కం. అహిభూషణ భస్మధరా
తుహినాంశ్వర్కాగ్నినేత్ర దోషరహిత ని
త్య హితకర దిగంబర శ్రీ
మహాశివ "న"కారరూప వందనమిదియే.
కం. మందాకిన్యభిషేకా
నందీశప్రమథగణపతి మండితగన్ధా
మందారపుష్పపూజిత
వందనము "మ"కారరూప పరమేశ శివా.
కం. గౌరీముఖాబ్జతపనా
ధారితపుంగవపతాక దక్షసవఘ్నా
వారిధిజాతమహావిష
ధారి శివ "శి"కారరూప దండములివియే.
కం. అగిరౌకసగణ సేవిత
అగస్త్య గౌతమ వసిష్ఠ వందిత దేవా
అగశశధరదహననయన
మృగధారి "వ"కారరూప మృడ శివ శంభో.
కం. ప్రమథేశ సనాతన శివ
ఉమాపతి పినాకి యక్షరూప కపర్దీ
అమరేశనుత దిగంబర
నమస్సులు "య"కారరూప నటరాజ నమో.
[శ్రీమచ్ఛంకరభగవత్పాదుల శివపఞ్చాక్షరీస్తోత్రముననుసరించి జేసిన స్వేచ్చాంధ్రానువాదమైన యీ స్తోత్రము బ్లాగేశ్వరుని "న"కార శివునిపై పద్యాన్ని జూచి ప్రేరణపొంది వ్రాసినది]
14 కామెంట్లు:
రాఘవ గారు ఈశ్వరానుగ్రహముతో చాలా శీఘ్రగతిన శివ పంచాక్షరీ స్తోత్రాన్ని వ్రాశారు. చాలా బాగుంది. మిగతా నాలుగు అక్షరాలు ఈశ్వానుగ్రహము ఉంటే కార్తీక మాసములొ పూర్తి చేయగలను. దేనికైన దైవాజ్ఞ ఉందాలి కదా.
శంకరా!!!
కం.
తలపులునొసగెడి వాడిన్
కలకరములచే రచనలు గావించేవాన్
పిలవగనేపలికేవాన్
పలికించుము పలుస్తవములుమాచే నిట్లా
వాన్ అని వాడాను వాడుక సరియా లేక సరికాదా
ఈ రోజే కొత్త సిరా పెన్ను కొన్నాను. రాసిన మొదటి పద్యము.
మీరు ఆటవెలదులలో వ్రాస్తున్నారని వాటిజోలికి పోకుండా కందాన్నెంచుకున్నాను నేనిదివ్రాసేటప్పుడు. శివుడికి నాజేత వ్రాయించుకోవాలనిపించిందేమో ప్రస్తుతానికి పంచాక్షరీస్తోత్రాన్ని పూర్తిజేశాను. ఇక ఆటవెలదులలో మీరెప్పుడు పూర్తిజేస్తారా అని జూస్తున్నాను.
మీరు కష్టపడకుండా యిలా వ్రాయొచ్చుకదా:
కం. తలపులనొసగెడివాడిని (గమనించండి, తలపులనొసగెడి తలపులునొసగెడి కాదు)
కలకరములచే రచనలు గావించు **న్ (మీకుతోచిన రెండక్షరాల నామమేదైనా హరున్, హరిన్, భవున్... యిలా)
పిలువగ పలికెడి వాడిని
పలికించుము పలుస్తవములు మాచే నిట్లా
ఇలా యెందుకు చెప్పానంటే నాకు "వాన్" అన్న ప్రయోగం యెక్కడా చదివిన గుర్తులేదు. అంతేగాక వినడానికి కూడా కొంచెం తేడాగా, నిజంచెప్పాలంటే యేదో తమిళం విన్నట్టుగా వుందనిపించింది (తమిళంలో అతడు అనటానికి అవన్ అంటార్లెండి).
ఇకపోతే కొత్త సిరా-కలము కొన్నారనా "కలకరములచే" అని వ్రాశారు? బాగుంది బాగుంది.
అన్నట్టు మరచిపోయాను వాక్యనిర్మాణమొకసారి సరిజూసుకోండి యీ కందంలో... నేను దాన్ని అలాగే వదిలేశాను.
చాలా బాగుంది. స్వేఛ్ఛాంధ్రానువాదం బాగున్నా అచ్చ తెలుగు, చివరి పాదం లోనే ఉందని అనిపిస్తోంది. క్షమించగలరు.
నీ పద్యాలకు వ్యాఖ్యానించే అంత లేదు నాకు.నా లాంటి పామరులకి అర్ధం అయ్యింది.అది చాలు నాకు,నువ్వు కందం లో వ్రాసినా,దేనిలో వ్రాసినా..
నువ్వు ఇలాగే మరిన్ని అనువదించాలని ఆశిస్తున్నా
అహి = పాము, తుహినాంశ్వర్కాగ్ని = తుహినాంశు+అర్క+అగ్ని, తుహినాంశు = చంద్రుడు, అర్క = సూర్యుడు, మందాకిన్యభిషేక = మందాకిని + అభిషేక, మండిత = అలంకరించబడిన, తపన = సూర్యుడు, ధారిత = ధరించబడిన, పుంగవ = ఎద్దు, సవ = యజ్ఞము, సవఘ్న = యజ్ఞనాశకుడు, వారిధి = సముద్రము, అగిర = స్వర్గము, అగిరౌకస = దేవతలు, అగ = సూర్యుడు, పినాకి = పినాకమను విల్లు ధరించినవాడు, కపర్ది = కపర్దమనబడే జటాజూటధారి.
మల్లిక్ గారు,
క్షమాపణలెందుకండి? మీ అభిప్రాయం మీరు చెప్పా రంతేగదా. సంస్కృత పదాలు వాడినందువల్ల అచ్చతెలుగుదనం కనబడకపోవచ్చు.
ఎంతమాట లలితక్కా. నీ ఆశీస్సులు చాలు నాకు.
శివుడి గురించిన యే స్తోత్రమైనా యే భాషలోనైనా ఎంతో అందంగా ఉంటాయి. ఇటువంటివి ఇంకా వ్రాయండి.
చాలా చాలా బాగా అనువదించారు.
నాదొక చిన్న సందేహం.దీనికి సంబంధించి కాదులెండి,శివుని పేరు గురించి.
ఆభవుడంటే శివుడేనా?
అభవుడంటె శివుడని అర్థం అయినప్పుడు
భవుడు,ఆభవుడు ఎలా అవుతాడు ఒకేసారి?
దీనిని తీర్చగలరు.
దన్యవాదములు.
కృష్ణ.
అభవుడు, భవుడు రెండూ శివుని positive and negative అన్నమాట. అందువలన తప్పు లేదు
శివుడు అఘోర మరియు ఘోర స్వరూపుడు కదా! అలాగే.
నా వూహ ప్రకారం, భవుడనీ అభవుడనీ రెండురకాలుగానూ చెప్పటం శివుడు జననమరణరహితుడనీ ఆయనే సృష్టిలయకారకుడనీ తెలియజేయటంకోసమై యుండొచ్చు.
అత్యుత్సాహం ప్రదర్శిస్తే ఇలాగే ఉంటుంది. సరిచేయాలి పద్యము, వాక్యనిర్మాణము సరిగా లేదు కదా. సరిచేస్తాను.
కామెంట్‌ను పోస్ట్ చేయండి