శనివారం, అక్టోబర్ 21, 2006

ఎందరో మహానుభావులు

పల్లవి
ఎందరో మహానుభావులు అందరికీ వందనములు

అనుపల్లవి
చందురు వర్ణుని యంద చందమును హృదయార-
విందమునఁ జూచి బ్రహ్మానందమను భవించు వా రెందరో

చరణములు
సామ గాన లోల మనసిజ లావణ్య ధన్య మూర్ధన్యు లెందరో
మానస వన చర వర సంచారము సలిపి మూర్తి బాగుగఁ బొడగనే వారెందరో
సరగున పాదములకు స్వాంతమను సరోజమును సమర్పణము జేయు వా రెందరో
పతిత పావనుఁడనే పరాత్పరుని గురించి పరమార్థమగు నిజ మార్గముతోను బాడుచును సల్లాపముతో స్వర లయాది రాగములఁ దెలియు వా రెందరో
హరి గుణ మణిమయ సరములు గళమున శోభిల్లు భక్త కోటులిలలో తెలివితోఁ జెలిమితోఁ గరుణ గల్గి జగమెల్లను సుధా దృష్టిచే బ్రోచు వా రెందరో
హొయలు మీర నడలు గల్గు సరసుని సదా కనులఁ జూచుచును పులక శరీరులై యానంద పయోధి నిమగ్నులై ముదంబునను యశము గలవా రెందరో
పరమ భాగవత మౌని వర శశి విభాకర సనక సనందన దిగీశ సుర కింపురుష కనకకశిపుసుత నారద తుంబురు
పవనసూను బాలచంద్రధర శుక సరోజభవ భూసురవరులు పరమపావనులు ఘనులు శాశ్వతులు కమల భవ సుఖము సదానుభవులూ గాక ఎందరో
నీ మేని నామ వైభవంబులను నీ పరాక్రమ ధైర్యముల శాంత మానసము నీవులను వచన సత్యమును రఘువర నీయెడ సద్భక్తియు జనించకను దుర్మతములను కల్ల జేసినట్టి నీమది నెఱింగి సంతసంబునను గుణ భజనానంద కీర్తనము జేయు వా రెందరో
భాగవత రామాయణ గీతాది శృతి శాస్త్ర పురాణపు మర్మములన్ శివాది షణ్మతముల గూఢములన్ ముప్పది ముక్కోటి సురాంతరంగముల భావంబుల నెఱిఁగి భావ రాగ లయాది సౌఖ్యముచే చిరాయువుల్ గలిగి నిరవధి సుఖాత్ములై త్యాగరాప్తులైన వా రెందరో

ప్రేమ ముప్పిరి గొను వేళ నామము దలచేవారు రామభక్తుఁడైన త్యాగరాజనుతుని నిజ దాసులైన వా రెందరో

1 కామెంట్‌:

Unknown చెప్పారు...

త్యాగరాజ స్వామి గడుసుతనం!
ఎందరో మహానుభావులు అందరికీ వందనములు….తెలుగు వారందరికీ సుపరిచితమైన కృతి ఇది. త్యాగరాజ స్వామి వారి పంచరత్న కృతులులో ఐదవది. మంగళకరమైన శ్రీ రాగంలో ఉండడం వల్ల కాబోలు దీనిని ఆఖరున పాడతారు.

ఈ కృతి గురించి ప్రచారంలో ఉన్న విషయం ఆసక్తికరమైనది. త్యాగరాజ స్వామి గురువు గారైన శొంఠి వెంకటరమణయ్య పంతులు గారి సమక్షంలో సంగీత విద్వత్సభ జరిగినప్పుడు, గురువు గారి ప్రతినిధిగా త్యాగరాజుల వారు తమ విద్వత్తు ప్రదర్శించవలసిన సందర్భంలో ఈ కృతి ని రచించి పాడారనీ, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళందరి పైన విజయం సాధించారని చెప్పుకుంటారు.

ఐతే నేనిక్కడ రాయబోయే విషయం ఈ కృతిలోని ఒక పాదానికి సంబంధించినది. ఎందరో మహానుభావులు అందరికీ వందనములు…అంటూ మొదలుపెట్టిన త్యాగరాజ స్వామి అనుపల్లవిలో:

“చందురు వర్ణుని అందచందమును హృదయారవిందమున జూచి బ్రహ్మానందమనుభవించువారు…

ఎందరో మహానుభావులు”

అంటారు. ఇక్కడే వచ్చింది తిరకాసంతా. మనందరికీ తెలిసిన విషయం రాముడు నీలమేఘ శ్యాముడు అని, అంటే నీలి మబ్బుల రంగులో ఉండేవాడు కదా. మరి చంద్రుని రంగులో ఉండడం ఏంటి? ఈ విషయమే సాహిత్యం గూగుల్ గుంపులో ఎవరో ఈ మధ్య అడిగారు.

