బుధవారం, ఫిబ్రవరి 25, 2009

పార్వతీపరమేశ్వరుల విహారపు పద్యం

తెనాలి రామలింగ కవి ఉద్భటారాధ్యచరిత్రమనే కావ్యంలో చెప్పిన పద్యం—

తరుణ శశాంక శేఖర మరాళమునకు సార గంభీర కాసారమగుచు
కైలాసగిరి నాథ కలకంఠ భర్తకు కొమరారు లేమావి కొమ్మయగుచు
సురలోక వాహినీ ధర షట్పదమునకు ప్రాతరుద్బుద్ధ కంజాతమగుచు
రాజ రాజ ప్రియ రాజకీరమునకు మానిత పంజరస్థానమగుచు

ఉరగ వల్లభ హార మయూరమునకు
చెన్ను వీడిన భూధర శిఖరమగుచు
లలిత సౌభాగ్య లక్షణ లక్షితాంగి
అద్రినందన బొల్చె విహారవేళ


ఈ పద్యం చదవటం మొదలుపెట్టగానే నాకు మొట్టమొదట అనిపించినది ఈ పద్యానికి సీసాన్ని ఎంచుకోవడం అంత అతకలేదేమో అని. సంగీతంలో ప్రవేశం ఉండడమో మరొకటో కారణమేమిటో తెలియదు కానీ నడకకి ఏదో అడ్డం తగిలినట్టుగా ఠపీమని మొదటి పాదం కూడా పూర్తికాకుండానే ఆగిపోయాను. పద్యాన్ని సీసంగా కాక చంపకమాలగా వ్రాసి ఉంటే ఇంకా అందగించేదేమో కూడా అనిపించింది. కానీ మొదటి పాదం దాటి ముందుకు వెళ్తే పద్యాన్ని ఆస్వాదిస్తూ అసలు మిగతా ఊసు(హ)లు అన్నీ మర్చిపోయాను. అంత అద్భుతంగా ఉందనిపించింది ఈ పద్యం.

అదేమిటో కానీ మొత్తం చదివేసాక పద్యం మరోసారి చదివినప్పుడు కూడా సీసం అతకలేదు మొదటిపాదానికి అనే అనిపించింది. దీనికి రెండు కారణాలు ఉండొచ్చు... ఒకటి ఏ శ్రీనాథుడి లేదా రామరాజభూషణుడి సీసపు నడకో మనస్సుకి బాగా పట్టేసి దాన్ని వదలలేకపోవడం, రెండు సీసం అంటే నా మనస్సులో ఒక రకమైన నడక బాగా ముద్రపడిపోయి ప్రస్తుత పద్యపు నడకని జీర్ణించుకోలేకపోవడం. ఏదైతేనేమి? సీసం సీసమే! పైగా అద్భుతమైన పద్యం!

ఏమాటకి ఆమాటే. శ్రీనాథుడికీ భట్టుమార్తికీ — వీరిద్దరికీ సీసంపై ఉన్న పట్టు, సీసం వాడడంలో ఉన్న ప్రతిభ, సీసపు నడకపై ఉన్న అవగాహన అనన్యసామాన్యం. అది ఒప్పుకు తీరాలి.

సరే. ఇక ఛందస్సు సంగతి ప్రక్కన పెట్టి పద్యాస్వాదనం, ఆలోచనామృతం సంగతి చూస్తే...

తరుణ అంటే యౌవనంలో ఉన్న (పూర్ణత్వము ఇంకా సిద్ధించని) అని. కాబట్టి తరుణేందుశేఖరుడంటే నెలవంకని శిఖలో ధరించినవాడు అని అర్థం. తరుణేందుబింబానికి కాంతి తక్కువే ఐనా శివుడు "మహాసితవపువు" అన్న అర్థం ధ్వనిస్తుంది తరువాతి మరాళ ప్రయోగంవలన. అలాంటి హంసకు శ్రేష్ఠమైన గంభీరమైన (నీటి) కొలను ఔతోందట అమ్మవారు.

కలకంఠ అంటే మగకోకిల (కలకంఠి అంటే కోకిలలా చక్కటి కంఠంగల ఆడుది అని అర్థం). భర్త ఇక్కడ శ్రేష్ఠతకి సూచిక. కైలాసాధిపతియైన కోకిలలలో శ్రేష్ఠునికి పూచే లేత మావి కొమ్మ ఔతోందట అమ్మవారు.

