శుక్రవారం, నవంబర్ 07, 2008

క్రికెట్‌ క్రీడా సౌరభము

కందములు

వల్లభుఁడను నా మిత్రుఁడు
చల్లగ నడిగెను నను నొకసారి* యసలు నే
నెల్లా సౌరవ్ ఫ్యానని
యుల్లాసముగా జవాబు నుత్తర క్షణమే

శ్రావ్యముగా పాడగఁ జిఱు
కావ్యముగా వ్రాసెదనని కైతగఁ మలచే
దివ్యక్షణముల నంతా
సవ్యంగా నుండఁ గోరి చతురాస్యుసతిం

గీర్వాణిని శ్రీరామునిఁ
బర్వతతనయాతనయునిఁ బరమేష్ఠిని గాం
ధర్వాది విద్యలఁ విభుఁడు
సర్వేశ్వరునిం దలంచి చనువునఁ గిరిజన్

తోటకము

అసలేమని వ్రాయుదు నాతనిపై?
కసిలో నెవరెస్టు నగప్రతి తా
నసమానుఁడు కిర్కెటు నాడుటలో
న సహించడు మాటను నల్వురిచే

శార్దూలము

గంగూలీ ఘనవంశజాతుఁడును బెంగాల్ రాష్ట్ర శార్దూలమున్
కంగారస్సలు లేకఁ దాఁ గదలుచూ క్లాసైన టైమింగుతోఁ
సింగారంబుగ బంతి నారు పరుగుల్ చేర్పించుటన్ వీరుడున్
కంగారూలతొ నాడుచుండెఁ దుదిగాఁ గౌశల్యముం జూపుచున్

ఆటవెలది

ఆటఁ జూచుచుంటెఁ హాయిగా నున్ననూ
చివరి మ్యాచ్చి గనుకఁ జిన్న బాధ
కలుగుచుండె వెలితిగాఁ దోచుచున్నది
మనసు మటుకు కలుకుమనుచు నుంది

సీసము

మురళీధరునినైనఁ ముప్పుత్రిప్పలఁ బెట్టి మూడుచెర్వుల నీటఁ ముంచగలఁడు
కాలుఁ ముందుకు వైచి గాలిలోఁ బంతులన్ సిక్సర్లు కొట్టేటి చేవ వాఁడు
ఆఫ్‌సైడు ఫీల్డులో నడ్డంకులెన్నున్నఁ జక్కగా నాడంగ శక్తియుతుఁడు
వీడి ఠస్సా దియ్య! వెనుదీయ డేదైనఁ బుఱ్ఱకేల్వాటంపు పొగరుబోతు

తేటగీతి

అజహరుద్దీను తరువాత నయ్యె నితఁడు
యిండియా టీము కెప్టెన్ను యింతవఱకు
వేరెవరికినీ లేనట్టి పేరు నొందె
నధిక విజయము లందించినది యితండె

ద్విపద

తిరిగి వచ్చుట కెంత త్రిప్పలు వడెనొ?
తనయందుఁ దనకెంత తరుగని స్థైర్య
మింత ధైర్యము వీని కెటుల యలవడె?
నూరకఁ బులి యని యూరంత యనునె?

మధ్యాక్కఱ

ఇంతకీ నా కెందు కిష్ట మింతగా నీతఁడు చూడ
నెంత లాఘవముతోఁ బ్యాట్టు నెత్తి బాల్‌నెంతగా బాదుఁ
బంతిమంతుఁడు మీడియముగ పదనుగాఁ బౌలింగు చేయుఁ
సాంతముగా మానధనుఁడు స్వయముగాఁ సౌరభ మితఁడు

_________________
* శ్రీసర్వధారి కార్తిక శుక్ల నవమి శుక్రవారం (2008 నవంబరు 6)

21 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

అమ్మో, మాచెడ్డ అభిమానమే సౌరవుని మీద. మిగతా ఉపజాతులూ, వృత్తలు ఏం పాపం చేసుకున్నాయి వాటిల్ని వదిలేసారు. బాగా రాసారు.

Purnima చెప్పారు...

