బుధవారం, ఫిబ్రవరి 25, 2009

పార్వతీపరమేశ్వరుల విహారపు పద్యం

తెనాలి రామలింగ కవి ఉద్భటారాధ్యచరిత్రమనే కావ్యంలో చెప్పిన పద్యం—

తరుణ శశాంక శేఖర మరాళమునకు సార గంభీర కాసారమగుచు
కైలాసగిరి నాథ కలకంఠ భర్తకు కొమరారు లేమావి కొమ్మయగుచు
సురలోక వాహినీ ధర షట్పదమునకు ప్రాతరుద్బుద్ధ కంజాతమగుచు
రాజ రాజ ప్రియ రాజకీరమునకు మానిత పంజరస్థానమగుచు

ఉరగ వల్లభ హార మయూరమునకు
చెన్ను వీడిన భూధర శిఖరమగుచు
లలిత సౌభాగ్య లక్షణ లక్షితాంగి
అద్రినందన బొల్చె విహారవేళ


ఈ పద్యం చదవటం మొదలుపెట్టగానే నాకు మొట్టమొదట అనిపించినది ఈ పద్యానికి సీసాన్ని ఎంచుకోవడం అంత అతకలేదేమో అని. సంగీతంలో ప్రవేశం ఉండడమో మరొకటో కారణమేమిటో తెలియదు కానీ నడకకి ఏదో అడ్డం తగిలినట్టుగా ఠపీమని మొదటి పాదం కూడా పూర్తికాకుండానే ఆగిపోయాను. పద్యాన్ని సీసంగా కాక చంపకమాలగా వ్రాసి ఉంటే ఇంకా అందగించేదేమో కూడా అనిపించింది. కానీ మొదటి పాదం దాటి ముందుకు వెళ్తే పద్యాన్ని ఆస్వాదిస్తూ అసలు మిగతా ఊసు(హ)లు అన్నీ మర్చిపోయాను. అంత అద్భుతంగా ఉందనిపించింది ఈ పద్యం.

అదేమిటో కానీ మొత్తం చదివేసాక పద్యం మరోసారి చదివినప్పుడు కూడా సీసం అతకలేదు మొదటిపాదానికి అనే అనిపించింది. దీనికి రెండు కారణాలు ఉండొచ్చు... ఒకటి ఏ శ్రీనాథుడి లేదా రామరాజభూషణుడి సీసపు నడకో మనస్సుకి బాగా పట్టేసి దాన్ని వదలలేకపోవడం, రెండు సీసం అంటే నా మనస్సులో ఒక రకమైన నడక బాగా ముద్రపడిపోయి ప్రస్తుత పద్యపు నడకని జీర్ణించుకోలేకపోవడం. ఏదైతేనేమి? సీసం సీసమే! పైగా అద్భుతమైన పద్యం!

ఏమాటకి ఆమాటే. శ్రీనాథుడికీ భట్టుమార్తికీ — వీరిద్దరికీ సీసంపై ఉన్న పట్టు, సీసం వాడడంలో ఉన్న ప్రతిభ, సీసపు నడకపై ఉన్న అవగాహన అనన్యసామాన్యం. అది ఒప్పుకు తీరాలి.

సరే. ఇక ఛందస్సు సంగతి ప్రక్కన పెట్టి పద్యాస్వాదనం, ఆలోచనామృతం సంగతి చూస్తే...

తరుణ అంటే యౌవనంలో ఉన్న (పూర్ణత్వము ఇంకా సిద్ధించని) అని. కాబట్టి తరుణేందుశేఖరుడంటే నెలవంకని శిఖలో ధరించినవాడు అని అర్థం. తరుణేందుబింబానికి కాంతి తక్కువే ఐనా శివుడు "మహాసితవపువు" అన్న అర్థం ధ్వనిస్తుంది తరువాతి మరాళ ప్రయోగంవలన. అలాంటి హంసకు శ్రేష్ఠమైన గంభీరమైన (నీటి) కొలను ఔతోందట అమ్మవారు.

కలకంఠ అంటే మగకోకిల (కలకంఠి అంటే కోకిలలా చక్కటి కంఠంగల ఆడుది అని అర్థం). భర్త ఇక్కడ శ్రేష్ఠతకి సూచిక. కైలాసాధిపతియైన కోకిలలలో శ్రేష్ఠునికి పూచే లేత మావి కొమ్మ ఔతోందట అమ్మవారు.

సురలోకంలో ప్రవహించేది – సురగంగ. దానిని ధరించినవాడు శివుడు. షట్పదం అంటే ఆరు పదములు కలిగినది, భ్రమరము. అట్టి భ్రమరానికి ప్రొద్దున్నే విచ్చుకున్న తామరపూవు ఔతోంది అమ్మవారు అని. ఇక్కడ షట్పద అన్నదానికి ఆరు భాగములు కలిగిన అని అర్థం కూడా చెప్పుకోవచ్చు. అంటే శివుడు వేదస్వరూపమని (వేదాంగములు ఆరు అన్న అర్థంలో). అప్పుడు కం శబ్దానికి ఆనందం అని అర్థం తీసుకోవాలి (అప్పుడు కంజాతమంటే కూడా ఆనందమే! పూర్ణమదః పూర్ణమిదం...).

