శనివారం, జనవరి 03, 2009

శ్రీశ్రీ లేకున్ననేమి సిరిసిరిమువ్వా

ఊకదంపుడుగారి బ్లాగులో ఈ టపా చూసి అప్పటికప్పుడు మదిలో మెదిలిన ఆలోచనే ఈ అక్షరమంజరి...

విశ్రాంతి చాలు చాలిక
లే శ్రమతోనైన కంటిరెప్పకు మల్లే
ప్రశ్రయమున నే చూచెద
శ్రీశ్రీ లేకున్ననేమి సిరిసిరిమువ్వా ౧

కందాలే మళ్ళీనా
అందామని ఉన్న కూడ అనవద్దమ్మా
అందంగా భావాలను
చిందిస్తా చిందులాడు సిరిసిరిమువ్వా ౨

ఓ కుఱ్ఱకుంక రాఘవ
నీకెందుకు నా గుఱించి నేనొప్పను పో
పో కైతలా ఇవనుచూ
ఛీ కొట్టకు నన్ను నువ్వు సిరిసిరిమువ్వా ౩

ఈ కవన మారథాన్లో
నా కంటే ముందు ఎవడు నడిచేస్తాడో!
నాకొక ఛాన్సిచ్చావో
చేకొందును ఫస్టు నేను సిరిసిరిమువ్వా ౪

ఇంకా ఏం కావాలట
నీకింకో గాఠి మాట నిజమిది శ్రీశ్రీ
కే కాదమ్మా పేర్లో
నాకూ శ్రీ ఉంది చూడు నా సిరి* మువ్వా ౫

లెచ్చర్లిచ్చుట సుళువే
అచ్చంగా టెల్గులోన అరవండంటూ
చచ్చే చావొచ్చిందే
చిచ్చీ ఇంగ్లీషుతోటి సిరిసిరిమువ్వా ౬

ఐనా కూడా యత్ని
స్తా నా వంతు పని నేను సాధించేస్తా
శానా సేయాలి... తెలుగు
సేనకు నే బంటునమ్మ సిరిసిరిమువ్వా ౭

నాది తెలుగు భాష అనీ
నా దేశము భారతమని నలుదిశలందూ
ఏదీ చాటక పోతే
చేదెక్కాలమ్మ జిహ్వ సిరిసిరిమువ్వా ౮

గునపం పారా కత్తీ
పని చేస్తేనే కదమ్మ పదిమందికి నో
ట్లో నలిగేదీ మెతుకులు
చినుకులు నడిపెడి బ్రతుకులు సిరిసిరిమువ్వా ౯

ఈ లోకంలో ఎంతో
కాలంగా ఉన్న వృత్తి కాయాకష్టం
గాలీ వానా ఎండా
చేలో సిరి ఉన్నదమ్మ సిరిసిరిమువ్వా ౧౦

పాలసపోటా కొబ్బరి
పాలూ గోదారినీళ్లు పనసా అరటీ
పాలూ జున్నూ చెరకూ
చేలో వరికంకి సిరులు సిరిసిరిమువ్వా ౧౧

కూలీనాలీ చేసే
పాలేళ్లూ కౌలుదార్లు పచ్చని చేలూ
కాలువగట్లూ ఈతలు
చేలో పాట సరదాలు సిరిసిరిమువ్వా ౧౨

వైనం చూస్తే దేశం
నానాటికి మారుతోంది నాగంభొట్లూ :)
గానుగ ఆడిన నూనెలు
చేనేతల బట్టలేవి సిరిసిరిమువ్వా ౧౩

వన్నెల బట్టల డూ బస
వన్నల సంక్రాంతి ఆటపాటలు చూశా
వెన్నెల్లో ఆటల్నీ
చిన్నప్పుడు చూస్తి నేను సిరిసిరిమువ్వా ౧౪

కోనేటిలోని చేపలు
మానులపై గూళ్లు చందమామా మట్టీ
వానా నా మదిలో రా
సేనెన్నో కవితలు మరి సిరిసిరిమువ్వా ౧౫

దోమలు చేసే నాదం
ఆమనిలో కోకిల స్వర మాడే నెమలీ
రాముడి గుడి పానకమూ
చీమల క్రమశిక్షణ భళి సిరిసిరిమువ్వా ౧౬

