శుక్రవారం, నవంబర్ 07, 2008

క్రికెట్‌ క్రీడా సౌరభము

కందములు

వల్లభుఁడను నా మిత్రుఁడు
చల్లగ నడిగెను నను నొకసారి* యసలు నే
నెల్లా సౌరవ్ ఫ్యానని
యుల్లాసముగా జవాబు నుత్తర క్షణమే

శ్రావ్యముగా పాడగఁ జిఱు
కావ్యముగా వ్రాసెదనని కైతగఁ మలచే
దివ్యక్షణముల నంతా
సవ్యంగా నుండఁ గోరి చతురాస్యుసతిం

గీర్వాణిని శ్రీరామునిఁ
బర్వతతనయాతనయునిఁ బరమేష్ఠిని గాం
ధర్వాది విద్యలఁ విభుఁడు
సర్వేశ్వరునిం దలంచి చనువునఁ గిరిజన్

తోటకము

అసలేమని వ్రాయుదు నాతనిపై?
కసిలో నెవరెస్టు నగప్రతి తా
నసమానుఁడు కిర్కెటు నాడుటలో
న సహించడు మాటను నల్వురిచే

శార్దూలము

గంగూలీ ఘనవంశజాతుఁడును బెంగాల్ రాష్ట్ర శార్దూలమున్
కంగారస్సలు లేకఁ దాఁ గదలుచూ క్లాసైన టైమింగుతోఁ
సింగారంబుగ బంతి నారు పరుగుల్ చేర్పించుటన్ వీరుడున్
కంగారూలతొ నాడుచుండెఁ దుదిగాఁ గౌశల్యముం జూపుచున్

ఆటవెలది

ఆటఁ జూచుచుంటెఁ హాయిగా నున్ననూ
చివరి మ్యాచ్చి గనుకఁ జిన్న బాధ
కలుగుచుండె వెలితిగాఁ దోచుచున్నది
మనసు మటుకు కలుకుమనుచు నుంది

సీసము

మురళీధరునినైనఁ ముప్పుత్రిప్పలఁ బెట్టి మూడుచెర్వుల నీటఁ ముంచగలఁడు
కాలుఁ ముందుకు వైచి గాలిలోఁ బంతులన్ సిక్సర్లు కొట్టేటి చేవ వాఁడు
ఆఫ్‌సైడు ఫీల్డులో నడ్డంకులెన్నున్నఁ జక్కగా నాడంగ శక్తియుతుఁడు
వీడి ఠస్సా దియ్య! వెనుదీయ డేదైనఁ బుఱ్ఱకేల్వాటంపు పొగరుబోతు

తేటగీతి

అజహరుద్దీను తరువాత నయ్యె నితఁడు
యిండియా టీము కెప్టెన్ను యింతవఱకు
వేరెవరికినీ లేనట్టి పేరు నొందె
నధిక విజయము లందించినది యితండె

ద్విపద

తిరిగి వచ్చుట కెంత త్రిప్పలు వడెనొ?
తనయందుఁ దనకెంత తరుగని స్థైర్య
మింత ధైర్యము వీని కెటుల యలవడె?
నూరకఁ బులి యని యూరంత యనునె?

మధ్యాక్కఱ

ఇంతకీ నా కెందు కిష్ట మింతగా నీతఁడు చూడ
నెంత లాఘవముతోఁ బ్యాట్టు నెత్తి బాల్‌నెంతగా బాదుఁ
బంతిమంతుఁడు మీడియముగ పదనుగాఁ బౌలింగు చేయుఁ
సాంతముగా మానధనుఁడు స్వయముగాఁ సౌరభ మితఁడు

_________________
* శ్రీసర్వధారి కార్తిక శుక్ల నవమి శుక్రవారం (2008 నవంబరు 6)

ఆదివారం, జూన్ 15, 2008

నాన్న

కం. కొంచెం భయమూ భక్తీ
కొంచెం మరియాద ప్రేమ కొంచెం గురినీ
కొంచెం గౌరవ మింకా
కొంచెం చనువు మమతలను కూడెను తండ్రై.

కం. పెంచుట నమ్మ చదువు నే
ర్పించుటను గురువు నడతను పితరుడు ప్రేమన్
పంచుటను సఖుడు... తండ్రిని
మించిన శ్రేయోభిలాషి మేదినిఁ గలడే?

ఉ. సంచిత వీర్యమిచ్చి నరజన్మ మొసంగి మహాజనాప్తమౌ
మంచిఁ గ్రహింపఁజేసి సుకుమార కుమారక కేలువట్టి యా
డించి సుభక్త ధీజన విధేయత నేర్పెడి దైవమా తలన్
వంచి నమస్కరింతుఁ శిశుపాలనకౌశల ఆత్మదాయకా.

