సోమవారం, జూన్ 18, 2007

నా కందపద్యం!

కం.అందం కావాలన్నా
పొందిక క్లుప్తత సరళత పొందాలన్నా
కందమె తప్పనిసరియని
చందస్సు తెలిసిన కవిగ చకచక చెప్తా.

ఆదివారం, జూన్ 17, 2007

పోతనగారి ప్రహ్లాదుని పలుకులు నా మాటల్లో...

కం.విరిమధువు గ్రోలు తుమ్మెద
అరగునె యుమ్మెత్త కడకు? అవ్విధముననే
మురహరి నామామృతమును
పరి ధ్యానించి మదిని హరి ప్రార్థన జేతున్.

మంగళవారం, జూన్ 12, 2007

ఆధునికత!

ఉ.ఏమిటొ ఈ ప్రపంచమున ఎక్కడ చూసిన పిచ్చిగోలలే -
గ్రామములన్ని పోయినవి - ఆమని చచ్చి యుగంబులయ్యె - ఔ
రా! మనిషన్నవాడు యిక రాడని లేడని పన్కిరాడనీ
యీ మరబొమ్మలే భువిని యేలగ జూసెనె - లెమ్మురా నరా!

ఆ.వె.ఒక్కసారి చూడు పోయిన విభవము
ప్రకృతికాస్త యిపుడు వికృతి అయ్యె
పుడమి మనది దాన్ని పునరుద్ధరించరా
చక్కదిద్దు గాని చంపబోకు.

కం.ఈ ధరణి జీవమాతృక
ఆధునికత ముసుగు లోన అమ్మను చాలా
బాధపెడుతు సాధించెడి
ఏ ధనమైనా విషంబె తెలుసుకొనుమురా.
పూర్తిజేసి సరిదిద్దవలసియున్నది.

తారకమంత్రము

కం.మననముచే రక్షించే
ధ్వనినే మంత్రమని యెరిగి ధరణిజపతియౌ
ఘనచరితుని ఘనశ్యాముని
మనసున రాముని తలచెద మధునామంబున్.

శుక్రవారం, జూన్ 08, 2007

ఆదిత్య 369 చిత్రంలోని శ్లోకం

శ్లో. జయ జయ దానవదారణకారణ శార్ఙ్గ రథాఙ్గ గదాసిధరా
జయ జయ చన్ద్ర దినేన్ద్ర శతాయుతసాన్ద్రశరీర మహత్ప్రసరా
జయ జయ తామరసోదర సోదర చారు పదోజ్ఝిత గాఙ్గఝరా
జయ జయ కేశవ కౌశినిషూదన శౌరి శరజ్జలజాక్ష హరీ.

[దారణ = చంపు,నిర్మూలించు; రథాఙ్గ = చక్రం; అసి = కత్తి; దినేన్ద్ర = సూర్యుడు; అయుత = పదివేలు(అనేకం); సాన్ద్ర = ఘన; మహత్ = గొప్పతనం; తామరసోదర = ఉదరమునుండి పుట్టిన తామరపువ్వు కలవాడు - విష్ణువు; ఉజ్ఝిత = emitted; ఝరము = ఝరి,ప్రవాహము; శరజ్జలజాక్ష = శరత్కాలంలో వికసించిన కలువలవంటి కన్నులు కలిగిన]

సోమవారం, జూన్ 04, 2007

సమస్య 6

ఒక్క వచనంలో తేడా సమస్యాపూరణాన్ని ఎలా మార్చేయగలదో!

1. పరకాంతను కోరె నేకపత్నీవ్రతుడై.

2. పరకాంతల కోరె నేకపత్నీవ్రతుడై.

శనివారం, జూన్ 02, 2007

బాల్యమిత్రునికిచ్చినదీ పద్యం

పదవ తరగతిలో వుండగా నా మిత్రుడు బందా శరవణ కార్తికేయకు నేను వ్రాసియిచ్చిన పద్యమిది:
ఉ.ఆపగ పారినట్లు హృది యా హరి మీదనె కల్గు భక్తియున్
ఏ పగ కల్గకుండ యిల ప్రేమను పంచెడిదైన స్నేహమున్
మాపుచు అంధకారమును మానవు మార్చెడిదైన విద్యయున్
ఆపదనుండినా విడువరానివిరా మనసైన నేస్తమా.
[ఆపగ = నది]