ఊహించనది ఈ అభిమానం! సౌరవ్ గురించి ఇలా తెలుగు పద్యాల్లో చదువుకోవటం అసలింతకు ముందెప్పుడూ తెలియని అనుభూతి. నా దగ్గర మాటల్లేవంతే! నేనీ పద్యాలు బట్టీయం కొట్టి అందరికీ చెప్పేస్తానంతే! :-)

మంచి ప్రయత్నం. ధన్యవాదాలు!

పూర్ణిమ

చంద్ర మోహన్ చెప్పారు...

అద్భుతం! మీ సీస పద్యం సర్వోత్తమంగా ఉంది. చాలా బాగా వ్రాశారు.

మీ మధ్యాక్కరలో , "బ్యాట్టు నెత్తి బాలెంతగా..." అని చదివి ఒక్క క్షణం కంగారు పడ్డమాట మాత్రం నిజం :-)

అభినందనలు.

జిగురు సత్యనారాయణ చెప్పారు...

బాగుంది.
ఒకప్పుడు నేనూ క్రికెట్టు అభిమానినినే. గంగూలి కెప్టన్ అయినప్పుడు వ్రాసిన పద్యం ఇది.

తే. వామ హస్తాన పరుగుల వరద సేయు
కుడి కరంబు తోడ వికెట్లు కూల్చ గలడు
సవ్యసాచి భారత నవ్య సారథికి వి
జయము సౌరభ గంగూలి జయము జయము!

-సత్య

కొత్త పాళీ చెప్పారు...

ముందుగా .. రాఘవకి బోలెడు అభినందనలు. పద్యాల్లో ఫ్లో, భావం చాలా బాగా కుదిరాయి.
చంద్ర .. బాలెంత .. మంచి పట్టె పట్టారు.:)
నేనూ ఒకటి పట్టుకున్నా .. సీసంలో .. గాలిలో బంతితో సిక్సరు కొట్టినట్టు రాశారు. సిక్సరు బేటుతో బంతిని కొడతారు కాబట్టి .. గాలిలో బంతినే అని మారిస్తే బావుంటుంది.

Unknown చెప్పారు...

vaarnee.. padyam kooda rasesava!!! nee abhimaanam tagaletta!!

రాఘవ చెప్పారు...

"వికటకవి"శ్రీనివాస్‌ గారూ, పూర్ణిమగారూ, చంద్రమోహన్‌గారూ, సత్యనారాయణగారూ, "క్రొత్తపాళీ" నారాయణస్వామిగారూ,

ధన్యోஉస్మి.

నా కెందుకో సౌరభుఁడంటే వల్లమాలిన అభిమానం, నిజమే. ఇప్పుడు నాకు కొందరు జతకలిశారని చాలా సంతోషంగా ఉంది. సత్యనారాయణగారైతే ఏకంగా జయధ్వానమే చేస్తున్నారాయె. నాకు భలే సంబడంగా ఉంది.

ఇక మిగతా ఉపజాతులూ వృత్తాలూ ఎందుకు వదిలేశావన్నారే... దానికి రెండు సమాధానాలున్నై. కారణాలు అనుకోండి. మొదటిది, నాకు తెలిసిన ఛందస్సు నిడివి కొంచెం తక్కువే. ఇక్కడ వాడినవి కాక నాకు మహా ఐతే ఒక డజను ఛందస్సులు తెలుసేమో, అంతే. రెండు, నేను ఈ పద్యాలన్నీ (అఫీసులో ఎవరికంటా పడకుండా జాగ్రత్త పడుతూ) ఒహ రెండు ఘంటలలో వ్రాసాను. ఇందులో చెప్పినట్టుగా మా మిత్రుడు అడిగాడని ఏదో యథాలాపంగా ఏరా కావ్యం వ్రాయమన్నావా అని మొదలుపెట్టానన్నమాట!

ఇక మొదలుపెట్టాక ముందు వెనుకలు చూసుకోకుండా వ్రాయడంవల్ల చంద్రమోహన్‌గారు అన్నట్టుగా బాలెంతగా అనీ, క్రొత్తపాళీ నారాయణస్వామి గారు సూచించినట్టుగా బ్యాట్టుకి బదులు బంతి అని ప్రయోగాలు వచ్చినై. మీరు పట్టుకోని మరొక పట్టు కూడ ఉంది. గమనించండి.