పితృదినోత్సవ శుభాకాంక్షలు!

గురువారం, జూన్ 05, 2008

భూభేరి

నేను సైతం
భూమి వేడిమి
తగ్గుదలకై పాటు పడతాను

నేను సైతం
బత్తి-బందుకు
లైటు నొక్కటి ఆర్పివేస్తాను
లైటు లన్నిటి నార్పివేస్తాను

నేను సైతం
బత్తి-బందుకు
వ్యాస మొక్కటి వ్రాసి యిచ్చాను

మన విధాతలం మనమె కాదా
మనకు మనమె
కొరివి పెట్టేలా
పుడమితాపపు వేడి సెగలను
నెత్తికెత్తుకు
తిరగబోనేల?

మన బ్రతుకులలొ
అలవాట్లు మారాయి
అనవసర పైత్యాలు వచ్చాయి

అవసరం ఉన్నంత మటుకే
పృథ్వి సంపద వాడుకోలేమా?
అందుకై అలవాట్లు సైతం
మార్చుకోలేనంత వెఱ్ఱులమా?

సోమవారం, మే 19, 2008

కళ్యాణరామ శతకం ౪

హరి! నీవు రాముడై వెలయఁ హరులై విహాయసచరులు
సురలందరు ఋషిగణములు క్షోణినిఁ సొచ్చిరి వన్య
చరసేనగా సేవఁ సేయఁ శరశూర! సమరలావణ్య!
కరధృతకోదండమూర్తి! కమనీయ కళ్యాణరామ!

కళ్యాణరామ శతకం ౩

అరుణాన్వయపు వృద్ధి కొఱకు హయమేధ యాగముఁ సలిపి
తరువాత పుత్రకామేష్ఠిఁ దశరథ నరపతి సేయఁ
బరమాత్మ! మనిషిగాఁ వస్తివయ్య రావణుఁ మట్టుబెట్టఁ

గరధృతకోదండమూర్తి! కమనీయ కళ్యాణరామ!

శనివారం, మే 17, 2008

కళ్యాణరామ శతకం ౨

భరతాగ్రజ! ధరణిజధవ! భవనుత! భద్రాద్రివాస!
వరదాయక! శరధిశయన! పద్మినీబంధువంశశశి!
పరిపాలితభువన! పాహి భక్తహృత్పంజరకీర!
కరధృతకోదండమూర్తి! కమనీయ కళ్యాణరామ!

కళ్యాణరామ శతకం ౧

కరిరాజు దీనుఁడై డస్సి కమలాక్ష కరమెత్తి మ్రొక్కఁ
సిరికైనఁ జెప్పకనె చని శీఘ్రమె ఛేదించి మకరి
శిరముఁ భక్త సులభుఁడవని శ్రీకర చెప్పితివయ్య
కరధృతకోదండమూర్తి! కమనీయ కళ్యాణరామ!

శుక్రవారం, మే 16, 2008

అమ్మ

ఈ పద్యాలు వ్రాయడానికి ప్రేరణ నిచ్చింది జాన్ హైడ్ గారి అమ్మ-బ్లాగు సంకలనం

ఆ.వె. అమ్మ జోలపాట, అమ్మ చల్లని చూపు,
అమ్మ మృదుల స్పర్శ, అమ్మ మాట,
అమ్మ చేతి బువ్వ అమృతపు నిలయముల్.
అమ్మ అమృతమూర్తి, అమృత మమ్మ.

కం. నవమాసంబులు కడుపున
నివసంబును, పోషణమును, నిర్భీతస్థితిన్,
పవమానపంచకము, ధా
తువుల నిడు జననిని దలతు తొలి దైవముగా.

తే.గీ. అమ్మ! నిను మించు దైవత మవనిలోన
లేదు, వాత్సల్యమున నీకు లేదు సాటి,
ఋణము నేమిచ్చి తీర్తును? తీర్చలేను,
చేతులెత్తి వందనములు సేతునమ్మ.

