మంగళవారం, ఏప్రిల్ 21, 2009

కైలాసాచలసానువాసము

కైలాసాచలసానువాసము వృషస్కంధాగ్రసంస్థాయి త
త్ప్రాలేయాచలకన్యకాకుచతటీపర్యంకనిద్రాగతం
బాలోలాగ్రజటాతటీఘటితనాకౌకస్సరిత్కంబు దే
హాలంకారితలేలిహానము వెలుం గర్చింతు విశ్వేశ్వరా


ఇది విశ్వనాథ సత్యనారాయణగారి శ్రీమద్రామాయణకల్పవృక్షావతారికయందలి రెండవ పద్యం. కైలాసాచలసానువాసము అనగానే నాకు మొదట తెనాలి రామకృష్ణుని ఉద్భటారాధ్యచరిత్రలోని పద్యం గుర్తొచ్చింది.

* * *

కైలాస-అచల-సాను-వాసము వృష-స్కంధ-అగ్ర-సంస్థాయి తత్-ప్రాలేయ-అచల-కన్యకా-కుచ-తటీ-పర్యంక-నిద్రా-ఆగతంబు ఆలోల-అగ్ర-జటా-తటీ-ఘటిత-నాక-ఓకస్-సరిత్కంబు దేహ-అలంకారిత-లేలిహానము వెలుంగు అర్చింతు విశ్వేశ్వరా

సం అంటే సమ్యక్, బాగుగా. స్థా గతినివృత్తౌ అని ధాతువు, అంటే గమనరహితమైన స్థితి. ప్రాలేయము మంచు. పర్యంకము మంచము. ఓకస్సు అంటే నివాసం. నాకౌకస్సు అంటే స్వర్గము నివాసముగా కల. "ఆలోల"లో లోల కంపిస్తున్న, ఆ స్వల్పత్వాన్ని సూచిస్తుంది. లేలిహానము అంటే పాము (లేలిహానో ద్విరసనో గోకర్ణః కఞ్చుకీ తథా అని అమరకోశము).

వెలుంగు అన్న పదం ఇక్కడ కీలకం. నిరాకారస్వరూపంగా అర్చించడమన్నమాట. ఎప్పుడైతే ఇలా నిరాకారస్వరూపంగా తీసుకున్నామో అప్పుడు చెప్పేవన్నీ స్త్రీ-పురుష-నపుంసక-లింగాతీతమైన శివలింగానికి సంబంధించినవౌతాయి కదా.

కైలాస పర్వత సానువులందు నివాసమున్నట్టిది. నందీశ్వరునియొక్క భుజములపైన చక్కగా నుండినది. ఆ మంచుకొండ కూతురైన పార్వతీదేవియొక్క పాలిండ్ల ప్రదేశమనే మంచముపై నిద్రను పొందునది. స్వల్పంగా కదులుతున్న జటాజూటపు పైభాగంలో స్వర్గలోకపు నదిని కలిగినట్టిది. దేహాలంకారముగా పామును చేసికొన్నట్టిది.

కైలాసపర్వతసానువులలో నివాసముంటూ, పాముని గంగని ధరించి, నందీశ్వరుని అధిరోహించి, పార్వతీదేవిపాలిండ్లపై నిద్రపోయే స్వరూపంగా కనిపిస్తున్న వెలుగువైన విశ్వేశ్వరా! నిన్ను కొలుస్తాను అని తాత్పర్యం.

* * *

ఇక్కడ ముందు పద్యంలో మాదిరిగా శివకేశవాభేదం గోచరించదు కానీ, వర్ణనలద్వారా సాకారమైన శివుణ్ణి నిరాకారమైన వెలుగుగా కొలుస్తాను అని చెప్పడంలో వింత అందం ద్యోతకమౌతోంది.

8 వ్యాఖ్యలు:

రవి చెప్పారు...

అసలు:

పద్యం మొదటి సారి చదివాను. ఆ తర్వాత మీ అన్వయం చదువుకుని రెండవసారి చదివాను.

కైలాస-అచల-సాను-వాసము
వృష-స్కంధ-అగ్ర-సంస్థాయి...