***

ఏవోఁయ్ వంశీ,

ఇది చాలా అన్యాయం. నా అభిమాన క్రికెటరు చివరి మ్యాచ్ సంతోషాన్ని పట్టలేక వ్రాసినదని కూడ చూడకుండా నా అభిమానాన్ని (అఖరికి అదేదో దిష్టిబొమ్మ ఐనట్టు) తగులబెట్టమంటే ఎలా? ;) సౌరభుడు ఎలాగా విరమిస్తున్నాడు కదా. తర్వాత నా పూర్తి మద్దతు సచిన్‌కే ఇస్తానులే :)

అజ్ఞాత చెప్పారు...

రాఘవ గారు,
పద్యాలు బావున్నాయ్. గత వారం ఆంధ్రజ్యోతి లో ను, ఇవాళ ఈనాడు లోను "గంగూలీ" దత్త పదులు చూసి, తెలుగు లో గంగూలీ పద్యాలు అని ఒత్తుదామానుకున్నాను .....
నా బ్లాగాగమనము సౌరభుని పునరాగమనము ఇంచుమించు ఒకేసారి జరిగాయి
అప్పుడు నే రాసింది ఇక్కడ


http://vookadampudu.wordpress.com/2007/07/31/%e0%b0%a8%e0%b0%a8%e0%b1%8d%e0%b0%a8%e0%b1%81-%e0%b0%b6%e0%b1%8d%e0%b0%b0%e0%b1%80-%e0%b0%a8%e0%b0%a8%e0%b1%8d%e0%b0%a8%e0%b1%81-%e0%b0%95%e0%b1%80-%e0%b0%b6%e0%b1%87-%e0%b0%85%e0%b0%a8%e0%b1%8d/

అజ్ఞాత చెప్పారు...

మరోమాట. ఎంత బ్రహ్మచారులయితే మాత్రం అలా పొద్దు పాఠాల్లో సంసారుల్ని పడతి పాదాల్ని పట్టిస్తారా, అదీ నిండు సభలో. ఇదే సమస్య మీరు సంసారులయ్యాక ఇస్తారేమో నేనూ చూస్తా :-)

నన్ను ఓ లెవెల్లో కష్టపెడుతోంది ఆ సమస్య. కాళ్ళు పట్టాడంటే సరిపోయేది, పులిని చూసి నక్క వాతపెట్టుకున్నట్లు, కృష్ణపరమాత్మని చూసి పట్టాడని సరిపెట్టుకుందును, మళ్ళీ నిండు సభలో అన్నారాయె, ఆ సభా సందర్భాన్ని మిగతా మూడు పాదాల్లో తేవటం అమ్మో ఇప్పటికే రెండు మూడు సార్లు బుర్ర వేడెక్కించుకుని వదిలేసా. మీరేదో మంచి హోం వర్కుతోనే ఇచ్చినట్లున్నారు ఆ సమస్యని.

చంద్ర మోహన్ చెప్పారు...

"మీరు పట్టుకోని మరొక పట్టు కూడ ఉంది. గమనించండి."-
మధ్యాక్కర చివరి పాదంలో "మాన ఘనుడు" అని వచ్చింది, అదేనా! ('ఒకని కవిత్వమందెనయు నొప్పులు తప్పులు...' అని తెనాలివాడూరకే అన్నాడా :) )

అజ్ఞాత చెప్పారు...

చంద్రమోహన్ గారన్నదేనా లేక ఇదా?

ఠస్సా దియ్య కాదు తస్సా దియ్య కదా?

కామేశ్వరరావు చెప్పారు...

"పుఱ్ఱకేల్వాటంపు పొగరుబోతు" - చాలాబావుంది!
తోటకాన్ని కూడా బాగా ఉపయోగించుకున్నారు, చక్కగా నడిపించారు. చివరిపాదంలో "న" ముందుపాదంలోంచి వచ్చినా, "సహించడు"తో కలిసిపోయి కొందరింగ్లీషువాళ్ళ double-negationలా అతని అసహనాన్ని స్ఫురింపజేస్తోంది!

మధ్యాక్కర చివరిపాదం చివరిలో జగణం ఎందుకొచ్చింది?

రాఘవ చెప్పారు...

ఊకదంపుడు వరేణ్యా,

బాగు బాగు. కీర్తిశేషుడు అన్న పదాన్ని సరైన అర్థంలో చక్కగా వాడుకున్నారు కదా మాచిరాజువారు.

