గురువారం, డిసెంబర్ 28, 2006

శ్రీరామకర్ణామృత ఆంధ్రీకరణము - అరుణాన్వయతారాపతి

కం. అరుణాన్వయతారాపతి
భరతాగ్రజుడగు రఘుపతి భవనాశకుడౌ
ధరణిజపతి శ్రితజనపతి
శిరసా నే మ్రొక్కు వేల్పు శ్రీరాఘవుడే.

श्लो॥ रघुनन्दन एव दैवतं नो रघुवंशोद्भव एव दैवतं नः।
भरताग्रज एव दैवतं नो भगवान् राघव एव दैवतं नः॥

శ్రీరామకర్ణామృత ఆంధ్రీకరణము - సీతమ్మకు కుడి ప్రక్కన

కం. సీతమ్మకు కుడి ప్రక్కన
భ్రాత సుమిత్ర కొమరునకు ప్రక్కన నడుమన్
చేతను విల్లంబులు కల
ఓ తరణికులజ రఘువర వందనములివే.

श्लो॥ सीतायाः दक्षिणे पार्श्वे लक्ष्मणस्य च पार्श्वतः।
तन्मध्ये राघवं वन्दे धनुर्बाणधरं हरिम्॥

శ్రీరామకర్ణామృత ఆంధ్రీకరణము - శ్రీరమ నాకు జనని

కం. శ్రీరమ నాకు జనని మరి
శ్రీరాముడు నాదు తండ్రి శ్రేయో ప్రదమౌ
శ్రీరామభక్తిపరులౌ
మారుత్యాది కపివరులు మా కిల బంధుల్.
श्लो॥ जनको रामचन्द्रो मे जननी जनकात्मजा।
हनुमत्प्रमुखास्सर्वे हरयो मम बान्धवाः॥

శ్రీరామకర్ణామృత ఆంధ్రీకరణము - జానకి నాదు జనని

కం. జానకి నాదు జనని యా
జానకిరాముడు మదీయ జనకుండవ్వన్
నా నెచ్చెలి లక్ష్మణుడుం
డన్ నా కెందుకు విచార డక్కుల్ చింతల్.

श्लो॥ जननी जानकी साक्षाज्जनको राघुनन्दनः।
लक्ष्मणो मित्र मस्माकं को विचारः कुतो भयम्॥

శ్రీరామకర్ణామృత ఆంధ్రీకరణము - రాముడె తల్లియుఁ దండ్రియు

కం. రాముడె తల్లియుఁ దండ్రియు
నా మిత్రుడు సోదరుండు నా కన్నియు శ్రీ
రాముడె యని నేఁ నమ్మితి
నా మది నెఱుఁగ నితర సుర నొక్కని నైనన్.

श्लो॥ माता रामो मत्पिता रामचन्द्रः भ्राता रामो मत्सखा राघवेशः।
सर्वस्वं मे रामचन्द्रो दयालुः नान्यं दैवं नैव जाने न जाने॥

సోమవారం, డిసెంబర్ 25, 2006

శ్రీరామకర్ణామృత ఆంధ్రీకరణము - అనుపమగుణశ్రీపతియగు

కం. అనుపమగుణశ్రీపతియగు
ఇనవంశసుధాకరునకు దైత్యహరునకున్
వనజాక్షుండగు దశరథ
తనయుడు ఆజానుబాహునకు వందనముల్.

श्लो॥ श्रीराघवं दशरथात्मज मप्रमेयम्
सीतापतिं रघुकुलान्वयरत्नदीपम्।
आजानुबाहु मरविन्ददलायताक्षम्
रामं निशाचर विनाशकरं नमामि॥

శ్రీరామకర్ణామృత ఆంధ్రీకరణము - రామా నీదు కథాసుధ

కం. రామా నీదు కథాసుధ
నీ మధు నామ పరిచయము నీ గుణ నుతులున్
నీ మంగళ పద సేవయు
సామీ నాకొసగు (సామీప్యంబొసగు) జన్మజన్మంబులకున్.