విశేషణాలన్నిటినీ సంస్కృత సమాసాలుగా చెప్పి, విశేష్యము "వెలుంగు" ను ఓ అచ్చతెనుగు పదంతో చెప్పాడాయన. (వెలుంగు - అచ్చ తెనుగు పదమని చదివాను. అమరంలోనూ "వెలుగు" కనబడలేదు)

మొదటి సారి చదివినప్పుడు ఓ అనుమానం (అజ్ఞానం )బయటకు వచ్చింది. అది మీ ముందుంచుతాను. వెలుగు - వెలిగి పోతున్నాడు - వెలిగించు - అంటే ప్రకాశించు, ఉప్పొంగి పోవు - అన్న అర్థం లో వాడుతాము కదా. "వెలుంగర్చింతు"- అంటే మిగులనర్చింతు, లేదా మనసు ఉప్పొంగునట్లు అర్చింతును అని అన్వయం చెప్పుకోవచ్చా? పద్యం చూడగనే నాకు స్ఫురించిన భావం ఇది. అయితే మీరు శివలింగాలినికి అన్వయించి చెప్పిన నిరాకార స్వరూప అర్చన కు తిరుగు లేదు.

కొసరు:

"లేలిహానో ద్విరసనో గోకర్ణః కఞ్చుకీ తథా".

ఈ మధ్య నాకు చాలా పాతకాలపు అమరం ఒకటి దొరికింది. అందులో ఉన్నది.

"లేలిహానః ద్విరసనో వ్యాళః కుమ్భీనసో హరిః"

మీరు ఉటంకించిన వాక్యంలో, కఞ్చుకః అంటే కుబుసము - ఈ పదం చూడగానే భోజరాజు చెప్పిన "మగ" పద్యం ఒకటి గుర్తొచ్చింది. ఇక్కడ చదుకోండి.

రవి చెప్పారు...

ఇందాక "మగ" కవిత్వం అనబోయి, మగ పద్యం అని వ్రాసాను. సవరించి చదువుకోగలరు.

రాఘవ చెప్పారు...

రవిగారూ,

౧ ఈ పద్యం చదవడం కూడా నాకు కూడా ఇదే ప్రథమమండీ. చదవగానే మీరు అన్నట్టుగానే మొత్తం సంస్కృతసమాసాలు వాడేసి చివర్న తెలుగు ప్రత్యయాలు చేర్చేసారు తెలివిగా అనిపించింది... "తత్" దానికి సాక్ష్యం (ఇక్కడ తత్ పూరకంలా ఉంది తప్పితే ఎందుకు వాడవలసివచ్చిందో స్పష్టంగా లేదు). గమనించారో లేదో; వాస, తటీ -- ఈ రెండూ రెండు సార్లు వాడారు. వసుచరిత్రలోని శ్రీభూపుత్రి వివాహవేళ పద్యంలో లీల అన్న పదాన్ని రెండు సార్లు రెండు అర్థాలలో వాడారు రామరాజభూషణుడు. విశ్వనాథవారు వాస, తటీ రెండు వేఱు పదార్థాలతో వాడారు. అదీ తేడా.

౨ నిజమే, వెలుగు చాలా కీలకమండీ ఇక్కడ. రెండు రకాలుగా అన్వయించుకోవచ్చు -- లక్ష్యమూ అదే క్రియా అదే. ఇన్నిరకాలుగా వెలుగు అంటే ఇన్నిరకాలుగా కనుపించు అన్న ధ్వని (క్రియ) ఒకటి. వెలుగు అంటే కాంతి అన్న ధ్వని (లక్ష్యం) ఒకటి.