వేసవిలో మామిళ్లూ
శైశవమున అమ్మ చేతి చద్దన్నాలూ
సీసాల్లో షోడాలూ
చేసిన అల్లరి పసందు సిరిసిరిమువ్వా ౧౭

స్కూల్లో గెంతిన రోజులు
పిల్లా పిచికా కబుర్లు పీచు మిఠాయీ
చిల్లుల జేబులు ఇంకా
చిల్లరతో కొన్న జీళ్లు సిరిసిరిమువ్వా ౧౮

మా సారు పుస్తకాలూ
క్లాసుల మధ్యన కబుర్ల కాలక్షేపం
రాసిన పేరడి పాటలు
సీసంతో నా తకధిమి సిరిసిరిమువ్వా ౧౯

పూటకి ఇన్నే రాస్తా
నేటికి ఇవి చాలు నీకు నే వెళ్లొస్తా
పోటీ పరుగుల మధ్యన
చీటికి మాటికి కుదరదు సిరిసిరిమువ్వా ౨౦

చెమక్కు: ఇవాళ ముగింపు చురుక్కు...

దురుసుగ వాగే తమ్ముడు
సరిగా గుదిబండలాగు చక్కగ ఉంటే
పరకాల మిత్రులున్నా
చిరు నెగ్గునొ నెగ్గలేడొ సిరిసిరిమువ్వా ౨౧

______
*ఒక్కటే శ్రీ కదా... ఒక్కటే సిరి

30 కామెంట్‌లు:

Bolloju Baba చెప్పారు...

ఇది ముమ్మూర్తులా సిరిసిరిమువ్వే. నాకు బాగా నచ్చేసింది.

లెచ్చర్లిచ్చుట సుళువే
అచ్చంగా టెల్గులోన అరవండంటూ
చచ్చే చావొచ్చిందే
చిచ్చీ ఇంగ్లీషుతోటి సిరిసిరిమువ్వా ౬


మిగిలినవన్నీ చాలా బాగున్నాయి.

Unknown చెప్పారు...

బాబా గారిదే నా అభిప్రాయం కూడా.పద్యాలన్నీ బహు సుందరంగా ఉన్నాయి.

కామేశ్వరరావు చెప్పారు...

వాగ్విలసఛ్చ్రీ రాఘవ!
వాగ్వేగమదేమి! కంద పద్యాశ్వ కళా
భాగ్వంతులైరి ఆ మే
జిగ్వల్గనమద్భుతమ్ము సిరిసిరిమువ్వా!

రాఘవ చెప్పారు...

కామెంట్లే దీవెనలిక
పై మహబాగు 'నరసింహ' బాబా గార్లూ
కామేశ్వరరావ్వారూ
చేమంతుల వందనాలు... సిరిసిరిమువ్వా :)

vijay చెప్పారు...

చాలా బాగున్నాయి రాఘవ. నాకు పద్యాల గురించి అంతగా తెలీదు ఐనా చదవగానే చాలా చక్కగా అనిపించాయి. పాత కాలపు రొజుల గురించి చాలా బాగా చెప్పావు. All the Best..

అజ్ఞాత చెప్పారు...

శ్రీశ్రీ కవిత్వం మీరు బాగా పట్టుకున్నారు రాఘవ గారూ!

అజ్ఞాత చెప్పారు...

చినుకులు నడిపెడి బ్రతుకులు /
చినుకులు తడిపెడి బ్రతుకులు
చాలా మంచి అభివ్యక్తి.

అప్పుడు గాచిన నెయ్యిల
అప్పటి కప్పుడుగజెప్ప ఆశువు రఘుశ్రీ,
మెప్పది నాకును జెల్లును
జెప్పితి శ్రీశ్రీ జయంతి, సిరిసిరి మువ్వా! :)

పుష్యం చెప్పారు...

