ఆదివారం, మార్చి 25, 2007

భారతీ స్తుతి

భారతీ స్తుతి!
కవి: ఓం ప్రకాశ్, ఎం.ఏ,(ఎం.ఫిల్),ఉస్మానియా విశ్వవిద్యాలయం.
(ఇది 'తెలుగు సాహిత్య వేదిక' ద్వారా ప్రకాశితము)

కం. వ్యాసపుర పీఠవాసవు
భాసుర వీణాక్షదామ పాణివి వాణీ!
వ్యాసమునీశ్వర సేవిత
దాసుడ ననుయేలరమ్ము దయతో దేవీ! 1.
[భాసుర = ప్రకాశించే; అక్ష దామ = పూసల మాల; పాణి = చేయి]

ఉ. బాసర పుణ్యతీర్థమున భాసిలి, భక్త జనావళీ మనో
వాసినియై, వచోవిభవ భావ విజృంభిత దివ్య మూర్తయై,
హాసవిలాస దీవరదయై, కవితారచనాత్మరూపయై,
వ్యాస మహామునీశకృతయై వెలుగొందెడి వాణి వేడెదన్! 2.
[భాసిలు = ప్రకాశించు; ఆవళి(లి) = సమూహము; వచస్ = మాట; విభవము = వైభవము, సంపద; విజృంభించు = వ్యాపించు; విలాసము = లీల; ధీ = intellect]

ఉ.బాసర పీఠమున్ వెలిగి భక్తుల పాలిటి కల్పవల్లియై,
దోసములన్నిటిన్ దునిచి, దోర్బల ధీబల దాత్రివంచు, నీ
బాసట వీడకన్ హృదయ పద్మమునందున గొల్తునమ్మ, యో
సారసనేత్రి! నీ కరుణశారద చంద్రికలౌత భారతీ!! 3.
[వల్లి = లత; దోర్బల(?) = బలహీన, చిన్న; దాత్రి(స్త్రీ.) - దాత(పుం.); సారసము = తామరపువ్వు; శారద చంద్రిక = శరదృతువులోని వెన్నెల]

దీనిపై నా వ్యాఖ్య:

ఉ. పక్కులు పల్కురీతి నిటు బాసరవాసిని శారదాంబపై
చక్కని పద్యమాలికలు చప్పున చెప్పి విశేష భక్తితో
మ్రొక్కెడు భక్తసత్కవికి మోదము తోడ ప్రశంస జేసెదన్ -
ఎక్కడ నాయనా యిపుడు తెల్గులొ వ్రాసిన పద్యసూనముల్
ఎక్కడయంచు వేచి గన చేవను (చేతల) చూపెను ఓం ప్రకాశుడే.

వ.తెలుగు వ్రాయటం చదవటం మాట్లాడటం సరిగా వచ్చినవారే కనుమరుగౌతున్న యీ తరుణంలో చక్కగా పద్యప్రసూనపూజ చేసిన ఓం ప్రకాశ్ గార్కి రాఘవ నమస్సులు.
[పక్కి = పక్షి; సూనము = ప్రసూనము = పువ్వు]

తప్పొప్పులు:

1. రెండవ పద్యం మూడవ పాదంలో ధీవరద అని వుండాలి; దీవరద కాదు. దీ [= మరణించు] అన్నది సంస్కృత ఆత్మనేపద ధాతువు.

2. ఇది తప్పో కాదో నాకు నిశ్చయంగా తెలియదు కానీ మూడవ పద్యంలో దౌర్బల అన్న ప్రయోగంతో పోలిస్తే దుర్బల అన్న ప్రయోగం బావుంటుందేమో అని అనిపించింది. దుర్బల ధీబల దాత్రివంచు = 'that you bless even a nitwit with the power of intellect' అన్నదే కవి అభిప్రాయమైయుండవచ్చని భావిస్తే.