సురలోకంలో ప్రవహించేది – సురగంగ. దానిని ధరించినవాడు శివుడు. షట్పదం అంటే ఆరు పదములు కలిగినది, భ్రమరము. అట్టి భ్రమరానికి ప్రొద్దున్నే విచ్చుకున్న తామరపూవు ఔతోంది అమ్మవారు అని. ఇక్కడ షట్పద అన్నదానికి ఆరు భాగములు కలిగిన అని అర్థం కూడా చెప్పుకోవచ్చు. అంటే శివుడు వేదస్వరూపమని (వేదాంగములు ఆరు అన్న అర్థంలో). అప్పుడు కం శబ్దానికి ఆనందం అని అర్థం తీసుకోవాలి (అప్పుడు కంజాతమంటే కూడా ఆనందమే! పూర్ణమదః పూర్ణమిదం...).

రాజ రాజ ప్రియ రాజ కీరము. మూడు రాజ శబ్దాలు! రాజరాజ అన్న ప్రయోగానికే కనీసం నాలుగైదు అర్థాలు వెతుక్కోవచ్చు. రాజరాజప్రియ శబ్దానికి ఒక అర్థం (గొప్ప)వేల్పులకి (మిక్కిలి) ఇష్టమైన అని. రాజ అంటే శ్రేష్ఠమైన అని ఇంకో అర్థం. శ్రేష్ఠులకి ఇష్టమైన శ్రేష్ఠమైన మగచిలుక (కీరి అంటే ఆడుచిలుక). అట్టి చిలుకకి ఆమోదమైన పంజరపు స్థానం ఔతోందట అమ్మవారు.

ఉరగము అంటే పొట్టతో కదిలేది, పాము. పాములు మెడలో వేసుకున్నవాడు శివుడు. శివుడు అనే మయూరానికి, నెమలికి. ఇక్కడ నెమలి మెడలో పాము అనడం ద్వారా ప్రకృతికి వైరుద్ధ్యాన్ని కూడా చూడచ్చు. ఇక్కడ తన అందాన్ని (చెన్ను) వదిలేసిన (వీడిన) కొండశిఖరము (భూధర శిఖరము) ఔతోందట అమ్మవారు. అందాన్ని వదిలేయడం ఏమిటి? శిఖరానికి అందం సమతలం కాకపోవడమే. అది వదిలేసిన. అంటే అమ్మవారు పర్వతాలలోని సమతలమైన ప్రదేశం (సానువు) ఔతోందట.

లతితమైన సౌభాగ్యవంతములైన లక్షణాలను కనబరచే గిరితనయ విహారవేళలో ఇన్ని రకాలుగా కనబడింది. (ఎవరికి అని అడగకండి, ఇంతకుమించి నేపథ్యం నాకు తెలియదు).

* * *

ఇక నాకు చదువుతూంటే “భలే” అనిపించిన విచిత్రమైన విషయాలు…

౧ ఈ పద్యంలో ఎక్కడా కూడా అయ్యవారిని అమ్మవారిని పురుషప్రకృతి-స్త్రీప్రకృతిలా పోల్చకపోవడం. హంసకి హంసిలా, మగకోకిలకి ఆడుకోకిలలా, భ్రమరానికి భ్రమరిలా, రాజకీరానికి రాజకీరిలా, మయూరానికి మయూరిలా చెప్పడంలేదు.

విహారం అంటున్నాడు కాబట్టి అయ్యవారిని ఏ రూపంలో చెప్తాడో, ఆ విధమైన రూపానికి అమ్మవారు ఏ రూపంలో ఉంటే బాగా నచ్చుతుందో అదే చెప్పాడు. కొలను హంస. మావిచిగురు కోకిల. భ్రమరం తామర. చిలుక పంజరంలోని స్థానం (పంజరం కాదు). నెమలి పర్వతసానువు.

