శుక్రవారం, ఏప్రిల్ 28, 2006

నేఁ వ్రాసిన పద్యములు ౨

కం.ముక్తికి మార్గము నీవని
రక్తిని పెంపొందగోరి అడిగెద నీపై
భక్తిని నీవే ఒసగుము
భక్తుల హృత్తాపహారి భద్రగిరిపతీ.

భగవంతుడు

నన్ను స్మరించు నిన్ను విస్మరించను
నన్ను విశ్వసించు నిన్ను ఉద్ధరిస్తాను
నాపై భారముంచు రక్షకుడిగా ఉంటాను
శరణాగతి చెందు నేనే చూసుకుంటాను
నేనెక్కడో లేను నీ హృదయంలోనే ఉన్నాను

మంగళవారం, ఏప్రిల్ 25, 2006

చాటువులు ౧

ఉ.మామను సంహరించి యొక మామకు గర్వమడంచి యన్నిశా
మామను రాజుజేసి యొక మామ తనూజున కాత్మబంధువై
మామకు గన్నులిచ్చి సుతు మన్మథు పత్నికి దానె మామయై
మామకు మామయైన పరమాత్ముడు మాకు బ్రసన్నుడయ్యెడిన్.

కం. సిరిగలవానికి చెల్లును
తరుణులు పదియారువేల దగ పెండ్లాడన్
తిరిపమున కిద్దరాండ్రా
పరమేశ్వర గంగ విడుము పార్వతి చాలున్.

ఆదివారం, ఏప్రిల్ 23, 2006

ప్రారంభింపగ ఇష్టదేవతా స్తుతి

ఉ.శ్రీరఘురామ చారు తులసీదళదామ శమక్షమాది శృం
గార గుణాభిరామ త్రిజగన్నుతశౌర్య రమాలలామ దు
ర్వార కబంధ రాక్షస విరామ జగజ్జన కల్మషార్ణవో
త్తారకనామ భద్రగిరి దాశరథీ కరుణా పయోనిధీ.
దాశరథీ శతకము, కంచర్ల గోపన్న విరచితము.