శుక్రవారం, నవంబర్ 07, 2008

క్రికెట్‌ క్రీడా సౌరభము

కందములు

వల్లభుఁడను నా మిత్రుఁడు
చల్లగ నడిగెను నను నొకసారి* యసలు నే
నెల్లా సౌరవ్ ఫ్యానని
యుల్లాసముగా జవాబు నుత్తర క్షణమే

శ్రావ్యముగా పాడగఁ జిఱు
కావ్యముగా వ్రాసెదనని కైతగఁ మలచే
దివ్యక్షణముల నంతా
సవ్యంగా నుండఁ గోరి చతురాస్యుసతిం

గీర్వాణిని శ్రీరామునిఁ
బర్వతతనయాతనయునిఁ బరమేష్ఠిని గాం
ధర్వాది విద్యలఁ విభుఁడు
సర్వేశ్వరునిం దలంచి చనువునఁ గిరిజన్

తోటకము

అసలేమని వ్రాయుదు నాతనిపై?
కసిలో నెవరెస్టు నగప్రతి తా
నసమానుఁడు కిర్కెటు నాడుటలో
న సహించడు మాటను నల్వురిచే

శార్దూలము

గంగూలీ ఘనవంశజాతుఁడును బెంగాల్ రాష్ట్ర శార్దూలమున్
కంగారస్సలు లేకఁ దాఁ గదలుచూ క్లాసైన టైమింగుతోఁ
సింగారంబుగ బంతి నారు పరుగుల్ చేర్పించుటన్ వీరుడున్
కంగారూలతొ నాడుచుండెఁ దుదిగాఁ గౌశల్యముం జూపుచున్

ఆటవెలది

ఆటఁ జూచుచుంటెఁ హాయిగా నున్ననూ
చివరి మ్యాచ్చి గనుకఁ జిన్న బాధ
కలుగుచుండె వెలితిగాఁ దోచుచున్నది
మనసు మటుకు కలుకుమనుచు నుంది

సీసము

మురళీధరునినైనఁ ముప్పుత్రిప్పలఁ బెట్టి మూడుచెర్వుల నీటఁ ముంచగలఁడు
కాలుఁ ముందుకు వైచి గాలిలోఁ బంతులన్ సిక్సర్లు కొట్టేటి చేవ వాఁడు
ఆఫ్‌సైడు ఫీల్డులో నడ్డంకులెన్నున్నఁ జక్కగా నాడంగ శక్తియుతుఁడు
వీడి ఠస్సా దియ్య! వెనుదీయ డేదైనఁ బుఱ్ఱకేల్వాటంపు పొగరుబోతు

తేటగీతి

అజహరుద్దీను తరువాత నయ్యె నితఁడు
యిండియా టీము కెప్టెన్ను యింతవఱకు
వేరెవరికినీ లేనట్టి పేరు నొందె
నధిక విజయము లందించినది యితండె

ద్విపద

తిరిగి వచ్చుట కెంత త్రిప్పలు వడెనొ?
తనయందుఁ దనకెంత తరుగని స్థైర్య
మింత ధైర్యము వీని కెటుల యలవడె?
నూరకఁ బులి యని యూరంత యనునె?

మధ్యాక్కఱ

ఇంతకీ నా కెందు కిష్ట మింతగా నీతఁడు చూడ
నెంత లాఘవముతోఁ బ్యాట్టు నెత్తి బాల్‌నెంతగా బాదుఁ
బంతిమంతుఁడు మీడియముగ పదనుగాఁ బౌలింగు చేయుఁ
సాంతముగా మానధనుఁడు స్వయముగాఁ సౌరభ మితఁడు

_________________
* శ్రీసర్వధారి కార్తిక శుక్ల నవమి శుక్రవారం (2008 నవంబరు 6)