ఆదివారం, మార్చి 25, 2007

భారతీ స్తుతి

భారతీ స్తుతి!
కవి: ఓం ప్రకాశ్, ఎం.ఏ,(ఎం.ఫిల్),ఉస్మానియా విశ్వవిద్యాలయం.
(ఇది 'తెలుగు సాహిత్య వేదిక' ద్వారా ప్రకాశితము)

కం. వ్యాసపుర పీఠవాసవు
భాసుర వీణాక్షదామ పాణివి వాణీ!
వ్యాసమునీశ్వర సేవిత
దాసుడ ననుయేలరమ్ము దయతో దేవీ! 1.
[భాసుర = ప్రకాశించే; అక్ష దామ = పూసల మాల; పాణి = చేయి]

ఉ. బాసర పుణ్యతీర్థమున భాసిలి, భక్త జనావళీ మనో
వాసినియై, వచోవిభవ భావ విజృంభిత దివ్య మూర్తయై,
హాసవిలాస దీవరదయై, కవితారచనాత్మరూపయై,
వ్యాస మహామునీశకృతయై వెలుగొందెడి వాణి వేడెదన్! 2.
[భాసిలు = ప్రకాశించు; ఆవళి(లి) = సమూహము; వచస్ = మాట; విభవము = వైభవము, సంపద; విజృంభించు = వ్యాపించు; విలాసము = లీల; ధీ = intellect]

ఉ.బాసర పీఠమున్ వెలిగి భక్తుల పాలిటి కల్పవల్లియై,
దోసములన్నిటిన్ దునిచి, దోర్బల ధీబల దాత్రివంచు, నీ
బాసట వీడకన్ హృదయ పద్మమునందున గొల్తునమ్మ, యో
సారసనేత్రి! నీ కరుణశారద చంద్రికలౌత భారతీ!! 3.
[వల్లి = లత; దోర్బల(?) = బలహీన, చిన్న; దాత్రి(స్త్రీ.) - దాత(పుం.); సారసము = తామరపువ్వు; శారద చంద్రిక = శరదృతువులోని వెన్నెల]

దీనిపై నా వ్యాఖ్య:

ఉ. పక్కులు పల్కురీతి నిటు బాసరవాసిని శారదాంబపై
చక్కని పద్యమాలికలు చప్పున చెప్పి విశేష భక్తితో
మ్రొక్కెడు భక్తసత్కవికి మోదము తోడ ప్రశంస జేసెదన్ -
ఎక్కడ నాయనా యిపుడు తెల్గులొ వ్రాసిన పద్యసూనముల్
ఎక్కడయంచు వేచి గన చేవను (చేతల) చూపెను ఓం ప్రకాశుడే.

వ.తెలుగు వ్రాయటం చదవటం మాట్లాడటం సరిగా వచ్చినవారే కనుమరుగౌతున్న యీ తరుణంలో చక్కగా పద్యప్రసూనపూజ చేసిన ఓం ప్రకాశ్ గార్కి రాఘవ నమస్సులు.
[పక్కి = పక్షి; సూనము = ప్రసూనము = పువ్వు]

తప్పొప్పులు:

1. రెండవ పద్యం మూడవ పాదంలో ధీవరద అని వుండాలి; దీవరద కాదు. దీ [= మరణించు] అన్నది సంస్కృత ఆత్మనేపద ధాతువు.

2. ఇది తప్పో కాదో నాకు నిశ్చయంగా తెలియదు కానీ మూడవ పద్యంలో దౌర్బల అన్న ప్రయోగంతో పోలిస్తే దుర్బల అన్న ప్రయోగం బావుంటుందేమో అని అనిపించింది. దుర్బల ధీబల దాత్రివంచు = 'that you bless even a nitwit with the power of intellect' అన్నదే కవి అభిప్రాయమైయుండవచ్చని భావిస్తే.