౩ వెలుంగర్చింతు. వెలుఁగుకి ఉప్పొంగటమన్న అర్థం సందర్భాన్నిబట్టి వస్తుందేమో కానీనండీ, విడిగా ఆ అర్థం చెప్పవచ్చో లేదో నాకు తెలియదు. ఐనా సాహిత్యం ఆలోచనామృతం కాబట్టి మనకి నాలుగు రకాల అర్థాలు గోచరించాయంటే మనం అమృతపానం చేస్తున్నట్టే కదండీ. నిపీయ యస్య క్షితిరక్షిణః కథా స్తథాద్రియన్తే న బుధా స్సుధామపి :)

౪ నా వద్దనున్న అమరకోశంలో వరుస వేఱుగా ఉందండీ. వ్యాళ స్సరీసృపః అని మొదటే ఇచ్చారు. లేలిహానమన్న నామం తర్వాత కుమ్భీనసః ఫణధరో హరిర్భోగధరస్తథా అని ఇచ్చారు.

౫ మగ కవిత్వం! ఈ వాదంలో నిజం లేకపోలేదండీ :)

భైరవభట్ల కామేశ్వర రావు చెప్పారు...

"వెలుంగు" అన్నది క్రియ అవ్వాలంటే, అది "వెలుంగున్" అయ్యి, "వెలుంగునర్చింతు" అని సంధి జరగాలనుకుంటాను.
అంచేత అక్కడ "వెలుంగు" అన్నది నామవాచకమే అవుతుంది.
అలా అయినా, వెలుంగుని అని ద్వితీయా విభక్తి రావాలి. అదీ రాలేదు. అంచేత ఇందులో వ్యాకరణ భంగం ఉన్నట్టు అనిపిస్తోంది. ప్రాచీన సాహిత్యంలో ఇలాంటి విభక్తి లోపాలు ఎక్కడైనా ఉన్నాయేమో పరిశీలించాలి.
దీన్ని ఆధునిక కవిత్వంగా పరిగణిస్తే ఈ విభక్తి లోపం దాని గుణం అవుతుంది :-)

"జటావనీ" అన్న పాఠం కూడా నేను ఎక్కడో వినడమో చదవడమో జరిగింది.
"వాస" రెండు సార్లు ఎక్కడ వచ్చింది?

"తత్ ప్రాలేయాచల" అనడం వల్ల ఏ కైలాసమ్మీదైతే శివుడు నివసిస్తున్నాడో, ఆ కైలాసగిరి కన్యకే అతని భార్య అన్న అర్థం వస్తుంది. శివుడు ఇల్లరికం ఉన్నాడన్న విషయాన్ని నొక్కి చెయ్యడానికేమో!

రాఘవ చెప్పారు...

కామేశ్వరరావుగారూ,

౦ నేను అభ్యంతరం వెలిపుచ్చుతున్నానధ్యక్షా! :)

౧ వెలుంగు క్రియ కావాలంటే వెలుంగున్ అవ్వవలసిన అవసరం లేదేమోనండీ. పదాలు కాస్త అటూ ఇటూ జరిపి, ఇన్నిరకాలుగా వెలుఁగు విశ్వేశ్వరా [నిన్ను] అర్చింతు అని చెప్పుకోవచ్చని నా భావన.

౨ నాకు ఈ పద్యంలో వ్యాకరణదోషం కూడా ఏమీ కనబడడం లేదు. మీరు అన్నట్టుగా, వెలుంగుకి ద్రుతము చేరి వెలుంగున్ అయ్యి దానిని క్రియగా వాడితే అంత అందం రాదనుకుంటానండీ. ఏదో శివుడికే నువ్వు శివుడివి అని చెప్పినట్టు ఉంటుంది. అలా కాకుండా ద్వితీయా విభక్తి వాచకంగా తీసుకుంటే (వెలుంగున్) విశ్వేశ్వరుడికి వెలుగుని అర్చిస్తాను అని చెప్పినట్టుగా ఉండి, ఈ విశ్వేశ్వరుడూ ఆ వెలుగూ వేఱ్వేఱేమో అన్న సందేహం కలిగించగలదు (విశేషణాలు చక్కగా శివుడే అని చెప్పకపోతే). ఇది కేవలం నా అభిప్రాయం. తప్పై ఉండవచ్చు కూడాను.

౩ ఇక ఆధునిక కవిత్వంలో విభక్తిలోపం గుణమా అంటే... నో కామెంట్సు ;)

౪ నేను గత ఆదివారంనాడు శ్రీమద్రామాయణకల్పవృక్షం పుస్తకాలు కొన్నానండీ. అందులో జటాతటీ అనే ముద్రితమైంది. జటావనీ పాఠం కూడా చక్కగానే ఉంది.

