శుక్రవారం, జులై 29, 2011

సోమాలియా

భగవన్! నీవు కృపాబ్ధి యండ్రు మఱి యీ బాలల్ ఘనాఘాత్ములా?
పగవారా? పసివారలయ్య భువిలో బాధానుభూతుల్ మదిన్
మిగులన్ జేతువ వారికిన్? కటకటా! మీ వైభవవ్యాప్తి నా
శుగజాప్తా దయఁజేసి మార్చఁగదవే సోమాలియాలో స్థితిన్

గురువారం, ఫిబ్రవరి 24, 2011

వీడ్కోలిక ముళ్లపూడి వేంకటరమణా

వేడ్కఁ దెలుఁగుహాస్యము నీ
మాడ్కి రచించెడిదెవరయ మా బాపు సఖా
వీడ్కోలోయ్ బుకురుకుగుకు
వీడ్కోలిక ముళ్లపూడి వేంకటరమణా

శుక్రవారం, ఫిబ్రవరి 04, 2011

దేశభక్తి

బెంగళూరు ఆకాశంలో రోజూ వైమానికదళంవారు చేసే సాధనా పరీక్షలూ చూసిన నా గుండె కఱగిపోయి ఈ మాటలరూపంలో ప్రవహించి ప్రపంచమనే సాగరంలో కలిసిపోయి మూగవోయింది.

అనుదినము సాధనార్థమై యాకసమున
వాయుసేన విన్యాసముల్ చేయుటఁ గని
యేమి చిత్రమో గాని నా యెడఁద పొంగుఁ
బొంగు నుప్పొంగు నుప్పొంగుఁ బొంగుఁ బొంగు ౧

వేగమునకు నిర్భీతికిఁ ద్యాగమునకు
నాకృతి యన విమానమునందు దేశ
రక్షణార్థమై ప్రీతితోఁ బ్రాణమిచ్చు
వీరుఁ డొకఁడు దోలుచు నభోవీథి నెగయు ౨

సైనికుఁడు కుటుంబసర్వస్వము వదలి
దేశసేవ సేయ దీక్షఁ బూనఁ
జేతులెత్తి మ్రొక్కఁ జిత్తము గోరును
దేశభక్తి యండ్రు దీనినేమొ ౩

దేశమునకయి యన్నియుఁ దెలిసి తెలిసి
దేహమును ధారవోయుట దేశభక్తి
దేశభక్తునిఁ గొలచుట దేశభక్తి
దివ్యమధురానుభూతి యీ దేశభక్తి ౪

గురువారం, ఫిబ్రవరి 03, 2011

భీంసేన్ జోషీ

సంసార మసారంబని
హంసలు మానససరసికి నరిగెడి రీతిన్
మాంసమయదేహము విడిచి
భీంసేనుఁడు నాకమునకు విజయము జేసెన్ ౧

విడచెను తనువును
నంతియ?
విడచెను తన ఘనయశస్సు
విడచెను బాణీన్
విడచెను గళమును
మన కై విడచెను...

మనకై విడచెను
చాలవె మనకివి భీంసేనకృతుల్ ౨

మంగళవారం, జనవరి 25, 2011

భగవంతుఁడా

ఖగపతిపతివో యజుఁడవొ నగజాజానివొ యెవఁడవొ నాకుత్తరమీ
యఁగ రా నీవెవఁడైనన్ భగవాన్ నేనసలు నేర్వవలెనా వద్దా ౧

ఏమనుకొందువీవసలుకేమిటి నీ పనులిట్టులుండు నా
కేమియు దక్కనీయక ననెందులకింతగ బాధవెట్టెదో
నా మనమందు ఖేదమును నవ్వులయాటగఁ జూడనేర్చినా
వో మఱి మాటలాడవు హు పోయినదేమిటి నీకు దేవుఁడా ౨

ఖేదంబెందుకు మోదమెందుకన నీకేమయ్య దైవంబ నీ
వాదిన్ పుట్టినవాడవౌట నిటులే హాస్యంబుగానుండు నా
వాదంబంతయు బాధయంతయు వృథావాక్కేళి గాదయ్య రా
నా దారిన్ నడు నీకె బాగ తెలియున్ నాల్పంబులీ నా వెతల్ ౩

