బుధవారం, జులై 25, 2007

నా మొదటి మత్తకోకిలకిలలు

మ.కో.'మత్తకోకిల'లోన వ్రాయగ మానసంబున యెక్కడో
విత్తుయుండెను వృక్షమై యది వేళ్లనూనెను పెద్దదై
ఇత్తరిన్ చిగురింపజేసితి యీ "కవీరుహమున్" యిలా (భలే!)
క్రొత్త భావమె నీరు దీనికి కొమ్మలన్నియు పూయగా.

మ.కో.ఏమి వ్రాయను? మంచి భావన దేనికైనను ముఖ్యమే;
నా మనస్సున తోచినట్టివి నాకు తోచిన రీతిలో
రామచంద్రునిపైన నాలుగు వ్రాయబూనితి నింతలో
యేమిటో మనసెందుకో యటువైపు దృష్టి మరల్చదే!

మ.కో.అక్కటా! ఎటు మర్చిపోదును ఆంధ్రభాష పరిస్థితిన్
చక్కనైనది తేనెవంటిది శబ్దప్రౌఢత యున్నదీ
పెక్కుకావ్యప్రసూనమాలలు పెద్దనాదుల గన్నదీ
దిక్కుతోచక బిక్కచచ్చెడి దైన్యమెట్టుల పొందెనో?!

మ.కో.నీవు నా ప్రియమాతృభాషవు నేను సేసెద భక్తితో
సేవ నీకు, తరించటానికి శీఘ్రమార్గమిదేగదా,
మావిపల్లవఖాదనంబున 'మత్తకోకిల' పల్కునే
ఆ విధంబునె పల్కగా తగు శక్తినీయుము ఆంధ్రమా!

2 వ్యాఖ్యలు:

Giri చెప్పారు...

నాకు మీ మత్తకోకిలలు చాలా నచ్చాయి.

Raghava చెప్పారు...

ధన్యుణ్ణి, చాలాసంతోషం.