గురువారం, మే 31, 2007

సమస్య 5

సమస్యాపూరణానికి లభించిన ఆదరణవలన ఉత్సాహంపొంది నేనిచ్చే మరొక సమస్య యిది. ఈ సమస్య ఇంతకు మునుపే సంస్కృతంలో వుంది. నేను తెనిగించానంతే.

ఉ.భామిని కౌగిలించె తన భర్తకు తండ్రిని కౌతుకమ్ముతో.
[భామిని = స్త్రీ; కౌతుకము = ఆశ, కోరిక]

6 కామెంట్‌లు:

Sriram చెప్పారు...

'కౌగిలించె' అని మళ్ళీ 'భర్తకు' అని షష్టీ విభక్తి వాడారేమిటి? లేక కౌగిలిచ్చె అనా? కాక ఇదంతా సమస్యలో భాగమేనా? ఏదో పొట్టిగా ఉన్న గోడలంటే దూకచ్చు గానీ ఇలా కోటగోడలు దూకడం మాకు కష్టం :)

రాఘవ చెప్పారు...

లేదండోయ్, మామగారిని నిజంగానే కౌగిలించిందట ఆ సతీమణి.

Naga Pochiraju చెప్పారు...

@శ్రీరాం గారు..."కు" లేక పొతే అన్ని గణాలు రావండి.
ఎంతకాలం చిన్న గోడలు దూకుతారు.కాస్త ఇలాంటివి కూడా దాటి,శిఖరాలను అందుకోండి.

అజ్ఞాత చెప్పారు...

కాముడు సందడింపమది, కౌగిలి గోముగ జేరినట్టి యా
భీముని బాహుబంధనపు బిఱ్ఱున కాయము చిత్తడిల్లగన్
మామను, పైటవీవెనల, మంద్రముగా,దను జేరపిల్చి,ఆ
భామిని కౌగిలించెతన "భర్తకు తండ్రిని" కౌతుకమ్ముతో

రాఘవగారు,
(౧)చిత్తడిల్లగన్ పదప్రయోగము ఉందోలేదో చూడవలసియున్నది కాని పక్షమున చెమ్మరించగన్ అని వేయవచ్చు.
(౨) మాతృక లో పైట ప్రస్తావన ఉన్నట్టు గుర్తు. అందుకే నేనూ పైట వీవెనల అన్నాను.( పైట వీవెనల బదులు ఇక్కడ వాయుదేవుడను అంటే ఇంకా నిక్కచ్చి గా ఉంటుంది గానీయండి, explicit చెప్పటమెందుకని అనలేదు.)

సూచనలు తెలియపరచండి.


దయచేసి ఆ సంస్కృత సమస్యా మరియు పూరణా, ఇక్కడ ప్రకటించరూ!

రాఘవ చెప్పారు...

బావుందండి యీ పూరణకూడా, కానీ మీరన్న మాతృక యేమిటో నాకర్థ మవ్వలేదు. త్వరలో ఆంధ్రీకరించి తప్పక "అసలు పూరణము"ను తెలియజేయగలను.
పూరణకోసం పంచభర్తృక ద్రౌపదిని యెంచుకోవటం గమ్మత్తుగా వుంది. భీముణ్ణీ వాయుదేవుణ్ణీ యెంచుకున్నారు -- బాగుంది.
ద్రౌపది మృత్యుకౌగిలిని కూడా కోరుకోవచ్చు కదా(ధర్మరాజు యమధర్మరాజు కొడుకు కాబట్టి)!!! ఈ ఆలోచన వస్తేనే వింతగా వుంది.

అజ్ఞాత చెప్పారు...

రాఘవ గారు,
ధన్యోస్మి.
ఇదే అర్ధంలో చాల పాత సంస్కృత సమస్య ఉన్నట్టు గుర్తు. దాని పూరణ కూడా, ద్రౌపది వాయిదేవుడికి అన్వయించే ఉంటుంది. మీరు ఆ సమస్యనే ఆంధ్రీకరించారు అనుకున్నాను.