మధ్యాక్కర. శరదాంశతాధికాయువును, శతమాన సౌభాగ్యములను,
నిరతము నారోగ్యంబును, ననితరమౌ నీ భక్తి, ముక్తి
కరుణను మా యమ్మకిచ్చి కాపాడు కలకాల మీవు
కరధృతకోదండమూర్తి! కమనీయ కళ్యాణరామ!*

_______
*మా కులదైవం శ్రీరామచంద్రుడు.

గురువారం, ఏప్రిల్ 17, 2008

సమస్యాపూరణం తిరిగొచ్చింది

రామనాథుడు చెప్పిన యీ సమస్యకి నా పూరణమిది:

శా. ఆమోదాంకితచేల దివ్యహలయుక్తా రేవతీశా సుధీ
రామా రమ్యగుణోజ్జ్వలా శుభములన్ లాభంబులం బొందగా
రామారామవిరామరామశుకశ్రీరావాప్తశ్రోత్రేంద్రియా
రామా రామ పదాబ్జముల్ కొలువరారా కీర్తి మిన్నందురా.

నా చేత చాలా కాలం తర్వాత మళ్ళీ పద్యపదాన్ని పట్టించినందుకు రామనాథునికి కృతజ్ఞతలు.

మంగళవారం, ఏప్రిల్ 08, 2008

नववर्षशुभाकांक्षाः

अस्मद्गुरुणा श्री पुल्लेल श्रीकृष्णमूर्तिना वदितः अयं श्लोकः --

पात्रस्खलितवृत्तीनां शास्त्रमार्गानुसारिणाम्।
योगकृत्क्षेमकृत्वस्स्यात् वर्षं श्रीसर्वधारि यत्।।

अन्वयक्रमः --
यत् वर्षं अस्खलितवृत्तीनां पातृ अमार्गानुसारिणां शास्तृ (तत्) श्री सर्वधारि वः योगकृत् क्षेमकृत् स्यात्।

తాత్పర్యం --
ఏ సంవత్సరమైతే చలింపని నడువడిక కలవారికి రక్షకత్వం వహిస్తున్నదో, మంచిమార్గాన్నవలంబించనివారిని శాసిస్తున్నదో (ఆ) సర్వధారి మీకు యోగాన్ని క్షేమాన్ని కలిగించునుగాక.

బుధవారం, మార్చి 05, 2008

శివరాత్రి పద్యం

కం. వరమొసగు కరుణను కుసుమ శరదహన గిరితనయపతి శశధరమౌళీ,
ధరణిజపతినుతవిభవ త్రి పురభవభయహర లయకర భుజగధర శివా.

శనివారం, జనవరి 26, 2008

గణతంత్రదినపు వేడుక

కం.జననికి భారతమాతకు
వినుతులు గణతంత్రదినపు వేడుకలన్ నీ
తనయులము మేము జేయగ
గని మము ఆశీర్వదించు ఘనతరచరితా.

బుధవారం, జనవరి 16, 2008

సంక్రాంతి పద్యం

ఉ.శ్రీరఘువంశమూలపురుషేశ్వరవిష్ణుస్వయంభురూప వో
నీరజబంధు లోకహిత నీరదకారక నిత్యనిర్మలాం
గా రవి నక్రసంక్రమణకాలమునందు శుభంబుగోరుచూ
సూరి దినేశ భాను ఖగ సూర్య సురోత్తమ నిన్నుగొల్చెదన్.

సోమవారం, జనవరి 14, 2008

భోగి పద్యం

ఉ.ఆగమవందితానఘుని దాశరథిన్ రఘురామచంద్రునిన్
నాగవిభూషణున్ ప్రళయనర్తనశీలిని శూలినిన్ సిరిన్
శ్రీగణనాథునిన్ మహిత శ్రీలలితాత్రిపురేశ్వరిన్ గుహున్
"భోగి"దినంబునన్ కొలతు భోగిశయున్ సకలాత్మకున్ హరిన్.

శనివారం, జనవరి 12, 2008

తాంబూలం!!!

కం.ఎప్పుడు యెక్కడ పడితే
అప్పుడు అక్కడ కవిత్వ మబ్బాలంటే
తప్పక నోట నమలవలె
కప్పుర తాంబూలమంచు గాఠిగ చెప్తే

కం.చెప్పుచు చక్కని కవితలు
మెప్పింతురొ లేదొ గాని వెధవది దీన్లో
ముప్పేంటంటే అందుకు
అప్పుల పాలౌదురేమొ మన కవులంతా! :P

గురువారం, జనవరి 10, 2008

పరమాత్మస్వరూపం

ఉ.కొందరు అమ్మగా గొలచుకొందురు కొందరు విష్ణుమూర్తిగా
కొందరు రుద్రుడంద్రు మరిగొందరు వారికి తోచినట్లుగా
గందురు నిన్ను రామునిగ గాంచెద మా కులదైవతమ్ముగా
అందరిలోననున్న పరమాత్మస్వరూపమ! మమ్ము బ్రోవుమా.