గురువారం, ఫిబ్రవరి 25, 2010

ఇందఱికి నభయంబు లిచ్చు చేయి

[యతి స్థానాలను లావాటి అక్షరాలలో చూపుతున్నాను. ప్రాస తెలుస్తూనే ఉంది. అన్నమాచార్యుని "ముద్ర"కు క్రింద గీత గీచాను.]

సంకీర్తన:
ఇందఱికి నభయంబు లిచ్చు చేయి
కందువగు మంచి బంగారు చేయి

వె లేని వేదములు వెదకి తెచ్చిన చేయి
చిలుకు గుబ్బలి క్రిందఁ జేర్చు చేయి
లికియగు భూకాంతఁ గౌగిలించిన చేయి
లనైన కొనగోళ్లవాఁడి చేయి

నివోక బలిచేతఁ దా మడిగిన చేయి
వొనరంగఁ భూదాన మొసఁగు చేయి
మొనసి జలనిధి యమ్ము మొనకుఁ దెచ్చిన చేయి
యెనయ నాఁగేలు ధరియించు చేయి

పురసతుల మానములు పొల్లసేసిన చేయి
తురగంబుఁ బరపెడి దొడ్డ చేయి
తిరువేంకటాచలాధీశుఁడై మోక్షంబు
తెరువు ప్రాణులకెల్లఁ దెలిపెడి చేయి

అర్థాలు:
కందువ - నేర్పు। చిలుకుగుబ్బలి - మంథరపర్వతం (చిలుకు - మథించు, గుబ్బలి - కొండ)। కలికి - చక్కటి స్త్రీ। వలను - నేర్పు। తనివోవు - తనివి పోవు (తనివి - సంతుష్టి)। ఒనరు - కలుగు। మొనయు - యుద్ధానికి పూనుకొను (మొనగాడు అంటే యుద్ధం చేయడానికి సిద్ధమైనవాడు)। అమ్ము - బాణం। మొన - కొస। ఎనయు - సరిపడు। నాఁగేలు - నాగలి। పొల్ల - పొల్లు (వ్యర్థం)। తురగము - గుఱ్ఱం। పరపు - తోలు। దొడ్డ - గొప్ప। తెరువు - దారి।

తాత్పర్యం:
ఇందఱికీ అభయాలను ఇచ్చే చేయి. అలా అభయాన్ని ఇవ్వడంలో బాగా నేర్పు కలిగిన గొప్ప బంగారుచేయి (బంగారుతల్లి అన్నప్పుడు బంగారు ఎలా విశేషణంగా వాడుతామో అలాగ).

వెలకట్టడానికి సాధ్యం కాని వేదాలని మత్స్యావతారమూర్తియై వెదికి తెచ్చి బ్రహ్మగారికి ఇచ్చినది ఈ హస్తమే. కూర్మమూర్తియై మంథరపర్వతం క్రింద చేరి తన చేతితో వహించే చేయి. చక్కటి భూకాంతను వరాహమూర్తియై సముద్రంనుండి ఉద్ధరించి కౌగిలించిన చేయి. హిరణ్యకశిపుణ్ణి చంపగల నేర్పు కలిగిన కొనగోళ్లు కలిగిన నరసింహావతారుని చేయి.

తను సాక్షాత్తూ లక్ష్మీదేవికే భర్త ఐనా అంతటితో తృప్తి పడక ఇంద్రుడి కోసమై బలి చేతినుండి దానం పుచ్చుకున్న వామనుని చేయి. పరశురాముడై సమస్త భూమండలాన్ని జయించి, అంత భూమినీ కలిగియున్నప్పుడు, యాగం చేసి ఆ ఋత్విక్కులకు సమస్తభూమినీ దానంగా ఇచ్చిన చేయి. రామావతారంలో సముద్రముపై యుద్ధానికి బయలుదేరి తన బాణాన్ని కొసకు తెచ్చిన చేయి. చక్కగా సరిపడేలా నాగలిని ధరించే బలరాముని చేయి.

