మంగళవారం, జులై 07, 2009

ఆచార్యదేవోభవ

ఓ దేవా నిన్ ౧

సాధించగా నెంచి శక్తీయ మని కోర నణకువ న్నేర్పగా నణచితీవు
గొప్పకార్యార్థినై కోరగా స్వాస్థ్యంబు మంచిఁ జేయించగా వంచితీవు
సంతసిల్లెద నంచుఁ జాల ధనముఁ గోరఁ బుద్ధిచ్చి నా కోర్కె ముంచితీవు
స్తుతులకై స్థితిఁ గోరఁ మతిపోయి నే నిన్ను పోగొట్టుకోకుండఁ బ్రోచితీవు

ఉర్వి నున్నవన్ని యుల్లాసజీవనో
త్సాహినై యడుగఁగఁ గ్షమనుఁ జూపి
కోరినయవి గాకఁ గోరకున్నను నాకుఁ
గోరవలసినయవి గూర్చితీవు ౨

లలితపదాంబుజంబులను లాఘవమొప్పఁ బదాలఁ గొల్వగాఁ
దెలియదు నాకు నీకయి సుదీర్ఘములైన కవిత్వమాలికల్
కలనము సేయఁ దైవతమ! కాని వచించెద, వచ్చి రాని యీ
తెలుగు వచస్సరోజములు తెల్పునుగాక నమస్సుమాంజలుల్ ౩

నన్ను మన్నించి యో ప్రపన్నప్రసన్న!
నిన్ను చూపు గురునిఁ దెల్పు తెన్నుజూపు
మన్ని కన్నరల్ ఛిన్నమై చెన్నుమీఱ
విన్నపంబు నీసారి నీ వెన్నవయ్య ౪

4 వ్యాఖ్యలు:

Sanath Sripathi చెప్పారు...

రాఘవ గారూ,

పద్యాలు హృద్యంగా , అత్యంత రమణీయం గా ఉన్నాయి. 'గురుతెరుగ జేసే' గురుని స్మరణ చాలా చక్కగా ఉంది.

భైరవభట్ల కామేశ్వర రావు చెప్పారు...

రాఘవగారు,

దేశిఛందస్సుల కన్నా మీకు వృత్తాలు బాగా నడుస్తున్నాయి.
మీ గ్రాంధిక వ్యావహారిక ప్రయోగాల మేళవింపు నాకు కాస్త ఇబ్బందిగా తోస్తోంది, అప్పుడప్పుడు. "శక్తీయ", "ఎన్నవయ్య"వంటి వ్యావహారిక ప్రయోగాలు చేస్తున్నప్పుడు, అరసున్నాలనూ దృతసంధిని పట్టించుకోవాలా?

"కలనము సేయ" అన్నది ఏ అర్థంలో వాడారు? కలనము అన్నా చెయ్యడమనే కదా అర్థం?
"అన్ని కన్నరల్ ఛిన్నమై చెన్నుమీఱ" అంతగా బాగులేదు. అక్కడ "చిన్నవై" అని మీ ఉద్దేశం అనుకుంటా. ఎంత చిన్నవైనా ఆపదలు "చెన్ను మీఱ"వు కదా!

"తెలుగు వచస్సరోజములు తెల్పునుగాక నమస్సుమాంజలుల్" - బావుంది.

రాఘవ చెప్పారు...

కామేశ్వరరావుగారూ, సరిగ్గా ఇలాంటి వ్యాఖ్య కోసమే ఎదురుచూస్తున్నానండీ. నెనర్లు :)

అతివేగం ప్రమాదకరం... ఇది నాకూ వర్తిస్తుంది అని గుర్తు పెట్టుకుంటాను :)

రాఘవ చెప్పారు...

సనత్ గారూ, నెనర్లు :)