శనివారం, జనవరి 31, 2009

తిమ్మన చిత్రకవితావిలాసము

పారిజాతాపహరణ కావ్యంలోని పంచమాశ్వాసంలో నంది తిమ్మన తన చిత్రకవిత్వాన్ని ఆవిష్కరించాడు—


కందము. నాయశరగసారవిరయ – తాయనజయసారసుభగధరధీనియమా
మాయనిధీరథగభసుర – సాయజనయతాయరవిరసాగరశయనా (౫-౯౨)


సార అంటే బలమైన, శ్రేష్ఠమైన అని శబ్దరత్నాకరము. గ శబ్దం గమనానికి సూచన. వి అంటే విశేషమైన. రయమంటే వేగం. నాయ శబ్దానికి పద్ధతి, దిశ, నీతి అని నిఘంటువు. తాయన అంటే బాగుగా సాగుచున్న అని నిఘంటువు. కాబట్టి నాయ–శరగ–సార–విరయ–తాయన–జయసార అనే మొదటి విశేషణాన్ని నాయ–వి–రయ–గ–సార–శర–తాయన–జయ–సార గా అన్వయించుకోవచ్చు. పద్ధతిగా విశేషమైన వేగంతో ప్రయాణించే శ్రేష్ఠమైన బాణాలవలన కలిగిన చక్కటి జయించే చేవ ఉన్నవాడు అని అర్థం.

సుభగుడు అంటే మనోహరమైనవాడు, భాగ్యవంతుడు.

ధీ అంటే బుద్ధి. ధర అంటే భూమి అనీ కొండ అనీ అర్థాలు (ధర ధరించేది). నియమ శబ్దం మొక్కవోని వ్రతాన్ని సూచిస్తుంది. కాబట్టి ధీ నియమం అంటే బుద్ధికి సంబంధించిన వ్రతం. ఎలాంటి వ్రతం? భూమిలాంటి (లేదా కొండవంటి). ఏమిటి దీని అర్థం? నిశ్చలమైన అని తీసుకుంటే భూమికైనా కొండకైనా సరిపోతుంది. కాబట్టి నిశ్చలమైన (మార్చరాని) బుద్ధినియమం కలవాడు.

మాయనిధీ వేరు మాయానిధీ వేరు. మాయానిధీ అంటే మాయకు నిలయమని. ఇక్కడ మాయనిధీ అంటున్నాడు కాబట్టి మా అయ నిధీ అని చెప్పుకోవాలి. అయమంటే మేలు కలుగజేసే వస్తువు/దైవము అని శబ్దరత్నాకరము. మా అంటే లక్ష్మి. కాబట్టి మాయనిధీ అంటే లక్ష్మికీ మేలుకీ నిలయమైనవాడు.

రథమంటే తేరు, శరీరము అని శబ్దరత్నాకరము. భ శబ్దం కాంతికి సూచిక. గ శబ్దం ధరించడాన్ని కూడా సూచిస్తుంది. కాబట్టి భ–సుర–రథ–గ అంటే కాంతివంతులైన దేవతలను శరీరమునందు ధరించినవాడు. అంటే సర్వదేవస్వరూపుడు.

సాయమంటే బాణము. నయమంటే న్యాయము. కాబట్టి సాయ–జ–నయ అంటే బాణము(ల) ద్వారా పుట్టిన న్యాయం కలవాడు.

తాయ్ ధాతువు విస్తరించడం అనే అర్థంలో వాడుతారు అని నిఘంటువు. ర అంటే కాంతి, గమనం, అగ్ని, కామం, ధారణ... అని నిఘంటువు. కాబట్టి తాయరవిర అంటే రవి–ర–తాయ రవికోటితేజుడు అని.

సాగర శయనా అంటే సముద్రమే పాన్పుగా కలవాడు.

ఈ పద్యంలో గమ్మత్తు మొదటినుండి చివరికి చదివినా చివరినుండి మొదటికి చదివినా ఒకేలా ఉండడం. దీనకి అనులోమవిలోమమని పేరు.