శనివారం, మార్చి 24, 2007

ఆదిశఙ్కరాచార్య కృత శివ మానస పూజా స్తోత్రమునకు నా తెనిగింపు

[ముందుమాట: "శార్దూల(విక్రీడిత)"మనే చందస్సులో వున్న సంస్కృత శ్లోకాలకు "శార్దూలం"లోనే తెలుగులో వ్రాయాలన్న వుద్దేశం వుండటం వల్ల కొన్ని కఠిన పదాలు వాడక తప్పలేదు. అలాగే చిన్న శ్లోకమవటం చేత చివరి "కర చరణ కృతం వా" అన్న శ్లోకాన్ని కందపద్యంగా వ్రాస్తే బాగుంటుందేమో అనిపించింది.]

స్తోత్రము:

శా. నానా రత్న విభూషితాసనము - శీతాపో೭భిషేకంబులున్ -
రత్నాలంకృత వస్త్రముల్ - భుజగ హారా - కస్తురీ గంధముల్ -
సూనంబుల్ ఘన బిల్వ పత్రములునూ - సూర్ముల్ - సుధూపంబులున్ -
అన్నీ నా హృదయంబునన్ మ(త)లచితిన్ - సర్వాత్మకా అందుకో. ౧.
[శీతాపో೭భిషేకము = శీత+ఆపః+అభిషేకము = చల్లని నీటితో అభిషేకము; సూనము = పువ్వు; సూర్ముల్ సుధూపముల్ = దీపధూపములు]

श्लो॥ रत्नैः कल्पितमासनं हिमजलैः स्नानं च दिव्यांबरं
नानारत्नविभूषितं मृगमदामोदाङ्कितं चन्दनम्।
जातीचंपकबिल्वपत्ररचितं पुष्पं च धूपं तथा
दीपं देव दयानिधे पशुपते हृत्कल्पितं गृह्यताम्॥१॥

శా. హేమాంగంబగు పాత్రలో - పచితముల్ హైయంగవీనంబుతోన్ -
ప్రేమన్ - పానక - క్షీరముల్ - ఫల - దధుల్ - పేయంబులున్ - వీటియున్ -
నీ మీదన్ గల భక్తితో మనసులో నీకై సమర్పించితిన్ -
శ్రీ మందాకినివాహ! శంకర! శివా! నీ స్వీకారమున్ దెల్పవే. ౨.
[పచితము = వండినది; హైయంగవీనము = అప్పుడే కాచిన నెయ్యి; దధి = పెరుగు; పేయము = beverage; వీటి = తాంబూలము]

श्लो॥ सौवर्णे नवरत्नखण्डरचिते पात्रे घृतं पायसं
भक्ष्यं पञ्चविधं पयोदधियुतं रम्भाफलं पानकम्।
शाकानामयुतं जलं रुचिकरं कर्पूरखण्डोज्ज्वलं
तांबूलं मनसा मया विरचितं भक्त्या प्रभो स्वीकुरु॥२॥

శా. సంకల్పంబున - చామర - వ్యజనముల్ - ఛత్రంబు - నాదర్శమున్ -
నీకై వాద్యములున్ - మృదంగ లయలున్ - నృత్యంబులున్ - గీతముల్ -
సంకీర్తుల్ యిల చాల జేసితి - హరా - సాష్టాంగ దండంబులున్ -
లోకాధీశ గ్రహించుమయ్య కృపతో - లోపాలు గాంచొద్దయా. ౩.
[చామరము = వింజామర; వ్యజనము = విసనకఱ్ఱ; చత్రము = గొడుగు; ఆదర్శము = అద్దము]

श्लो॥ छत्रं चामरयोर्युगं व्यजनकं चादर्शकं निर्मलं
वीणाभेरिमृदङ्गकाहलकला गीतं च नृत्यं तथा।
साष्टाङ्गं प्रणतिः स्तुतिर्बहुविधा ह्येतत्समस्तं मया
सङ्कल्पेन समर्पितं तव विभो पूजां गृहाण प्रभो॥३॥

శా. కాయంబే గుడి - ఆత్మ నీవు - మనసే కామాక్షి - ప్రాణంబులే
ఆయా సేవక బృందముల్ - విషయముల్ శాస్త్రోక్త పూజావిధుల్ -
శయ్యానిద్రలె శ్రీ సమాధి స్థితి - సంచారంబులావర్తముల్ -
నా యీ వాక్కులె స్తోత్రముల్ - క్రియలు నీ ఆరాధనల్ - ఓ శివా! ౪.
[ఆవర్తము = ప్రదక్షిణ]