శ్రుతులను నేర్వఁగోరితి గురున్ తొలివేదము నేర్పువానిఁ జూ
పితివ షడంగముల్ చదువఁ బ్రీతినిఁ బాణినిఁ గొంతయైన నే
ర్చితినను తృప్తినిచ్చితివ చేతికినందుచు జాఱిపోవుచున్
మతి చెదరంగఁజేతువు సుమా నువు టక్కరివయ్య దైవమా ౪

పాటలందుఁ నాట్యభంగిమఁ గృతులలోఁ
దెలియఁదగినదానిఁ దెలుపువారిఁ
గనుగొని నువు వేగఁ గొనిపోయెదవదేమి
మాకు నిన్నుఁ జూపు మార్గమేది ౫

దేవ నీ లీలఁ దెలియఁగఁ దెలివి లేదు
తెలివియున్నచో నేనును దేవుఁడౌదుఁ
గనుకఁ దొఱకినవన్నియుఁ గైగొని యిక
వినెదఁ జదివెద గురువుల విద్యలెల్ల ౬

నటుపై భారము నీదె దైవతమ నా యత్నంబులో లోపముల్
తృటిలోఁ ద్రుంచి ఫలంబునిచ్చి యటుపై దివ్యంబులౌ విద్యలన్
పటువిద్యార్థుల కెందఱెందఱికొ నేర్పన్ శక్తియున్ నీవయై
ఘటజాతాన్వయజాతుఁ నన్ను భువిలోఁ గాపాడుమా దైవమా ౭

బుధవారం, ఏప్రిల్ 07, 2010

ప్రేమస్వరూపము

క్రింది పంక్తులు నారదభక్తిసూత్రాలలోనివి. "భగవంతునిపై అమితమైన ప్రేమ కలిగియుండటమే భక్తి" అని నారద మహర్షి నిర్వచిస్తారు. "మఱి ప్రేమ అంటే ఏమిటీ" అన్న ప్రశ్నకు సమాధానంగా ఈ పంక్తులు తరువాత చెబుతారు.

51. అనిర్వచనీయం ప్రేమస్వరూపమ్
ప్రేమ యొక్క నిజమైన తత్త్వం మాటలకు అందనిది, ఇలా ఉంటుందీ అని చెప్పటానికి వీలు కానిది. అనంతమైన ప్రేమను వివరించటానికి, ప్రేమతో పోలిస్తే అననంతాలైన మాటలు ఏ మూలకూ సరిపోవు.

52. మూకాస్వాదనవత్
మూగవాడు దేనినైనా కేవలం ఆస్వాదించగలడే కానీ దేనినీ మాటలలో చెప్పలేడు. అలాగే ప్రేమను కేవలం అనుభవించగలమే తప్ప దానిని మాటలలో వ్యక్తీకరించడం కుదరదు. ప్రేమయొక్క స్వరూపాన్నే కాదు, ప్రేమానుభవాన్ని కూడ మాటలలో వెలిబుచ్చలేము అని అర్థం.
ఈ సందర్భంలో సాక్షాదీశ్వరస్వరూపుడైన దక్షిణామూర్తిని స్మరించటం చాల ఉచితం.
మౌనవ్యాఖ్యాప్రకటితపరంబ్రహ్మతత్త్వం యువానం వర్షిష్ఠాన్తేవసదృషిగణైరావృతం బ్రహ్మనిష్ఠైః।
ఆచార్యేన్ద్రం కరకలితచిన్ముద్రమానన్దమూర్తిం స్వాత్మారామం ముదితవదనం దక్షిణామూర్తిమీడే।।

