్రమో ఏమిటో కానీ వీటిల్లో శబ్దాడంబరం బావున్నా అర్థమవ్వాలంటే పరిశ్రమ చేయక తప్పదు!

ముక్కు తిమ్మనార్యు ముద్దు పలుకే గానీ ఇక్కడ ముక్కు తిమ్మనార్యు చిక్కుపలుకు అనాలనిపించింది (చిక్కుకి శ్లేషతో సహా) ఈ మూడూ అర్థం చేసుకునే సరికి!


కృతజ్ఞతలు:
౧ పారిజాతాపహరణ కావ్యపు జాలప్రచురణకర్తలైన ఆంధ్రభారతి వారికి
౨ శబ్దరత్నాకరాన్ని కూర్చిన బహుజనపల్లి సీతారామాచార్యులు గారికి
౩ సంస్కృతాంగ్లనిఘంటువును కూర్చిన మోనియరు విలియమ్సు గారికి
౪ దీనికై తగినంత పరిశ్రమ చేయించినందుకు మందాకిని గారికి

శనివారం, జనవరి 03, 2009

శ్రీశ్రీ లేకున్ననేమి సిరిసిరిమువ్వా

ఊకదంపుడుగారి బ్లాగులో ఈ టపా చూసి అప్పటికప్పుడు మదిలో మెదిలిన ఆలోచనే ఈ అక్షరమంజరి...

విశ్రాంతి చాలు చాలిక
లే శ్రమతోనైన కంటిరెప్పకు మల్లే
ప్రశ్రయమున నే చూచెద
శ్రీశ్రీ లేకున్ననేమి సిరిసిరిమువ్వా ౧

కందాలే మళ్ళీనా
అందామని ఉన్న కూడ అనవద్దమ్మా
అందంగా భావాలను
చిందిస్తా చిందులాడు సిరిసిరిమువ్వా ౨

ఓ కుఱ్ఱకుంక రాఘవ
నీకెందుకు నా గుఱించి నేనొప్పను పో
పో కైతలా ఇవనుచూ
ఛీ కొట్టకు నన్ను నువ్వు సిరిసిరిమువ్వా ౩

ఈ కవన మారథాన్లో
నా కంటే ముందు ఎవడు నడిచేస్తాడో!
నాకొక ఛాన్సిచ్చావో
చేకొందును ఫస్టు నేను సిరిసిరిమువ్వా ౪

ఇంకా ఏం కావాలట
నీకింకో గాఠి మాట నిజమిది శ్రీశ్రీ
కే కాదమ్మా పేర్లో
నాకూ శ్రీ ఉంది చూడు నా సిరి* మువ్వా ౫

లెచ్చర్లిచ్చుట సుళువే
అచ్చంగా టెల్గులోన అరవండంటూ
చచ్చే చావొచ్చిందే
చిచ్చీ ఇంగ్లీషుతోటి సిరిసిరిమువ్వా ౬

ఐనా కూడా యత్ని
స్తా నా వంతు పని నేను సాధించేస్తా
శానా సేయాలి... తెలుగు
సేనకు నే బంటునమ్మ సిరిసిరిమువ్వా ౭

నాది తెలుగు భాష అనీ
నా దేశము భారతమని నలుదిశలందూ
ఏదీ చాటక పోతే
చేదెక్కాలమ్మ జిహ్వ సిరిసిరిమువ్వా ౮

గునపం పారా కత్తీ
పని చేస్తేనే కదమ్మ పదిమందికి నో
ట్లో నలిగేదీ మెతుకులు
చినుకులు నడిపెడి బ్రతుకులు సిరిసిరిమువ్వా ౯

ఈ లోకంలో ఎంతో
కాలంగా ఉన్న వృత్తి కాయాకష్టం
గాలీ వానా ఎండా
చేలో సిరి ఉన్నదమ్మ సిరిసిరిమువ్వా ౧౦

పాలసపోటా కొబ్బరి
పాలూ గోదారినీళ్లు పనసా అరటీ
పాలూ జున్నూ చెరకూ
చేలో వరికంకి సిరులు సిరిసిరిమువ్వా ౧౧

కూలీనాలీ చేసే
పాలేళ్లూ కౌలుదార్లు పచ్చని చేలూ
కాలువగట్లూ ఈతలు
చేలో పాట సరదాలు సిరిసిరిమువ్వా ౧౨

వైనం చూస్తే దేశం
నానాటికి మారుతోంది నాగంభొట్లూ :)
గానుగ ఆడిన నూనెలు
చేనేతల బట్టలేవి సిరిసిరిమువ్వా ౧౩

వన్నెల బట్టల డూ బస
వన్నల సంక్రాంతి ఆటపాటలు చూశా
వెన్నెల్లో ఆటల్నీ
చిన్నప్పుడు చూస్తి నేను సిరిసిరిమువ్వా ౧౪

కోనేటిలోని చేపలు
మానులపై గూళ్లు చందమామా మట్టీ
వానా నా మదిలో రా
సేనెన్నో కవితలు మరి సిరిసిరిమువ్వా ౧౫

దోమలు చేసే నాదం
ఆమనిలో కోకిల స్వర మాడే నెమలీ
రాముడి గుడి పానకమూ
చీమల క్రమశిక్షణ భళి సిరిసిరిమువ్వా ౧౬

వేసవిలో మామిళ్లూ
శైశవమున అమ్మ చేతి చద్దన్నాలూ
సీసాల్లో షోడాలూ
చేసిన అల్లరి పసందు సిరిసిరిమువ్వా ౧౭

స్కూల్లో గెంతిన రోజులు
పిల్లా పిచికా కబుర్లు పీచు మిఠాయీ
చిల్లుల జేబులు ఇంకా
చిల్లరతో కొన్న జీళ్లు సిరిసిరిమువ్వా ౧౮

మా సారు పుస్తకాలూ
క్లాసుల మధ్యన కబుర్ల కాలక్షేపం
రాసిన పేరడి పాటలు
సీసంతో నా తకధిమి సిరిసిరిమువ్వా ౧౯

పూటకి ఇన్నే రాస్తా
నేటికి ఇవి చాలు నీకు నే వెళ్లొస్తా
పోటీ పరుగుల మధ్యన
చీటికి మాటికి కుదరదు సిరిసిరిమువ్వా ౨౦

చెమక్కు: ఇవాళ ముగింపు చురుక్కు...

దురుసుగ వాగే తమ్ముడు
సరిగా గుదిబండలాగు చక్కగ ఉంటే
పరకాల మిత్రులున్నా
చిరు నెగ్గునొ నెగ్గలేడొ సిరిసిరిమువ్వా ౨౧

______
*ఒక్కటే శ్రీ కదా... ఒక్కటే సిరి