మంగళవారం, ఆగస్టు 11, 2009

శివధనుర్భంగపుసన్నివేశంలో ఐదు పద్యాలు

శ్రీమద్రామాయణకల్పవృక్ష మహాకావ్యంలో విశ్వనాథ సత్యనారాయణ గారు ఉపకాండలకి పెట్టిన పేర్లు సముచితాలు. ఉదాహరణకి బాలకాండలో చాలా ముఖ్యమైన ఘట్టాలు ఏమిటి అని ఎవరైనా అడిగితే మనకి వెంటనే స్ఫురించేవి పుత్రకామేష్టీ శ్రీరామజననమూ విశ్వామిత్రాగమనమూ అహల్యాశాపవిమోచనమూ శివధనుర్భంగమూ సీతారామకల్యాణమూను. ఇందులో అహల్యాశాపవిమోచనమూ శివధనుర్భంగమూ విశ్వామిత్రాగమనం పైన ఆధారపడ్డవే కాబట్టి ఈ జాబితాలో దానిని మినహాయించవచ్చు. విశ్వనాథ సత్యనారాయణ గారు పెట్టిన పేర్లు సరిగ్గా ఇక మిగిలిన ఘట్టాలకు సంబంధించినవే. మరొక విషయం ఏమంటే ఉపకాండలని ఆయన ఖండాలని పిలిచారు. ౢకప్తత కోసం ఆ పేర్లలోని ఆ ఆ సమాసాలలో ముఖ్యమైన పదాలని మాత్రమే తీసుకున్నారు. అంటే పుత్రకామేష్టిలో ఇష్టి అన్నది ముఖ్యమైన పదం కాబట్టి ఇష్టిఖండము అని పేరు పెట్టారు. అలాగే తరువాతవి అవతారఖండమూ అహల్యాఖండమూ ధనుష్ఖండమూ కల్యాణఖండమూను.

ఈ ధనుష్ఖండంలోనే అహల్యాతనయుడైన శతానందుడు రామలక్ష్మణులకి విశ్వామిత్రచరిత్రని చెబుతాడు. నాకు బాలకాండలో ఈ విశ్వామిత్రచరిత్ర చెప్పే సర్గలు ఎందుకో కానీ భలే ఇష్టం. అందువల్ల నాలుగు నెలల క్రితం కల్పవృక్షం సంపుటాలు ఆరూ కొనగానే నేను ముందు చదివినది ఈ విశ్వామిత్రచరిత్రే (బాల-ధనుస్సు ౫౬-౨౫౯). అందులో వాల్మీకిమహర్షి చెప్పిన మూలకథకి అనుగుణంగా వ్రాసినది కాక, కొన్ని చోట్ల చిన్నవే ఐనా విశ్వనాథవారు చాలా అందమైన కల్పనలు చేసారు. వాటి గురించి తరువాతి టపాలో వ్రాస్తాను. ప్రస్తుతం ఈ ధనుష్ఖండంలో మల్లిన నరసింహారావుగారు  అడిగిన ఐదు పద్యాలూ నాకు అర్థమైనట్టుగా వివరించడానికి ప్రయత్నిస్తాను.

* * *

ఈ శివధనుర్భంగానికి సంబంధించి వాల్మీకిమహర్షి కృతమైన శ్రీమద్రామాయణంలో రెండు శ్లోకాలు ఉన్నాయి.

శ్రీరామచంద్రుడు వింటినారి సారించాక ఎక్కుపెట్టాడనీ, అలా ఎక్కుపెట్టడంద్వారా ఆ ధనుస్సుని మధ్యలో విరిచాడనీ—

ఆరోపయిత్వా మౌర్వీం చ పూరయామాస వీర్యవాన్।
తద్బభంజ ధనుర్మధ్యే నరశ్రేష్ఠో మహాయశాః।।
(బాల-౬౭-౧౭)

అప్పుడు పిడుగుపాటులాంటి గొప్ప నాదం ఆవిర్భవించిందనీ, పర్వతం బ్రద్దలైందా అన్నట్టుగా భూమి కంపించిందనీ—

తస్య శబ్దో మహానాసీత్ నిర్ఘాతసమనిఃస్వనః।
భూమికమ్పశ్చ సుమహాన్ పర్వతస్యేవ దీర్యతః।।
(బాల-౬౭-౧౮)

* * *

ఇక విశ్వనాథవారి పద్యాలు. ఈ ఐదూ సందర్భానికి తగిన అక్షరరమ్యత నిండుగా తొణికిసలాడే పద్యాలు.

