శనివారం, డిసెంబర్ 01, 2007

తెగులు - నివారణ

కం. తెలుగుకి ఆంగ్లం దట్టిం
చి లేతవంకాయకూర చికెనుకెబాబుల్
కలగలిపి తిన్న రీతిని
పలకకపోతె మనభాష అర్థమవదుగా.

ఆ.వె.పంది బురదలోన పొర్లుతూంటేజూచి
ఆహ! బురద యెంతొ హాయిగొలుపు
నంటు దొర్లినాము ఆంగ్లపంకమునందు
పందులం పరాయివారికన్న.

ఆ.వె.వారిభాష నేర్చి వారిసంస్కృతినేర్చి
వొరగబెట్టెదేన్ని? ఓరి శుంఠ!
వారిమాయలోన దూరి పరాయివై
పోయినావు నీవు పూర్తిగాను.

తే.గీ.అమ్మవంటి భాషనెటుల వదలినావు
మేలుకొనుము నీవిపుడైన మేలుసేయ
లేకపోయినచో నీకులేదు ముక్తి
కనుక సేవచేయ నడుముకట్టు యిపుడు.

8 కామెంట్‌లు:

rākeśvara చెప్పారు...

:D

చదువరి చెప్పారు...

బాగున్నాయి, పద్యాలు. ముఖ్యంగా మొదటిది నాకు నచ్చింది.

మీ బాటలోనే నాదో పద్యం. (కళ్ళూ కళ్ళజోడు పోలిక నా సొంతం కాదు, ఎక్కడో చదివాను.)

ఇంగిలీసు నేర్చి ఇంటిబాస మరచె
ఊరు వదలగానె ఉనికి మరచె
కళ్ళజోడు కలదు గనుక కళ్ళు వలదె?
వచ్చు తరము కొరకు ఉంచు తెలుగు!

బ్లాగేశ్వరుడు చెప్పారు...

పద్యాలు చాలా బాగున్నాయి. తెలియక అడుగుతచుంటిని. యతి మీద కొద్ది సందేహాలు ఉన్నాయి. యతిమైత్రిలు సరిగా కుదిరాయా అన్న సందేహాము వచ్చుచున్నది. దయచేసి వివరించండి.

అ కి ప కి యతి కుదురుతుందా మొదటి కందము చివరి పాదములొ

మొదటి ఆటవెలది మెదటి పాదము లొ పం కి పొం కి యతి కుదురుతుందా?

మెదటి ఆటవెలది చివరి పదములొ యతి కుదిరిందా?

ఇవే కాకుందా ఇంకా కొన్ని ప్రదేశాలలొ యతి మైత్రి మీద సందేహము ఉన్నది . దయచేసి తీర్చవలెను.

గిరి Giri చెప్పారు...

ఆంగ్లపంకము - కొంచెం ఘఠ్ఠిగానే తగిలించారు..మొదటి పద్యం చాలా బావుంది

braahmii చెప్పారు...

పద్యాలు బాగున్నాయి. మరీ ముఖ్యంగా మొదటి రెండూనూ. నాకు గణాలు,లక్షణాలు తెలియవు. తెలియదు అన్నందుకు (సాక్షి ప్రసంగాల) జంఘాలశాస్త్రిలా కోప్పడకండేం, మొదటి రెండు పద్యాలు చదివినప్పుడు బాగున్నాయని అనిపించిది, అందుకే చెబుతున్నాను.
@చదువరి గారు, మీ పద్యం కూడా చాలా బాగుంది,
బాలవాక్కు

రాఘవ చెప్పారు...

క్షమించాలి, పని యొత్తిడిజేత యిన్నాళ్లూ వ్యాఖ్యాపఠనం గావింపలేదు.

బ్లాగేశ్వరా,
(1) అ - ప
పకి అకి యతి చెల్లుతుంది. అచ్చులు ప్రధానంగా చూడాలి.
(2) పం - పొ
పంది బురదలోన పొర్లుతుంటే జూచి -- ఇది తప్పే, వ్రాసేటప్పుడు నేనంత గమనించలేదు.
కాబట్టి పంది బదులు పోత్రి (పోత్రము కలది, పోత్రము అంటే ముట్టె) పెడితే సరిపోతుంది. కానీ నాకెందుకో నియమం తప్పినా పోత్రి కన్నా పందే బావుందనిపించింది. వేరే యేమైనా పరిష్కారముందేమో ఆలోచించాలి.
(3) గొలుపు|నంటు దొర్లినాము ఆంగ్లపంకమునందు
ఇది వొక విశేష యతి నియమం. గొలుపున్ + అంటు -- ఇందులో యతి కోసం అంటు అన్న పదాన్ని తీసుకోవాలి. అంకి పంకి యతిచెల్లుతుంది.
(4) వారి - దూరి
ఆటవెలదులకి ప్రాసయతైనా భేషుగ్గా సరిపోతుంది.

చదువరిగారూ,
బాగుందీ పద్యం. వచ్చు తరము కొరకు వుంచు తెలుగు -- యతి కొద్దిలో తప్పిపోయిందనుకుంటే ప్రాసయతి చక్కగా కుదిరింది. శభాష్.

గిరివర్యా,
అసలు మీ టపా జూచి దానికి వ్యాఖ్య వ్రాయగోరి మొదటి పద్యం వ్రాశాను. కానీ యెందుకో చేయి, మనస్సు వూరకుండక నాజేత మిగతావి కూడా వ్రాయించినై.

హే బాలవాక్,
తెలియకపోవటం తప్పు కాదు. తెలియనప్పుడు తెలియదని తెలిసీ తెలుసుకోవాలనుకోకపోవటం తప్పు, కాదంటారా?

బ్లాగేశ్వరుడు చెప్పారు...

క్షమించండి దురుసుగా వ్యాఖ్య వ్రాసుంటే మీ వద్ద నుండి యతి నియమాలు తెలుసుకోవాలనే ఇచ్ఛ తప్పితే వేరే ఏమి కాదు.

రాఘవ చెప్పారు...

బ్లాగేశా, మీరు దురుసుగా వ్యాఖ్యానించానేమోనని అనుకోవటమే నన్ను నొప్పించింది.