గొల్లకాంతలందఱికీ వారి మానము తనే అనే అవగాహన కల్పించడానికై వారి మానములను అపహరించిన కృష్ణుని చేయి. గుఱ్ఱాన్ని తోలుతూ ధరావలయమునందు ధర్మస్థాపన చేసే కల్కిమూర్తి యొక్క గొప్ప చేయి. అలాగే, శ్రీవేంకటాచలానికి అధిపతియై తన పాదములే మోక్షపు మార్గము అని తెలిపే చేయి.

ఇందఱికి అభయాలని ఇచ్చే చేయి.

12 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

ధన్యవాదములు. ఇటువంటివి మరిన్ని అందిచగలరని ఆశిస్తున్నాను.

కామేశ్వరరావు చెప్పారు...

బావుందండి.

"పురసతుల మానములు పొల్లసేసిన చేయి" - ఈ వాక్యం ఇప్పటిదాకా బుద్ధావతారం (గౌతమ బుద్ధుడు కాదు) గురించే అనుకున్నాను. కృష్ణావతారానికి కూడా అన్వయించుకోవచ్చన్న మాట!

రవి చెప్పారు...

పూతరేకులా ఎంత పసందుగా ఉందండి. ఎంతయినా తెనుగు సౌందర్యం తెనుగుదే.

కౌటిల్య చెప్పారు...

రాఘవ గారూ,
నేను ఈ బ్లాగ్లోకానికి వచ్చిన కొత్తల్లో, అంటే ౩ నెలల క్రితం స్నేహితులు చెప్తే రాకేశ్వరరావు గారి బ్లాగు చూశాను...అక్కడ టపాల్లో పద్యవిన్యాసాలు, సాహితీ చర్చలు చూసి ఆశ్చ్రర్యపడ్డాను...చిన్నప్పుడు సరదాగా ఛందస్సు కట్టుకుని పద్యాలు రాసిన రోజులు గుర్తొచ్చాయ్...అవన్నీ వదిలేసినందుకు చాలా సిగ్గు,బాధ అనిపించాయి...ఇంత చిన్న వయస్సులో అంత పాండిత్యం అని, వారి బ్లాగులో వ్యాఖ్య పెట్టాను...దానికి రాకేశ్వరరావు గారు స్పందిస్తూ,"నాదేముంది?పైగా నేనంత చిన్నవాణ్ణి కాదు కూడా..ఇంకా గొప్పవాళ్ళు ఉన్నారు" అని, మీ బ్లాగు పరిచయం చేశారు...అప్పుడు మీ బ్లాగు చూసి, నాకు నోటమాట రాలేదు...మీ బ్లాగులో వ్యాఖ్య పెట్టే అర్హత కూడా లేదనిపించింది.....నాన్న ఎప్పుడూ అడుగుతుంటారు"చిన్నప్పుడు నేర్చుకున్నవాటిని అలా గాలికొదిలెయ్యొద్దు...అప్పుడప్పుడు మననం చేసుకుంటూ ఉండు" అని..."నేను నా profession తో చాలా బిజీ,అవన్నీ వీలుపడట్లేదు,అసలు ఈ రోజుల్లో ఎవరూ మాలా ఉండట్లేదు,మేం అప్పుడప్పుడూ కనీసం మీరు చదివే పురాణాలైనా వింటున్నాం" అని నాన్నకి సమాధానం చెప్పేవాణ్ణి...నాకూ నేను సమాధానం ఇచ్చుకునే వాణ్ణి....కాని రాకేశ్వరరావు గారిది,మీది బ్లాగులు చూశాక, మీరు వృత్తిపరంగా ఎంత బిజీగా ఉన్నా నేర్చుకున్న విద్యని వదిలెయ్యకుండా పదిమందితో పంచుకోడం చూసి, చాలా సిగ్గుగా అనిపించింది....అప్పట్నుంచీ మీ బ్లాగు చాలా తరచుగా చూస్తుంటా..ఇ-తెలుగు మిత్రుల ప్రోత్సాహంతో,మీ బ్లాగు ఇచ్చిన inspiration తో,
నేను నేర్చుకున్న రెండు ముక్కలూ గుర్తు తెచ్చుకుంటూ బ్లాగు మొదలెట్టా....ఏదో గురువుగారి దగ్గర నేర్చుకున్న కొద్దిపాటి జ్ఞానంతో, భాగవతం రాస్తున్నాను.....తలుచుకుంటుంటే అంతా కలలా ఉంది....