నిష్ఠావర్ష దమోఘ మేఘపటలీ నిర్గచ్ఛ దుద్యోతిత
స్పేష్ఠేరమ్మదమాలికా యుగప దుజ్జృంభన్మహాఘోర బం
హిష్ఠ స్ఫూర్జథు షండమండిత రవాహీన క్రియా ప్రౌఢి ద్రా
ఘిష్ఠంబై యొకరావ మంతట నెసంగెన్ ఛిన్నచాపంబునన్.
(బాల-ధనుస్సు-౩౦౧)

నిష్ఠా ఆవర్షత్ అమోఘ మేఘ పటలీ నిర్గచ్ఛత్ ఉద్యోదిత స్ఫేష్ఠ ఇరమ్మద మాలికా యుగపత్ ఉజ్జృంభత్ మహా ఘోర బంహిష్ఠ స్ఫూర్జథు షండ మండిత రవ అహీన క్రియా ప్రౌఢి ద్రాఘిష్ఠంబై ఒక రావము అంతటన్ ఎసంగెన్ ఛిన్న చాపంబునన్

నిష్ఠా నిలకడగా ఆగకుండా. స్ఫేష్ఠ మిక్కిలి. ఇరమ్మద మెరుపులోని జ్యోతి. యుగపత్ కలిసియుండే. బంహిష్ఠ శక్తివంతమైన. స్ఫూర్జథు ఉరుము. షండ గుంపు. ద్రాఘిష్ఠ మిక్కిలి దీర్ఘమైన.

నిలకడగా కురియడం ద్వారా సఫలాలైన మేఘసమూహాల నుండి బయల్వెడలుతూ ప్రకాశించే బోలెడు మెరుపుల్లోని జ్వాలామాలలతో కలిసి అతిశయించే మహాభయంకరమైన శక్తివంతమైన ఉరుముల గుంపుచే అలంకరింపబడినట్టుగా గొప్ప ధ్వని లేకుండా ఉండనట్టిదీ [శివధనుర్భంగం అనే] క్రియ యొక్క శ్రేష్ఠత్వం వలన చాలా దీర్ఘమైనట్టిదీ ఐన ఒక మహానాదం విరిగిన వింటినుండి అంతటా వ్యాపించింది.

ఈ పద్యంలో మేఘపటలీనిర్గచ్ఛత్ అనడం ద్వారా అంతర్లీనంగా నీలమేఘశ్యాముడైన రాముని చేతినుండి విరిగిన “ధనుష్ఖండము” వెలువడిందనీ, మేఘం మెరుపులూ ఉరుములూ వెలువరించినట్లుగా ఆ విరిగిన విల్లు బోలెడు కాంతినీ బ్రహ్మాండమైన ధ్వనినీ నలుదిక్కులలో వెదజల్లిందనీ చెప్పబడింది.

హేరంబోన్నత శూర్పకర్ణ వివరహ్రీకారియై షణ్ముఖ
స్ఫార ద్వాదశ నేత్రగోళ వివృతిప్రాకారమై శైలక
న్యారాజ న్నవ ఫాలమండల విభుగ్నక్రీడమై యాశ్చల
ద్గీరుగ్రప్రమథంబుగా ధనువు మ్రోఁగెన్ శైవలోకంబులన్.
(బాల-ధనుస్సు-౩౦౨)

హేరంబ ఉన్నత శూర్ప కర్ణ వివర హ్రీకారియై షణ్ముఖ స్ఫార ద్వాదశ నేత్ర గోళ వివృతి ప్రాకారమై శైల కన్యా రాజత్ నవ ఫాల మండల విభుగ్న క్రీడమై ఆశ్చలత్ గీః ఉగ్ర ప్రమథంబుగాన్ ధనువు మ్రోఁగెన్ శైవ లోకంబులన్

శూర్ప చేట. వివర కన్నము. హ్రీ సిగ్గు. స్ఫార గొప్ప. వివృతి పూర్తిగా తెరుచుకోవడం. ప్రాకార చుట్టుగోడ. విభుగ్న వంగిన వంకరగా ఉన్న. ఆశ్చలత్ కంపించే(?). గీః వాక్కు.

