శుక్రవారం, సెప్టెంబర్ 25, 2009

బెంగ

అమ్మా! అదేమిటో చెమ్మగిల్లెను కళ్లు జ్ఞప్తికొస్తున్నావు చాల నువ్వు
దవ్వునుంటినిగాని ఱివ్వున వాలనూ నీ కళ్లముందుగా నిలచుకొఱకు
బరువెక్కె మనసంత బాధతో నీ చెంత లేనన్న దిగులుతో రేఁగిపోయె
బెంగగా నుంది నీ వెనుక నేఁ దిరుగంగ నినుఁ జూడ నొడిలోన నిదురపోవ

నీ కబుర్లు నేను వినుచు నిలువ నీదు
చేతివంటను భుజియింపఁ బ్రీతి మీఱ
మనసు మారాము సేసేను మాట వినదు
అమ్మ! దీని వైఖరి నాకు నందకుంది౹౹ ౧

అగపడుతున్నావమ్మా మిగతా స్త్రీమూర్తులందు మెలఁకువలో లే
నగవుల పసిపాపలలో దిగులు మఱింతగ పెరిఁగెను దేనినిఁ గనినా౹౹ ౨

వేదములకుఁ బ్రణవమువలె నాదిని “అమ్మా”యనె గద యందరినోటా
నాదారంభంబౌనది! భూదేవిని మించు సహనమూర్తివి అమ్మా౹౹ ౩

దూరవాణి వచ్చి దూరాలఁ జెఱిపేను
మనసువఱకు గాదు మాటవఱకె
ఉత్తరాలు భువిని నుత్తమంబులు గాద
మనసుకైన రెండు కనులకైన౹౹ ౪

కనుక నీ యుత్తరము వ్రాస్తి, గాని నేను
నీకు నిది పంపి బాధింపలేక, నిదుర
పోయి, కలలోన నినుఁ జేరి, పొంగిపోదు
“నిదుర” దీవించి నాకోర్కె నెరపుఁగాత౹౹ ౫

వ్రాసినది: 27/2/2009

5 కామెంట్‌లు:

  1. నా పట్ల మా అబ్బాయి కనపరుచు బెంగ మొదటి పద్యాల్లో కనిపిస్తే, ఉత్తరం విషయం లో ఇప్పటికీ మారని నేను,నాన్నగారు జ్ఞప్తికొచ్చాము. అలరారుతున్న మనియాద నన్నూ బెంగలో ముంచేసింది. అమ్మప్రేమలోని మహిమ అది.

    రిప్లయితొలగించండి