కం//
ఆశుగ పద్యం బొక్కటి
వ్రాసుట బహు కష్టమెపుడు, రాఘవ మీరో?
రాసులొకొద్దీ వ్రాసిరి
చూసిన వారెల్ల మెచ్చ సిరిసిరి మువ్వా


కం//
ముక్కగ విరచిన బజ్జీ
చక్కగ నోటితొ నమలుతు చల్లని బీరున్
గ్రుక్కెడు త్రాగిన ఫీలింగ్
చిక్కెను మీ కవిత చదవ సిరిసిరి మువ్వా :-)

పుష్యం చెప్పారు...

"చూసిన వారెల్ల మెచ్చ సిరిసిరి మువ్వా" లో యతి తప్పింది. చెప్పాగా ఆశువుగా వ్రాయటం బహు కష్టమని :-) "చూసిన వారెల్ల మెచ్చ సొగసరి మువ్వా" అని చదవగలరు.

పుష్యం చెప్పారు...

మరొక్కటి

ఉక్కగ ఉండిన రోజున
చొక్కా గుండీలు విప్పి షోకుగ ఏ.సీ.
ప్రక్కన నిలచిన ఫీలింగ్
చిక్కెను మీ కవిత చదవ సిరిసిరి మువ్వా :-)

రానారె చెప్పారు...

కమనీయము నీ కవితల
గమనము, గలగల పదముల కడువేగమునన్
గమకపు సెలయేరువలే
చెమకుల పారించెనిచట సిరిసిరిమువ్వా!

పుష్యం చెప్పారు...

ఆఖరి పాదం recycle చేస్తూ ఇంకో పద్యం..

కం//
క్రిక్కిరిసి ఉన్న బస్సును
ఎక్కిన వెంటనొక సీటు ఇంపుగ కిటికీ
ప్రక్కన దొరకిన ఫీలింగ్
చిక్కెను మీ కవిత చదవ .. సిరిసిరి మువ్వా!

ఆత్రేయ కొండూరు చెప్పారు...

ఆశగ పద్యం బొక్కటి
చందసు సరి కూడునటుల రాయగ రాదే ?
కుప్పగ చాల రాసిరి
సిగ్గుతొ నామది చచ్చె సిరిసిరి మువ్వా !!

రాఘవ చెప్పారు...

అందరి కవితావేశపు
సందట్లో కొంత... ఇచటసైతం నీకై
కందాలవాన చక్కగ
చిందిందే చూడు చూడు సిరిసిరిమువ్వా

విజయ్‌బాబూ, మురళిగారూ, ఊదంగారూ, రామనాథులవారూ, "పుష్యం"గారూ, మీ అందరికీ నెనరులు :)

రాఘవ చెప్పారు...

ఆత్రేయగారూ,
పద్యాలు వ్రాయాలన్న ఆత్రం ఉంటే చాలండీ. ఇప్పుడూ చక్కగా వ్రాసారు కదా. ఇక ఛందోబద్ధం ఎలా చెయ్యాలంటారూ, పెద్దలు ఎలాగూ ఉండనే ఉన్నారు. ఆంధ్రామృతం బ్లాగులో రామకృష్ణారావుగారి ప్రాస-యతి పాఠాలూ, తెలుగుపద్యం బ్లాగులో భైరవభట్ల మేస్టారి వివరణలూ... అబ్బో బోలెడు. చూస్తూ ఉండండి మీకూ ఇట్టే వచ్చేస్తాయి ఛందోబద్ధ పద్యాలు.

చంద్ర మోహన్ చెప్పారు...

శ్రీశ్రీ లేకుంటేనేం
సుశ్రీరాఘవ యిలాంటి సొగసగు కందా
లీశ్రేణిని వ్రాస్తుంటే
శ్రీశ్రీనిక దలచునెవడు సిరి సిరి మువ్వా!

ఫణి ప్రసన్న కుమార్ చెప్పారు...

హవ్వా! ఏమీ పద్యాల్?
సవ్వాలే లేదు ఇట్టి సరసపు కవనం
బివ్వాల్టి రోజు జగతిని
వెవ్వెడల జూడ కానము వెదకిన మువ్వా!

krishna చెప్పారు...

రాఘవా గారు,
చాలా బాగున్నయి రసకందాలు.
ఆరుద్ర కూనలమ్మ పదాలు శ్రీ శ్రీ రాసినట్టుగా వుంది.

