మంగళవారం, జూన్ 27, 2006

కొందరు వ్యక్తులపై నా పద్యములు

కం. గౌరవమిది భారతి కిల -
చేరగ "షెవలియరు" కీర్తి - చూడన్ వెదుకన్
వేరెవరున్నార(ని)య మన
వారిలొ సాటిగ ఘనతను - "బాలమురళి" తోన్.

(గానసుధాకర పద్మవిభూషణ్ పద్మశ్రీ మంగళంపల్లి బాల మురళీకృష్ణ గారిపై, వారికి వినిపించినది)

కం. తాతకు - గురువుకు - స్ఫూర్తి ప్ర
దాతకు - సుకవీశ్వరునకు - దైవ రతునకున్
శ్రోతకు వసంత కోకిల
కూతల - శ్రీ మూర్తి గార్కి కోరెద శుభమున్.

(బ్రహ్మశ్రీ మంగళంపల్లి రామనరసింహమూర్తి గారిపై)


కం. అరగంట మాట కలిపితి
సరదా పాటల 'చరణ్' తొ సాయంకాలం
మరువని క్షణమిది మనసుకు
తరగని స్వరముల నిధి గను తరుణము గనుకన్.

(పద్మశ్రీ శ్రీపతి పణ్డితారాధ్యుల బాల సుబ్రహ్మణ్యం తనయుడు, గాయకుడు చరణ్ ని కలసినప్పుడు)

కం. అందరి మన్నన లొందెడు
కొందరిలో మీరు మాకు కోటి సిరులనన్,
పొందగ శుభమును యశస్సు
అందుకొనుడు ఆంగ్లమునిటు 'హ్యాపీ బర్త్డే'.

(నేను ఇంటెర్న్ షిప్ చేసిన విటెస్ ఎండీ శ్రీ తనికెళ్ళ కామేశ్వరరావు పుట్టిన రోజున)

సోమవారం, జూన్ 19, 2006

నేఁ వ్రాసిన పద్యములు ౩

కందం వ్రాయటం ప్రారంభించిన క్రొత్తలలో వ్రాసిన పద్యాలు -

కం.శుకపికముల రవములతో
వికసించిన హృదయమందు విడువక భక్తిన్
ఇక కొలిచెదమా రాముని
సకల శుభమ్ములు గలుగగ సతతము భువిలో.

(ఉగాదికి వ్రాసినది)

కం.అందరి పూజలు పొందుచు
కొందరికే నీది యైన కరుణను ఒసగన్
నీ దయ నాపై కలుగగ
వందనమిదియే రఘుపతి వందనమిదియే.

(నేను వ్రాసిన మొట్టమొదటి కందపద్యము)