53. ప్రకాశతే క్వాపి పాత్రే
సరే. ఈ ప్రేమ ఎక్కడ కనబడుతుంది? ప్రేమను పొందటానికి పాత్రులైనవారిలోనే, నూటికో కోటికో ఒక్కరిద్దరిలోనే కనబడుతుంది. తప్పితే ఎవఱిలో పడితే వాఱిలో ప్రకాశించదు. ప్రేమకు అర్హత సంపాదించుకోవటం ఎలా? ప్రేమను పొందటానికి ప్రయత్నించటమే. ప్రయత్నించేకొలదీ తనంత తానుగా ప్రేమ అదే చేరువౌతుంది. సాధారణంగా ఏతావత్ప్రేమకై చాల తక్కువమంది మాత్రమే ప్రయత్నిస్తారు అని చెప్పడమే నూటికో కోటికో ఒక్కరిద్దరిలోనే కనబడుతుంది అనటం వెనక ఆంతర్యం. అలా చాలా అరుదుగా కనబడినా, ప్రయత్నించినవారికి క్రమేణ అందటం మాత్రమే కాకుండా, ఆ పాత్రుని చుట్టూ ఉన్నవారికి కూడ ఆ వెలుగును (ప్రేమను) పంచుతుంది. ప్రపంచాన్ని ప్రేమోద్దీపితం చేస్తుంది, ప్రేమమయం చేస్తుంది.

54. గుణరహితం కామనారహితం ప్రతిక్షణవర్ధమాన మవిచ్ఛిన్నం సూక్ష్మతర మనుభవరూపమ్
మామూలుగా ఈ చరాచరజగత్తులో ఉండే వస్తువులకు ఆపాదించదగిన సత్వము రజస్సు తమస్సు అన్న గుణాలు ప్రేమకు ఉండవు. అలాగే షట్ఛత్రువులు నశించటంవలన ప్రాపంచికమైన ఏ కోరికలూ బంధాలూ ప్రేమను కట్టలేవు. ఐనా, ప్రాపంచికమైన గుణాలూ బంధాలూ ఉంటే ప్రేమ అనిర్వచనీయమైనదీ కేవలాస్వాదనీయమైనదీ అరుదైనదీ ఎందుకౌతుంది? అలాంటి ప్రేమను ఒకసారి అనుభవించటం మొదలైతే, ఆ ప్రేమకు నిరంతరం పెరుగుదలే తప్పితే తరుగుదల ఉండదు. కోరికకూ ప్రేమకూ ఇదే ప్రధానమైన తేడా. తీరిన తరువాత కోరిక తరిగిపోతుంది. ప్రేమ అనుభవించేకొద్దీ పెరుగుతూనే ఉంటుంది (అనుభవంలో మాత్రమే కాదు, పరిధిలో కూడా). అందుకే ప్రేమ ఆనందస్వరూపం, అమృతం. ప్రేమే భగవంతుడు, భగవంతుడే ప్రేమ. ఈ ప్రపంచమంతటా ప్రేమ నిండి ఉంది. స్థూలమైనవాటికి ఇలాంటి సర్వవ్యాపకత్వం ఉండదు. ఉదాహరణకు, భూమినీ నీటినీ తీసుకుంటే, భూమి చేరలేని ప్రదేశాలలో కూడ నీరు చేరగలదు. అందువల్ల భూమి నీటికన్నా స్థూలమైనదీ (gross), లేదా భూమికన్నా నీరు సూక్ష్మమైనదీ (subtle) అంటున్నాం. నీటి కన్నా నిప్పుకూ, నిప్పు కన్నా గాలికీ, గాలి కన్నా శూన్యానికీ (ఆకాశానికీ) సూక్ష్మత ఎక్కువ. ప్రేమ వీటన్నింటికన్నా చాలా సూక్ష్మమైనది. అంటే ఎక్కడైనా దేనియందైనా చేరిపోగలదు. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రేమ అనంతమైనది. మఱి ఇలాంటి అనంతమైన మితిలేని ప్రేమను పరిమితమైన మాటలలో చెప్పడం కుదరదు కాబట్టి ప్రేమ కేవలం అనుభవైకవేద్యం.