విహారాన్ని వర్ణించడానికి చక్కటి జంటలు ఇవి. హంస కొలనులో విహరిస్తుంది. కోకిల మావికొమ్మలపై విహరిస్తుంది. భ్రమరం తామరలందు విహరిస్తుంది (వేదాలు సచ్చిదానందస్వరూపంలో విహరిస్తాయి). చిలుక తనకి ఆమోదమైన పంజరంలో విహరిస్తుంది. నెమలి పర్వతసానువులపై విహరిస్తుంది. దీనివల్ల అయ్యవారు విహరిస్తున్నారనే అర్థం బైటకు కనిపిస్తున్నా ఇద్దరికీ అభేదం కూడా చెప్పినట్టైంది.

విహారం కాకుండా ఏకాంతమని చెప్పి ఉంటే వేరేలా ఉండేదేమో కవి కల్పనా చాతుర్యం.

౨ అన్ని చోట్లా అమ్మవారు కొలను ఔతోంది, కొమ్మ ఔతోంది, కంజాతమౌతోంది అన్నాడే కానీ కొలనులా ఉంది అనడం లేదు. ఆ రూపకాలంకార ధ్వనిని అమ్మవారివరకూ కొనసాగించడం అద్భుతం. పైగా అయ్యవారు హంస ఐతే అమ్మవారు కొలనులా ఉంది అనడం కాకుండా, అమ్మవారు కొలను ఔతోంది అనడం ఎంత సముచితం! మళ్లీ అర్ధనారీశ్వరతత్వం చూపినట్టౌతోంది.

మొత్తానికి అమృతమే ఈ పద్యం. అందులో అనుమానం లేదు. అలాంటప్పుడు అమృతభాండం బంగారానిదా వెండిదా రాగిదా ఇత్తడిదా లేదా ఆ భాండానికి రత్నాలు తాపడం చేసారా నగిషీలు చెక్కారా... ఇలాంటివి చూడడం అనవసరం!

* * *

రవిగారు చెప్పబట్టి ఇది ఉద్భటారాధ్యచరిత్రంలోనిదని తెలిసింది. తప్పితే ఈ పద్యం ఆ కావ్యంలో ఏ ఆశ్వాసంలోదో ఎన్నో పద్యమో నేపథ్యమేమిటో వివరాలు నాకు అస్సలు తెలియవు. ఏదేమైనా మంచి పద్యాన్ని పరిచయం చేసినందుకు రవిగార్కి కృతజ్ఞతలు.

18 కామెంట్‌లు:

కొత్త పాళీ చెప్పారు...

తరుణేందు శేఖర .. గురించి మీ వివరణ బాగుంది.
ఇహ సీసం నడక గురించి. ఇంద్ర గణాల్లో వేర్వేరు మాత్రల గణాలు అనేకం ఉండడంతో వచ్చిన తంటా యిది. అలాగే, గణం ముగిసే దగ్గర పదం ముగిసిందా లేదా అనేది కూడా పద్యం నడకని నిర్ణయిస్తుంది.
తెనాలి రామకృష్ణ సినిమాలో ఘంటసాల శ్రావ్యంగా గానం చెయ్యగా ఈ పద్యాన్ని వినవచ్చు.

కొత్త పాళీ చెప్పారు...

http://www.ghantasala.info/padyaalu/069_TenaliRamakrishna(1956)_Taruna(Padyam).mp3

రాఘవ చెప్పారు...

కొత్తపాళీవారూ, అదే కదండీ. గమనించారో లేదో పద్యం న-జ-భ-జ లతో మొదలైంది పైగా!

ఘంటసాలవారిని విన్నాను. పద్యాన్ని పద్యంలా చదవడం వేరు, పద్యాన్ని పాడడం వేరు. పద్యాన్ని పాడితే అసలు గొడవే లేదు. చదివితేనే ఆ ఇబ్బందంతానూ :)

రవి చెప్పారు...

రాఘవా, నాకన్న వయసులో కాస్త చిన్నవాడయిపోయావు కానీ, లేకపోతే నమస్కారం పెట్టి ఉండవచ్చు. అంత అద్భుతంగా ఉంది మీ వివరణ. మీకు నా బ్లాగులో సమాధానం చెప్పాను. ఇక్కడా చెబుతున్నాను. రామకృష్ణయ్యను ఆక్షేపించేంత, కనీసం వ్యాఖ్యానించేంత సీను నాకు లేదు. ఈ పద్య వివరాలు, ఇంకా ఉద్భటారాధ్య చరిత్రం గురించి, కాస్త తెలుసుకుని, వీలు వెంబడి రాయటానికి ప్రయత్నిస్తాను.