కందము. ధీర శయనీయశరధీ – మారవిభానుమతమమత మనుభావిరమా
సారసవన నవసరసా – దారదసమతారహార తామసదరదా (౫-౯౩)


ధీరుడు అంటే విద్వాంసుడు, ధైర్యవంతుడు అని శబ్దరత్నాకరము.

శయనీయ శరధి అంటే శయనించుటకు అర్హమైన సముద్రము కలవాడు.

మారుడంటే మన్మథుడు. వి అంటే విశేషమైన. భా అంటే కాంతి. అనుమత సమ్మతించబడిన. మమత మమత్వం, అభిమానం. మార–విభానుమత–మమత. మన్మథుడి కాంతికి సమ్మతమైన అభిమానం కలవాడు. అంటే మన్మథుడివలె కాంతిమంతుడని.

నిఘంటువులో మను శబ్దానికి మంత్రమని అర్థం. భావి అంటే కాగల, భవిష్యత్ అని అర్థాలు. మంత్రము వలన కాగల లక్ష్మి కలవాడు. అంటే మంత్రమననముచే సమస్తశుభాలనీ ఇచ్చేవాడు.

సవనమంటే యజ్ఞము. సవన–సార అని అన్వయించుకుని యజ్ఞములందు శ్రేష్ఠుడని చెప్పుకోవచ్చు. లేదా తరువాతి నవ–స–రసా కూడ కలిపి అర్థం తీసుకోవచ్చు. నవ అంటే క్రొత్త, తొమ్మిది. ఈ రెండు అర్థాలూ వాడుకుంటే నవసరసా అంటే కొంగ్రొత్త సరసనవము కలవాడా అని. అప్పుడు శ్రేష్ఠమైన యజ్ఞములందు సనవరసుడని.

దారదమంటే పాదరసము విషము ఇంగువ అని శబ్దరత్నాకరము. తార అంటే మలినరహితమైన ముత్యము. దారద–సమ–తార అంటే పాదరసంలా మెరిసే మంచి ముత్యం. అట్టి ముత్యాల హారం కలిగినవాడు.

దరమంటే భయమనీ శంఖమనీ శబ్దరత్నాకరము. తామసదరదుడంటే తామసానికి భయాన్నిచ్చేవాడు అని.

ఈ పద్యంలో గమ్మత్తు ఏ పాదానికి ఆ పాదం మొదటినుండి చివరికి చదివినా చివరినుండి మొదటికి చదివినా ఒకేలా ఉండడం. దీనకి పాదభ్రమకమని పేరు.


కందము. మనమున ననుమానము నూ–నను నీ నామ మను మను మననమును నేమ
మ్మున మాన నన్ను మన్నన – మను మను నానా మునీన మానానూనా (౫-౯౮)


మనమునన్ అనుమానమున్ ఊనను నీ నామము అను మను మననమునున్ నేమమ్మునన్ మానన్ నన్ను మన్ననన్ మనుము అను నానా ముని ఇన మాన అనూనా

ఊను అంటే అవలంబించు, పొందు అని శబ్దరత్నాకరము. మను శబ్దానికి మంత్రమని అర్థం. నేమము అంటే నియమము. మనుట అంటే జీవించుట (మనుగడ, మనికి). ఇన అంటే శ్రేష్ఠమైన అని నిఘంటువు. మానము అంటే కొలత, ప్రమాణం అని ఇక్కడ తీసుకోవలసిన అర్థం. అనూన అంటే వెలితి లేని, నిండైన అని శబ్దరత్నాకరము.

ముని శ్రేష్ఠుల అందరి ప్రమాణాలకీ ఏమాత్రం వెలితిలేనివాడా! మనస్సులో అనుమానం పొందను (ఊహాపోహలకి తావివ్వను). నీ నామపు మంత్రజపం చేసే నియమాన్ని మానను. మన్ననతో నన్ను జీవించుమని దీవించు.

తెలుస్తూనే ఉంది. ఈ పద్యం ద్వ్యక్షరి. న, మ — ఈ రెండక్షరాలే ఉన్నాయీ పద్యంలో.