55. తత్ప్రాప్య తదేవావలోకతి తదేవ శృణోతి తదేవ భాషయతి తదేవ చిన్తయతి
ప్రేమను అనుభవంలోకి తెచ్చుకున్నవారికి ఈ సృష్టిలో దేనిని చూచినా ప్రేమమయంగానే కనబడుతుంది (సూక్షతరమ్). ఏది చూచినా ప్రేమమయంగానే కనబడుతూంటే, దేనినీ అసహ్యించుకోవడమంటూ ఉండదు. ఏది విన్నా ప్రేమగానే వినబడుతుంది. వ్యర్థభాషణలూ కామాలాపాలూ వ్యంగ్యసంభాషణలూ దూషణలూ అన్నీ ప్రేమవాక్కులుగానే వినబడడం చేత ఎవఱిపైనా రాగద్వేషాలు ఉండవు. ఏది మాట్లాడుదామన్నా ప్రేమగానే పలుకబడుతుంది. ఇది కావాలీ ఇది వద్దూ అన్న కార్యకారణసంబంధాలు తెగిపోవటం చేత తక్కువగానే మాట్లాడుతారు, ఒకవేళ మాట్లాడినా ప్రేమతో నిండియుండటం చేత అది అందఱికీ ఆహ్లాదకరంగానే ఉంటుంది. ఏది ఆలోచించినా ప్రేమతోనే ఆలోచించబడుతుంది. మనోవాక్కాయకర్మలు ప్రేమయందే వాటి ప్రతిపత్తిని కలిగి ఉంటాయి.
భక్తిని భగవంతునియందు ప్రేమగా చెప్పడం వలన, ఆ భక్తి కలిగినవానికి ఈ లోకంలో అన్నిటియందూ భగవంతుడే గోచరిస్తాడు. ఏమి విన్నా భగవంతుని మధురమంగళనాదంగానే వినబడుతుంది. ఏమి అందామన్నా భగవంతునితో సంభాషిస్తున్నామన్న స్పృహవలన మృదువాక్కులే నోటియందు జనిస్తూ ఉంటాయి. కర్మ వాక్కులతో పాటు మనస్సులో కూడ భగవంతుడే ఎల్లప్పుడూ కొలువైయుంటాడు. తనే ఆనందస్వరూపమని తెలుసుకుంటాడు. ఇతరమైన ప్రాపంచిక సౌఖ్యాలను ఇచ్చేవి ఏవీ దీనిముందు అగుపడవు, వినబడవు, అనబడవు. ఇలా నిరంతరమూ ఆనందంలో మునిగి తేలటమే మోక్షం.

బుధవారం, మార్చి 17, 2010

ఆ నో భద్రాః క్రతవో యన్తు విశ్వతః

ఋగ్వేదములోని ౧టి మణ్డలములో ౮౯వ సూక్తములోని ౧టి ఋక్కు:

ఆ నో భద్రాః క్రతవో యన్తు విశ్వతో೭దబ్ధాసో అపరీతాస ఉద్భిదః।
దేవా నో యథా సదమిద్వృధే అసన్నప్రాయువో రక్షితారో దివేదివే।।


* * *

ఇప్పుడు ఆ నో భద్రాః క్రతవో యన్తు విశ్వతః అన్న వాక్యానికి అర్థం గమనిస్తే:

౧ ఋగ్వేదముపై వ్రాయబడిన సాయణాచార్యభాష్యం ప్రకారం--

నో೭స్మాన్ క్రతవో೭గ్నిష్టోమాదయో మహాయజ్ఞా విశ్వతః సర్వస్మాదపి దిగ్భాగాదా యన్తు ఆగచ్ఛన్తు. కీదృశాః క్రతవః. భద్రాః సమీచీనఫలసాధనత్వేన కల్యాణా భజనీయా వా.

నః మనను, క్రతవః అగ్నిష్టోమము మొదలైన మహాయజ్ఞములు, విశ్వతః అన్ని దిక్కులనుండి, ఆ యన్తు వచ్చునుగాక (వచ్చి రక్షించునుగాక). ఎలాంటి క్రతువులు? భద్రాః మంచి ఫలములను సాధింపజేయటంద్వారా కల్యాణములైనవీ కొలవదగినవైనవీ ఐన క్రతువులు.

౨ క్రియతే క్రతుః అని అమరకోశంలో క్షీరస్వామికృతభాష్యం. ఈ ప్రకారంగా చూస్తే మంచి చేతలు అన్న అర్థం కూడ తీసుకోవచ్చు. అప్పుడు భద్రములైన (భద్రములైన) చేతలు (క్రతవః) అన్నివైపులనుండి (విశ్వతః) మనకు (నః) వచ్చునుగాక (ఆ యన్తు).