श्लो॥ आत्मा त्वं गिरिजा मतिः सहचराः प्राणाः शरीरं गृहं
पूजा ते विषयोपभोगरचना निद्रा समाधिस्थितिः।
सञ्चारः पदयोः प्रदक्षिणविधिः स्तोत्राणि सर्वा गिरो
यद्यत्कर्म करोमि तत्तदखिलं शम्भो तवाराधनम्॥४॥

కం. కర - పద - తను - మనకృతములు
మరి జ్ఞానేంద్రియ కృతములు అపరాధంబుల్
సరియై(నై)నను కాకున్నను
కరుణాభ్ధీ నను క్షమించి కావుము దేవా.౫.

श्लो॥ करचरणकृतं वा कर्मवाक्कायजं वा श्रवणनयनजं वा मानसं वापराधम्।
विहित मविहितं वा सर्वमेतत्क्षमस्व शिव शिव करुणाभ्धे श्रीमहादेव शम्भो॥५॥

బుధవారం, మార్చి 21, 2007

పుష్ప విలాపము - కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి

తే.గీ.చేతులారంగ నిన్ను పూజించుకొరకు
కోడి కూయంగనే మేలుకొంటి నేను;
గంగలో మున్గి ధౌత వల్కలము గట్టి
పూలు కొనితేర నరిగితి పుష్పవనికి. 1.
[ధౌత = ఉతకబడిన; వల్కలము = నారచీర; అరుగు = వెళ్లు]

ఉ.నే నొక పూలమొక్క కడ నిల్చి చివాలున కొమ్మవంచి గో
రానెడు నంతలోన విరు లన్నియు జాలిగ నోళ్ళు విప్పి "మా
ప్రాణము తీతువా" యనుచు బావురు మన్నవి; క్రుంగిపోతి; నా
మానసమం దెదో తళుకు మన్నది పుష్పవిలాప కావ్యమై. 2.
[విరి = పువ్వు]

తే.గీ.తల్లి యొడిలోన తలిరాకు తల్ప మందు
ఆడుకొను మమ్ములను బుట్టలందు చిదిమి
అమ్ముకొందువె మోక్ష విత్తమ్ము కొరకు!
హృదయమే లేని నీ పూజ లెందుకోయి? 3.
[తలిరాకు = లేత/క్రొత్త ఆకు; తల్పము = పరుపు; విత్తము = ధనము]

తే.గీ.జడమతుల మేము; జ్ఞానవంతుడవు నీవు;
బుధ్ధి యున్నది; భావ సమృద్ధి గలదు;
బండబారెనటోయి నీ గుండెకాయ!
శివునకై పూయదే నాల్గు చిన్ని పూలు? 4.
[ఏము = మేము]

ఉ.ఆయువు గల్గు నాల్గు గడియల్ కని పెంచిన తీవతల్లి జా
తీయత దిద్ది తీర్తుము; తదీయ కరమ్ములలోన స్వేచ్ఛమై
నూయల లూగుచున్ మురియుచుందుము; ఆయువు దీరినంతనే
హాయిగ కన్ను మూసెదము ఆయమ చల్లని కాలి వ్రేళ్ళపై. 5.
[తీవ = తీగ; దిద్దు = చక్కబెట్టు; తదీయ = ఆ; ఆయమ = ఆ అమ్మ]

ఉ.గాలిని గౌరవింతుము సుగంధము పూసి; సమాశ్రయించు భృం
గాలకు విందు చేసెదము కమ్మని తేనెలు; మిమ్ము బోంట్ల నే
త్రాలకు హాయిగూర్తుము; స్వతంత్రుల మమ్ముల స్వార్ధ బుద్ధితో
తాళుము త్రుంప బోవకుము; తల్లికి బిడ్డకు వేరు సేతువే! 6.
[భృంగము = తుమ్మెద; మిమ్ము బోంట్లు = మీబోటి వారు; తాళు = సహించు]