చాలా రోజుల తర్వాత మీ బ్లాగులో కొత్త టపా చూసి చాలా ఆనందం కలిగింది...నాకు ఈ కీర్తన చాలా ఇష్టం....మన వాగ్గేయకారులు తెలుగులో, సంస్కృతంలో రాసిన దశావతార వర్ణనలన్నిటికీ అభినయం నేర్చుకోవాలనేది నా తపన...నేర్చుకుని, బ్రహ్మోత్సవాల్లో మా చెన్నకేశవస్వామి పాదాలకి అర్పించాలని....ప్రస్తుత దశావతార అష్టపదికి నేర్చుకుంటున్నా..తర్వాత ఈ కీర్తనే అనుకుంటున్నా..."పురసతుల" అన్న దగ్గర ఏ అవతారం(బుద్ధ్హావతారమా,కృష్ణావతారమా) చెయ్యాలా అని తికమకపడి పోతుంటా..ఇప్పుడు మీ టపా చదివాక, ఓ మంచి ఆలోచన వచ్చింది..ఒక సంగతిలో ఒకటి, ఇంకో సంగతప్పుడు మరోటి చేద్దామనుకుంటున్నా....
ఇంకో చిన్న విషయం...తప్పుగా అనుకోవద్దు....పైన మీరు రాసిన భావంలో బుద్ధ్హావతారాన్ని కూడా కలిపి చెప్పండి....బాగుంటుంది...

రాఘవ చెప్పారు...

కామేశ్వరరావుగారూ కౌటిల్యగారూ

నాకు ఈ గౌతమబుద్ధేతర బుద్ధునిగుఱించి తెలియిదు. వివరములు తెలుపగలరు. నెనర్లు.

రాఘవ

కౌటిల్య చెప్పారు...

రాఘవ గారూ,
గౌతమబుద్ధ్హుడు కలియుగం...చాలా మంది ఆయన్ని దశావతారాల్లో ఒకటిగా చెప్పరు...కాని భాగవతంలో మాత్రం ఏకవింశతి అవతార వర్ణనప్పుడు,కలియుగాద్యవసరంబున రాక్షసులని మోహింపజేయుటకు జినసుతుండై, కీకటదేశంలో(మధ్యగయ అంటారు) అవతరిస్తాడని ఉంటుంది...అది ఈ గౌతమబుద్ధ్హుడో, కాదో మరి తెలియదు...కాని జయదేవుడు తన అష్టపదిలో మాత్రం ఈ గౌతమబుద్ధ్హుణ్ణే వర్ణిస్తాడు..

కాని అన్నమయ్యగారు చెప్పిన "పురసతుల మానములు పొల్లసేసిన" బుద్ధ్హుడు మాత్రం కృతయుగం.....త్రిపురాసురులని ముగ్గురు రాక్షసులు,వాళ్ళు బ్ర్హహ్మవరంతో ఆకాశమధ్యాన తేలియాడే మూడు నగరాల్ని నిర్మించుకుని,సర్వలోకాల్నీ జయించి, అభేద్యంగా ఉంటారు....
అప్పుడు లోకరక్షణకోసం మహేశ్వరుడు అర్థనారీశ్వరుడై మేరువుని ధనుస్సుగా చేసుకుని, త్రిపురాసురుల మీదకి దండెత్తుతాడు....ఎంత ప్రయత్నించినా వాళ్ళని గెలవలేకపోతాడు...కారణం ఆలోచిస్తే ఓ విషయం తెలుస్తుంది....ఆ త్రిపురాసురుల భార్యలు మువ్వురూ మహాపతివ్రతలు..వాళ్ళ పాతివ్రత్య మహిమ వీళ్ళని రక్షిస్తూ ఉంటుంది....అప్పుడు దేవతలందరూ ఆ శ్రీ మహావిష్ణువుని ప్రార్థిస్తారు...అప్పుడు ఆయన సర్వస్త్రీసమ్మోహనకరమైన బుద్ధ్హరూపం ధరించి, ఆ త్రిపురాసురుల భార్యల దగ్గరికి భిక్షకి వెళ్తాడు....ఆ సమ్మోహన రూపం చూసి ఒక్కక్షణం వాళ్ళ మనసులు చలిస్తాయి....ఈ అసురుల రక్షణకవచం తొలిగిపోతుంది....వెంటనే ఆ అర్థనారీశ్వరుడు అసురుల్ని అంతమొందిస్తాడు....అదండీ కథ...మా కూచిపూడి సంప్రదాయ దశావతార కీర్తనలో కూడా ఈ బుద్ధ్హుణ్ణి గురించే అభినయం ఉంటుంది...