Bolloju Baba చెప్పారు...

beautiful

కామేశ్వరరావు చెప్పారు...

రాఘవగారు,

ఈ పద్యంలో అంత లోతులేమీ లేవని రవిగారి బ్లాగులో కామెంటి ఇక్కడికి వచ్చి చూస్తే లోతులు చూపించే మీ వివరణ!
అయితే మీ వివరణతో నాకు కొన్ని చిన్న చిన్న అభ్యంతరాలు, అనుమానాలు ఉన్నాయి :-)
మరాళంతో పోలిక వల్ల శివుని "మహాసిత" రూపం ధ్వనిస్తే మరి తర్వాతి పాదంలో కోకిలతో పోలిక వల్ల "మహా+అసిత" రూపం ధ్వనించదా?
కలకంఠ అంటే మీరన్నట్టు మగకోకిలే. కాని భర్త శ్రేష్ఠతకి సూచనా అని అనుమానం. ఇంకెక్కడైనా భర్త పదాన్ని శ్రేష్టమైన అనే అర్థంలో వాడడం ఉన్నదా?
"రాజ రాజ" అంటే చంద్రునికి అధిపతి శివుడనే అర్థమే సమంజసమైనదిగా నాకనిపిస్తోంది. ప్రియ అన్నది రాజకీరానికి విశేషణం అవుతుంది. అంటే ప్రియమైన చిలక అనే అర్థం వస్తుంది.
రవిగారి బ్లాగులో సరిగా చూడలేదు కాని, "చెన్ను వీడిన భూధర శిఖరం" కాదనుకుంటాను, అది "చెన్ను మీరిన భూధర శిఖరం" అయ్యుంటుంది. రవిగారి బ్లాగులో నేనాపద్యాన్ని అలానే చదువుకున్నాను :-) కొత్తపాళీగారిచ్చిన లింకులో ఘంటసాల పాటని మరోసారి వినండి. అందులో "మీరిన" అనే ఉంది. "చెన్ను మీరిన" అంటే అందం అతిశయించిన అని అర్థం.

షట్పదము, కంజాతము పదాలకి మీరిచ్చిన అన్వయం బావుంది!

రాఘవ చెప్పారు...

కామేశ్వరరావుగారూ,

౧ మహాసిత మహాऽసిత... సర్వవర్ణస్వరూపుడు కదా మరి. ఇంతకుమించి నేనేమీ చెప్పలేను. నా నోరు కట్టేసారు :)

౨ భర్తృ శబ్దాన్ని ఇక్కడ నేను గొప్పతనానికి/శ్రేష్ఠతకి సూచికగా తీసుకున్నాను. దీనికి ప్రయోగాలు ఉన్నాయా అంటే, ఏమోనండీ నాకు తెలియదు.

౩ రాజ రాజ అన్నదానికి చంద్రునికి వల్లభుడు అనేకంటే రాజ్ఞాం దేవతానాం అని తీసుకుని చంద్రుడికి రాజు అనుకునేకంటే దేవతలలో తలమానికమైనవాడు అనుకోవడం సబబేమోనండీ. ఐనా, ఇలా రాజరాజ ద్వారా శివుణ్ణి సూచిస్తున్నాడు అని అన్వయించుకుంటే... రాజరాజ ప్రియకీరమంటే శివుడనే ఇష్టమైన (మళ్లీ ఇంకొక ప్రశ్న. ఎవరికి ఇష్టమైన?) చిలుక అని మాత్రమే కాకుండా, శివునికి ఇష్టమైన చిలుక అని తత్పురుష-సమాసపుటర్థం వచ్చే అవకాశం కూడా ఉంది. కాబట్టి నేను రాజరాజప్రియ అనే విడగొట్టుకున్నాను. తప్పైతే మన్నించి సరిదిద్దగలరు.

