శనివారం, జనవరి 26, 2008

గణతంత్రదినపు వేడుక

కం.జననికి భారతమాతకు
వినుతులు గణతంత్రదినపు వేడుకలన్ నీ
తనయులము మేము జేయగ
గని మము ఆశీర్వదించు ఘనతరచరితా.

బుధవారం, జనవరి 16, 2008

సంక్రాంతి పద్యం

ఉ.శ్రీరఘువంశమూలపురుషేశ్వరవిష్ణుస్వయంభురూప వో
నీరజబంధు లోకహిత నీరదకారక నిత్యనిర్మలాం
గా రవి నక్రసంక్రమణకాలమునందు శుభంబుగోరుచూ
సూరి దినేశ భాను ఖగ సూర్య సురోత్తమ నిన్నుగొల్చెదన్.

సోమవారం, జనవరి 14, 2008

భోగి పద్యం

ఉ.ఆగమవందితానఘుని దాశరథిన్ రఘురామచంద్రునిన్
నాగవిభూషణున్ ప్రళయనర్తనశీలిని శూలినిన్ సిరిన్
శ్రీగణనాథునిన్ మహిత శ్రీలలితాత్రిపురేశ్వరిన్ గుహున్
"భోగి"దినంబునన్ కొలతు భోగిశయున్ సకలాత్మకున్ హరిన్.

శనివారం, జనవరి 12, 2008

తాంబూలం!!!

కం.ఎప్పుడు యెక్కడ పడితే
అప్పుడు అక్కడ కవిత్వ మబ్బాలంటే
తప్పక నోట నమలవలె
కప్పుర తాంబూలమంచు గాఠిగ చెప్తే

కం.చెప్పుచు చక్కని కవితలు
మెప్పింతురొ లేదొ గాని వెధవది దీన్లో
ముప్పేంటంటే అందుకు
అప్పుల పాలౌదురేమొ మన కవులంతా! :P

గురువారం, జనవరి 10, 2008

పరమాత్మస్వరూపం

ఉ.కొందరు అమ్మగా గొలచుకొందురు కొందరు విష్ణుమూర్తిగా
కొందరు రుద్రుడంద్రు మరిగొందరు వారికి తోచినట్లుగా
గందురు నిన్ను రామునిగ గాంచెద మా కులదైవతమ్ముగా
అందరిలోననున్న పరమాత్మస్వరూపమ! మమ్ము బ్రోవుమా.