श्लो॥ रामचन्द्र चरिताकथामृतम् लक्ष्मणाग्रज गुणानुकीर्तनम्।
राघवेश तव पादसेवनम् संभवन्तु मम जन्मजन्मनि॥

ఆదివారం, డిసెంబర్ 24, 2006

శ్రీరామకర్ణామృత ఆంధ్రీకరణము - వామాంకమ్మున సీత దేవియు

శా. వామాంకమ్మున సీత దేవియు ప్రభావంతంబు కోదండమున్
అమ్మున్ దక్షిణ హస్తమందు దరమున్ చక్రంబు పై జేతులన్
పద్మాక్షుల్ భుజకీర్తులొప్పగను శ్రీభద్రాద్రి నాకమ్ములో
సౌమిత్రీయుత రామునిన్ కొలిచెదన్ శ్రేయస్కరంబౌ గతిన్.

श्लो॥वामाङ्कस्थित जानकी परिलसत् कोदण्डदण्डं करे।
चक्रं चोर्ध्वकरेण बाहुयुगले शङ्खं शरं दक्षिणे।
बिभ्राणं जलजातपत्रनयनं भद्राद्रिमूर्ध्नि स्थितम्।
केयूरादिविभूषितं रघुपतिं सौमित्रि युक्तं भजे॥

శనివారం, నవంబర్ 25, 2006

శ్రీ రామ్మోహన్ గారి 'ఆశీర్వాద' ప్రశంస

నేను ఇంటర్మీడియట్ లో వుండగా వ్రాసిన ఒకటీ రెండూ చిన్నా చితకా పద్యాలని మెచ్చుకొని శ్రీ రామ్మోహన్ గారు (శశి జూనియర్ కాలేజీ లో లెక్చరర్, తెలుగు మరియు ఇంగ్లీష్ భాషలు చెప్పేవారు) నాకు వ్రాసి యిచ్చిన పద్యమిది

కం. పద్యం నడకను మిక్కిలి
హృద్యంగా పట్టినావు యిట్టే బాగా
సద్యస్ఫూర్తికి నెలవే
విద్యార్థివి నీకు రాని విద్యలు కలవే.

శనివారం, అక్టోబర్ 21, 2006

ఎందరో మహానుభావులు

పల్లవి
ఎందరో మహానుభావులు అందరికీ వందనములు

అనుపల్లవి
చందురు వర్ణుని యంద చందమును హృదయార-
విందమునఁ జూచి బ్రహ్మానందమను భవించు వా రెందరో

చరణములు
సామ గాన లోల మనసిజ లావణ్య ధన్య మూర్ధన్యు లెందరో
మానస వన చర వర సంచారము సలిపి మూర్తి బాగుగఁ బొడగనే వారెందరో
సరగున పాదములకు స్వాంతమను సరోజమును సమర్పణము జేయు వా రెందరో
పతిత పావనుఁడనే పరాత్పరుని గురించి పరమార్థమగు నిజ మార్గముతోను బాడుచును సల్లాపముతో స్వర లయాది రాగములఁ దెలియు వా రెందరో
హరి గుణ మణిమయ సరములు గళమున శోభిల్లు భక్త కోటులిలలో తెలివితోఁ జెలిమితోఁ గరుణ గల్గి జగమెల్లను సుధా దృష్టిచే బ్రోచు వా రెందరో
హొయలు మీర నడలు గల్గు సరసుని సదా కనులఁ జూచుచును పులక శరీరులై యానంద పయోధి నిమగ్నులై ముదంబునను యశము గలవా రెందరో
పరమ భాగవత మౌని వర శశి విభాకర సనక సనందన దిగీశ సుర కింపురుష కనకకశిపుసుత నారద తుంబురు
పవనసూను బాలచంద్రధర శుక సరోజభవ భూసురవరులు పరమపావనులు ఘనులు శాశ్వతులు కమల భవ సుఖము సదానుభవులూ గాక ఎందరో
నీ మేని నామ వైభవంబులను నీ పరాక్రమ ధైర్యముల శాంత మానసము నీవులను వచన సత్యమును రఘువర నీయెడ సద్భక్తియు జనించకను దుర్మతములను కల్ల జేసినట్టి నీమది నెఱింగి సంతసంబునను గుణ భజనానంద కీర్తనము జేయు వా రెందరో
భాగవత రామాయణ గీతాది శృతి శాస్త్ర పురాణపు మర్మములన్ శివాది షణ్మతముల గూఢములన్ ముప్పది ముక్కోటి సురాంతరంగముల భావంబుల నెఱిఁగి భావ రాగ లయాది సౌఖ్యముచే చిరాయువుల్ గలిగి నిరవధి సుఖాత్ములై త్యాగరాప్తులైన వా రెందరో

ప్రేమ ముప్పిరి గొను వేళ నామము దలచేవారు రామభక్తుఁడైన త్యాగరాజనుతుని నిజ దాసులైన వా రెందరో