౪ నేను రవిగారు వ్రాసిన పద్యాన్ని ఉన్నది ఉన్నట్టు చదివి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాను. ఇప్పుడు మీరు అన్నాక అనుమానం వచ్చింది. వెతికితే డిజిటల్ గ్రంథాలయంలో దొరికింది (236వ పేజీ). ఇక్కడ మీఱిన అనే ఉంది.
సందర్భానికి తగ్గట్టుగా అన్వయించేసుకున్నాను కానీ నాకు నెమళ్లకి ఎక్కడ విహరించడం (శిఖరాలపైనో సానువులపైనో) ఇష్టమో కచ్చితంగా తెలియదండీ :D

రాఘవ చెప్పారు...

అన్నట్టు చెప్పడం మరచిపోయాను... ప్రస్తుత పద్యం ఉద్భటారాధ్యచరిత్రంలోని ప్రథమాశ్వాసంలో ౯౪వది.

రవి చెప్పారు...

"చెన్ను మీఱిన" అని కామేశ్వర్రావు గారు చెప్పిన తర్వాత నా వద్ద పుస్తకం తిరిగేసి సరిదిద్దుకుందామనుకుని వెతికితే, పుస్తకం మా వూళ్ళో ఉండి పోయింది, దొరకలేదు.ఇప్పుడు రాఘవ గారి లంకె - digital గ్రంథాలయంలో చూసి సరిదిద్దాను.


"కానీ నాకు నెమళ్లకి ఎక్కడ విహరించడం (శిఖరాలపైనో సానువులపైనో) ఇష్టమో కచ్చితంగా తెలియదండీ :D"


మా జిల్లాలో నెమళ్ళ కొండ (కల్యాణ దుర్గం వద్ద) అన్న ప్రదేశం ఒకటుంది. అక్కడ సాయంత్రాలు (శ్రావణ సాయంత్రాలు preferably) నెమళ్ళు అక్కడ కొండ సానువుల్లో గుమి గూడుతాయి. పద్యం అర్థం అనుకునేప్పుడు, నాకు ఆ ప్రదేశం గుర్తుకు రావడంతో నెమళ్ళకు పర్వత సానువులు ఇష్టం కాబోలు అని అనిపించింది.


ఈ విషయమూ మన సారస్వతంలో ఎక్కడైనా వెతికితే దొరక్కపోదు అని నా ఊహ.


ఇంకో చిన్న విషయం. ఇదివరకు నా టపా ఒకటి ఇక్కడ. గ్రంథాలయంలో ఈ కావ్యం పీఠిక చదువుతుంటే, 61 వ పేజీ, తిరిగి 78 వ పేజీల్లో ఆ టపాలో విషయం మళ్ళీ సోదాహరణంగా కనిపించింది.

రాఘవ చెప్పారు...

రవిగారూ, అసలు నెమళ్ల గురించి ప్రస్తావించిన పద్యాలేమిటా అని ఆలోచిస్తే నాకు మొదట పెద్దన గారి "అటఁ జని కాంచె భూమిసురుఁ డంబరచుంబి..." పద్యం గుర్తొచ్చింది. దీని ప్రకారం చూస్తే నెమళ్లు శిఖరాలలో తిరుగుతాయేమో అనే అనిపిస్తోంది.

నేను చదువకపోయినా కథావస్తువు ప్రకారం చూస్తే మనుచరిత్రలో కాకపోతే ఏ కళాపూర్ణోదయంలోనో కుమారసంభవంలోనో వసుచరిత్రలోనో నెమళ్ల గురించి ఉండచ్చూ అని ఊహ కలుగుతోంది.

మీరు ఉదహరించిన "సింధుబల్లహు రీతి శ్రీపతిపండితు మరియాద..." భలే ఉందండీ. ఇలాంటి పద్యాన్ని చూడడం ఇదే ప్రథమం :)

గిరి Giri చెప్పారు...

రాఘవా, పాండిత్యం పెరుగుతోందే, బాగు బాగు..

రవి చెప్పారు...

రాఘవ గారు, ఇప్పుడే ఆ పద్యం ఉటంకించిన పుస్తకం చూశాను (మా వూళ్ళో).

మొదటి మూడు వర్ణనలు తెలిసినవే. రాజరాజ ప్రియరాజ కీరము - అంటే మాత్రం ఈ రచయిత వ్యుత్పత్తి ఇలా చెబుతున్నారు.

