గురువారం, అక్టోబర్ 04, 2007

ఆఫీసు బ్రతుకు ౧

శా. అయ్యో! యేంటిది? నాది కూడ బ్రతుకే? ఆఫీసులో యెద్దులా
కుయ్యోమంటు పని ప్రవాహము నెలాగోలాగ దాటేసినా
దెయ్యాల్లాగ నికృష్ట (వికార) జీవితముతో తెల్లారినా నిద్రతో
పొయ్యేకాలమువైపు హాయిగ యిలా పోతున్న తీరేమిటో!!!

5 కామెంట్‌లు:

Naga Pochiraju చెప్పారు...

ఏంటి నాన్నా...నీ ఆఫీసు ఇంతగా నీలో కవి ని బయటికి తీస్తోందా

ఈ పద్యాన్ని మీ యముడికి(బాసు) అంకితం ఇవ్వక పోయావా [:)]

రానారె చెప్పారు...

ఇంత సరళమైన శార్ధూలం ఎక్కడా చూళ్లేదు. భలే రాశారు. ఒక్కచోట మాత్రం నాకు నచ్చలేదు. "అయ్యో, నాదీ ఒక ... బ్రతుకే?" అంటూ మొదలెట్టినవారు "పొయ్యేకాలమువైపు హాయిగ ..." పోవడమే నచ్చలేదు.

అజ్ఞాత చెప్పారు...

ఛందస్సులో సులభంగా పద్యాలు రాయగలిగేవారంటే నాకు గౌరగం, కించిత్తు అసూయ కలుగుతాయి..

రానారె అన్నట్లుగానే మీరు, సరళం గా రాసేసారు. అభినందనలు.

కించపరచడానికి కాదు కాని, కుయ్యోమనేది ఎద్దు కాదు కుక్క కదా - కుక్క అని వాడినా, ఛందస్సు నియమమేది తప్పదు కదా?

రాఘవ చెప్పారు...

లలితక్కయ్యా,
మా బాసుకి పొరబాటున అంకితమిచ్చానే అనుకో, పాపం పిచ్చెక్కి సన్యాసంలో కలిసిపోతాడు. నాకే ఇంత చిరాగ్గా వుంటే పాపం నాపై వాళ్లకి యింకా యెంత చిరాగ్గా వుంటుందో కదా!? తలచుకుంటేనే జాలేస్తోంది.

రామనాథ గారూ,
జీవితాన్ని యింత నిస్సారంగా గడిపేస్తున్నా అది పట్టించుకోకుండా, యేదో సంపాదిస్తున్నామా, కడుపునిండా తింటున్నామా, కంటినిండా నిద్రపోతున్నామా అనే చూస్తున్నా(ము). చిన్నతనంనుంచి యిప్పటివరకు యేమి సాధించామని వెనక్కి తిరిగి చూసుకుంటే నాకైతే అంతా శూన్యమే కనిపించింది. అప్పుడు పుట్టిందీ పద్యం. హాయిగా అనటానికి కారణం యేమిటంటే యివన్నీ పట్టించుకోకుండా, యెక్కడికి పోతున్నామో కూడా చూసుకోకుండా, యేదో నాటకంలో పాత్రల్లాగ, పైన వుటంకించినట్లు సంతోషాన్ని చిన్న చిన్న విషయాల్లో వెతుక్కుంటూ కాలాన్ని గడిపేస్తున్నామే అన్న చిన్న బాధ.

గిరి గారూ,
మీరు దీన్ని "వృషభ-శ్వాన-వ్యవహారం"గా చక్కగా మార్చేశారు. అక్కడ నా అభిప్రాయం యెద్దు కుయ్యోమంటుందనీ, అల్లాంటి యెద్దులా నేను అఘోరిస్తున్నాననీ కాదండీ. నేను కుయ్యో మొర్రో అంటూ మరియూ (గానుగ)యెద్దులా పనిజేస్తున్నానని. అయినా మీరన్నట్లుగా "కుక్కలా" అంటే గణభంగం జరగదుగానీ ఆత్మగౌరవభంగం మాత్రం తప్పదు. :)

కొత్త పాళీ చెప్పారు...

ఈ పద్యం చదువుతుంటే ఒక తమాషా ఫీలింగ్ కలిగింది. సాధారణంగా శార్దూలం అంటే సంస్కృత సమాసాలతో కాస్త గంభీరంగా మరికొంచెం భయానకంగా ఉంటుంది. రోజూ మాట్లాడుకునే మాటల్తో అలవోకగా ఉండటం, పద్యం నడక కూడా చక్కగా కుదరడం తమాషాగా అనిపిస్తుంది.వృషభ-శ్వాన-వ్యవహారం - దీన్నే mixed metaphor అంటారు ఇంగ్లీషులో. రాఘవా, గానుగెద్దు కంటే స్వేఛ్ఛగా ఉన్న కుక్క స్థితే బెటరేమో ఆలోచించు :-)