సోమవారం, మే 19, 2008

కళ్యాణరామ శతకం ౪

హరి! నీవు రాముడై వెలయఁ హరులై విహాయసచరులు
సురలందరు ఋషిగణములు క్షోణినిఁ సొచ్చిరి వన్య
చరసేనగా సేవఁ సేయఁ శరశూర! సమరలావణ్య!
కరధృతకోదండమూర్తి! కమనీయ కళ్యాణరామ!

కళ్యాణరామ శతకం ౩

అరుణాన్వయపు వృద్ధి కొఱకు హయమేధ యాగముఁ సలిపి
తరువాత పుత్రకామేష్ఠిఁ దశరథ నరపతి సేయఁ
బరమాత్మ! మనిషిగాఁ వస్తివయ్య రావణుఁ మట్టుబెట్టఁ

గరధృతకోదండమూర్తి! కమనీయ కళ్యాణరామ!

శనివారం, మే 17, 2008

కళ్యాణరామ శతకం ౨

భరతాగ్రజ! ధరణిజధవ! భవనుత! భద్రాద్రివాస!
వరదాయక! శరధిశయన! పద్మినీబంధువంశశశి!
పరిపాలితభువన! పాహి భక్తహృత్పంజరకీర!
కరధృతకోదండమూర్తి! కమనీయ కళ్యాణరామ!

కళ్యాణరామ శతకం ౧

కరిరాజు దీనుఁడై డస్సి కమలాక్ష కరమెత్తి మ్రొక్కఁ
సిరికైనఁ జెప్పకనె చని శీఘ్రమె ఛేదించి మకరి
శిరముఁ భక్త సులభుఁడవని శ్రీకర చెప్పితివయ్య
కరధృతకోదండమూర్తి! కమనీయ కళ్యాణరామ!

శుక్రవారం, మే 16, 2008

అమ్మ

ఈ పద్యాలు వ్రాయడానికి ప్రేరణ నిచ్చింది జాన్ హైడ్ గారి అమ్మ-బ్లాగు సంకలనం

ఆ.వె. అమ్మ జోలపాట, అమ్మ చల్లని చూపు,
అమ్మ మృదుల స్పర్శ, అమ్మ మాట,
అమ్మ చేతి బువ్వ అమృతపు నిలయముల్.
అమ్మ అమృతమూర్తి, అమృత మమ్మ.

కం. నవమాసంబులు కడుపున
నివసంబును, పోషణమును, నిర్భీతస్థితిన్,
పవమానపంచకము, ధా
తువుల నిడు జననిని దలతు తొలి దైవముగా.

తే.గీ. అమ్మ! నిను మించు దైవత మవనిలోన
లేదు, వాత్సల్యమున నీకు లేదు సాటి,
ఋణము నేమిచ్చి తీర్తును? తీర్చలేను,
చేతులెత్తి వందనములు సేతునమ్మ.

మధ్యాక్కర. శరదాంశతాధికాయువును, శతమాన సౌభాగ్యములను,
నిరతము నారోగ్యంబును, ననితరమౌ నీ భక్తి, ముక్తి
కరుణను మా యమ్మకిచ్చి కాపాడు కలకాల మీవు
కరధృతకోదండమూర్తి! కమనీయ కళ్యాణరామ!*

_______
*మా కులదైవం శ్రీరామచంద్రుడు.