మంగళవారం, జనవరి 25, 2011

భగవంతుఁడా

ఖగపతిపతివో యజుఁడవొ నగజాజానివొ యెవఁడవొ నాకుత్తరమీ
యఁగ రా నీవెవఁడైనన్ భగవాన్ నేనసలు నేర్వవలెనా వద్దా ౧

ఏమనుకొందువీవసలుకేమిటి నీ పనులిట్టులుండు నా
కేమియు దక్కనీయక ననెందులకింతగ బాధవెట్టెదో
నా మనమందు ఖేదమును నవ్వులయాటగఁ జూడనేర్చినా
వో మఱి మాటలాడవు హు పోయినదేమిటి నీకు దేవుఁడా ౨

ఖేదంబెందుకు మోదమెందుకన నీకేమయ్య దైవంబ నీ
వాదిన్ పుట్టినవాడవౌట నిటులే హాస్యంబుగానుండు నా
వాదంబంతయు బాధయంతయు వృథావాక్కేళి గాదయ్య రా
నా దారిన్ నడు నీకె బాగ తెలియున్ నాల్పంబులీ నా వెతల్ ౩

శ్రుతులను నేర్వఁగోరితి గురున్ తొలివేదము నేర్పువానిఁ జూ
పితివ షడంగముల్ చదువఁ బ్రీతినిఁ బాణినిఁ గొంతయైన నే
ర్చితినను తృప్తినిచ్చితివ చేతికినందుచు జాఱిపోవుచున్
మతి చెదరంగఁజేతువు సుమా నువు టక్కరివయ్య దైవమా ౪

పాటలందుఁ నాట్యభంగిమఁ గృతులలోఁ
దెలియఁదగినదానిఁ దెలుపువారిఁ
గనుగొని నువు వేగఁ గొనిపోయెదవదేమి
మాకు నిన్నుఁ జూపు మార్గమేది ౫

దేవ నీ లీలఁ దెలియఁగఁ దెలివి లేదు
తెలివియున్నచో నేనును దేవుఁడౌదుఁ
గనుకఁ దొఱకినవన్నియుఁ గైగొని యిక
వినెదఁ జదివెద గురువుల విద్యలెల్ల ౬

నటుపై భారము నీదె దైవతమ నా యత్నంబులో లోపముల్
తృటిలోఁ ద్రుంచి ఫలంబునిచ్చి యటుపై దివ్యంబులౌ విద్యలన్
పటువిద్యార్థుల కెందఱెందఱికొ నేర్పన్ శక్తియున్ నీవయై
ఘటజాతాన్వయజాతుఁ నన్ను భువిలోఁ గాపాడుమా దైవమా ౭

10 కామెంట్‌లు:

Sanath Sripathi చెప్పారు...

చాలా రోజులుగా ఎదురు చూస్తున్నాము మీ టపాలకై. మీ నివేదన చాలా బాగున్నది.
ఘటజాతాన్వయజాతుఁ = ?

Unknown చెప్పారు...

బాగున్నాయండి మీ పద్యాలు.మంచి ధార.ధన్యవాదములు.

లక్ష్మీదేవి / लक्ष्मीदेवी చెప్పారు...

చాలా రోజులకు కనిపించారు.
విద్యలెల్ల ! ఏమేం విద్యలో చెప్పరా?

రాఘవ చెప్పారు...

సనత్‌గారూ, మాది వాశిష్ఠ-మైత్రావరుణ-కౌండిన్య త్రయార్షేయం.

మందాకినిగారూ, "దొఱకినవన్నియు" :) ముఖ్యంగా వేదాలూ వేదాంగాలూ ఉపవేదాలూ అనండీ. నాకు ప్రవేశమాత్రం ఉంది తప్పితే ఏదీ సరిగా నేర్చుకోలేదు. సంగీతం ఒక్కటేనండీ నేను కాస్త నేర్చుకున్నది. ఋగ్వేదీయులమైనా ఇప్పటివఱకూ కనీసం ఒక్క ఋక్కు కూడ చదువుకోలేదు.

అన్నిటికంటె ముఖ్యంగా చెప్పేవారిని ఒక్కొక్కఱినీ ఈ భగవంతుడు తీసికొనివెళ్లిపోతూంటే బాధగా ఉంటుంది. అందుకే వీలైనంత త్వరగా వీలైనన్ని నేర్చుకోవాలీ అని.

లక్ష్మీదేవి / लक्ष्मीदेवी చెప్పారు...

ఔనండీ!
ఆముక్తమాల్యద లోని పద్యాలు మీరు రాగయుక్తంగా పాడినది వింటే మీరు సంగీతజ్ఞులని తెలుస్తుంది.
ఇంత ఆర్తిగా నిజమైన విద్యార్థినవ్వాలని మీరు కోరుతుంటే ఆ శారదాంబ మిమ్మల్ని తప్పక అనుగ్రహిస్తుందని ఆశిస్తున్నాను.

rākeśvara చెప్పారు...

నగజాజానివో ... పార్వతీ పుత్రిక అనా యేమి, నాకు అర్థంకాలేదు.

రవి చెప్పారు...

శార్దూలంలో సరళమైన పద్యం బహుచక్కగా వ్రాశారు, సమాసభరితం కాకుండా. ఈ సారి శార్దూల పద్యం వ్రాయవలసి వస్తే మీ పద్యం చూసి నేర్చుకుంటాను.

రాఘవ చెప్పారు...

@రాకేశ్వర:

న గచ్ఛతీతి నగః, తస్య పుత్రీతి నగజా, ఇయం జానిః యస్య స ఇతి నగజాజానిః. నగజాజాని అంటే శివుఁడు. ఇక్కడ బహువ్రీహి మాత్రమే సాధ్యం, ఆఁడుదానికి భార్య ఉండదు గనుక. జానకీజాని అని శ్రీరాముని పిలవటం ప్రసిద్ధమే.

కామేశ్వరరావు చెప్పారు...

భగవంతునితో మీ గదమాయింపు చూస్తే విశ్వనాథ విశ్వేశ్వరశతకమూ, మధ్యాక్కరలు గుర్తుకువచ్చాయి!

చివరి పద్యం చివరి పాదం ఒకసారి సరిచూడండి.

"నీవాదిన్ పుట్టినవాడవౌట" - అయితే అతను ఆదిని పుట్టే ఉంటాడా? :-)

రాఘవ చెప్పారు...

కామేశ్వరరావుగారూ, నిజమే. చివఱిపద్యం చివఱిపాదంలో భువిలోన్ అని వ్రాయటానికి బదులు భువిన్ అని వ్రాసాను. పొఱబాటు చూపినందుకు నెనర్లండీ.

ఆదిన్ పుట్టినవాఁడవౌటన్... సౌందర్యలహరి ప్రకారం సరిపోతుందేమోలెండి. :)