ఉ.ఆత్మ సుఖమ్ము కోసమయి అన్యుల గొంతులు కోసి తెచ్చు పు
ణ్యాత్ముడ! నీకు మోక్ష మెటు లబ్బును? నెత్తురు చేతి పూజ వి
శ్వాత్ముడు స్వీకరించునె? చరాచరవర్తి ప్రభుండు మా పవి
త్రాత్మల నందుకోడె! నడమంత్రపు నీ తగులాట మేటికిన్? 7.
[నడమంత్రపు = అకస్మాత్తుగా (వచ్చిన); తగులాట = ఆసక్తి; మేటి = భగవంతుడు]

తే.గీ.ఊలు దారాలతో గొంతు కురి బిగించి
గుండెలో నుండి సూదులు గ్రుచ్చి కూర్చి
ముడుచుకొందురు ముచ్చట ముడుల మమ్ము
అకట! దయలేని వారు మీ యాడువారు. 8.

తే.గీ.గుండె తడి లేక నూనెలో వండి పిండి
అత్తరులు చేసి మా పేద నెత్తురులను
కంపు దేహాలపై గుమాయింపు కొరకు
పులుముకొందురు హంత! మీ కొలము వారు. 9.
[గుండె తడి = జాలి; హంత = హంతకుడు/హంతకురాలు; కొలము = కులము]

ఉ.అక్కట! హాయి మేము మహిషాసురు లెందరొ నాల్గు ప్రక్కలన్
ప్రక్కల మీద చల్లుకొని మా పసిమేనులు పాడు కాళ్ళతో
ద్రొక్కుచు దొర్లి - దొర్లి - మరు రోజుదయాననె వాడి వత్తలై
రెక్కలు జారిపోఁ పరిహరింతురు మమ్ముల పెంటదిబ్బ పై. 10.
[మేను = శరీరం; వత్త = వడలిపోయినది; పరిహరించు = విడుచు]

ఉ.మా వెలలేని ముగ్ధ సుకుమార సుగంధ మరంద మాధురీ
జీవిత మెల్ల మీకయి త్యజించి కృశించి నశించిపోయె; మా
యౌవన మెల్ల కొల్లగొని ఆ పయి చీపురుతోడ చిమ్మి మ
మ్మావల పారబోతురు గదా! నరజాతికి నీతి యున్నదా!? 11.
[ముగ్ధ = చక్కని; మరందము = మకరందము; మాధురి = తీయందనము]

తే.గీ.బుద్ధ దేవుని భూమిలో పుట్టినావు
సహజ మగు ప్రేమ నీలోన చచ్చెనేమి?
అందమును హత్య చేసెడి హంతకుండ!
మైలపడిపోయె నోయి! నీ మనుజ జన్మ. 12.
[మైల = మలినము]

తే.గీ.పూజ లేకున్న బాబు నీ పున్నె మాయె!
కోయ బోకుము మా పేద కుత్తుకలను
అకట! చేసేత మమ్ముల హత్య చేసి
బాపుకొనబోవు ఆ మహా భాగ్య మేమి? 13.
[కుత్తుక = గొంతు]

తే.గీ.ఇట్లు పుష్పాలు నన్ను చీవాట్లు పెట్టి
నట్లుగాన్ - పూలు కోయ చేయాడలేదు;
ఏమి తోచక దేవర కెరుక సేయ
వట్టి చేతులతో ఇటు వచ్చినాను. 14.

శనివారం, మార్చి 17, 2007

శ్రీరామ కర్ణామృతము - ప్రార్థన

చం. మొదలిడ కావ్యభారతిని ముందుగ వాణిని ప్రస్తుతింప నా
యెదనుదయించినట్టివగు యీ చిఱు పల్కులు వచ్చిరాని యీ
పదములతోనె నీకు అభివందనముల్ మనసార చేయుచూ
చదువులతల్లి శారదవు అమ్మవు నీకు నమస్కరించెదన్.

బుధవారం, మార్చి 14, 2007

చదువుల్ నేర్చిన చాలునంచు

మ. చదువుల్ నేర్చిన చాలునంచు విధులన్ సంధ్యాదులన్ వీడుచున్
అదియే లోకమటంచు నమ్మి క్రమబద్ధంబైన సజ్జీవనం
బు దగా గాబడినా నిజంబు యది కాబోదంచు జీవించు నా
హృదయంబందలి బాధనెంచి, హరి! నా హృత్తాపమున్ బాపవే.