క్ఌప్తంగా, మనకు మంచి జఱుగుగాక అని అర్థం.

౩ ఇదే వాక్యానికి స్వామి వివేకానంద చెప్పిన అర్థం "మంచి ఆలోచనలు నలుదిశలనుండీ మనకు కలుగునుగాక" అని.

గురువారం, ఫిబ్రవరి 25, 2010

ఇందఱికి నభయంబు లిచ్చు చేయి

[యతి స్థానాలను లావాటి అక్షరాలలో చూపుతున్నాను. ప్రాస తెలుస్తూనే ఉంది. అన్నమాచార్యుని "ముద్ర"కు క్రింద గీత గీచాను.]

సంకీర్తన:
ఇందఱికి నభయంబు లిచ్చు చేయి
కందువగు మంచి బంగారు చేయి

వె లేని వేదములు వెదకి తెచ్చిన చేయి
చిలుకు గుబ్బలి క్రిందఁ జేర్చు చేయి
లికియగు భూకాంతఁ గౌగిలించిన చేయి
లనైన కొనగోళ్లవాఁడి చేయి

నివోక బలిచేతఁ దా మడిగిన చేయి
వొనరంగఁ భూదాన మొసఁగు చేయి
మొనసి జలనిధి యమ్ము మొనకుఁ దెచ్చిన చేయి
యెనయ నాఁగేలు ధరియించు చేయి

పురసతుల మానములు పొల్లసేసిన చేయి
తురగంబుఁ బరపెడి దొడ్డ చేయి
తిరువేంకటాచలాధీశుఁడై మోక్షంబు
తెరువు ప్రాణులకెల్లఁ దెలిపెడి చేయి

అర్థాలు:
కందువ - నేర్పు। చిలుకుగుబ్బలి - మంథరపర్వతం (చిలుకు - మథించు, గుబ్బలి - కొండ)। కలికి - చక్కటి స్త్రీ। వలను - నేర్పు। తనివోవు - తనివి పోవు (తనివి - సంతుష్టి)। ఒనరు - కలుగు। మొనయు - యుద్ధానికి పూనుకొను (మొనగాడు అంటే యుద్ధం చేయడానికి సిద్ధమైనవాడు)। అమ్ము - బాణం। మొన - కొస। ఎనయు - సరిపడు। నాఁగేలు - నాగలి। పొల్ల - పొల్లు (వ్యర్థం)। తురగము - గుఱ్ఱం। పరపు - తోలు। దొడ్డ - గొప్ప। తెరువు - దారి।

తాత్పర్యం:
ఇందఱికీ అభయాలను ఇచ్చే చేయి. అలా అభయాన్ని ఇవ్వడంలో బాగా నేర్పు కలిగిన గొప్ప బంగారుచేయి (బంగారుతల్లి అన్నప్పుడు బంగారు ఎలా విశేషణంగా వాడుతామో అలాగ).

వెలకట్టడానికి సాధ్యం కాని వేదాలని మత్స్యావతారమూర్తియై వెదికి తెచ్చి బ్రహ్మగారికి ఇచ్చినది ఈ హస్తమే. కూర్మమూర్తియై మంథరపర్వతం క్రింద చేరి తన చేతితో వహించే చేయి. చక్కటి భూకాంతను వరాహమూర్తియై సముద్రంనుండి ఉద్ధరించి కౌగిలించిన చేయి. హిరణ్యకశిపుణ్ణి చంపగల నేర్పు కలిగిన కొనగోళ్లు కలిగిన నరసింహావతారుని చేయి.

తను సాక్షాత్తూ లక్ష్మీదేవికే భర్త ఐనా అంతటితో తృప్తి పడక ఇంద్రుడి కోసమై బలి చేతినుండి దానం పుచ్చుకున్న వామనుని చేయి. పరశురాముడై సమస్త భూమండలాన్ని జయించి, అంత భూమినీ కలిగియున్నప్పుడు, యాగం చేసి ఆ ఋత్విక్కులకు సమస్తభూమినీ దానంగా ఇచ్చిన చేయి. రామావతారంలో సముద్రముపై యుద్ధానికి బయలుదేరి తన బాణాన్ని కొసకు తెచ్చిన చేయి. చక్కగా సరిపడేలా నాగలిని ధరించే బలరాముని చేయి.