వినాయకుడి గొప్ప చేటల్లాంటి చెవిరంధ్రాలకి సిగ్గు కలిగించేదిగా, కుమారస్వామికి పూర్తిగా తెరుచుకున్న పన్నెండు కనుగ్రుడ్లకీ చుట్టుగోడ అయ్యి, పార్వతీదేవియొక్క ప్రకాశించే నుదుటిపై చిట్లింపు అనే విలాసమయ్యి, కంపించిన మాటలు కలిగినవారిగా భయంకరమైన ప్రమథగణాలని చేసినదై శైవలోకాలలో ధనుస్సు మ్రోగింది.

చేటలంత పెద్ద చెవులకి కూడా ధ్వని అధికమైనదే అనీ, పన్నెండు కళ్లున్నా కాంతిని పూర్తిగా గ్రహించలేవనీ, అమ్మవారి దృష్టిని కూడా ఆకర్షించిందనీ, ఉగ్రంగా ఉండే ప్రమథగణాలకి సైతం మాటలు తడబడ్డాయనీ అర్థం. శివుడే ఆ వెలుగు (వెలుంగర్చింతు విశ్వేశ్వరా) కాబట్టి పైగా శివకేశవాద్వైతం చూపించారు కాబట్టి శివుడి గురించి ప్రత్యేకంగా చెప్పలేదు.

నృత్యన్మంజుల తారహార కబరీనిష్యంది ముక్తామణి
ప్రత్యగ్ర ప్రసవాక్షి సంకలన దీవ్య త్కంధరాభేద సా
హిత్య ప్రౌఢ నవాప్సరోనటన సౌహిత్యప్రశస్తాచ్ఛదృ
గ్గీత్యాకార మనోజ్ఞమై ధనువు మ్రోఁగెన్ స్వర్గలోకంబులన్.
(బాల-ధనుస్సు-౩౦౩)

నృత్యత్ మంజుల తార హార కబరీ నిష్యంది ముక్తా మణి ప్రత్యగ్ర ప్రసవ అక్షి సంకలన దీవ్యత్ కంధర అభేద సాహిత్య ప్రౌఢ నవాప్సరోనటన సౌహిత్య ప్రశస్త ఆచ్ఛత్ ఋక్ గీతి ఆకార మనోజ్ఞమై ధనువు మ్రోఁగెన్ స్వర్గ లోకంబులన్

తార ముత్యం. కబరీ జడ. నిష్యంది జారుతున్న. ముక్తామణి ముత్యం. ప్రత్యగ్ర క్రొత్త. ప్రసవ పువ్వు. దీవ్యత్ ఆడుతున్న. కంధర తల, మెడ. సాహిత్య సహితత్వం. సౌహిత్య మనోజ్ఞత్వం. ఆచ్ఛత్ కప్పుతున్న. ఋక్ పొగడ్త.

నర్తిస్తున్న అందమైన ముత్యాలజడనుండి జారుతున్న ముత్యాలనీ మొగ్గలనీ కంటితో ఏరే ఆటాడే మెడకు తగినట్లుగా గొప్ప [దొడ్డ చిన్న అందరూ§] అప్సరసల నటనలోని అందం యొక్క గొప్పతనాన్ని కప్పే గానంలాగ మనోజ్ఞమై ధనుస్సు స్వర్గలోకాలలో మ్రోగింది.

అప్సరసలు నర్తిస్తున్నారు. ఆ నర్తనం చాలా అందంగా ఉంది. వాళ్లు నర్తిస్తూ ఉంటే జడలు కూడా నర్తిస్తున్నాయి. ఆ జడలు కదలడం వల్ల వాటికి పెట్టుకున్న ముత్యాలూ, ననలూ రాలిపడుతున్నాయి. ఆ రాలుతున్నవాటిని చూపులతోనే ఏరుతున్నారా అన్నట్టుగా కదులుతున్నాయి వాళ్ల తలలు. ఆ తలలు ఎలా కదులుతున్నాయో వాటికి అభేదంగా సాహిత్యంగా (సహితము–సాహిత్యము)... అంటే ఆ తలల కదలికలు ఎలా ఉన్నాయో అచ్చంగా అలాగే వాటికి తగినట్టుగానే వారి ఆంగికం కూడా ఉందట. అటువంటి ఆ నాట్యం లోని గొప్పతనాన్ని దాస్తోందా అన్నట్లుంది పొగడ్త. ఆ పొగడ్తని గానం చేస్తే ఆ ఋగ్గానం కూడా అందంగా ఉందట. అంత అందంగానూ స్వర్గలోకంలో శివధనుర్నాదం వినవచ్చిందీ, అంటే స్వర్గలోకంలో వారికి ఆ ధ్వని వినసొంపుగా ఉంది అని అర్థం.