అజ్ఞాత చెప్పారు...

ఫణి గారు,
పద్యం బావుంది, ఏమీ అనుకోకపోతే నాలుగో పాదాన్ని సవరించి నిక్కచ్చి కందం చేయరూ

రాఘవ చెప్పారు...

చంద్రమోహన్‌గారూ, కృష్ణుడు గారూ, ఎంతమాట!

ఫణిగారూ, ఊకదంపుడు మహాయశుడు అడిగారు కూడా కదా... నాలుగో పాదం మార్చేయండి.

కందాలను మెచ్చిన మీ
అందరికీ వందనాలు ఐనా శ్రీశ్రీ
ముందు మొదలుపెట్టె కనుక
చెందాలి క్రెడిట్లు తనకె... సింపుల్ చాలా. (మళ్లీ సిరిసిరిమువ్వా అనాలనిపించక)

ఏకాంతపు దిలీప్ చెప్పారు...

22 ఏళ్ళ కుర్రాడు ఆశువుగా పద్యాలు రాసేస్తున్నాడు అంటే, ఇంకా తెలుగుకి చాలా రోజులున్నాయి... ముగ్ధుడనైపోయాను...

అజ్ఞాత చెప్పారు...

ఇరవై రెండే ళ్ళయినను
అరవై రెండేళ్ళు మించె ననుభవ సారం!
సిరిసిరి మువ్వల సాటిగ
సిరిగల కందముల నల్లు సరిజోడితడే!

అజ్ఞాత చెప్పారు...

ఇరవై రెండే ళ్ళయినను
అరవై రెండేళ్ళు మించె ననుభవ సారం!
సిరిసిరి మువ్వల సాటిగ
సరియగు కందముల నల్లు సరిజోడితడే!

ఫణి ప్రసన్న కుమార్ చెప్పారు...

ఊకదంపుడు మహాశయా,రాఘవ గారూ,ఈ టపాలోకి ఆలస్యంగా తిరిగి వచ్చినందుకు మన్నించండి.మీ వినతి శిరోధార్యం.స్వీకరించండి.

హవ్వా ఏమీ పద్యాల్?
సవ్వాలే లేదు ఇట్టి సరసపు కవనం
బివ్వాల్టి రోజు కానము
అవ్వార్నిధి ముత్యమట్లు వహ్వా మువ్వా!

mmkodihalli చెప్పారు...

ఫణీ!
అవ్వార్నిధి ముత్యమట్లు = ఆ సముద్రంలో ముత్యం అట్లు అంటే విశాలమైన సముద్రంలో ముత్యమంత స్వల్పమైనది అని అర్థమా? లేక సముద్రంలో ముత్యమంత విలువైనది అని అర్థమా?

రాఘవ చెప్పారు...

దిలీప్‌గారూ, చదువరిగారూ, ఫణిగారూ, నెనరులు.

మురళిగారూ, నేను తెలుగు సేనకు బంటును మాత్రమేనండీ. ఆపై రానారె అన్నట్టుగా “మీ దయ మా ప్రాప్తం” :P

ఓ మువ్వా, సవ్వడి అదిరింది నీకు చప్పట్లివిగో!

అజ్ఞాత చెప్పారు...

ఫణి గారు,
మీ మొదటి పద్యాన్ని కొద్దిగా మార్చే సాహసం చేస్తున్నాను, మన్నించండి

హవ్వా! ఏమీ పద్యాల్?
సవ్వాలే లేదు ఇట్టి సరసపు కవనం
బివ్వాల్టి రోజు జగతిని
వెవ్వెడలవెతుకకనగలవేమరి? మువ్వా?


భవదీయుడు
ఊదం

ఫణి ప్రసన్న కుమార్ చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
ఫణి ప్రసన్న కుమార్ చెప్పారు...

నా పద్యాన్ని సవరించినందుకు ఊదం గారికి కృతగ్నతలు.

మిస్సన్న చెప్పారు...

సిరిసిరిమువ్వా అంటూ
పరిగెట్టేయ్ చకచకాను పద్యాలన్నీ
సరిసరి రాఘవ మీరే
సరి మీకిల! బండి లేటు సారూ! సారీ.