శుక్రవారం, సెప్టెంబర్ 11, 2009

ప్రార్థన

నమస్తే సదావత్సలే మాతృభూమే త్వయా హిన్దుభూమే సుఖం వర్ధితో೭హమ్
మహామఙ్గలే పుణ్యభూమే త్వదర్థే పతత్వేష కాయో నమస్తే నమస్తే ౧


తా. నిత్యవాత్సల్యవైన ఓ మాతృభూమీ, నీకు వందనం. ఓ హిన్దుభూమీ, నీచే సుఖంగా పెంచబడ్డాను. గొప్ప మంగళస్వరూపవైన ఓ పుణ్యభూమీ, నీ కోసం ఈ శరీరం పడిపోవాలి. నీకు వందనం. నీకు వందనం.

ప్రభో శక్తిమన్ హిన్దురాష్ట్రాఙ్గభూతా ఇమే సాదరం త్వాం నమామో వయమ్
త్వదీయాయ కార్యాయ బద్ధా కటీయం శుభామాశిషం దేహి తత్పూర్తయే
అజయ్యాం చ విశ్వస్య దేహీశ శక్తిం సుశీలం జగద్యేన నమ్రం భవేత్
శ్రుతం చైవ యత్కణ్టకాకీర్ణ మార్గం స్వయం స్వీకృతం నస్సుగం కారయేత్ ౨


తా. సర్వశక్తివంతుడవైన ఓ ప్రభూ, నీకు హిందురాష్ట్రపు బిడ్డలం అందరమూ సాదరంగా నమస్కరిస్తున్నాం. నీ పని చేయడం కోసమే నడుంబిగించాం. ఆ పని పూర్తి అవ్వడం కోసం నీ శుభాశీస్సులు ఇవ్వు. ఓ విశ్వేశ్వరా, ప్రపంచం గౌరవించేలాగ, ముళ్లమార్గమే అని విన్నా కూడా మేము స్వయంగా ఎంచుకున్న ఈ మార్గం సుగమం అయ్యేలాగ మాకు అజేయమైన శక్తినీ మంచి నడువడినీ ఇవ్వు.

సముత్కర్షనిశ్శ్రేయసస్యైకముగ్రం పరం సాధనం నామ వీరవ్రతమ్
తదన్తస్స్ఫురత్వక్షయా ధ్యేయనిష్ఠా హృదన్తః ప్రజాగర్తు తీవ్రానిశమ్
విజేత్రీ చ నస్సంహతా కార్యశక్తిర్విధాయాస్య ధర్మస్య సంరక్షణమ్
పరం వైభవం నేతుమేతత్స్వరాష్ట్రం సమర్థా భవత్వాశిషా తే భృశమ్ ౩


తా. శ్రేష్ఠమైన మోక్షాన్ని సాధించే అద్వితీయమైన ఉగ్రమైన వీరవ్రతం మా మనస్సులలో కొలువై ఉండాలి. ఆ అక్షయమైన ధ్యేయనిష్ఠ తీవ్రంగా నిత్యం మా గుండెలలో మేల్కొని ఉండాలి. నీ ఆశీస్సులవల్ల బోలెడంత సామర్థం పొంది, విజయవంతమై కేంద్రీకృతమై మా కార్యశక్తి ధర్మసంరక్షణ చేసి, స్వరాష్ట్రానికి గొప్ప వైభవాన్ని తీసుకురావాలి.

[ఇది "గురూజీ"గా పిలువబడే శ్రీ మాధవ సదాశివ గోల్వల్కరు గారిచే సంస్కృతంలో వ్రాయబడిన రాష్ట్రీయ స్వయంసేవక సంఘ ప్రార్థన. ఇంత అద్భుతమైన ఈ ప్రార్థనను నాకు నేర్పిన శ్రీ కళాపూర్ణారావుగారికీ, నాకు సంఘాన్ని పరిచయం చేసిన శ్రీ సదాశివగారికీ వేనవేల కృతజ్ఞతలు, నమస్కారాలు. ఈ ప్రార్థనకు ప్రస్తుతం ప్రచురించిన వ్యావహారిక భాషలోని తెలుగు తాత్పర్యాలు నావి, అందులో దోషాలుంటే దొడ్డమనసుతో మన్నించి నా దృష్టికి తీసుకురాగలరు.]