దర్పస్వీకృతహాస విశ్లథనరుంధద్దుష్టవాగ్ధోరణీ
సర్పద్వీరచమూ పథశ్లథనమై స్రంసత్కటీ శాటికా
కూర్పాస ప్రకటోగ్ర సాధ్వస వధూగుర్విణ్య భద్రాధ్వమై
దర్పాడంబరమై ధనుస్సు మొఱసెన్ దైతేయలోకంబులన్.
(బాల-ధనుస్సు-౩౦౪)

దర్ప స్వీకృత హాస విశ్లథన రుంధత్ దుష్ట వాక్ ధోరణీ సర్పత్ వీర చమూ పథ శ్లథనమై స్రంసత్ కటీ శాటికా కూర్పాస ప్రకట ఉగ్ర సాధ్వస వధూ గుర్విణీ అభద్ర అధ్వమై దర్ప ఆడంబరమై ధనుస్సు మొఱసెన్ దైతేయ లోకంబులన్

శ్లథన వీడిపోవడం సడలిపోవడం. రుంధత్ అడ్డుపడే. సర్పత్ గమించే. స్రంసత్ పడే. శాటికా లుంగీ లాంటి గుడ్డ. కూర్పాస కవచం. సాధ్వస భయం. గుర్విణీ చూలాలు. అధ్వ మార్గం. మొఱయు మ్రోఁగు.

దర్పంవలన కలిగిన సంతోషం వీడిపోకుండా అడ్డుపడే చెడు మాటల పద్ధతిగల కదిలే వీరసైన్యానికి మార్గం నిర్వీర్యంచేసేలా, [అట్టి రాక్షసుల] జారిన కటివస్త్రాలూ కవచాల ద్వారా స్పష్టమయ్యే భీతివలన రాక్షసస్త్రీలకి భద్రం చేకూర్చనట్టిదై, [దైత్యుల దర్పాలను తీసేయడంలో] దర్పంతోకూడిన వైభవం కలదై ఆ ధనుస్సు దైత్యలోకాలలో మ్రోగిందట.

రాక్షసుల లక్షణం చెప్తున్నారు. వాళ్లు దర్పం వలన సంతోషపడతారట. అలాంటి సంతోషం పోకుండా చెడ్డ మాటలు మాట్లాడుకుంటారట. అలాంటి రాక్షసుల సైన్యానికి మార్గం సడలించేది. రెండర్థాలు. ఒకటి, వారి పట్టు తీసేయడం, నిర్వీర్యం చేయడం. రెండు, భూలోకంలో వారి ఆయుస్సు తీసేసి [త్వరగా] మోక్షాన్ని ఇవ్వడం. ఈ ధనుస్సు వల్ల ఆ రాక్షసుల వస్త్రాలూ కవచాలూ జారిపోతున్నాయట. అది స్పష్టంగా తెలియడం వల్ల రాక్షసస్త్రీలకి భయం కలుగుతోందట. కడుపుతో ఉన్న రాక్షసస్త్రీలకి అభద్రమైన మార్గమట.

స్ఫీతాష్టాపదవిద్యుదుజ్జ్వల పయ౱పీయుషధారాధునీ
నీతాస్వాద్యతర ప్రగల్భవచన స్నిగ్ధాననాంభోజ సం
ధాతీర్థంకర (తీర్థాకృతి) మాగధోల్బణము నానా మేదినీరాట్సభా
గీతిస్వాదు మనోజ్ఞమై ధనువు మ్రోఁగెన్ రాజలోకంబులన్.
(బాల-ధనుస్సు-౩౦౫)

స్ఫీత అష్టాపద విద్యుత్ ఉజ్జ్వల పయః పీయుష ధారా ధునీ నీత ఆస్వాద్యతర ప్రగల్భ వచన స్నిగ్ధ ఆనన అంభోజ సంధా తీర్థంకర (తీర్థాకృతి) మాగధ ఉల్బణము నానా మేదినీ రాట్ సభా గీతి స్వాదు మనోజ్ఞమై ధనువు మ్రోఁగెన్ రాజలోకంబులన్

స్ఫీత విశాలమైన. అష్టాపద కైలాసం. నీత తేబడిన. స్నిగ్ధ స్నేహముగల. సంధా కలయిక. మాగధ స్తోత్రము చేసేవాడు. ఉల్బణము మిక్కిలి, అతిశయము. స్వాదు తీపి.