గొల్లకాంతలందఱికీ వారి మానము తనే అనే అవగాహన కల్పించడానికై వారి మానములను అపహరించిన కృష్ణుని చేయి. గుఱ్ఱాన్ని తోలుతూ ధరావలయమునందు ధర్మస్థాపన చేసే కల్కిమూర్తి యొక్క గొప్ప చేయి. అలాగే, శ్రీవేంకటాచలానికి అధిపతియై తన పాదములే మోక్షపు మార్గము అని తెలిపే చేయి.

ఇందఱికి అభయాలని ఇచ్చే చేయి.

మంగళవారం, నవంబర్ 17, 2009

కృష్ణాజినం దర్భమయీ చ మౌఞ్జీ

కృష్ణాజినం దర్భమయీ చ మౌఞ్జీ పాలాశదణ్డః పరిధానశాటీ।
యజ్ఞోపవీతఞ్చ దిశన్తు నిత్యం వటోశ్చిరాయుశ్శుభకీర్తివిద్యాః।।

కృష్ణ-అజినమ్ దర్భమయీ చ మౌఞ్జీ పాలాశ-దణ్డః పరిధాన-శాటీ యజ్ఞోపవీతమ్ చ దిశన్తు నిత్యమ్ వటోః చిరాయుః శుభ-కీర్తి-విద్యాః

కృష్ణజింకచర్మమూ, ముంజ-దర్భలతో చేయబడిన ఒడ్డాణమూ, మోదుగకఱ్ఱా, అంగవస్త్రమూ, జంధ్యమూ నిత్యమూ (నిత్యముగా) వటువుకి చిరాయువునీ శుభాన్నీ కీర్తినీ విద్యలనీ ఇచ్చుగాక.

ఆదివారం, నవంబర్ 15, 2009

జానక్యాః కమలామలాఞ్జలిపుటే యాః

జానక్యాః కమలామలాఞ్జలిపుటే యాః పద్మరాగాయితాః
న్యస్తా రాఘవమస్తకే చ విలసత్కున్దప్రసూనాయితాః।
స్రస్తాశ్శ్యామలకాయకాన్తికలితా యా ఇన్ద్రనీలాయితాః
ముక్తాస్తాశ్శుభదా భవన్తు భవతాం శ్రీరామవైవాహికాః।।

జానక్యాః కమలామలాఞ్జలిపుటే యాః పద్మరాగాయితాః న్యస్తాః రాఘవమస్తకే చ విలసత్ కున్దప్రసూనాయితాః స్రస్తాః శ్యామలకాయకాన్తికలితాః యాః ఇన్ద్రనీలాయితాః ముక్తాః తాః శుభదాః భవన్తు భవతామ్ శ్రీరామవైవాహికాః

జానకి యొక్క కమలములవలె అమలములైన దోసిళ్లలో ఏవైతే పద్మరాగాలైనాయో, రాఘవుని మస్తకమునందు ఉంచబడినవై ఏవి కుందప్రసూనాలలాగ విలసిల్లాయో, తలపైనుండి జారి ఆ రాముని శ్యామలకాయకాంతితో కలిసినవై ఏవి ఇంద్రనీలాలయ్యాయో, ఆ శ్రీరామవైవాహికములైన ముత్యాలు మీకు శుభాలని ఇచ్చేవి అగుగాక.

న్యస్తాః + రాఘవమస్తకే = న్యస్తా రాఘవమస్తకే
స్రస్తాః + శ్యామలకాయకాన్తికలితాః = స్రస్తాశ్శ్యామలకాయకాన్తికలితాః
కలితాః + యాః = కలితా యాః
యాః + ఇన్ద్రనీలాయితాః = యా ఇన్ద్రనీలాయితాః
ముక్తాః + తాః = ముక్తాస్తాః
తాః + శుభదాః = తాశ్శుభదాః
శుభదాః + భవన్తు = శుభదా భవన్తు