ఆదివారం, జూన్ 15, 2008

నాన్న

కం. కొంచెం భయమూ భక్తీ
కొంచెం మరియాద ప్రేమ కొంచెం గురినీ
కొంచెం గౌరవ మింకా
కొంచెం చనువు మమతలను కూడెను తండ్రై.

కం. పెంచుట నమ్మ చదువు నే
ర్పించుటను గురువు నడతను పితరుడు ప్రేమన్
పంచుటను సఖుడు... తండ్రిని
మించిన శ్రేయోభిలాషి మేదినిఁ గలడే?

ఉ. సంచిత వీర్యమిచ్చి నరజన్మ మొసంగి మహాజనాప్తమౌ
మంచిఁ గ్రహింపఁజేసి సుకుమార కుమారక కేలువట్టి యా
డించి సుభక్త ధీజన విధేయత నేర్పెడి దైవమా తలన్
వంచి నమస్కరింతుఁ శిశుపాలనకౌశల ఆత్మదాయకా.

పితృదినోత్సవ శుభాకాంక్షలు!

గురువారం, జూన్ 05, 2008

భూభేరి

నేను సైతం
భూమి వేడిమి
తగ్గుదలకై పాటు పడతాను

నేను సైతం
బత్తి-బందుకు
లైటు నొక్కటి ఆర్పివేస్తాను
లైటు లన్నిటి నార్పివేస్తాను

నేను సైతం
బత్తి-బందుకు
వ్యాస మొక్కటి వ్రాసి యిచ్చాను

మన విధాతలం మనమె కాదా
మనకు మనమె
కొరివి పెట్టేలా
పుడమితాపపు వేడి సెగలను
నెత్తికెత్తుకు
తిరగబోనేల?

మన బ్రతుకులలొ
అలవాట్లు మారాయి
అనవసర పైత్యాలు వచ్చాయి

అవసరం ఉన్నంత మటుకే
పృథ్వి సంపద వాడుకోలేమా?
అందుకై అలవాట్లు సైతం
మార్చుకోలేనంత వెఱ్ఱులమా?