రాజరాజు - కుబేరుడు, రాజరాజప్రియ - కుబేరుడికి ప్రియమైన (జక్కులఱేని చెలికాడు అని ఒక తెలుగు కావ్యంలో, త్ర్యంబక సఖః అని ఓ సంస్కృత కావ్యం లోనూ ప్రయోగమట) రాచిలుక.

చెన్ను మీఱిన భూధర శిఖరమంటే - కామేశ్వర్రావు గారు చెప్పినట్టు అందం అతిశయించిన కైలాస శిఖరం అని.

ఇక కావ్యం గురించి క్లుప్తంగా. శైవాచార్య పరంపరలో ఆచార్య త్రయము, ఆరాధ్య త్రయము, సిద్ధ త్రయము - పండిత త్రయముగా ప్రసిద్ధి బడసిన ఈ త్రయమున ప్రప్రథముడు ఉద్భటుడు. (మిగిలిన వారు కోటిపల్యారాధ్యుడు, మరియు వేమనారాధ్య్డుడు)- ఈ గాథను పాల్కురికి సోమనాథుడు ౩౮ ద్విపదలలో చెబితే, రామయ్య ౮౪౨ గద్యపద్యాలలో మూడాశ్వాసాల కావ్యంగా మలిచాడుట.

rākeśvara చెప్పారు...

షట్పద అంటే ఏంటా అనుకున్నాను. తుమ్మెద ఎలా అయ్యిందో చెప్పినావు. నెనర్లు.

కామేశ్వరరావుగారిలా నాకు కూడా ఒకటి రెండు చోట్ల అర్థాన్ని లాగినట్టు అనిపించినా - కవిత్వమంటేనే లేని అర్థాలు కనబడడం కాబట్టి, మంచి అర్థాలు కనబడుతున్నాయి రాఘవుని అదృష్టం అని సరిపెట్టుకున్నాను.

సీసాల్లో ఎంతో కంత, గణం ఆగిన చోట పదం ఆగుతూంటుంది కాబట్టి, ఈ పద్యం పోతన సీసాలే ఎక్కువ అలవాటున్న నాలాంటి వాడికి కూడా కాస్త ఇబ్బందిగా అనిపించినా, (రవి గారి బ్లాగులో చెప్పినట్టు) పదిహేనలంకార భూషితమైన సీసం కాబట్టి అలాంటివి తట్టవుకూడా.

రాఘవ చెప్పారు...

రాజరాజ - కుబేరుడు. నిజమేనండీ. కుబేరుడు మహాశివభక్తుడు... త్ర్యంబక సఖుడని పేరు ఊరికే వస్తుందా? :)

ఈ పద్యం పుణ్యమా అని చాలా విషయాలు తెలుస్తున్నై.

@రాకేశ్వరులవారు:
"...వ్రాయడం కవిత్వం, అర్థమవ్వడం పాండిత్యం..." అని మా నాన్నగారు చెప్పారు నాకు. కానీ అంతటితో ఆగకుండా అసలుకి పణ్డితాః సమదర్శినః అని కూడా చెప్పారు. పుడకతో పానకం -- కవిర్దణ్డీ కవిర్దణ్డీ భవభూతిస్తు పణ్డితః అని కాళి కాళిదాసుతో చెప్పిందట! :)

rākeśvara చెప్పారు...

తెలుగులో చెబితే ఎక్కడ అర్థమవ్వదోనని నాలాంటి పామరులకోసం సంస్కృతంలో చెప్పినందుకు కృతజ్ఞతలు ;)

సమిధ ఆన౦ద్ చెప్పారు...