పదాలు విడగొట్టుకోవడంలోనే అసలు చిక్కంతా ఉందీ మూడు పద్యాల్లోనూ. చిత్రకవిత్వంలో చిత్రమో ఏమిటో కానీ వీటిల్లో శబ్దాడంబరం బావున్నా అర్థమవ్వాలంటే పరిశ్రమ చేయక తప్పదు!

ముక్కు తిమ్మనార్యు ముద్దు పలుకే గానీ ఇక్కడ ముక్కు తిమ్మనార్యు చిక్కుపలుకు అనాలనిపించింది (చిక్కుకి శ్లేషతో సహా) ఈ మూడూ అర్థం చేసుకునే సరికి!


కృతజ్ఞతలు:
౧ పారిజాతాపహరణ కావ్యపు జాలప్రచురణకర్తలైన ఆంధ్రభారతి వారికి
౨ శబ్దరత్నాకరాన్ని కూర్చిన బహుజనపల్లి సీతారామాచార్యులు గారికి
౩ సంస్కృతాంగ్లనిఘంటువును కూర్చిన మోనియరు విలియమ్సు గారికి
౪ దీనికై తగినంత పరిశ్రమ చేయించినందుకు మందాకిని గారికి

13 కామెంట్‌లు:

  1. బాగుంది మీ వివరణ. "చిత్ర"కవిత్వం చిత్రాలకి అంతు లేదు. మీ పుణ్యమా అని అనులోమవిలోమాన్ని అర్ధ భ్రమకం అని కూడా అంటారని ఇప్పుడే తెలుసుకున్నా.

    తెలుగు సంస్కృతంతో ఎంత పెనవేసుకుపోయిందో ఇదో ఉదాహరణ. ఈ ప్రక్రియలన్నీ సంస్కృతంలోనివే.

    రిప్లయితొలగించండి
  2. ఈ విషయంపైన గతంలో నేను చదివిన ఓ పుస్తకం వివరాలు నేనొక టపాలో రాసాను. చూసే ఉంటారు.

    http://blog.vikatakavi.net/2008/04/11/%E0%B0%B8%E0%B0%82%E0%B0%B8%E0%B1%8D%E0%B0%95%E0%B1%83%E0%B0%A4-%E0%B0%AD%E0%B0%BE%E0%B0%B7-%E0%B0%9A%E0%B0%BF%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B5%E0%B0%BF%E0%B0%9A%E0%B0%BF%E0%B0%A4%E0%B1%8D/

    రిప్లయితొలగించండి
  3. రాఘవ గారూ,
    ఇంత శ్రమించి పద్యాలకు ఒఠ్ఠి భావాన్నే కాకుండా చక్కటి విశ్లేషణ తో పాటు(మీగడ తో కూడిన పాలవలె) అందించినందుకు శతకోటి ధన్యవాదాలు.అందులోనూ అదనంగా ఒక ద్వక్షరినీ అందించి (తేనెవలె) మా పాఠకులందరినీ కృతార్థులను చేసినందుకు కృతజ్ఞతలు.

    రిప్లయితొలగించండి
  4. అభినంద"నీ"య "సేవకు"
    అభినందనలయ్య రాఘవాఖ్యుడ! నీకున్
    శుభ కర సాహిత్యాంశము
    లభవుడు కరుణించి యొసగు నద్భుత ఫణితిన్.

    రిప్లయితొలగించండి
  5. చాలా రోజుల తర్వాత ఒక చక్కటి తెలుగు పద్యాన్ని శ్లేషార్థాలతో సహా చదివిన తర్వాత తేనె త్రాగినట్టుగా వుంది.

    రిప్లయితొలగించండి
  6. వికటకవి గారూ, అచ్చతెలుగు పదాలతో చిత్రకవిత్వం వ్రాయటం కష్టమేమోనండీ.

    మందాకినిగారూ, ఈ పద్యాలు లోగడ చూసాను కానీ అర్థం సంగతి పట్టించుకోలేదు. మీకు కృతజ్ఞతలు.

    రామకృష్ణారావుగారూ, నమోవాకం.
    మీవంటి వారి ప్రేరణ
    కావలసినయంత దొరికి కనిపిస్తూంటే
    నావంటి వారు వ్రాయక
    ఏ విధముగ ఉండగలరు ఈ విషయములన్?

