శుక్రవారం, మే 16, 2008

అమ్మ

ఈ పద్యాలు వ్రాయడానికి ప్రేరణ నిచ్చింది జాన్ హైడ్ గారి అమ్మ-బ్లాగు సంకలనం

ఆ.వె. అమ్మ జోలపాట, అమ్మ చల్లని చూపు,
అమ్మ మృదుల స్పర్శ, అమ్మ మాట,
అమ్మ చేతి బువ్వ అమృతపు నిలయముల్.
అమ్మ అమృతమూర్తి, అమృత మమ్మ.

కం. నవమాసంబులు కడుపున
నివసంబును, పోషణమును, నిర్భీతస్థితిన్,
పవమానపంచకము, ధా
తువుల నిడు జననిని దలతు తొలి దైవముగా.

తే.గీ. అమ్మ! నిను మించు దైవత మవనిలోన
లేదు, వాత్సల్యమున నీకు లేదు సాటి,
ఋణము నేమిచ్చి తీర్తును? తీర్చలేను,
చేతులెత్తి వందనములు సేతునమ్మ.

మధ్యాక్కర. శరదాంశతాధికాయువును, శతమాన సౌభాగ్యములను,
నిరతము నారోగ్యంబును, ననితరమౌ నీ భక్తి, ముక్తి
కరుణను మా యమ్మకిచ్చి కాపాడు కలకాల మీవు
కరధృతకోదండమూర్తి! కమనీయ కళ్యాణరామ!*

_______
*మా కులదైవం శ్రీరామచంద్రుడు.

13 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

@ రాఘవ, బాగున్నాయ్ పద్యాలు. ముఖ్యంగా మొదటిది. తక్కినవాటిలో ఆ ప్రవాహం జోరు తగ్గిందనిపించింది.

కామేశ్వరరావు చెప్పారు...

పద్యాలు బావున్నాయి.
విశ్వనాథలా మీరూ మీ కులదైవం పేరుమీద మధ్యాక్కర శతకం రాయకూడదూ.
"కరధృతకోదండమూర్తి! కమనీయ కళ్యాణరామ!" అన్నది మకుటంగా బావుంటుంది.

krishna చెప్పారు...

చాలా బాగున్నాయి మీ పద్యాలు అమ్మ్మ మీద.

చివర పద్యం రెండవ పాదంలో (నారోగ్యంబును, ననితరమౌ )ఎలా పదాలు విడగొట్టాలో కొంచం చెప్పరా?దయచేసి అలాగే మధ్యక్కర గణాలు కూడా తెల్పండి.

రాఘవ చెప్పారు...

వికటకవి శ్రీనివాస్‌గారూ కృతజ్ఞుణ్ణి. మీరన్నట్టు మొదటి పద్యం తక్కిన వాటికన్నా బాగా వచ్చింది. కారణం బహుశా ఇదై ఉండచ్చు... అమ్మ అంటే మనకి ఉండే భావన అమ్మలో అందరూ ఆరాధించే విశేషాలని మొదటి పద్యం చెప్తుంది. రెండవది అమ్మని సృష్టికర్త్రిగా నిలబెట్టి అమ్మలో దైవాన్ని చూపిస్తుంది. మూడవది అమ్మకి నమస్సులందజేస్తుంది. నాల్గవది అమ్మ లాభక్షేమాన్ని కోరుతుంది.

కామేశ్వరరావుగారూ ధన్యో2స్మి. మధ్యాక్కర శతకం వ్రాయి అని మీరనడం వరకూ బాగానే ఉంది. కానీ అసలు పని చూస్తే హిమశైలశిఖరంలా ఉంది. నేనా అర్భకుణ్ణి. ఏదో ఒక శతకం ఏదో తంటాలు పడి వ్రాయగలను కానీ, ఇప్పుడు మకుటం మీరన్నట్టుగా కరధృతకోదండమూర్తి కమనీయ కళ్యాణరామ వాడి వ్రాయాలంటే మాత్రం చాలా కష్టసాధ్యం. ఒకటి ప్రాస 300 సార్లు (మకుటాన్ని వదిలేసి లెక్కపెడితే) ర కే సరిపెట్టాలా... పైగా మొదట లఘువుతో ప్రారంభించానేమో లఘువుతో ప్రారంభమయ్యే 300 పాదాలూ వ్రాయాలా ఆ లెక్కన...
అయినా ఒజ్జ చెప్పిన తర్వాత శిష్యుడు అష్టకష్టాలు పడైనా పూర్తి చేయడానికి ప్రయత్నించెదడుగాక. ఒజ్జ ఆశీర్వాదములు శిష్యుణ్ణి వెన్నంటి నడిపించునుగాక.