8 కామెంట్‌లు:

రవి చెప్పారు...

విశ్వకవి ఠాగూర్ "ఏక్లా చలో" అన్న బంగ్లా గీతం రచించారు. ఆ రచనకు, తిరుమల రామచంద్ర గారు, సంస్కృతానువాదం చేశారట, "ఏకాకీ చర ఏకాకీ చర.." అన్న మకుటంతో.

మీరు ఉటంకించిన పద్యాలు ఉద్వేగంగా, భావగంభీరంగా ఉన్నాయి.

రాఘవ చెప్పారు...

గురూజీ మంచి ప్రతిభాశాలండీ. భారతీయత చక్కగా ప్రతిబింబింపజేసారు ఆయన ఈ ప్రార్థనలో.

తిరుమల రామచంద్రగారి సంస్కృతానువాదం దొరకలేదు కానీ, రవీంద్రుని కృతి ఎంచక్కా వికీలో ఉందండీ... http://en.wikipedia.org/wiki/Ekla_Chalo_Re :)

rākeśvara చెప్పారు...

మొదటి రెండు పద్యాలూ సంస్కృతంలోనే చదివి, ఇదేమిటబ్బా సంఘవాసనలు వస్తున్నాయి అనుకున్నాను. క్రింద వివరణ వుండనే వుంది.

ఠాగూరే అన్నారు, దేశాభిమానం కంటా సకలనరాభిమానం మిన్న అని. వసుధైక కుటుంబం అన్నది ఆదర్శం. దేశైక కుటుంబం అన్నది కత్తులు దువ్వే లోకంలో ఒక అనివార్య వికృతం.

రాఘవ చెప్పారు...

@రాకేశా:

అసలు వసుధైకకుటుంబం అనే భావనని మనసారా నమ్మి, నిరంతరం అదే స్పృహతో ఉండి, దానిని ఆచరించగలిగిన వారు కచ్చితంగా జీవన్ముక్తులే. ఆ స్థితి అంత తేలికగా రాదు కనుకే పుట్టినదేశం అని!

జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి.

కంది శంకరయ్య చెప్పారు...

ఈ ప్రార్థనతో నా చిన్నప్పడు శాఖకు వెళ్ళిన రోజుల్ని గుర్తుకు తెచ్చారు. ఇది నాకు కంఠస్థమే. మిమ్మల్ని సంఘానికి పరిచయం చేసిన సదాశివ రావు గారంటే వరంగల్ భండారు సదాశివ రావు గారేనా? మరొకరా?

లక్ష్మీదేవి / लक्ष्मीदेवी చెప్పారు...

రాఘవగారూ!
చాలా ప్రభావపూరితమైన తాత్పర్యం అందరికీ పరిచయం చేసినందుకు కృతఙ్ఞతలు.

రాఘవ చెప్పారు...

కంది శంకరయ్య గారూ,
సదాశివగారి ఇంటిపేరు నాకు తెలియదండీ. కానీ ఆయనది ఓరుగల్లే అనుకుంటాను. నెనరులు.

మందాకిని గారూ, నెనరులు.

Srinivas చెప్పారు...

RSS ప్రార్థన రాసింది గురూజీ కాదు. ఆయన ఆధ్యాత్మికత గురించి చదివీ, వినీ ఉన్నాను కానీ, కవిత్వం గురించీ, పాండిత్యం గురించీ చదవలేదూ, వినలేదు.

1939 లో సింధీ అనే చోట జరిగిన ఓ కాంపులో ఈ ప్రార్థనని కొందరు పండితులు రాసారని జ్ఞాపకం.

సదాశివ - ఆయన తండ్రి పేరు. వరంగల్లులో సదాశివరావు గారు వేరు. ఆయన బండారు సదాశివరావుగారనుకుంటా.