సోమవారం, నవంబర్ 26, 2007

శివపఞ్చాక్షరీస్తోత్రమ్

కం. అహిభూషణ భస్మధరా
తుహినాంశ్వర్కాగ్నినేత్ర దోషరహిత ని
త్య హితకర దిగంబర శ్రీ
మహాశివ "న"కారరూప వందనమిదియే.

కం. మందాకిన్యభిషేకా
నందీశప్రమథగణపతి మండితగన్ధా
మందారపుష్పపూజిత
వందనము "మ"కారరూప పరమేశ శివా.

కం. గౌరీముఖాబ్జతపనా
ధారితపుంగవపతాక దక్షసవఘ్నా
వారిధిజాతమహావిష
ధారి శివ "శి"కారరూప దండములివియే.

కం. అగిరౌకసగణ సేవిత
అగస్త్య గౌతమ వసిష్ఠ వందిత దేవా
అగశశధరదహననయన
మృగధారి "వ"కారరూప మృడ శివ శంభో.

కం. ప్రమథేశ సనాతన శివ
ఉమాపతి పినాకి యక్షరూప కపర్దీ
అమరేశనుత దిగంబర
నమస్సులు "య"కారరూప నటరాజ నమో.

[శ్రీమచ్ఛంకరభగవత్పాదుల శివపఞ్చాక్షరీస్తోత్రముననుసరించి జేసిన స్వేచ్చాంధ్రానువాదమైన యీ స్తోత్రము బ్లాగేశ్వరుని "న"కార శివునిపై పద్యాన్ని జూచి ప్రేరణపొంది వ్రాసినది]

మంగళవారం, నవంబర్ 20, 2007

అర్ధనారీశ్వరస్తోత్రమ్

సీ.సంపెంగసుమవర్ణసౌందర్యలహరీమె కర్పూరసమవర్ణకాంతియతడు
ముత్యాలజడగలముగ్ధమోహనవేణి జటలుగట్టినజుట్టుజంగమయ్య
కస్తూరితిలకంపుకాంతినిండినమోము భవనాశకుడుచితాభస్మధారి
కవులెల్లకొలిచేటికలికిమీనాక్షమ్మ ప్రమథగణవిభుడుప్రథితమూర్తి

ఆ.వె.ఘల్లుఘల్లుమనెడిగజ్జెలూగాజులూ
పసిడినగలతోడిపార్వతమ్మ
సర్పనూపురములుశంకరుమెడలోన
బుస్సుమనెడిపామెభూషణంబు

సీ.కలువరేకులవంటికన్నులుగలదీమె పద్మలోచనములవాడుశివుడు
పద్మయుగళనేత్రిమాయమ్మగిరిపుత్రి మూడుకన్నులపూర్ణపురుషుడతడు
మందారసుమమాలనామెకొప్పునబెట్టె మెడనుపుఱ్ఱెలమాలవేసెనితడు
దివ్యాంబరములీమె దిగ్వస్త్రమాయన జలదనీలచికురి జటలశివుడు

ఆ.వె.దేవిరూపరహిత దేవదేవుడితడు
ఈమెసృష్టిజేసె నితడులయము
జగతికంతజనని జగదేకజనకుడు
శుభమునిచ్చుగాత ఉమయుశివుడు

अर्धनारीश्वरस्तोत्रम्

चाम्पेयगौरार्धशरीरकायै कर्पूरगौरार्धशरीरकाय।
धम्मिल्लकायै च जटाधराय नमश्शिवायै च नमश्शिवाय॥

कस्तूरिकाकुङ्कुमचर्चितायै चितारजः पुञ्जविचर्चिताय।
कृतस्मरायै विकृतस्मराय नमश्शिवायै च नमश्शिवाय॥

झणत्क्वणत्कङ्कणनूपुरायै पादाब्जराजत्फणिनूपुराय।
हेमाङ्गदायै भुजगाङ्गदाय नमश्शिवायै च नमश्शिवाय॥

विशालनीलोत्पललोचनायै विकासिपङ्केरुहलोचनाय।
समेक्षणायै विषमेक्षणाय नमश्शिवायै च नमश्शिवाय॥

मन्दारमालाकलितालकायै कपालमालाङ्कितकन्धराय।
दिव्याम्बरायै च दिगम्बराय नमश्शिवायै च नमश्शिवाय॥

अम्भोधरश्यामलकुन्तलायै तटित्प्रभाताम्रजटाधराय।
निरीश्वरायै निखिलेश्वराय नमश्शिवायै च नमश्शिवाय॥

प्रपञ्चसृट्युन्मुखलास्यकायै समस्तसम्हारकताण्डवाय।
जगज्जनन्यै जगदेकपित्रे नमश्शिवायै च नमश्शिवाय॥

प्रदीप्तरत्नोज्ज्वलकुण्डलायै स्फुरन्महापन्नगभूषणाय।
शिवान्वितायै च शिवान्विताय नमश्शिवायै च नमश्शिवाय॥

एतत्पठेदष्टकमिष्टदं यो भक्त्या स मान्यो भुवि दीर्घजीवी।
प्राप्नोति सौभाग्यमनन्तकालं भूयात्सदा तस्य समस्तसिद्धिः॥

గురువారం, నవంబర్ 15, 2007

శ్రీసర్వజిత్ శరన్నవరాత్రులు - మహిషాసురమర్దని

[ఇన్నాళ్లకి అమ్మకి వ్రాయించుకోవాలనిపించిందేమో! ఎప్పుడో వ్రాయవలసినది యిప్పుడు వ్రాస్తున్నాను.]