కృష్ణగారూ కృతజ్ఞతలు. ఒక్క పాదమో పదమో ఏం కర్మ... పద్యం మొత్తం విడగొడతాను. శరదాంశతాధికాయువును శతమాన సౌభాగ్యములను నిరతమున్ ఆరోగ్యంబునున్ అనితరమౌ నీ భక్తి ముక్తి కరుణను మా అమ్మకి ఇచ్చి కాపాడు కలకాలం ఈవు కర ధృత కోదండ మూర్తి కమనీయ కళ్యాణ రామ.
శరదాంశతమ్ అని సంస్కృతంలో విరివిగా వాడబడే వాడుక అందరికీ సుపరిచితమే. ఏ పదానికి ఆ పదం అర్థం చెప్పుకుంటే శరత్కాలములలో వంద అని దానర్థం. శరదాంశతాధిక ... నూఱు సంవత్సరములకు మించిన. ఆయువు వయస్సు. శతమాన అంటే ఇక్కడ రెండు అర్థాలు చెప్పుకోవచ్చు. శతమాన అంటే మళ్లీ నూఱు సంవత్సరాలు అని చెప్పుకోవచ్చు. అది కాకుండా శతమానాలు అంటే మంగళసూత్రాలు అని మరో అర్థం చెప్పుకోవచ్చు. పైగా సౌభాగ్యం గురించి తర్వాత చెప్పబడింది కూడాను. సౌభాగ్యములను పసుపుకుంకుమలనే మంచి అదృష్టాన్ని. అంతర్లీనంగా తండ్రి క్షేమం కోరడం. నిరతమున్ ఎల్లప్పుడూ. ఆరోగ్యంబున్ స్వస్థతని రోగాలు లేని స్థితిని. అనితరమౌ అనన్యమైన. నీ తమరి. భక్తి చరణకమలసేవ. ముక్తి మోక్షం. (తల్లిదండ్రుల అన్యోన్యదాంపత్యం కలకాలం ఉండాలి, అది ముక్తికి దారితీయాలన్న ఆకాంక్ష నిగూఢం). కరుణను కరుణతో. మా మాయొక్క. అమ్మకి మాతృమూర్తికి. ఇచ్చి దయజేసి. కాపాడు రక్షించు. కలకాలం ఎల్లప్పుడూ. ఈవు నీవు. కర చేతితో. ధృత ధరించబడిన. కోదండ విల్లు. మూర్తి ...(కోదండపాణి) స్వరూపంకలవాడా. కమనీయ మోహన. కళ్యాణ సమస్త శుభములనూ ఇచ్చే స్వరూపం కల. రామ శ్రీరామచంద్రప్రభూ.
కోదండపాణిగా శత్రుసంహారకుడైన రామచంద్రమూర్తిని స్తుతించి ఆ వింటిని నమ్ముకున్న తల్లిదండ్రుల యోగక్షేమాలు ఎప్పుడూ చూసుకొమ్మని ఆ సమస్తకళ్యాణగుణాభిరాముణ్ణే కోరుతున్నట్టు.

అందరికీ ఒక సూటి ప్రశ్న. పద్యాలు చదవగానే అర్థమయ్యేలా వ్రాయగలిగానా? లేదా అర్థమవడానికి తిప్పలు పెట్టేలా ఉన్నాయా?

కామేశ్వరరావు చెప్పారు...

రాఘవగారూ,
అవును సమండీ, నేనంత కష్టమవుతుందని ఆలోచించలేదు. పోనీ "కమనీయ కళ్యాణరామ!" అన్నది మాత్రమే మకుటంగా ప్రయత్నించండి.

కృష్ణుడు గారూ,
మధ్యాక్కర ఒక విచిత్రమైన ఛందస్సు. సాధారణంగా పద్యానికుండే ధార దీనికుండదు. రెండు ఇంద్రగణాలూ (సీస పద్యం మొదటి పాదంలో సగం), ఒక సూర్యగణం (UI లేదా III) మళ్ళీ రెండు ఇంద్రగణాలూ ఒక సూర్యగణం. దీనికి రెండు రకాలైన నడకులున్నాయి. ఒకటి ఇలా ఉంటుంది: "తానాన తననాన తనన - తాననా తానాన తాన". దీనికి నాలుగవ గణం మొదటి అక్షరం యతి అవుతుంది.
మరొక నడక: "తానాన తననాన తనన తాననా - తానాన తాన". దీనికి అయిదవ గణం మొదటి అక్షరం యతి అవుతుంది. ఈ రెండవది మొదటిదానికన్నా ప్రాచీనమైనది.
రాఘవగారు తన పద్యంలో రెండు యతులనీ పాటించారు!
మధ్యాక్కర వ్యావహారికమైన తెలుగు సంభాషణలకి అనువుగా ఉండే ఛందస్సు.