అసలే విశాలమైన కైలాసం. అక్కడ మెరుపులా ప్రకాశించే కైలాసజలం. ఆ అమృతపుధార వల్ల ఏర్పడ్డ నది నుండి తేబడిన నీరు. ఆ నీటికి ఉన్న రుచి కన్నా మిక్కిలి రుచికరమైన ప్రగల్భవాక్యం. ఆ వాక్యం చెప్పే ఆప్తుని ముఖకమలం. ఆ కమలాన్ని బాగా ధరించిన తీర్థం వంటి మాగధుల అతిశయం. అలా ఉందట ఈ ధ్వని. అంతే కాదు, నానా రాజసభలలోనూ పాడే గీతాల తీయనిదనంలాగ మనోజ్ఞంగా ఉందట. అంటే రాజులందరికీ ఇది సంతోషకరమైన తీయని వార్త అని అర్థం.

* * *

అసలు ఈ నాలుగు లోకాలే ఎందుకు ఎంచుకోవాలి?

విరిచినది శివుని చాపం. తన ప్రభువు చేసిన ఘనకార్యాన్ని చూసి సంతోషించాడు శివుడు. శివుడు కాక కైలాసంలో ఉన్న చిన్నా పెద్దా అందరూ ఎలా స్పందించారో చెప్పారు ఒక పద్యంలో.

శ్రీరామావతారం కోసం ప్రార్థించినవారు దేవతలు. కాబట్టి అవతార ప్రయోజనం నెరవేరడం ప్రారంభమయ్యిందీ అని ఆ సురలకే తెలియజేయడం. స్వయంగా వైకుంఠవాసుడే విరిచాడు కాబట్టి వైకుంఠలోకంలో ఎలా మ్రోగిందో చెప్పనవసరంలేదు. బ్రహ్మగారి సత్యలోకమూ స్వర్గాలలో ఒకటి కాబట్టి ప్రత్యేకంగా చెప్పలేదు.

దైత్యలోకంలో వినబడిందీ అని చెప్పడం ద్వారా వారికి హెచ్చరిక అందిందీ అని.

రాజలోకాలలో వినబడిన మ్రోత ఇక రాక్షసుల అరాచకాలకి అంతమనీ, రామరాజ్యం రాబోతోందీ అని సూచన.

* * *

విశ్వనాథవారు మూలకథకు చేసిన ఒక మార్పు ధనుష్ఖండంలోనే విష్ణుచాపాన్ని కూడా తీసుకురావడం, తద్ద్వారా ఆయన తెలివిగా ఇవే పద్యాలని చిన్న చిన్న మార్పులతో మళ్లీ వాడుకోవడం జరిగింది.

--------
§ప్రౌఢ అంటే దొడ్డ, నవ అంటే చిన్న అన్న అర్థంలో

9 కామెంట్‌లు:

రవి చెప్పారు...

తెలుగు పద్యాలు కూడా సంస్కృత పద్యాల్లాగే ఉన్నాయి. రావణుని శివతాండవస్తోత్రం గుర్తొచ్చింది.

కిన్నెరసాని వంటి పద్యాలు వ్రాసిన విశ్వనాథ వారేనా ఈ పద్యాలు వ్రాసింది అనిపిస్తుంది.

Unknown చెప్పారు...

మీరు ఎంతో ఓపికతో వివరించిన పద్యాల అర్థాలు తెలుసుకున్నాక ఎనలేని సంతృప్తి కలిగింది. విశ్వనాథ వారిమీద భక్తి అంతకంతకూ పెరుగుతోంది. శ్రమ తీసుకుని వివరించినందుకు మీకు అనేకానేక ధన్యవాదాలు. విశ్వనాథ వారు విష్ణుచాప ధ్వనిని దాదాపు ఇవే పద్యాలలో చెప్పినా వారు కొన్ని చిన్న చిన్న మార్పులు చేసారు. ఆ మార్పుల వలన ఒనగూడిన అందం యేదో ఉండే వుంటుంది అదికూడా తెలుసుకోవాలని ఉంది..

