శనివారం, మార్చి 24, 2007

ఆదిశఙ్కరాచార్య కృత శివ మానస పూజా స్తోత్రమునకు నా తెనిగింపు

[ముందుమాట: "శార్దూల(విక్రీడిత)"మనే చందస్సులో వున్న సంస్కృత శ్లోకాలకు "శార్దూలం"లోనే తెలుగులో వ్రాయాలన్న వుద్దేశం వుండటం వల్ల కొన్ని కఠిన పదాలు వాడక తప్పలేదు. అలాగే చిన్న శ్లోకమవటం చేత చివరి "కర చరణ కృతం వా" అన్న శ్లోకాన్ని కందపద్యంగా వ్రాస్తే బాగుంటుందేమో అనిపించింది.]

స్తోత్రము:

శా. నానా రత్న విభూషితాసనము - శీతాపో೭భిషేకంబులున్ -
రత్నాలంకృత వస్త్రముల్ - భుజగ హారా - కస్తురీ గంధముల్ -
సూనంబుల్ ఘన బిల్వ పత్రములునూ - సూర్ముల్ - సుధూపంబులున్ -
అన్నీ నా హృదయంబునన్ మ(త)లచితిన్ - సర్వాత్మకా అందుకో. ౧.
[శీతాపో೭భిషేకము = శీత+ఆపః+అభిషేకము = చల్లని నీటితో అభిషేకము; సూనము = పువ్వు; సూర్ముల్ సుధూపముల్ = దీపధూపములు]

श्लो॥ रत्नैः कल्पितमासनं हिमजलैः स्नानं च दिव्यांबरं
नानारत्नविभूषितं मृगमदामोदाङ्कितं चन्दनम्।
जातीचंपकबिल्वपत्ररचितं पुष्पं च धूपं तथा
दीपं देव दयानिधे पशुपते हृत्कल्पितं गृह्यताम्॥१॥

శా. హేమాంగంబగు పాత్రలో - పచితముల్ హైయంగవీనంబుతోన్ -
ప్రేమన్ - పానక - క్షీరముల్ - ఫల - దధుల్ - పేయంబులున్ - వీటియున్ -
నీ మీదన్ గల భక్తితో మనసులో నీకై సమర్పించితిన్ -
శ్రీ మందాకినివాహ! శంకర! శివా! నీ స్వీకారమున్ దెల్పవే. ౨.
[పచితము = వండినది; హైయంగవీనము = అప్పుడే కాచిన నెయ్యి; దధి = పెరుగు; పేయము = beverage; వీటి = తాంబూలము]

श्लो॥ सौवर्णे नवरत्नखण्डरचिते पात्रे घृतं पायसं
भक्ष्यं पञ्चविधं पयोदधियुतं रम्भाफलं पानकम्।
शाकानामयुतं जलं रुचिकरं कर्पूरखण्डोज्ज्वलं
तांबूलं मनसा मया विरचितं भक्त्या प्रभो स्वीकुरु॥२॥

శా. సంకల్పంబున - చామర - వ్యజనముల్ - ఛత్రంబు - నాదర్శమున్ -
నీకై వాద్యములున్ - మృదంగ లయలున్ - నృత్యంబులున్ - గీతముల్ -
సంకీర్తుల్ యిల చాల జేసితి - హరా - సాష్టాంగ దండంబులున్ -
లోకాధీశ గ్రహించుమయ్య కృపతో - లోపాలు గాంచొద్దయా. ౩.
[చామరము = వింజామర; వ్యజనము = విసనకఱ్ఱ; చత్రము = గొడుగు; ఆదర్శము = అద్దము]

श्लो॥ छत्रं चामरयोर्युगं व्यजनकं चादर्शकं निर्मलं
वीणाभेरिमृदङ्गकाहलकला गीतं च नृत्यं तथा।
साष्टाङ्गं प्रणतिः स्तुतिर्बहुविधा ह्येतत्समस्तं मया
सङ्कल्पेन समर्पितं तव विभो पूजां गृहाण प्रभो॥३॥

శా. కాయంబే గుడి - ఆత్మ నీవు - మనసే కామాక్షి - ప్రాణంబులే
ఆయా సేవక బృందముల్ - విషయముల్ శాస్త్రోక్త పూజావిధుల్ -
శయ్యానిద్రలె శ్రీ సమాధి స్థితి - సంచారంబులావర్తముల్ -
నా యీ వాక్కులె స్తోత్రముల్ - క్రియలు నీ ఆరాధనల్ - ఓ శివా! ౪.
[ఆవర్తము = ప్రదక్షిణ]

श्लो॥ आत्मा त्वं गिरिजा मतिः सहचराः प्राणाः शरीरं गृहं
पूजा ते विषयोपभोगरचना निद्रा समाधिस्थितिः।
सञ्चारः पदयोः प्रदक्षिणविधिः स्तोत्राणि सर्वा गिरो
यद्यत्कर्म करोमि तत्तदखिलं शम्भो तवाराधनम्॥४॥

కం. కర - పద - తను - మనకృతములు
మరి జ్ఞానేంద్రియ కృతములు అపరాధంబుల్
సరియై(నై)నను కాకున్నను
కరుణాభ్ధీ నను క్షమించి కావుము దేవా.౫.

श्लो॥ करचरणकृतं वा कर्मवाक्कायजं वा श्रवणनयनजं वा मानसं वापराधम्।
विहित मविहितं वा सर्वमेतत्क्षमस्व शिव शिव करुणाभ्धे श्रीमहादेव शम्भो॥५॥

2 వ్యాఖ్యలు:

Raghava చెప్పారు...

సంకీర్తుల్ యిల నీకు జేసితి హరా సాష్టాంగ దండంబులున్ అంటే బావుంటుంది.

Raghava చెప్పారు...

సూర్ముల్ కన్నా జ్యోతుల్ అంటే బాగుంటుంది.