బుధవారం, జులై 25, 2007

నా మొదటి మత్తకోకిలకిలలు

మ.కో.'మత్తకోకిల'లోన వ్రాయగ మానసంబున యెక్కడో
విత్తుయుండెను వృక్షమై యది వేళ్లనూనెను పెద్దదై
ఇత్తరిన్ చిగురింపజేసితి యీ "కవీరుహమున్" యిలా (భలే!)
క్రొత్త భావమె నీరు దీనికి కొమ్మలన్నియు పూయగా.

మ.కో.ఏమి వ్రాయను? మంచి భావన దేనికైనను ముఖ్యమే;
నా మనస్సున తోచినట్టివి నాకు తోచిన రీతిలో
రామచంద్రునిపైన నాలుగు వ్రాయబూనితి నింతలో
యేమిటో మనసెందుకో యటువైపు దృష్టి మరల్చదే!

మ.కో.అక్కటా! ఎటు మర్చిపోదును ఆంధ్రభాష పరిస్థితిన్
చక్కనైనది తేనెవంటిది శబ్దప్రౌఢత యున్నదీ
పెక్కుకావ్యప్రసూనమాలలు పెద్దనాదుల గన్నదీ
దిక్కుతోచక బిక్కచచ్చెడి దైన్యమెట్టుల పొందెనో?!

మ.కో.నీవు నా ప్రియమాతృభాషవు నేను సేసెద భక్తితో
సేవ నీకు, తరించటానికి శీఘ్రమార్గమిదేగదా,
మావిపల్లవఖాదనంబున 'మత్తకోకిల' పల్కునే
ఆ విధంబునె పల్కగా తగు శక్తినీయుము ఆంధ్రమా!

ముదితల్ నేర్వగరాని విద్య గలదే ముద్దార నేర్పించినన్

చిలకమర్తివారి "ప్రసన్నయాదవం"నుండి --

చం.చదవన్నేర్తురు పూరుషుల్ బలెనె శాస్త్రంబుల్ పఠింపించుచో
నదమన్నేర్తురు శత్రుసేనల ధనుర్వ్యాపారముల్ నేర్పుచో
నుదితోత్సాహము తోడ నేలగలరీ యుర్విన్ బ్రతిష్ఠించుచో
ముదితల్ నేర్వగరాని విద్య గలదే ముద్దార నేర్పించినన్.
(నాకీ పద్యమిచ్చినది మా 'వాగ్దేవి' లలితక్క)

సోమవారం, జులై 16, 2007

దేశభాషలందు తెలుగు లెస్స

పద్యం:
ఆ.వె.తెలుగదేలయన్న దేశంబు తెలుగేను
తెలుగు వల్లభుండ తెలుగొకండ
యెల్ల నృపులు గొలువ యెఱుగవే బాసాడి
దేశభాషలందు తెలుగు లెస్స. (శ్రీకృష్ణదేవరాయలు)

పదచ్ఛేదం:
తెలుగు అది ఏల అన్న దేశంబు తెలుగు; ఏను తెలుగు వల్లభుండ; తెలుగు ఒకండ;
ఎల్ల నృపులు కొలువ; ఎరుగవే బాసాడి; దేశ భాషలందు తెలుగు లెస్స

అర్థాలు:
ఏను = నేను
తెలుగు = తెలుగుభాష, తెలుగు మాట్లాడు వ్యక్తి, ఆంధ్రదేశము
బాసాడు = భాషించు అనగా మాట్లాడు(బాసాడు బాసయాడు భాషణముచేయు)

తాత్పర్యం:
తెలుగే ఎందుకంటే దేశం ఆంధ్రదేశం, నేను తెలుగువాడినైన రాజును, ఒక తెలుగువాడిని. అలాకాదుగానీ, రాజపూజ్యమైన తెలుగుభాషని మాట్లాడి, తెలుగు లెస్స అని తెలుసుకొనుము!

సోమవారం, జులై 09, 2007

నంది తిమ్మయ ముక్కు తిమ్మయ యెందుకయ్యాడంటే...

శా.నానా సూన వితాన వాసనల నానందించు సారంగమే
లా నన్నొల్లదటంచు గంధఫలి బల్కాలం తపంబంది యో
షా నాసాకృతి బూని సర్వ సుమనస్సౌరభ్య సంవాసియై
పూనెం బ్రేక్షణ మాలికా మధుకరీ పుంజంబులిర్వంకలన్.

[వితానము = సమూహము, ఒల్లు = ఎంచుకొను, గంధఫలి = సంపెంగ, యోష = ఆడుది, సుమనస్సు = పూవు, సౌరభ్యము = సౌరభము = పరిమళము, సర్వసుమనస్సౌరభ్యసంవాసియై = వివిధ పుష్ప సుగంధములకు నిలయమై (సుగంధములన్నిటికీ గమ్యమైన నాసికగా మారి), పుంజము = గుంపు, ప్రేక్షణమాలికా మధుకరీపుంజము = కన్నులనే తుమ్మెదలు, ఇర్వంకలన్ = రెండుప్రక్కల]

ఆడువారి ముక్కును సంపెంగతో పోల్చటం రివాజు. కానీ సంపెంగ తనవద్దకు తుమ్మెదలు వచ్చుటలేదని తపస్సుజేసి 'ముక్కు'గా మారి కన్నులనే రెండు తుమ్మెదలను శాశ్వతంగా తనప్రక్కన యిముడ్చుకుందని చెప్పటం అసాధారణాద్వితీయాద్భుతమైన ప్రయోగం. అంతచక్కగా ముక్కునుగూర్చి చెప్పిన తిమ్మనను ముక్కుతిమ్మన అనటం అతిశయోక్తిగాదేమో.

నంది తిమ్మనామాత్యునికి వికటకవి శంస

కం.మా కొలది జానపదులకు
నీ కవనపు ఠీవి యబ్బునే ! కూపనట
ద్భేకములకు గగనధునీ
శీకరముల చెమ్మ నంది సింగయ తిమ్మా !

[జానపదులు = గ్రామవాసులు, నటత్ = గెంతే, భేకము = కప్ప, ధుని = నది, శీకరము = నీటిబిందువు, చెమ్మ = తడి]

శుక్రవారం, జులై 06, 2007

నల్లిబాధ!

కం.శివుడద్రిని శయనించుట
రవిచంద్రులు మింటనుంట రాజీవాక్షుం
డవిరళముగ శేషునిపై (పాము పైన)
పవళించుట నల్లి బాధ పడలేక సుమీ!
-- చిలకమర్తి లక్ష్మీనరసింహం

సమస్య 7

ఇది సులభమైన సమస్య:
చం.రతిపతి సృష్టికర్తయని ప్రార్థన చేసిరి భక్తితో బుధుల్.