గిరి Giri చెప్పారు...

తొనలొలిచి చేతిలోపెట్టినట్టు...

కామేశ్వరరావు చెప్పారు...

ఇవి ఎన్ని మార్లు చదివినా నాకు కొఱుకుడు పడలేదు! మొదటి పద్యానికి మాత్రం అర్థం తెలిసింది. ఎక్కడా ఎవరూ అర్థాలు చెప్పినట్టు లేదు. మొదటిసారిగా ఇప్పుడే చూస్తున్నాను.
ప్రతిపదార్థం బాగుంది కాని తాత్పర్యం దగ్గరికి వచ్చేసరికి అంతగా సంతృప్తి ఇవ్వడం లేదు.
మొదటి పద్యంలో రవ+అహీన అంటేనే వ్యాకరణం సరిపోతుందా? "రవ" పదం దీర్ఘాంతం అవ్వవచ్చా? అలా అయ్యే మాటుంటే, "రవా హీన", అలాంటి రవాన్ని కూడా తక్కువ చేసే క్రియలో ప్రౌఢి కలిగి అని అన్వయం చెప్పుకోవచ్చు, సులువుగా. ప్రతిపదార్థం ఇవ్వలేదు కాని ఒకటి రెండు చోట్ల తాత్పర్యం ఇలాగే ఉంది. లేదూ "రవ+అహీన" అనే విడగొట్టాల్సి వస్తే, అలాంటి రవం చేత "అహీనక్రియా" తక్కువ చెయ్యలేనట్టి - ప్రౌఢి కలిగి అని చెప్పుకోవచ్చు ననుకుంటాను.

"షణ్ముఖ స్ఫార ద్వాదశ నేత్రగోళ వివృతిప్రాకారమై" - షణ్ముఖుని ద్వాదశ నేత్రాలు అనే తెరుచుకున్న ప్రాకారం/గోడ కలది అని అర్థం సరైనది అనుకుంటాను. ఇక్కడ ప్రాకారం నేత్ర గోళం. అది విల్లు విరిగిన శబ్దానికి వివృతి చెందింది.

"ఆశ్చలత్" = ఆః + చలత్ - "ఆః అని వణుకుతున్న" (ఆశ్చర్యం కూడా ఇలా ఏర్పడిందే అనుకుంటాను)

తక్కిన వాటి గురించి ఇంకా ఆలోచించాలి. నా దగ్గరున్న విశ్వనాథ గురించిన పుస్తకాలన్నీ తిరగేసాను కాని వీటికి అర్థాలు ఎక్కడా లేవు :-( ఆఖరికి స్వయంగా విశ్వనాథ వారే రచించిన "కల్పవృక్ష రహస్యాల"లో కూడా లేదు!

శివలోకంలో వినిపించడం పరశురాముని కథని కూడా సూచిస్తుందని విశ్వనాథవారు చెప్పారు. అతను పరమ శివభక్తుడు కాబట్టి. అందుకే అతని కథ అయిన వెంటనే మళ్ళీ యీ పద్యం వస్తుంది. అలాగే రాజాలోకంలో వినిపించడం కూడా అతని కథని సూచిస్తుంది. అతను క్షత్రియులకి చేసిన అవమానానికి సమాధానం (క్షత్రియుడైన రాముని చేతిలో ఓటమి) లభించనున్నదని. పరశురాముడు వచ్చే ముందు మళ్ళీ యిదే పద్యం వస్తుంది.
ఈ దనుష్ఖండం "దైతేయ లోకంబునన్" పద్యంతో పరిసమాప్త మవుతుంది.
పరశురాముని కథ సీతారామ కల్యాణం జరగక ముందే తీసుకురావడానికి కారణం, విష్ణుచాపం పట్టుకున్న తర్వాతే రామునిలో విష్ణ్వంశ పూర్తిగా వచ్చిందనీ, అప్పుడే అతను సీతాదేవితో వివాహానికి అర్హత సంపాదించాడనీ చెప్పడం కోసమట!

రాఘవ చెప్పారు...

రవిగారూ, రావణాసురుడి స్తోత్రం కనీసం కాస్తైనా తేలికగా అర్థమౌతుంది. ఈయనది మరీ నారికేళతరపాకమండీ.