దీని గురించి నేను శ్రీ నూకల చిన సత్యనారాయణ గారి పుస్తకంలో చదవి ఉండడం వల్ల అక్కడ సమాధానం ఇచ్చాను. వర్ణము అంటే రంగు,కులము అనే అర్ధాలతో పాటు గుణము అనే అర్ధం ఉంది (వర్ణో ద్విజాది శుక్లాది యజ్ఞే గుణ కధాసు చ – వర్ణమనగా బ్రాహ్మణాది కులాలు, తెలుపు మొదలైన రంగులు, యజ్ఞము, గుణము-ఇన్ని అర్ధాలున్నాయి). రాముడు చంద్రుని మల్లే చల్లని చూపులతో ప్రకాశవంతంగా ఉంటాడు కనక అలా పోల్చవచ్చు. అందుకే వాల్మీకి మహాముని రాముని “సోమవత్ ప్రియదర్శనః” అని కీర్తించారు.

తరువాత అలోచిస్తే త్యాగరాజ స్వామి చేసినది చాలా చిలిపి పనిగా అనిపించింది. మనకి అందరికీ వర్ణము కి తెలిసిన అర్ధాలు రంగు ఇంకా కులము. రాముడు చంద్రునిలా తెల్లగా ఉండడు. పైగా రామునిది సూర్యవంశం. మరి పని గట్టుకుని చంద్రుని లాగుకు రావడం, వర్ణము అనడం, పైగా అందచందాల గురించి ప్రస్తావించడం అంతా పనిగట్టుకుని చేసినట్టుగా అనిపిస్తుంది. చంద్రుని వర్ణంలో ఉండేవాని అందచందాలు చూడడం అనగానే ఎవరికైనా రంగు అనే అర్ధమే కదా గుర్తొస్తుంది. ఇలా మనని తప్పుదోవ పట్టించవలసిన అవసరం ఆయనకేమిటి? కేవలం ప్రాస కోసం ఇంత పని చేసుంటారా?

నాకు తోచిన సమాధానం ఏంటంటే ఇక్కడ త్యాగరాజ స్వామి తప్పుదోవ పట్టించినది కావాలనే. ఆ రోజుల్లో విద్వత్సభల్లో నెగ్గుకు రావడానికి ఇలాంటి కిటుకులు చాలా అవసరంగా ఉండేవని నేను విన్నాను. ఎందుకంటే ప్రతీ చోటా దుష్ట శంకలు చేసే మిడిమిడి జ్ఞానపు పండితులు చాలా మందే ఉండేవారు. తప్పులు పట్టడం వీరి పని.అజ్ఞానం వీరి లక్షణం. ఈ కృతి సభలో పాడగానే వీరికి ఇది వెంటనే దొరుకుతుంది. వెంటనే రాముని వర్ణం కూడా మీకు తెలీదంటూ మొదలు పెడతారు. ఇంత పండితుడికి,భక్తుడికి ఈ మాత్రం తెలియదా, ఏదో అర్ధం ఉండే ఉంటుందని కూడా ఆలోచించరు. దెబ్బకి ఈయన చేతిలో చిక్కుతారు. అర్ధం చెప్పగానే నోరుముయ్యవలసిందే కదా. ఇంక మరి మాట్లాడరు. ఇలాంటి వారి కోసమే త్యాగరాజ స్వామి ఈ ఎర విసిరారేమో అనిపిస్తుంది నాకు.

మహాకవి శ్రీనాధుడు కూడా గౌడ డిండిమ భట్టుని ఓడించే సందర్భంలో “రాజనందన రాజ రాజాత్మజులు సాటి….” అంటూ రాజ శబ్దానికి ఉన్న వివిధ అర్ధాల ఆధారంగా ఒక పద్యం చెప్పి ప్రతిపక్షులని బోల్తా కొట్టించడం మనకి తెలిసిన విషయమే. బాపూ గారి సినిమాలో కూడా చూపించారు.

కానీ త్యాగరాజుల వారు శ్రీనాధుని కన్నా చాలా మెత్తన. నిజానికి మనం కొద్దిగా నిదానించి చూస్తే త్యాగరాజ స్వామి ఎరలో చిక్కుకోకుండా బయటకి రావచ్చు. మరొక్కసారి చూడండి, అంద చందమును కళ్ళతో చూసి అనలేదు హృదయంలో చూసి అని కదా వాడారు. మరి మనం హృదయంతో చూసేవి గుణగణాలేకానీ రంగులు కాదు కదా. పైగా ఆ చూసినవారు “బ్రహ్మా”నందం పొందుతారని కూడా అన్నారు. అంటే ఏమిటన్నమాట, ఆత్మ సాక్షాత్కారమే కదా. మరి అటువంటి జ్ఞానులకి బాహ్య సౌందర్యంతో పనేముంది. ఇప్పుడు మరొక్కసారి ఆ అనుపల్లవి చూస్తె “పరబ్రహ్మ స్వరూపమైన శ్రీరాముని గుణగణాలను హృదయమనే పద్మంలో చూసి చిదానంద స్థితిని పొందే మహానుభావులకి వందనం” అన్న అర్ధం గోచరిస్తుంది. తరచి చూస్తే ఈ పాదంలో వేదాంత పరమైన ఇంత అర్ధం ఉంది.

త్యాగరాజ స్వామి కృతిలోని ఒక్క అనుపల్లవి గురించి నాబోటి వాడు ఇంత రాయగలిగితే, సమర్ధులైన వారు ఒక్కొక్క కృతి మీదా పీహెచ్‌డీ చెయ్యవచ్చనిపిస్తుంది నాకు.