వికటకవిగారండోయ్,

సమస్య ఆలోచించి ఇచ్చింది కాదు. చివర్న ఏదో ఒక అభ్యాసం పడేద్దామని యథాలాపంగా అప్పటికప్పుడు తోచినది విసిరానంతే. నేను సంసారినయ్యాక ఇస్తానో లేదో ప్రస్తుతానికి తెలియదు కాని ఇప్పటికి మాత్రం నిరభ్యంతరంగా ఇస్తాను.

తరువాత, ఠస్సా అన్నది సరైన పదమే.

చంద్రమోహన్‌గారూ,

భలే, పట్టు పట్టేశారు. ఐనా నన్ను నేను ఇంకా సమర్ధించుకోవాలంటే -- మానధనుడే కాదు మానఘనుడు కూడాను అనొచ్చునేమో :)

కామేశ్వరరావు మాస్టారూ,

నాకు కూడ భలే నచ్చింది ఈ "పుర్రకేల్వాటంపు పొగరుబోతు" అన్న ప్రయోగం. తరువాత తోటకాన్ని ఎంచుకోవడం కూడ చక్కగా కుదిరింది. ఏదో స్తోత్రం చేస్తున్నట్టుగానూ ఉంది, విరుపులూ అందాన్నిచ్చినై.

నేను గమనించని పెద్ద తప్పు చూపించారు. అమ్మో. జగణం వాడేశానేమిటి? నేను ఖచ్చితంగా తిరిగి సరిచూసుకోవడం నేర్చుకోవాలి. ఇలా వ్రాయగానే అలా పెట్టేశాను. అసలేం వ్రాసానో అందులో ఏమేం తప్పులున్నాయో అని కూడ చూసుకోకుండా. స్వకీయ సౌరభమని వాడాలనిపించింది వాడేశాను. దానిని స్వయముగా అని మార్చుకుంటే సరిపోతుంది కదా. నెనరులు.

అజ్ఞాత చెప్పారు...

పద్యాలు బాగున్నాయి. సీసపద్యం అన్నిటిలోకీ మెరుగు.

రాఘవ చెప్పారు...

చదువరిగార్కి నెనరులు :)

Trinath Gaduparthi చెప్పారు...

అయ్యా రాఘవ కవీంద్రా !
అద్భుతంగా ఉన్నాయి ఈ కందశార్దులసీసచంపక ఉత్పలాలు .

రాఘవ చెప్పారు...

సంతోషమండీ త్రినాథులవారూ :)

bvamkris చెప్పారు...

Why don't you write a poem about me for old times' sake?

I will include you in the Acknowledgments section of my PhD thesis ;)

రాఘవ చెప్పారు...

బావుంది వంశీ, తప్పకుండా వ్రాయొచ్చు. ఏమని వ్రాయాలో కూడ చెప్పు... అలాగే వ్రాస్తాను [:P] నీ పీఎచ్‌డీ డిసర్టేషన్‌లో పెట్టుకుందువుగాని [;)]

రానారె చెప్పారు...

పద్యాలెంతబాగున్నాయో మాటల్లో చెప్పలేను. గలగలగలా చదివించేశాయి. ద్విపదలో మీరు చెప్పినమాటుందే, అందుకే నాకు సౌరభ్ అంటే ఆరాధన.

తప్పులెన్నువారు తండోపతండంబులు. ఆ తండాలో నేనూ ఒకణ్ణి. ఇది తప్పోఒప్పో తెలీదు. సందేహంవచ్చింది, అడుగుతున్నాను. పుఱ్ఱకేల్వాటంపు పొగరుబోతు ప్రయోగం అద్భుతంగావుంది. కాకపోతే 'కేలు' అని బహువచనం వాడారు, సౌరవుకున్నది ఒక్కటే ఎడమచేయి కదా!

రాఘవ చెప్పారు...

రామనాథులవారూ, సౌరభుని అభిమానించేవాళ్ల సంఘంలో మీరూ ఉన్నారా? Wow!

ఆలు (భార్య), డాలు, చూలు లాగానే కేలు కూడా ఏకవచనమే. ఇక మీది ఏ తండానో మీరే తేల్చుకోండి ;)