బాలకృష్ణమూర్తిగారూ, ఈ వివరణ కూడా నాకు అర్థమైనట్టుగానే వ్రాసానండీ. కల్పవృక్షం ఇంకా బాగా అర్థమయ్యాక మీరు అడిగిన ఇతర పద్యాలని ప్రయత్నిస్తాను. నన్ను మీరు అంతవరకూ మన్నించాలి.

గిరిగారూ, నెనరులు.

కామేశ్వరరావుగారూ, నాకు తెలిసినంతలో రవ శబ్దం పుంలింగమండీ. రవా అని రాదు. మీరు చెప్పిన రెండవ అన్వయం బాగుంది.

నాకు కూడా తాత్పర్యాల విషయంలో పూర్తిగా సంతృప్తి లేదండీ. పూర్తిగా అర్థమే కాలేదేమో అన్న స్థితిలోనే ఇంకా ఉన్నాను. ముఖ్యంగా షణ్ముఖ-స్ఫార-ద్వాదశ-నేత్ర-గోళ-వివృతి-ప్రాకారమై వంటివాటిని తప్పుగా అర్థం చేసుకున్నానేమో అని అనిపిస్తూనే ఉంది. ఆశ్చలత్ కూడా నాకు తెలియదండీ, బహుశా ఏమైనా సంస్కృత వ్యాకరణ సూత్రాలు తిరగవేయాలనుకుంటాను.

తర్వాత, శివలోకంలో వినిపించడం పరశురాముని కథని కూడా సూచిస్తుందని విశ్వనాథవారు చెప్పారు అన్నారు. మరీ ఇంత నిగూఢంగా వ్రాస్తే చదివే వారికి అర్థమౌతుందాండీ? వివరణ కైలాసంతో పోలిస్తే తృప్తికరంగా ఉన్నా కూడా, రాజలోకాల విషయం కూడా గూఢంగానే ఉందండీ.

"పరశురాముని కథ సీతారామ కల్యాణం జరగక ముందే తీసుకురావడానికి కారణం, విష్ణుచాపం పట్టుకున్న తర్వాతే రామునిలో విష్ణ్వంశ పూర్తిగా వచ్చిందనీ, అప్పుడే అతను సీతాదేవితో వివాహానికి అర్హత సంపాదించాడనీ చెప్పడం కోసమట!"

ఆఁ (ఆశ్చర్యంతో నోరు వెళ్లబెట్టాను). నాకు మరొకలా అర్థమయ్యిందండీ. సీతమ్మతో వివాహమైన తర్వాత లక్ష్మిని కూడిన విష్ణుమూర్తిగా సంపూర్ణత్వాన్ని పొందాడు కాబట్టే విష్ణు చాపాన్ని ధరించగలిగాడూ అని. నాకు బుఱ్ఱ తిరిగిపోయిందండీ!

Unknown చెప్పారు...

రాఘవ గారూ
మీరు వావిలికొలను సుబ్బారావుగారు సుమారు 100 సంవత్సరాలక్రితం వ్రాసిన రామాయణ అనువాదం (మందరం పేరుతో వ్రాసారట ) మీరు చదివారా ? ఆ పుస్తకాలను తెప్పించే ప్రయత్నం చేస్తున్నాను. ఆయన రామాయణానువాదం యథావాల్మీకంగా ఎన్ని శ్లోకాలో అన్ని పద్యాలలో వ్రాసారట. చాలా బాగుంటుందని విన్నాను. తప్పకుండా చదవాలి.

రాఘవ చెప్పారు...

నరసింహారావుగారూ

లోగడ మీరు చెబితేనే శ్రీ వావిలికొలను సుబ్బారావుగారు వ్రాసిన రామాయణాన్నిగుఱించి విన్నాను. ఏతద్రామాయణాన్ని నేను చదవలేదండీ. ఎక్కడ ప్రాప్తిస్తుందో తెలియజేస్తే నేను కూడా తెప్పించుకునే ప్రయత్నం చేస్తాను. మంచి విషయాన్ని పునః గుర్తుజేసినందుకు కృతజ్ఞుణ్ణి.

నమస్సులతో
భవదీయుడు

Unknown చెప్పారు...