శుక్రవారం, సెప్టెంబర్ 29, 2006

తాళ్ళపాక అన్నమాచార్యుని పద శోభ ౧

అలరఁ జంచలమైన ఆత్మలందుండ నీ యలవాటు జేసె నీ వుయ్యాల
పలుమారు నుచ్ఛ్వాస పవనమందుండ నీ భావంబు దెలిపె నీ వుయ్యాల

ఉదయాస్త శైలంబు లొనరఁ గంభములైన వుడుమండలము మోఁచె నుయ్యాల
అదన నాకాశ పద మడ్డదూలంబైన అఖిలంబు నిండె నీ వుయ్యాల

పదిలముగ వేదములు బంగారు చేరులై పట్ట వెరపై తొఁచె నుయ్యాల
వదలకిటు ధర్మదేవత పీఠమై మిగుల వర్ణింప నరుదాయ నుయ్యాల

మేలు కట్లయిమీకు మేఘ మండలమెల్ల మెఱుఁగునకు మెఱుఁగాయ నుయ్యాల
నీల శైలము వంటి నీ మేని కాంతికిని నిజమైన తొడవాయ నుయ్యాల

పాలిండ్లు కదలఁగాఁ పయ్యదలు రాఁపాడ భామినులు వడినూఁచు నుయ్యాల
వోలి బ్రహ్మాణ్డములు వొరగునో యని భీతి నొయ్య నొయ్యన వూఁచి రుయ్యాల

కమలకును భూసతికి కదలు కదలకు మిమ్ముఁ గౌఁగిలింపఁగఁజేసె నుయ్యాల
అమరాంగనలకు నీ హావ భావ విలాస మందంద చూపె నీ వుయ్యాల

కమలాసనాదులకుఁ గన్నులకు పండుగై గణుతింప నరుదాయ నుయ్యాల
కమనీయ మూర్తి వేంకట శైల పతి నీకు కడు వేడుకై యుండె నుయ్యాల

శనివారం, ఆగస్టు 05, 2006

నేఁ వ్రాసిన పద్యములు ౧

[ఇవి నేఁ వ్రాయఁబూనిన "శ్రీరామకర్ణామృతము" ఆంధ్రానువాదమునకు చెందిన పద్యములు.]

చం. తొలుత నమస్కరింతు సురతుల్యులు అమ్మకు నాన్నకున్ ఇలా
తలమున పెద్దలందరకు ధర్మము సత్యము నిల్పు వారికిన్
కులమున పూర్వజాతులకు కోర్కెలు దీర్చగ కల్పక్ష్మాజమై
వెలసిన భద్రశైలపతి విప్రుల బ్రోచెడి రామమూర్తికిన్.

పార్థివ ఫాల్గుణ కృష్ణ ప్రతిపత్, సౌమ్యవాసరము.
ఉ. ముందుగ రామభక్తి యను ముక్తినొసంగెడు దారి చూప - తా
నందు చరించుచున్ - సుతుని నన్నును రాముని మార్గమందు నా
నందము నొంద జేసిన - సునామ రసామృత స్వాదికిన్ - కృతిన్
వందన పూర్వకంబుగను అంకితమిత్తును నాదు తండ్రికిన్.
వ్యయ ఆషాఢ పూర్ణిమా, భౌమవాసరము.

ఆదివారం, జులై 02, 2006

నవవిధ భక్తి మార్గములు

మ.తను హృద్భాషల సఖ్యమున్ శ్రవణమున్ దాసత్వమున్ వందనా
ర్చనముల్ సేవయు నాత్మలో నెఱుకయున్ సంకీర్తనల్ చింతనం
బను నీ తొమ్మిది భక్తి మార్గముల సర్వాత్మున్ హరి న్నమ్మి స
జ్జనుడై యుండుట భద్రమంచు దలతున్ సత్యంబు దైత్యోత్తమా.
[సహజకవి బమ్మెర పోతనామాత్యుని శ్రీమదాంధ్రమహాభాగవతమందలి ప్రహ్లాదచరిత్రమునుండి]

మంగళవారం, జూన్ 27, 2006

కొందరు వ్యక్తులపై నా పద్యములు

కం. గౌరవమిది భారతి కిల -
చేరగ "షెవలియరు" కీర్తి - చూడన్ వెదుకన్
వేరెవరున్నార(ని)య మన
వారిలొ సాటిగ ఘనతను - "బాలమురళి" తోన్.