నేను తిరుపతిలో పుట్టి రె౦డేళ్ళ తర్వాత ను౦చీ దాదాపు పదేళ్ళు విజయనగర౦లో పెరిగాను. కానీ ఏ రోజూ మన సా౦ప్రదాయ శాస్త్రీయ స౦గీతాన్ని నేర్చుకోవాలని నా మతి నాకు చెప్పలేకపోయి౦ది. ఊహ తెలిసి నాక౦టూ ఓ శైలి, ఇష్టాఇష్టాలు మొదలయ్యేసరికి ఆ ఊరు వదిలేసాను. చాలా బాధపడ్డాను. పోనీలే ఈ జన్మకి ఓ మ౦చి అభిరుచి గల శ్రోతగా మిగిలిపోదామని అనుకుని ఆ తర్వాత అ౦దరిలానే నా జీవిత నౌకకు తెరచాప అల్లిక మొదలు పెట్టేసాను. మీలా౦టి వారు తారసపడినప్పుడు మాత్ర౦ ఆ బాధ మళ్ళీ తిరిగి రావడమే కాక, ఆ బాధకు మరి౦త బాధ తోడౌతో౦ది. నేనె౦దుకు ఇ౦త తెలుగు నేర్చుకోలేదూ అని. కానీ మీరు రాసిన పద్యాలను చదువుతూ, మీరిచ్చే తాత్పర్యాలను వి౦టూ ఆ బాధనీ, దా౦తో పాటు నన్ను మర్చిపోతు౦టాను. మీ బ్లాగు చాలాసార్లు చూసాను. దాదాపు గత మూడు నెలలుగా గతి తప్పకు౦డా చూస్తున్నాను. మీకు వ్యాఖ్యలు రాసేవాళ్ళు కూడా ప౦డితులే. నా వ్యాఖ్యను౦చడానికి నాకు ఏ రోజూ ధైర్య౦ సరిపోలేదు. ఈ రోజు ఆ భయాన్ని వదలి మీతో పరిచయమనే స్వార్ధస్ఫూర్తితో ఇలా ఈ నాలుగు మాటలు నాకు నచ్చిన పద్య౦ దగ్గర వదలి వెళ్తున్నాను. నా పేరు ఆన౦ద్. మీకూ, మీలోని విద్వత్తుకూ శతకోటి నమస్కారాలు. ఈ ఆ౦ధ్రసాహిత్యామృతాన్ని కొన్ని చుక్కలైనా సరే నాలా౦టి వారికి ప౦చిపెడుతున్న మీ సదాశయానికి అన౦తకోటి అభిన౦దనలు. సవినయ౦గా ...........మళ్ళీ కలుస్తాను.

రాఘవ చెప్పారు...

నమస్తే ఆనంద్‌గారూ

౧ నాకూ తెలుగు పెద్దగా ఏమీ రాదండీ. నేనూ ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను, ఆ నేర్చుకోవడానికి నేను ఎన్నుకున్న మార్గం పద్యకావ్యాలో మరొకటో చదవడం. అలాగే తోచినప్పుడు ఇలా బ్లాగుల్లో వ్రాసుకోవడం. ఇలా బ్లాగు ద్వారా మీకు కొద్దో గొప్పో సంతోషం కలిగించగలిగాను అంటే నాకూ సంతోషమే. నేనూ ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను కాబట్టి, నేను పండితుణ్ణి కాదు కాబట్టి, నిస్సంకోచంగా మీరు చెప్పదలచుకున్నది (ముఖ్యంగా దోషాలు కనబడినప్పుడు) వ్యాఖ్యరూపంలో చెప్పండి.

౨ నేనైనా సరే సంగీతం నేర్చుకున్నానంటే సాహిత్యమంటే మక్కువ ఉందీ అంటే అది మా తండ్రిగారి ఆశయం. దాని రుచి తెలిసే వఱకూ ప్రత్యేకమైన శ్రద్ధ ఆయన తీసుకోబట్టే...
నేను ఆ పితౄణం ఎప్పటికీ తీర్చుకోలేను.

౩ నాచేత ఏమైనా చెయ్యబడిందీ అంటే, అది అంతా మా శ్రీరామచంద్రమూర్తి కృపావీక్షణం... నేను కేవలం ఆయన చేతి ఉపకరణాన్ని.

సమిధ ఆన౦ద్ చెప్పారు...

మీరు చేసిన పనులలో దోషాలను వెతికేట౦తటి శక్తి నాకు లేదు. కావాల౦టే మీకభ్య౦తర౦ లేకపోతే నాకు స్వార్ధానికి మీ శక్తిని వాడుకోగలను మీరనుమతిస్తే! ఉదాహరణకు నేనీమధ్య చేపట్టిన ఓ బృహత్కార్యాన్ని మీకు చూపి౦చి మీ సూచనలను పొ౦దాలనే దూరాలోచనలో ఉన్నాను. మీకు కుదిరినప్పుడు మీ ఈమెయిల్ నాకు ప౦ప౦డి. ధన్యుడనౌతాను. శలవు!
anandb.surampudi@gmail.com