    కృష్ణుడుగారూ, నెనరులు.

    రిప్లయితొలగించండి
  7. raaghavagaaru
    మీ వివరణ చాలా బాగుంది.
    ఈ క్రింది లింకులో చిత్రకవిత్వం గురించి ఆశక్తికరమైన సమాచారం ఉంది గమనించండి.
    http://kovela.blogspot.com/

    రిప్లయితొలగించండి
  8. ఒక సారి మీరి jnanakhadga@gmail.com కి ఒక టెస్టు మెయిలు చెయ్యగలరా?

    రిప్లయితొలగించండి
  9. బాబాగారూ,
    నేను తిమ్మన బంధకవిత్వం గుఱించి కూడ వ్రాద్దామనే అనుకున్నాను. కానీ ముందు నాకు చెప్పే అర్హత ఉండాలని ఆగాను. మంచి లంకె చూపించారు. నెనర్లు.

    రిప్లయితొలగించండి
  10. బావుంది, బావుంది. మొదటి పద్యమెక్కడో చూశాను. (సమగ్రాంధ్ర సాహిత్యంలో అనుకుంటాను).

    చివరి పద్యం లాంటి సంస్కృత శ్లోకం ("న" గుణింతంలోని అక్షరాలతో) భారవి వ్రాశాడని గుర్తు.మీకు తప్పక తెలిసి ఉంటుంది. అది కూడా చిత్రకవితేనాండి?

    రిప్లయితొలగించండి
  11. ఏమోనండీ రవిగారూ, నేను భారవి కిరాతార్జునీయంలో ప్రథమసర్గను మాత్రమే (అది కూడా నా చిన్నప్పుడు, నాకు సంస్కృతమంటే ఇష్టం మాత్రమే ఉండి ఇప్పటిలా వెఱ్ఱి అభిమానం లేని కాలంలో) చదువుకున్నాను. అందువల్ల కిరాతార్జునీయంలోని పదిహేనవ సర్గలో చిత్రకవిత్వవిశేషాలు చాలా చూపించాడని వినడమే తప్ప, నాకు వివరాలు పెద్దగా తెలియవండీ.

    ఇక పారిజాతాపహరణంలో తిమ్మన్నగారు బంధకవిత్వం కూడా వ్రాసారండీ. మీకు తెలిసే ఉంటుంది, చిత్రకవిత్వం బంధకవిత్వం గర్భకవిత్వం అని మూడు రకాలు.

    బంధ కవిత్వం అంటే చక్రం, శంఖం, గద, కత్తి, రథం, పాము, గోమూత్రం, ... ఇలా రకరకాల చిత్రాలలో పద్యాన్ని బంధించడం. దీనివల్ల కొన్ని నిర్దేశించబడిన స్థానాల్లో ఒకే వర్ణం వస్తుందన్నమాట.

    గర్భకవిత్వం అంటే ఒక పద్యంలో ఇంకొక పద్యాన్ని గర్భితం చేయడం. ఉదాహరణకి, సీసంలో మత్తేభం, భుజంగప్రయాతంలో స్రగ్విణి, మొదలైనవి.

    చిత్రకవిత్వం అంటే మిగిలిన గారడీలు అన్నీను. నిజానికి పదాలతో ఆడుకోవడం. ఏకాక్షరులు, ద్వ్యక్షరులు, త్ర్యక్షరులు, అనులోమ విలోమాలు, నిరోష్ఠ్యాలు, ... గట్రా.

    ఎప్పుడో వీలు చూసుకుని తిమ్మనగారి బంధకవిత్వం గుఱించి బ్లాగుతాను.

    రిప్లయితొలగించండి
  12. గొప్ప వివరణ అంద చేసినందుకు మీకు నా ధన్యవాదములు

    రిప్లయితొలగించండి
  13. raghava garu,
    http://en.wikipedia.org/wiki/Palindrome
    indulo , telugu section okati create chesi ee padyalanu unchagalaru.

    -sravan

    రిప్లయితొలగించండి