౫ అవతారికలోని ఈ మొదటి రెండు పద్యాలూ చూస్తే "వెలుంగర్చింతు విశ్వేశ్వరా" అన్నది చూడడానికి ఈ పద్యద్వయానికి మకుటంగా కనిపిస్తోంది.

౬ తత్ప్రాలేయాచల. నాకు మీరు చెప్పేదాకా తట్టనేలేదు... కనబడనీయకుండా మధ్యలో నందీశ్వరుడు అడ్డుగా నిలబడ్డాడు. :)

౭ సంస్థాయి... సంవాసి కొంచెం పొరబడ్డాను. వాస రెండు సార్లు రాలేదు.

భైరవభట్ల కామేశ్వర రావు చెప్పారు...

కల్పవృక్షంలో ఈ మొదటి రెండు పద్యాలూ (శ్రీమంజూషిక, కైలాసాచల సానువాసము), అసలు విశ్వేశ్వర శతకంలోనివి. "విశ్వేశ్వరా" అనే మకుటంతో విశ్వనాథ ఒక శతకాన్ని రచించారు (కల్పవృక్ష రచనకి ముందే). ఇవాళ ఇంటికొచ్చి ఆ పుస్తకం తిరగేస్తే కనిపించింది, అందులో "జటావనీ" అన్న పాఠం ఉంది.

ఇక "వెలుంగు" గురించి. ఎవరైనా తెలుగు పండితులని అడిగి నిర్ధారించుకోవాలి. నాకు దోషమని అనిపించడానికి కారణాలు:
1. మీరన్నట్టు పద క్రమాన్ని మార్చుకొని అన్వయించుకోడం సంస్కృతంలో కుదిరినట్టు, తెలుగులో అన్ని సందర్భాలలో కుదరదు. ముఖ్యంగా "వెలుగు అర్చింతు విశ్వేశ్వరా" అన్న పదాల క్రమాన్ని "వెలుగు విశ్వేశ్వరా అర్చింతు" అని మార్చుకొనే వీలు తెలుగులో ఉండదని నేననుకుంటున్నాను.
2. ద్రుతం గురించి. మొదటి పద్యం చివర చూడండి - "పొల్చు వెల్గు నొకడే" అని ద్రుతం వచ్చింది. నాకు తెలిసి ద్రుతం నిత్యమే కాని వైకల్పికం కాదు (అచ్చు పరమైనప్పుడు).

ఇవి కేవలం అనుమానాలే. ఎవరినైనా అడిగి నివృత్తి చేసుకోవాఅలి.

రాకేశ్వర రావు చెప్పారు...

సానువు - కొండనెత్తము
స్కంధ - భుజ శిరస్సు
తటి - దరి, ఒడ్డు, ప్రదేశము
ప్రాలేయము - శరత్కలపు ప్రళయమున వచ్చునది = మంచు (ప్రాళేయము అనవచ్చా మనం తెలుఁగు వారం ?)
ఆలోల - మెల్లగా కదులు
ఓకస్ - నివాసం (దివోకసము, దివౌకసము = పక్షి)
సరిత్కము - నది (నీరు గలది? ఇందాకే గరికిపాటి వారు సరస్వతికి నదికి ఏదో అర్థ సంబంధం చెప్పారు, గుర్తులేదు)
నాకము - దుఃఖము లేని లోకము = స్వర్గము
లేలీహాసము - మాటిమాటికిని లేహనము (నాకుట) చేయునది = పాము

ఇన్ని సార్లు నిఘంటు తిరగవేయాల్సి వచ్చింది. తుంబా థాంక్సో కణా :)

బొల్లోజు బాబా చెప్పారు...

తెలుగు మాస్టారు పాఠం చెపుతూంటే బుద్దిగా చేతులుకట్టుకొని వింటున్నటుగా ఉంది నా పరిస్థితి.
అందరకూ నమస్సులు
బొల్లోజు బాబా