రాఘవ గారూ
వావిలికొలను సుబ్బారావు గారు వారి శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణంలో శివధనుర్భంగ ఘట్టంలో వ్రాసిన పద్యాలను క్రిందవ్రాస్తున్నాను.
కం.
మునివాక్య చోదితుండయి
ధనువుండెడిమందసంబు దాయం జని మూఁ
తను దెఱచి చూచి యిట్లను
మునివర స్పృశియించి కంటి ; ముదలయ యేనిన్.
కం.
త్రిక్కక వెలుపలఁ దీసెద
నెక్కిడియెద నన్న నట్టులే కానిమ్మా
గ్రక్కున నని జనకుండును
మక్కువ గాధిజుఁడు పల్క మహిపసుతుండున్.
కం.
ఉఱక యవలీలఁ జాపం
బఱచేతను దిగిచి, చూడ నవనీశులు, క్ర
చ్చఱఁ దెగ నిండఁగఁ దీసిన
బిఱు సే మని చెప్ప విల్లు ఫెళ్ళున విఱిగెన్.
తెగ = అల్లెత్రాడు
కం.
నిర్ఘాతనాద మగుచు ధ
నుర్ఘటితమహాస్వనం బనూనం బగుడున్
దీర్ఘముగ వణఁకె ధరణి స
నిర్ఘోషంబుగను గిరులు నెఱపాఱుగతిన్.
కొండలన్నీ కదిలేలా ధరణి వణికిందట.
ఈ పద్యం వాల్మీకి వ్రాసిన రెండు శ్లోకాలకు సరియయిన అనువాదం అవుతుందనుకుంటానండి. మీ అభిప్రాయం తెలియజేయగలరు.
ఇదే ఘట్టంలో కవయిత్రి మొల్ల వ్రాసిన పద్యం నా కెంతో యిష్టమయిన పద్యాలలో ఒకటి. అందుకని దానిని కూడా ఇక్కడ వ్రాస్తున్నాను, అవధరించండి.
చ.
కదలకుమీ ధరాతలమ కాశ్యపిఁ బట్టు ఫణీంద్ర భూవిషా
స్పదులను బట్టు కూర్మమ రసాతలభోగిఢులీకులీశులన్
వదలక పట్టు ఘృష్టి ధరణీఫణికచ్ఛపపోత్రివర్గమున్
బొదువుచుఁ బట్టుఁడీ కరులుభూవరుఁడీశునిచాపమెక్కిడున్.
క.
ఉర్వీనందనకై రా
మోర్వీపతి యెత్తు నిప్పు డుగ్రునిచాపం
బుర్విం బట్డుడు దిగ్దం
త్యుర్వీధరకిటిఫణీంద్రు లూఁతఁగఁ గడిమిన్.
వ.
అనుచు లక్ష్మణుండు దెలుపుచున్న సమయంబున.
మ.
ఇనవంశోద్భవుఁడైనరాఘవుఁడు భూమీశాత్మజుల్ వేడ్కతోఁ
దనువీక్షింప మునీశ్వరుం డలరఁ గోదండంబు చేనంది చి
వ్వన మోపెట్టి గుణంబు పట్టి పటుబాహాశక్తితోఁ దీసినన్
దునిఁగెన్ జాపము భూరిఘోషమున వార్ధుల్ మ్రోయుచందంబునన్.
సముద్రాలు ఘోషపెట్టిన రీతిలో శబ్దం వినిపించిందంట.
తెలుగులో ఒక పదాన్ని గుఱించి చెప్పే నానార్థాల పదాలతో ఎలా ఆడుకోవచ్చో వాటిద్వారా అందాన్ని ఎలా రాబట్టచ్చో తెలిసిన విదుషీమణి మొల్ల. ఒక్కొక్కరిదీ ఒక్కో రకమైన కల్పన. మన అదృష్టం.

రాఘవ చెప్పారు...

నరసింహారావుగారూ

వావిలికొలనువారు వాల్మీకి భావాన్ని నాల్పంగా నాధికంగా చక్కగా చెప్పినా, మనోనేత్రాలకు అగుపించినదీ మనశ్శ్రోత్రాలకు వినిపించినదీ ఆవిష్కరించడంవలన విశ్వనాథవారి కల్పవృక్షంలోని పద్యాలు మందరంలోని పద్యాలకంటె అందంగా ఉన్నాయండీ (అర్థం తెలియనక్కరలేకుండానే భావం గోచరించేలా).

ఇక మహాకవయిత్రి మొల్ల చేసినది అంటారూ, అది రమణీయమైన "కల్పన". :)

నమస్సులతో భవదీయుడు