చం. ఱుగను నీదువైభవము యేమనుకోకు మదంబ, యింతకీ
కరమున శూలమెందులకు? కామము క్రోధము ద్రుంచు శక్తివై
శరణనువారికందరికి చక్కటి యండవు తోడునీడవై
సరగున బ్రోవువమ్మ "మహిషాసురమర్దని" దేవి యీశ్వరీ.

బుధవారం, నవంబర్ 14, 2007

ఊకదంపుడుగారి "టంగు-తెగింది"కి కొనసాగింపు:

ముందు యిది చూడండి.

చూశాక...

ఉ.సూటిగ వొక్కమాట వినసొంపుగ పల్కగలేరు వీరు యే
ఆటలనాడలేరు మనభాషను నేర్వరు నేర్పబోయినన్
“కూటికి ఆంగ్లమైతె పనికొచ్చును, ఆంధ్రము తిండిబెట్టునా?
మేటిగ వుండగోరు మము మీరలు క్రిందకు ద్రోసివేతురా
వోటమి నోర్వనేర”మని పోరెడివారిని మార్చుటా? వృథా!

మ. నిజమే మాటలు చాలబోవు మన యీ నిట్టూర్పులే సాక్ష్యముల్
“అజుడైనా భయమొందు రీతిని తయారైయారు జాగ్రత్తరోయ్
విజిగీషావనమందు నిల్చినచొ వీడ్కోలు చెప్పొచ్చునా
విజిగీషాముఖులైతె? భాషకు నిలా వీడ్కోలు చెప్పొచ్చునా
ప్రజలారా” అని మొత్తుకుంటె తుదకున్ ప్రాయోజనంబున్నదా?

మ. అసలీ వైఖరి యెట్లు వచ్చె? మనమే గాదా సగం కారణం?
పసివారన్నది కూడ చూడక మహా భారంబులన్ నెత్తిపై
కసితో రుద్దుచు చోద్యమున్ గనుచు కందోయి చల్లారగా
కసితో రుద్దుచు పెంచుచుంటిమి గదా కందోయి చల్లారగా
మసలే నైజము నేర్వలేద? మన ఆత్రంబు లీడేరగన్.
మసలే నైజము నేర్వలేద? మనలో నాత్రంబు లీడేరగన్.

* * *

కం.[నా]మీలోనున్న కసినిలా
యీలోకంమీద గ్రక్కి యిపుడిక చాలా
తేలికపడి హాయిగ కం
దంలోతుల మునిగితేలుదాం రారండోయ్.

శుక్రవారం, నవంబర్ 02, 2007

ఎన్నాళ్లైందో యివి చదివి...

ఆ.వె. చేత వెన్న ముద్ద చెంగల్వ పూదండ
బంగరు మొల త్రాడు పట్టుదట్టి
సందె తాయెతులును సరి మువ్వ గజ్జెలు
చిన్ని కృష్ణ నిన్ను చేరి కొలతు.

కం. వంకాయ వంటి కూరయు
పంకజముఖి సీత వంటి భామామణియున్
శంకరుని వంటి దైవము
లంకాధిపు వైరి వంటి రాజును గలడే.

కం. అప్పిచ్చువాడు వైద్యుడు
యెప్పుడు నెడతెగక పారు యేరును ద్విజుడున్
చొప్పడిన యూర నుండుము
చొప్పడకున్నట్టి వూరు చొరకుము సుమతీ.

చం. చదువది యెంత గల్గిన రసజ్ఞత యించుక లేకయున్న నా
చదువు నిరర్థకంబు గుణసంయుతులెవ్వరు మెచ్చరెచ్చటన్
పదనుగ మంచికూర నలపాకము జేసినదైన నందు నిం
పొదవెడి వుప్పు లేక రుచి పుట్టగ నేర్చునటయ్య భాస్కరా.

ఆ.వె. కొండనుండు నెమలి కోరినపాలిచ్చు
పశువు చదువుచుండు శిశువు తోడ
వనిత వేదములను వల్లె వేయుచునుండు
బ్రాహ్మణుండు కాకి పలలము తిను.

ఆ.వె. చెరకుతోటనుండు వరిమళ్ళలోనుండు
జొన్నచేలనుండు చోద్యముగను
తలుపుమూలనుండు తలపైనవుండును
దీనిభావమేమి తిరుమలేశ.

ఇవి చదివి చాలా చాలా కాలమయింది... జ్ఞాపకం భ్రష్టుపట్టి తప్పులు దొర్లివుండవచ్చు. దోషములు సరిదిద్దగలరు.

గురువారం, నవంబర్ 01, 2007

ఆంధ్రప్రదేశావతరణోత్సవ శుభాకాంక్షలతో...

ఉ.మిక్కిలి యందమైనదియు మేటియు భారతభాషలన్నిటా
పెక్కుధరాధిపాదులకు పిన్నలపెద్దలయందరిన్ మహా
మక్కువయైనభాష మనమాతృకయై వెలుగొందునట్టిదౌ
చక్కని ఆంధ్రమాతకివె జన్మదినోత్సవ మోదశంసనల్
[అక్క యభీష్టముం దెలిసి తమ్ముడు వ్రాసిన పద్యమిద్దియే].