గురువారం, జూన్ 05, 2008

భూభేరి

నేను సైతం
భూమి వేడిమి
తగ్గుదలకై పాటు పడతాను

నేను సైతం
బత్తి-బందుకు
లైటు నొక్కటి ఆర్పివేస్తాను
లైటు లన్నిటి నార్పివేస్తాను

నేను సైతం
బత్తి-బందుకు
వ్యాస మొక్కటి వ్రాసి యిచ్చాను

మన విధాతలం మనమె కాదా
మనకు మనమె
కొరివి పెట్టేలా
పుడమితాపపు వేడి సెగలను
నెత్తికెత్తుకు
తిరగబోనేల?

మన బ్రతుకులలొ
అలవాట్లు మారాయి
అనవసర పైత్యాలు వచ్చాయి

అవసరం ఉన్నంత మటుకే
పృథ్వి సంపద వాడుకోలేమా?
అందుకై అలవాట్లు సైతం
మార్చుకోలేనంత వెఱ్ఱులమా?

6 కామెంట్‌లు:

కొత్త పాళీ చెప్పారు...

బాగు బాగు.

పద్యం మొత్తం అదే నడక మీద నడిపిస్తే ఇంకా సెబాషుగా ఉండేది.

అజ్ఞాత చెప్పారు...

కొత్తపాళీ గారు,
ఇది రుద్రవీణ చిత్రంలో "నేను సైతం"(శ్రీశ్రీ రచనేనా?)అనే పాట బాణీలో పాడుకోవాలనుకుంటా..

గిరి

రాఘవ చెప్పారు...

కొత్తపాళీ నారాయణసారువాడూ... శ్రీశ్రీ ఒప్పుకోనంటా వుండాడు. గిరిగారు పట్టేసారు (పట్టీ వేశారో లేదో తెలియదు :P).

అసలు నేను వ్రాసింది కూడా శ్రీశ్రీని పేరడిద్దామనే. "జయభేరి" ఆ కవిత పేరు. పేరుతో సహా మొత్తం కాపీ"లెఫ్టు" శ్రీశ్రీదే. గతి కొంచెం అక్కడక్కడా మారి ఉండొచ్చు.

నేను చేసిన ద్వితీయ పేరడీ ప్రయోగమిది. మొదటి పేరడీ "మా తెలుగు తల్లికి" కి చేసాను. ఏప్పుడో... దానిని పేరడీ అంటారని కూడా తెలియనంత చిన్న వయసులో... ఐదో క్లాసులో. యాదృచ్చికంగా నా రెండవ వచన తవిక కూడా :)

rākeśvara చెప్పారు...

అసలు పాటకి ఒకటి రెండు చోట్ల లయ కుదరలేదు కానీ.
ఉదా - మన విధాతలం మనమె కాదా
మనకు మనమె
కొరివి పెట్టేలా
అన్నచోట కుదరలేదు.
మళ్ళీ
పుడమితాపపు వేడి సెగలను
నెత్తికెత్తుకు
తిరగబోనేల?
అన్న చోట చాలా బాగ కుదిరింది.


నువ్వు మొత్తానికి శ్రీశ్రీ చదివి (అప్పుడెప్పుడో ఎప్పుడూ చదవలేదని చెప్పినట్టు గుర్తు). దానికి పేరడీకి కూడా పూనుకున్నందుకు బహు సంతోషం.
ఇంకా ఎన్నో కవితలు తొందరలో ఆశిస్తున్నాను.

రాకేశ్వర

రాఘవ చెప్పారు...

రాకేశా,
నేనేదో సరదాకి శ్రీశ్రీని అనుకరిస్తే అదేదో ఘనకార్యమన్నట్టు చూస్తే ఎలా?
అనిపించింది అనిపించినట్టుగా ఆపకుండా చిత్తుప్రతి కూడా లేకుండా నాకు తోచినట్టు డైరెక్టుగా బ్లాగులోనే టైపాను. కాబట్టి ఇక్కడ లయలేదు అక్కడ శృతిలేదు అంటే నేనొప్పుకోను :)
ఒక్కమాట. ఎందుకో నాకు తెలియదు కానీ నేనెప్పుడూ వచనకవిత వ్రాయాలనుకోలేదు. కానీ పనిగట్టుకుని వ్రాయాలంటే మాత్రం అనుభవలేమి వల్ల కించిత్తు కసరత్తు అవసరం. చూద్దాం... భవిష్యత్తులో వచనం వ్రాస్తానేమో, ఖచ్చితంగా వ్రాస్తానో వ్రాయనో నాకే తెలియదు.

op చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.