రాఘవ చెప్పారు...

బాగుందండీ. వివరణకు కృతజ్ఞుడను. మీ కూచిపూడి వీడియోలు ఏమైనా జాలంలో లభిస్తూంటే లంకె తెలుపగలరు. నెనర్లు.

కౌటిల్య చెప్పారు...

రాఘవ గారూ,
నేనంత గొప్ప నాట్యవేత్తనేమీ కాదండీ...అసలు stage performances ఇప్పటిదాకా నేనిచ్చింది రెండో,మూడో...అందులో SOLO ఒకటే....ముఖ్యంగా నేను నేర్చుకుంటోంది నా కోసం...అంటే నా ఆధ్యాత్మిక జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి....దేవాలయాల్లో మాత్రమే చెయ్యాలని నియమం పెట్టుకున్నాను....అమ్మ లయస్వ్రరూపిణి,లాస్యప్రియ...ఆ తల్లికి నాట్యార్చన చేసి నా దోషాల్ని మాపుకుందామనే నా ప్రయత్నం...అది నా ఉపాసనలో ఓ భాగం...

ఏమీ అనుకోకండి..కొంచెం emotional అయ్యా.....ఇంకో విషయం రాఘవ గారూ....మీరు నా బ్లాగు చూసి, ఏవైనా తప్పులుంటే తెలుపగలరు...ఏవైనా సలహాలు, సూచనలు కూడా..వాటిని బట్టి నా భాగవత గమనాన్ని సరిగ్గా నడుపుకోగలను...

ధన్యవాదాలు...

కౌటిల్య చెప్పారు...

రాఘవ గారికి,
"ధన్యవాదాలు....మీరు పైన రాసిన శ్లోకం అంతగా అర్థం కాలేదు...అది ఎందులోది?..సంస్కృతం నాకు అంతబాగా రాదండీ...స్థూలంగా అర్థం చేసుకోగలను కానీ, సూక్ష్మమైన భావాల్ని పట్టుకోలేను...దయచేసి అర్థం తెలుపగలరు..." ఈ వ్యాఖ్య మీరు నా బ్లాగులో పెట్టిన వ్యాఖ్యకి ప్రతిస్పందనగా పెట్టింది....మీరు గమనించినట్టు లేరు...దయచేసి అర్థాన్ని, అక్కడే నా బ్లాగులో తెలుపగలరు...ఎందుకంటే, అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది...ధన్యవాదాలు

కౌటిల్య చెప్పారు...

ధన్యవాదాలు రాఘవ గారూ.....నాకు సంస్కృత భాగవతంతో పెద్దగా పరిచయం లేదు...ఎప్పుడో ఒకసారి, రాజవంశ చరిత్ర కావాల్సొచ్చి ద్వాదశస్కంధం తీసి చదివా....మీరు రాసింది అదేనేమో అనుకున్నా, కాని ఒకవేళ మీరే స్వంతగా రాసారేమో అనిపించింది...అందుకే అడిగా...మీరు చెప్పింతర్వాత అన్వయించుకుని చదువుతుంటే బాగా అర్థమౌతోంది....

కౌటిల్య చెప్పారు...

రాఘవగారికి,
నమస్కారం...మీతో మాటాడాలనుంది...మీకు ఇబ్బంది లేకపోతే మీ contact numbr ఇవ్వగలరు..మీకు వీలైన సమయం చెప్తే అప్పుడే call చేస్తాను..

రాఘవ చెప్పారు...

కౌటిల్యగారూ,

దయచేసి msrkiran [@] జీమెయిల్ డాట్ కామ్ కు వేగు పంపగలరు.