శుక్రవారం, ఫిబ్రవరి 04, 2011

దేశభక్తి

బెంగళూరు ఆకాశంలో రోజూ వైమానికదళంవారు చేసే సాధనా పరీక్షలూ చూసిన నా గుండె కఱగిపోయి ఈ మాటలరూపంలో ప్రవహించి ప్రపంచమనే సాగరంలో కలిసిపోయి మూగవోయింది.

అనుదినము సాధనార్థమై యాకసమున
వాయుసేన విన్యాసముల్ చేయుటఁ గని
యేమి చిత్రమో గాని నా యెడఁద పొంగుఁ
బొంగు నుప్పొంగు నుప్పొంగుఁ బొంగుఁ బొంగు ౧

వేగమునకు నిర్భీతికిఁ ద్యాగమునకు
నాకృతి యన విమానమునందు దేశ
రక్షణార్థమై ప్రీతితోఁ బ్రాణమిచ్చు
వీరుఁ డొకఁడు దోలుచు నభోవీథి నెగయు ౨

సైనికుఁడు కుటుంబసర్వస్వము వదలి
దేశసేవ సేయ దీక్షఁ బూనఁ
జేతులెత్తి మ్రొక్కఁ జిత్తము గోరును
దేశభక్తి యండ్రు దీనినేమొ ౩

దేశమునకయి యన్నియుఁ దెలిసి తెలిసి
దేహమును ధారవోయుట దేశభక్తి
దేశభక్తునిఁ గొలచుట దేశభక్తి
దివ్యమధురానుభూతి యీ దేశభక్తి ౪

6 కామెంట్‌లు:

Sanath Sripathi చెప్పారు...

నా నోటి మాటను మీరు పలికినట్లనిపించింది. :-) చాలా బాగా రాశారు.

రవి చెప్పారు...

ఏరో ఇండియా షో కు వెళ్ళారా? బావుంది. విమానచోదకుడి (పైలట్) కు ప్రతి సారి జీవన్మరణ సమస్యట. వాయుసేనలో విమాన చోదకత్వం నెఱిపి, ఉన్నతికి వెళ్ళినవారి కెరీర్ ను ఎన్ని యేళ్ళ విమానచోదక అనుభవం ఉన్నదన్నట్టుగా సాధారణంగా ప్రస్తావిస్తుంటారు.

రాఘవ చెప్పారు...

రవిగారూ, నేను ఏ "షో" కూ వెళ్లలేదండీ. నేను ఉండే చోటు ఎచ్.ఏ.ఎల్. ప్రక్కనే కావటంతో రోజూ ప్రొద్దున్నే ఈ విమానాలూ వారి హడావుడీ చూస్తూన్నాను. అదీ సంగతి. :)

Unknown చెప్పారు...

చాలా బాగా వ్రాశారండీ.

Sandeep P చెప్పారు...

చక్కని పద్యాలు వ్రాస్తున్నారు రాఘవ గారు. మీరు ఇంకా చాలా పద్యాలు వ్రాస్తారని ఆశిస్తున్నాను.


నాకు ఒక చిన్న సందేహం - పొంగు, బొంగు, ఉప్పొంగు, బొంగు, బొంగు అన్నారు కదా? ఇక్కడ మీ ప్రయోగం నాకు పూర్తిగా అర్థం కాలేదు. దయచేసి వివరిస్తారా?

రాఘవ చెప్పారు...

సందీప్ గారూ,

"పొంగుఁ బొంగు" అంటే మొదటిసారికంటె రెండవసారి ఆ "యెడఁద పొంగటం" అతిశయిస్తుందనీ, ఆ "యెడఁద"కు "పొంగిపోవటం" తప్ప వేఱే ఏమీ తెలియటం లేదనీ...