గిరి Giri చెప్పారు...

రాఘవా, పద్యాలు బావున్నాయి. పోనీ, కమనీయ కల్యాణ రామ అనేదే మకుటంగా వాడవచ్చు కదా?
(అయినా, మకుటం యతి స్ధానం నుండి మొదలైతే, మొదటి అక్షరం ద్విత్వం వేసుకుంటేనే మేలు)

గిరి Giri చెప్పారు...

మరొక్క మాట. మీరు ఈపాటికే పూనుకున్నారని అనిపిస్తోంది, నేను కుండలీకరణాల్లో ఉంచిన వ్యాఖ్యని అంతగా పట్టించుకోవద్దు, కష్టపడితే సాధ్యపడంది లేదు కదా?

రాఘవ చెప్పారు...

కామేశ్వరరావు మేస్టారూ,
మీరు చెప్పారు అంతే. ఒక శిష్యుడిగా నేను ప్రయత్నిస్తాను. అన్నట్టు కృష్ణుడుగారు అడిగిన రెండో ప్రశ్న నేను మరచిపోయాను. మీరే సమాధానం చెప్పారు. కృతజ్ఞతలు.

గిరి గారూ,
మీ వ్యాఖ్య చూసాక కష్టమైనా సరే వ్రాసేద్దాం అన్న భావన ఇంకా బలపడింది. ఇప్పుడే ఒక పద్యం పూర్తి చేసి ప్రచురించాను. చూడండి.

krishna చెప్పారు...

రాఘవ గారు,
ధన్యవాదాలు.మొత్తం పద్యం విడగొట్టి చెప్పినందుకు చాలా సంతోషం.

కామేశ్వరరావుగారు,ధన్యవాదములు.

Sanath Sripathi చెప్పారు...

రాఘవ గారూ.. అమ్మ గురించీ, నాన్న గురించీ, ఇద్దరి తో 'స రి సమానం గా' రాముడి గురించీ వర్ణించినట్టు పద్యాలు హృద్యం గా ఉన్నాయి. నేను నిన్న రాత్రి 11 గ. లకు ప్రారంభించా మీ బ్లాగు చదవతం. ఇప్పటికి పూర్తైనాయి. ఆద్యంతం రమణీయం గా సాగింది ఝరి.

నేను బ్లాగు మొదలు పెట్టి సరిగ్గ 10 రొజులు కాలెదు. ఏదొ మనకి తట్టింది రాద్దం అనుకున్నా కానీ ఇలా హెమా హెమీలందరూ ఉన్నారని ఇప్పుడే తెలిసింది.

నా ప్రయోగాలన్నీ హనుమంతుడి ముందు కుప్పి గంతులు అని తెలుస్తున్నై. కాకపొతే నిరాశ లేదు. చేరుకునే మార్గం తెలిసింది కదా..చేరాల్సిన గమ్యం తెలిసింది కద..

మరొక్క మారు కృతజ్ఞతలు, గురుతెరుగ జేసేవాడే గురువు...

రాఘవ చెప్పారు...

నా బ్లాగు నిద్ర మానుకుని మరీ చదివారంటే చాలా ఆశ్చర్యపోయాను. మా రాముడు నిజంగా ఘటికుడే!

నా చేత ఏమైనా వ్రాయబడిందీ అంటే ఆ వ్రాత బాగా కుదిరింది అంటే దానికి కేవలం మా తల్లిదండ్రుల ఆశీర్వాదము అలాగే మా రామచంద్రమూర్తి కృపలే కారణం. నేను కేవలం నిమిత్తమాత్రుణ్ణి.

వ్రాస్తూనే ఉండండి. అది మీకు మాత్రమే కాదు తెలుగు భాషామాతృకకి కూడా మంచిది :)

Sanath Sripathi చెప్పారు...

రాఘవ గారూ..

చిన్న స(వి)వరణ. నిద్ర మానుకోలెదు. నిద్ర రాలేదు అంతే. తాగుతున్న పాయసం ఆపలేదు. చర్విత చర్వణం లాగా.. అన్ని పద్యాలనీ మళ్ళీ మళ్ళీ చదివాక కానీ తెలియ లేదు తెల్లారి పోయిందని.

Unknown చెప్పారు...

చాలా బాగుంది. కలగ మురళకృష్ణ రామాయణ భాగవత ప్రవచనకర్త