శార్దూలవిక్రీడితమ్
ఫుల్లాంభోరుహపత్రనేత్రయుగభూతౌ భానుతారాధవౌ
యస్యత్వన్వయనామయోస్సురుచయస్సంపూరయన్తావుభౌ
రాత్రీశాన్వయజాతడిజ్జలధరో యస్సూర్యవంశోద్భవ
స్సీతామాధవమాంజనేయరమణం తం రామచన్ద్రం భజే.
ప.వి.
ఫుల్ల అంభోరుహపత్ర నేత్రయుగ భూతౌ భానుతారాధవౌ యస్య తు అన్వయనామయోః సురుచయః సంపూరయన్తౌ ఉభౌ రాత్రీశ అన్వయజా తడిత్ జలధరః యః సూర్యవంశోద్భవః సీతామాధవమ్ ఆంజనేయరమణమ్ తమ్ రామచన్ద్రమ్ భజే
తా.
ఎవరికి సూర్యచంద్రులు వికసించిన తామరపూరేకులవంటి నేత్రద్వయమగుచున్నారో, ఎవరికి వంశమునందు (సూర్యవంశము) నామమునందు (శ్రీరామ'చంద్రుడు') సూర్యచంద్రులిరువురూ కాంతులు (రుచిః - కాంతి, రుచి, సౌందర్యం) నింపుతున్నారో, చంద్రవంశంలో పుట్టిన మెరుపుతీగెకు ఏ సూర్యవంశజుడు మేఘమగుచున్నాడో అట్టి సీత అనబడే లక్ష్మీభర్తయైన, ఆంజనేయరమణుడైన శ్రీరామచంద్రుని కొలచుచున్నాను.
8 కామెంట్లు:
ఇనకుల తిలకా! ఎవనియందు నీ నామము భాసిల్లుతున్నదో(రాఘవ), ఏ వంశము నిన్ను కులదైవంగా పూజించునో ఆ కులదీపకునికి, ఆ రాఘవునికి, నీ ఆశీస్సులందించుము. ఈ రాఘవుని చేయి పట్టుకుని ఏ సిరులరాణి సీతగా మారునో, ఆ సీతను సకలసౌభాగ్యసిద్ధిరస్తని దీవెనలొసగుము.
రాఘవగారూ, శ్రీరామనవమి శుభాకాంక్షలు.
మీక్కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు
చాలా బావుందండీ! "భూత" పదాన్నింకా వదల్లేదు :-)
మొత్తానికి మీసం పెంచే కవులవుతున్నారన్న మాట:-)
"తటిజ్జలధరో" అని ఉండాలికదా, టైపాటు పడినట్టుంది.
మీ శ్లోకానికి నా తేట తెలుగు అనువాదం:
ఎండదేవర జాబిల్లి యెవని కనులు
వెలుగు రేఱేడు లెవ్వని కొలము పేరు
మేటి పాలేటిపట్టింటి మెరుపు తీగ
కెవడు మొయిలయ్యె పగటివేల్పింటబుట్టి
అతని సీతమ్మ పెనిమిటి నంజి యెదను
కొలువు జేసిన రామయ్య గొలుతు నేను
శ్రీరామ నవమి శుభాకాంక్షలు.
రాఘవగారూ, శ్రీరామనవమి శుభాకాంక్షలు
శ్రీ రామనవమి శుభాకాంక్షలు.
శ్రీ రాముడి కుటుంబం,మీ కుటుంబాన్ని చల్లగా చూడాలని కోరుకొంటూ శ్రీరామనవమి శుభాకాంక్షలు.
చివుకుల కృష్ణమోహన్ గారూ, మీ దీవెనలకి కృతజ్ఞుణ్ణి.
భైరవభట్ల కామేశ్వరరావు గారూ,
ఈ "భూత" అన్న ప్రయోగం శ్రీలలితాసహస్రనామస్తోత్రంలో కూడ కానవస్తుందండీ -- తాటంకయుగళీభూతతపనోడుపమండలా అన్న నామంలో. తర్వాత తటిత్ అన్నా తప్పు లేదనుకుంటాను. కానీ సంస్కృతంలో తడిత్ అనే వాడుక. ఇక్కడ తడిత్ ప్రయోగానికి కూడా అమ్మవారి పేరే ఉటంకిస్తానండీ... తడిల్లతాసమరుచిః అని.
మీసం పెంచే కవులా? తిరుపతివేంకటకవులగుఱించి మాట్లాడుతున్నారా? మహాప్రభో నేను అర్భకార్భకుణ్ణండీ.
మేటి పాలేటిపట్టింటి మెరుపుతీగ కెవడు మొయిలయ్యె... పాలసముద్రమే కాక ఇందులో పాలనదులు కూడా కనబడుతున్నాయండీ. భలే.
శ్లోకపు సారాన్ని మీ ఈ అనువాదం చక్కగా గ్రహించగలిగిందండీ.
నేను మా స్వగ్రామానికి వెళ్లటంచేత వెంటనే స్పందించలేకపోయాను. కృష్ణమోహన్గారూ, విజయమోహన్గారూ, కామేశ్వరరావుగారూ, భాస్కరరామిరెడ్డిగారూ, "పరిమళం"గారూ, "అమ్మ ఒడి" ఆదిలక్ష్మిగారూ, మీ అందఱికీ మఱొక్కమాఱు శ్రీరామనవమి శుభాకాంక్షలు.
రాఘవగారు,
"తడిత్" గురించి వివరించినందుకు నెనరులు. నేను తెలుగులోని "తటిత్" పదాన్నే దృష్టిలో ఉంచుకొని అది టైపాటనుకున్నాను. సంస్కృతంలో "తడిత్" తెలుగులో "తటిత్" అయ్యిందన్నమాట!
మీరెంత అర్భకులో మీ కన్నా మీ పద్యాలే నిజం చెప్తున్నాయి లెండి :-)
కామెంట్‌ను పోస్ట్ చేయండి