(గానసుధాకర పద్మవిభూషణ్ పద్మశ్రీ మంగళంపల్లి బాల మురళీకృష్ణ గారిపై, వారికి వినిపించినది)

కం. తాతకు - గురువుకు - స్ఫూర్తి ప్ర
దాతకు - సుకవీశ్వరునకు - దైవ రతునకున్
శ్రోతకు వసంత కోకిల
కూతల - శ్రీ మూర్తి గార్కి కోరెద శుభమున్.

(బ్రహ్మశ్రీ మంగళంపల్లి రామనరసింహమూర్తి గారిపై)


కం. అరగంట మాట కలిపితి
సరదా పాటల 'చరణ్' తొ సాయంకాలం
మరువని క్షణమిది మనసుకు
తరగని స్వరముల నిధి గను తరుణము గనుకన్.

(పద్మశ్రీ శ్రీపతి పణ్డితారాధ్యుల బాల సుబ్రహ్మణ్యం తనయుడు, గాయకుడు చరణ్ ని కలసినప్పుడు)

కం. అందరి మన్నన లొందెడు
కొందరిలో మీరు మాకు కోటి సిరులనన్,
పొందగ శుభమును యశస్సు
అందుకొనుడు ఆంగ్లమునిటు 'హ్యాపీ బర్త్డే'.

(నేను ఇంటెర్న్ షిప్ చేసిన విటెస్ ఎండీ శ్రీ తనికెళ్ళ కామేశ్వరరావు పుట్టిన రోజున)

సోమవారం, జూన్ 19, 2006

నేఁ వ్రాసిన పద్యములు ౩

కందం వ్రాయటం ప్రారంభించిన క్రొత్తలలో వ్రాసిన పద్యాలు -

కం.శుకపికముల రవములతో
వికసించిన హృదయమందు విడువక భక్తిన్
ఇక కొలిచెదమా రాముని
సకల శుభమ్ములు గలుగగ సతతము భువిలో.

(ఉగాదికి వ్రాసినది)

కం.అందరి పూజలు పొందుచు
కొందరికే నీది యైన కరుణను ఒసగన్
నీ దయ నాపై కలుగగ
వందనమిదియే రఘుపతి వందనమిదియే.

(నేను వ్రాసిన మొట్టమొదటి కందపద్యము)

శుక్రవారం, ఏప్రిల్ 28, 2006

నేఁ వ్రాసిన పద్యములు ౨

కం.ముక్తికి మార్గము నీవని
రక్తిని పెంపొందగోరి అడిగెద నీపై
భక్తిని నీవే ఒసగుము
భక్తుల హృత్తాపహారి భద్రగిరిపతీ.

భగవంతుడు

నన్ను స్మరించు నిన్ను విస్మరించను
నన్ను విశ్వసించు నిన్ను ఉద్ధరిస్తాను
నాపై భారముంచు రక్షకుడిగా ఉంటాను
శరణాగతి చెందు నేనే చూసుకుంటాను
నేనెక్కడో లేను నీ హృదయంలోనే ఉన్నాను

మంగళవారం, ఏప్రిల్ 25, 2006

చాటువులు ౧

ఉ.మామను సంహరించి యొక మామకు గర్వమడంచి యన్నిశా
మామను రాజుజేసి యొక మామ తనూజున కాత్మబంధువై
మామకు గన్నులిచ్చి సుతు మన్మథు పత్నికి దానె మామయై
మామకు మామయైన పరమాత్ముడు మాకు బ్రసన్నుడయ్యెడిన్.

కం. సిరిగలవానికి చెల్లును
తరుణులు పదియారువేల దగ పెండ్లాడన్
తిరిపమున కిద్దరాండ్రా
పరమేశ్వర గంగ విడుము పార్వతి చాలున్.

ఆదివారం, ఏప్రిల్ 23, 2006

ప్రారంభింపగ ఇష్టదేవతా స్తుతి

ఉ.శ్రీరఘురామ చారు తులసీదళదామ శమక్షమాది శృం
గార గుణాభిరామ త్రిజగన్నుతశౌర్య రమాలలామ దు
ర్వార కబంధ రాక్షస విరామ జగజ్జన కల్మషార్ణవో
త్తారకనామ భద్రగిరి దాశరథీ కరుణా పయోనిధీ.
దాశరథీ శతకము, కంచర్ల గోపన్న విరచితము.