రాజ రాజ ప్రియ రాజ కీరము. మూడు రాజ శబ్దాలు! రాజరాజ అన్న ప్రయోగానికే కనీసం నాలుగైదు అర్థాలు వెతుక్కోవచ్చు. రాజరాజప్రియ శబ్దానికి ఒక అర్థం (గొప్ప)వేల్పులకి (మిక్కిలి) ఇష్టమైన అని. రాజ అంటే శ్రేష్ఠమైన అని ఇంకో అర్థం. శ్రేష్ఠులకి ఇష్టమైన శ్రేష్ఠమైన మగచిలుక (కీరి అంటే ఆడుచిలుక). అట్టి చిలుకకి ఆమోదమైన పంజరపు స్థానం ఔతోందట అమ్మవారు.

ఉరగము అంటే పొట్టతో కదిలేది, పాము. పాములు మెడలో వేసుకున్నవాడు శివుడు. శివుడు అనే మయూరానికి, నెమలికి. ఇక్కడ నెమలి మెడలో పాము అనడం ద్వారా ప్రకృతికి వైరుద్ధ్యాన్ని కూడా చూడచ్చు. ఇక్కడ తన అందాన్ని (చెన్ను) వదిలేసిన (వీడిన) కొండశిఖరము (భూధర శిఖరము) ఔతోందట అమ్మవారు. అందాన్ని వదిలేయడం ఏమిటి? శిఖరానికి అందం సమతలం కాకపోవడమే. అది వదిలేసిన. అంటే అమ్మవారు పర్వతాలలోని సమతలమైన ప్రదేశం (సానువు) ఔతోందట.

లతితమైన సౌభాగ్యవంతములైన లక్షణాలను కనబరచే గిరితనయ విహారవేళలో ఇన్ని రకాలుగా కనబడింది. (ఎవరికి అని అడగకండి, ఇంతకుమించి నేపథ్యం నాకు తెలియదు).

* * *

ఇక నాకు చదువుతూంటే “భలే” అనిపించిన విచిత్రమైన విషయాలు…

౧ ఈ పద్యంలో ఎక్కడా కూడా అయ్యవారిని అమ్మవారిని పురుషప్రకృతి-స్త్రీప్రకృతిలా పోల్చకపోవడం. హంసకి హంసిలా, మగకోకిలకి ఆడుకోకిలలా, భ్రమరానికి భ్రమరిలా, రాజకీరానికి రాజకీరిలా, మయూరానికి మయూరిలా చెప్పడంలేదు.

విహారం అంటున్నాడు కాబట్టి అయ్యవారిని ఏ రూపంలో చెప్తాడో, ఆ విధమైన రూపానికి అమ్మవారు ఏ రూపంలో ఉంటే బాగా నచ్చుతుందో అదే చెప్పాడు. కొలను హంస. మావిచిగురు కోకిల. భ్రమరం తామర. చిలుక పంజరంలోని స్థానం (పంజరం కాదు). నెమలి పర్వతసానువు.

విహారాన్ని వర్ణించడానికి చక్కటి జంటలు ఇవి. హంస కొలనులో విహరిస్తుంది. కోకిల మావికొమ్మలపై విహరిస్తుంది. భ్రమరం తామరలందు విహరిస్తుంది (వేదాలు సచ్చిదానందస్వరూపంలో విహరిస్తాయి). చిలుక తనకి ఆమోదమైన పంజరంలో విహరిస్తుంది. నెమలి పర్వతసానువులపై విహరిస్తుంది. దీనివల్ల అయ్యవారు విహరిస్తున్నారనే అర్థం బైటకు కనిపిస్తున్నా ఇద్దరికీ అభేదం కూడా చెప్పినట్టైంది.

విహారం కాకుండా ఏకాంతమని చెప్పి ఉంటే వేరేలా ఉండేదేమో కవి కల్పనా చాతుర్యం.

౨ అన్ని చోట్లా అమ్మవారు కొలను ఔతోంది, కొమ్మ ఔతోంది, కంజాతమౌతోంది అన్నాడే కానీ కొలనులా ఉంది అనడం లేదు. ఆ రూపకాలంకార ధ్వనిని అమ్మవారివరకూ కొనసాగించడం అద్భుతం. పైగా అయ్యవారు హంస ఐతే అమ్మవారు కొలనులా ఉంది అనడం కాకుండా, అమ్మవారు కొలను ఔతోంది అనడం ఎంత సముచితం! మళ్లీ అర్ధనారీశ్వరతత్వం చూపినట్టౌతోంది.

మొత్తానికి అమృతమే ఈ పద్యం. అందులో అనుమానం లేదు. అలాంటప్పుడు అమృతభాండం బంగారానిదా వెండిదా రాగిదా ఇత్తడిదా లేదా ఆ భాండానికి రత్నాలు తాపడం చేసారా నగిషీలు చెక్కారా... ఇలాంటివి చూడడం అనవసరం!

* * *

రవిగారు చెప్పబట్టి ఇది ఉద్భటారాధ్యచరిత్రంలోనిదని తెలిసింది. తప్పితే ఈ పద్యం ఆ కావ్యంలో ఏ ఆశ్వాసంలోదో ఎన్నో పద్యమో నేపథ్యమేమిటో వివరాలు నాకు అస్సలు తెలియవు. ఏదేమైనా మంచి పద్యాన్ని పరిచయం చేసినందుకు రవిగార్కి కృతజ్ఞతలు.