గురువారం, మే 31, 2007

పాఠకులకు చిన్న విన్నపం

ఈ పద్యం యెవరికైనా తెలిస్తే దయజేసి పూర్తిజేయ ప్రార్థన. నాకు నాల్గవ పాదం మాత్రం తెలుసు.

మ.ముదితల్ నేర్వగలేని విద్యగలదే ముద్దాడి నేర్పించినన్.

సమస్య 5

సమస్యాపూరణానికి లభించిన ఆదరణవలన ఉత్సాహంపొంది నేనిచ్చే మరొక సమస్య యిది. ఈ సమస్య ఇంతకు మునుపే సంస్కృతంలో వుంది. నేను తెనిగించానంతే.

ఉ.భామిని కౌగిలించె తన భర్తకు తండ్రిని కౌతుకమ్ముతో.
[భామిని = స్త్రీ; కౌతుకము = ఆశ, కోరిక]

మంగళవారం, మే 15, 2007

తెనాలి రామకృష్ణీయమ్

చం.స్తుతమతి యైన యాంధ్ర కవి ధూర్జటి పల్కుల కేల గల్గెనో
అతులిత మధురీ మహిమ? ఆ తెలిసెన్, భువనైక మోహనో
ద్ధత సుకుమార వార వనితా జనతా ఘనతాపహారి సం
తత మధురాధరోదిత సుధారస ధారల గ్రోలుటన్ జుమీ.

సోమవారం, మే 14, 2007

నేనిచ్చే సమస్య 4

రావణు చెల్లి ద్రౌపదిని రాముడు యెత్తుకు పోయె చక్కగా.

నేనిచ్చే సమస్య 3

మఠమును వేసి వండమనె మంచిగ భార్యను పిండివంటలన్.

ఆదివారం, మే 13, 2007

నేనిచ్చే సమస్య 2

మలమును గాంచి ముద్దిడెను మన్మథ తాపము తాళజాలకన్.

నేనిచ్చే సమస్య 1

తన వొడిలో కుమారుఁ గని తల్లి భయంబున మూర్ఛనొందదా?

శనివారం, మే 05, 2007

వికటకవి తెనాలి రామకృష్ణీయమ్

కం. ఎమితిని సెపితివి కపితము
భ్రమపడి వెరిపుచ్చకాయ వడి దిని సెపితో
యుమెతక్కయ దిని సెపితివొ
యమవసనిసి యన్న మాట యలసని పెదనా!

కం. గంజాయి త్రావి తురకల
సంజాతుల గూడి కల్లు చవిగొన్నావా?
లంజాకొడకా యెక్కడి
కుంజర యూధంబు దోమ కుత్తుక జొచ్చెన్?

కం. రంజన జెడి పాండవు లరి
భంజనులై విరటుఁ గొల్వ బాల్పడి రకటా
సంజయ యేమని జెప్పుదు
కుంజర యూధంబు దోమ కుత్తుక జొచ్చెన్!

శ్రీరామ మహిమ

తే.గీ.కవిత ఛందము లేకున్న కవిత గాదు
అన్న విశ్వనాథ పలుకు లనుసరించి
రామ నామము పలుకగ రమ్య రీతి
రామచంద్రునిఁ గొలుచుచు(కొలువగ)వ్రాసితినిది.

కం.శ్రీరామచంద్రమూర్తీ
నోరారా నీదు మహిమ నుర్విని పాడన్
వేరే సేవకులెందుకు
ఈ రాఘవుడుండ నీకు యినకులచంద్రా.